ఎన్నారై యశస్విని అరెస్టు చేసిన సీఐడీ.. 41ఏ నోటీసులిచ్చి విడుదల
posted on Dec 23, 2023 @ 10:08AM
అహంకారం, అడ్డగోలు నిర్బంధాలు, అవధులు లేని వేధింపులు, అదేమంటే అరెస్టులు.. నాలుగున్నరేళ్ల జగన్ పాలన గురించి ఇంత కంటే చెప్పుకునేందుకు ఏమీ లేదు. ఈ మాట ఎవరో వైసీపీ వ్యతిరేకులు అంటున్నది కాదు. రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేని తటస్థులు సైతం చెబుతున్న మాట. ప్రజా వేదిక కూల్చివేతతో ప్రారంభమైన జగన్ విధ్వంస పాలన ఈ నాలుగున్నరేళ్లుగా విధ్వంసం, విద్వేషం, వేధింపులు, అరెస్టులు, దుర్భాషలతోనే సాగుతోంది. న్యాయస్థానాల తీర్పుల ఖాతరీ లేదు. ప్రజాస్వామ్య విలువల అర్థమే తెలియదు. తెలిసిందల్లా జగన్ సర్కార్ నిర్ణయాలన్నిటికీ జీహుజూర్ అంటూ మద్దతు తెలిపిన వారే రాష్ట్రంలో ఉండేందుకు అర్హులు. ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించినా, ప్రశ్నించినా వాళ్లు ఉండాల్సింది జైల్లోనే అన్నట్లుగా సాగింది, సాగుతోంది జగన్ పాలన.
జగన్ హయాంలో పోలీసులకు అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయడం వినా మరో పనే లేకుండా పోయింది. పోలీసు వ్యవస్థ జగన్ మనసులో ఏముందో గ్రహించి అందుకు అనుగుణంగా ఆయన ప్రత్యర్థులను (జగన్ దృష్టిలో ఆయన ప్రత్యర్థులు శతృవులే) వెతికి పట్టుకుని కేసులు బనాయించి జైలుకు పంపడం, వేధించి, హింసించి దారికి తేవడంగానే మారిపోయింది.
కరోనా సమయంలో మాస్కులు కావాలని అడిగిన దళిత వైద్యుడి నుంచి మొదలు పెడితే.. ఇప్పుడు ఎన్నారై యశస్వి బొద్దులూరిని అరెస్టు చేయడం దాకా జగన్ పాలన అంతా నిరంకుశత్వానికి నిలువెత్తు నిదర్శనం అన్నట్లుగానే సాగింది. కోర్టులు ఎప్పుడో సామాజిక మాధ్యమంలో పోస్టులు పెట్టిన కారణంగా ఎవరినీ అరెస్టు చేయవద్దని విస్పష్టంగా తీర్పు ఇచ్చినా జగన్ ప్రభుత్వానికి ఖాతరీ లేదు. అందుకే ప్రభుత్వ తప్పుల్ని ఎత్తి చూపిన ఎన్నారై యశస్వి బొద్దులూరిని విమానాశ్రయంలోనే అరెస్టు చేశారు. అందుకు కారణం యశశ్వి తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ప్రభుత్వ విధానాలు, తప్పిదాలను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమంలో ప్రశ్నించడమే. ఆయన అనారోగ్యంతో ఉన్న తన తల్లిని పరామర్శించడానికి ఇండియాకు వచ్చీ రాగానే విమానాశ్నయంలోనే పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. ఏపీ పోలీసులు యశశ్వి బొద్దులూరి ఇండియా వస్తున్నారని తెలియడంతోనే శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చారు. ఆయన ఇలా దిగగానే అలా అరెస్టు చేశారు.
ఇంతకీ ఆయన అరెస్టునకు కారణమేమిటంటే.. ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే. ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలను ఎత్తి చూపడమే. లండన్ లో ఉండే యశస్వి ఏపీలో అరాచకపాలనను. అడ్డగోలు విధానాలు.. ప్రభుత్వ పెద్దల తప్పిదాలను సామాజిక మాధ్యమం వేదికగా ప్రశ్నిస్తారు, ఎత్తి చూపుతారు. నిలదీస్తారు. జగన్ సర్కార్ ఆయనపై కక్షగట్టడానికి, కత్తిగట్టడానికి అది ఒక్కటే కారణం. ఆ కారణంగానే ఆయనపై ఆయనకే తెలియకుండా ఏపీలో కేసులు నమోదు చేశారు. లుక్ ఔట్ నోటీసు జారీ చేసింది. లుక్ ఔట్ నోటీసు ఉండటంతో ఆయన విమానాశ్రయంలో దిగగానే ఏపీ పోలీసులకు సమాచారం అందింది అరెస్టు చేసేశారు. అంతే. పోలీసులు తమ బాస్ జగన్ ఆదేశం మేరకు కేసులు బనాయించగలరు? అరెస్టు చేయగలరు? వారు అంతే చేస్తున్నారు. తరువాత కోర్టుల్లో చీవాట్లు తిని తలలు వంచుకుంటున్నారు. యశస్విని కూడా అలాగే అరెస్టు చేసి శంషాబాద్ విమానాశ్రయం నుంచి మంగళగిరి తరలించారు. యశస్వి అరెస్టుతో ఏపీ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యశస్వి అరెస్టును ఖండించారు. వైసీపీ పాలనకు చివరి రోజులు ఆరంభమయ్యాయని మండిపడ్డారు.
కాగా యశస్విని అరెస్టు చేసి మంగళగిరికి తరలించిన సీఐడీ పోలీసులు అక్కడ ఆయనకు సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు ఇచ్చి విడుదల చేశారు. పిలిచినప్పుడు విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. ఇంత మాత్రానికి శంషాబాద్ విమానాశ్రయం వద్ద నానా హంగామా చేసి అదుపులోనికి తీసుకుని మంగళగిరి తరలించడం ఎందుకో ఘనత వహించిన సీఐడీ పోలీసులకే తెలియాలి. మొత్తం మీద యశస్వి అరెస్టు విషయంలో పోలీసుల తీరు పట్ల సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.