సీఎంగా జగన్ ఫెయిల్.. రుజువులివే!
posted on Dec 23, 2023 @ 11:44AM
ఏపీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనపై ప్రజలలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఇప్పటికే ఎన్నో సర్వేలు ఇప్పటికే తేల్చేశాయి. వైసీపీకి ఎన్నికల వ్యూహాలను అందించే ఐ ప్యాక్ కూడా ఇదే విషయాన్ని తేల్చి చెప్పినట్లు పార్టీ వర్గాలే చెబుతున్నాయి. అందుకే ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున అభ్యర్థులను మార్చేసే పనిలో ఉన్నారు జగన్. అయితే అసలు ఈ స్థాయిలో వైసీపీ పాలనపై వ్యతిరేకత పెరగడానికి కారణమేంటి? సీఎంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎందుకింత దారుణంగా ఫెయిలయ్యారు? అనే విశ్లేషణలు సాగుతున్నాయి. మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణతో పోల్చి చూపుతూ ఏపీలో పాలనా వైఫల్యంపై విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చల్లో జగన్ వైఫల్యాలకు ప్రధానంగా నాలుగు అంశాలు ప్రస్ఫుటంగా ప్రస్తావనకు వస్తున్నాయి. ఏ రాష్ట్రంలో అయినా ఆ రాష్ట్ర ప్రభుత్వ సామర్థ్యం, పనితీరు అంచనా వేయాలంటే ముఖ్యంగా నాలుగు అంశాలు చూడాల్సి ఉంటుంది.
అందులో ప్రధానమైనది ఆ రాష్ట్ర ఆదాయం (జీడీపీ) పెరుగుదల. తలసరి ఆదాయం, పన్నుల రూపంలో వచ్చే ఆదాయం చూడాలి. అలాగే మానవాభివృద్ధి మరో ప్రధానమైన అంశం. విద్య, వైద్యం, ఆరోగ్యం, పౌష్టికాహారం, సంక్షేమం వంటివి మానవాభివృద్ధి కిందకి వస్తాయి. తరువాత పారిశ్రామిక, సర్వీస్ సేవా రంగాల్లో అభివృద్ధి. అంటే ఉద్యోగ , ఉపాధి అవకాశాల కల్పన, పారిశ్రామిక వాడల ఏర్పాటు, రోడ్లు తదితర మౌలిక వసతుల అభివృద్ధి. అలాగే ప్రజాస్వామ్య స్పూర్తి కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వ పాలనా తీరు ఎలా ఉందన్న విషయంలో కీలకం. అంటే ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండటం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, రాజ్యాంగ సంస్థల బలోపేతం లాంటివి.
ఈ పై నాలుగు అంశాలలో తెలంగాణలో కేసీఆర్ తొమ్మిదేళ్ల పాలన, ఏపీలో జగన్ పాలనతో పోలిస్తే ఎన్నో రెట్లు మెరుగ్గా ఉంది. జీడీపీ పెరుగుదల విషయంలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. హైదరాబాద్ లాంటి మెట్రో సిటీ ఆదాయం ప్రధానంగా దోహదం చేయటం వల్ల ఇది సాధ్య మైంది. మానవాభివృద్ధిలో కేసీఆర్ సర్కార్ పూర్తిగా విఫలమైంది. మానవాభివృద్ధి చేసే విషయంలో తెలంగాణ వెనుకబడింది. పారిశ్రామిక , సేవా రంగాల్లో కేసీఆర్ పనితీరు మెరుగ్గానే ఉంది. ప్రజాస్వామ్య స్పూర్తిలో విషయంలో తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తంగా కేసీఆర్ పాలనలో జీడీపీ పెరుగుదల, పారిశ్రామిక అభివృద్ధి మెరుగ్గానే ఉన్నాయి.
అదే ఏపీ విషయానికి వస్తే ప్రభుత్వ పనితీరుకు అద్దంపట్టే నాలుగు విషయాల్లోనూ కూడా జగన్ సర్కార్ కనీసం పాస్ మార్కులు కూడా సాధించలేదు. ఏపీలో జగన్ హయంలో జీడీపీ ఘోరంగా దిగజారిపోయింది. తలసరి ఆదాయం ఏటేటా తగ్గుతూ వచ్చి పాతాళానికి దిగజారిపోయింది. ప్రజలను పీడించి పన్నులు వసూలు చేయడంతో వారిలో కొనుగోలు శక్తి తగ్గిపోయి ఆదాయం గణనీయంగా పడిపోయింది. ఇక మానవాభివృద్ధిలో తమ సర్కార్ గొప్పగా పని చేస్తోందని జగన్ ఘనంగా చెప్పుకున్నా వాస్తవం మాత్రం అందుకు రివర్స్ లో ఉంది. విద్య, వైద్యం, ఆరోగ్యం, పౌష్టికాహారం, సంక్షేమం వంటివి మానవాభివృద్ధిలో భాగం. అయితే జగన్ మాత్రం కేవలం బటన్ నొక్కి డబ్బులు పంచి అదే మానవాభివృద్ధిగా చెప్పుకుంటున్నారు. విద్య, వైద్యం, ఆరోగ్యం వంటి అంశాల్లో జగన్ సర్కార్ ది ప్రకటనల ఆర్భాటం తప్ప ఇంకేం లేదు.
ఇక, పారిశ్రామిక, సేవా రంగాల్లో అభివృద్ధి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఉద్యోగావకాశాలు, ఉపాధి కల్పన, పారిశ్రామిక వాడల ఏర్పాటు, రోడ్లు, రవాణా అంశాలలో జగన్ సర్కార్ ది ఘోర వైఫల్యం. ఇక ప్రజాస్వామ్య స్పూర్తి అన్నది జగన్ పాలనలో కాగడా పెట్టి వెతికినా కనిపించదు. ప్రభుత్వానికి ప్రజలతో అసలు సంబంధాలే లేకుండా తెగిపోయాయి. భావప్రకటనా స్వేచ్ఛ, అసెంబ్లీ సమావేశాల నిర్వహణ ఇలా ఏ విషయంలోనూ జగన్ సర్కార్ కు జీరోకు మించి మార్కులు రాని పరిస్థితి ఉంది. అసలు ఏపీలో అసలు రాజ్యాంగం అమలు కావడం లేదంటూ కోర్టులే పలు సందర్భాలలో వ్యాఖ్యానించాయంటే పరిస్థితి ఏమిటో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ముఖ్యమంత్రి జగన్ ప్రజలకి మొహం చూపించకుండా పరదాలు కప్పుకు తిరుగుతూ పాలన సాగిస్తున్నారంటే జగన్ సర్కార్ ప్రజలకు ఎంత దూరమైందో ఇట్టే అర్ధమైపోతుంది.
ఇవి మాత్రమే కాదు జగన్ ఫెయిల్యూర్ అనేందుకు ఇంకా ఎన్నో, ఎన్నో కారణాలు ఉన్నాయి. పారిశ్రామిక ప్రగతి పూజ్యం. పెట్టుబడులు శూన్యం, అభివృద్ధి, ఉద్యోగ, ఉపాధి కల్పన , విద్య, వైద్యం ఆరోగ్యం, ప్రజా సంక్షేమం ఏవీ కూడా రాష్ట్రంలో కనిపించని అంశాలు. ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు, దాడులు. ప్రతిపక్ష నేతలు నుండి మొదలుకొని సామాన్య ప్రజలు అన్న తేడా లేదు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గొంతెత్తితే ఇక అంతే సంగతులు. జైళ్లు నోళ్లు తెరుస్తాయి. లాఠీలు విరుగుతాయి. ఇక సంక్షేమ పథకాల పేరిట బటన్ నొక్కి డబ్బులు పందేరం చేస్తున్నట్లు జగన్ చెప్పుకుంటున్నా.. అదేం గొప్ప విషయం కాదు. జగన్ ప్రతిభా ఏం లేదు. ఒక చేత్తో సొమ్ములు ఇచ్చినట్లే ఇచ్చి.. పన్నుల రూపేణా అంతకు అంతా తిరిగి ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. అలా వసూలు చేసిన సొమ్మునే తిరిగి ప్రజలకు పందేరం చేస్తున్నారు. అయితే జగన్ మాత్రం మేము డబ్బులు పంచి పెడుతున్నాం కనుక మేం తిట్టినా పడాలి.. కొట్టినా పడాలి.. ఎదురు తిరిగితే సహించేది లేదన్నట్లు పాలన సాగిస్తున్నారు. గంజాయి అక్రమ రవాణాలో ఏపీని దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టిన ఈ ప్రభుత్వం.. అప్పుల దిబ్బగా, దివాళా రాష్ట్రంగా మార్చేసింది. ఎస్సీ.. ఎస్టీలపై దాడుల్లో, స్త్రీల అక్రమ రవాణాలో కూడా దేశంలో అగ్రగామిగా ఏపీని నిలబెట్టిన జగన్.. దళితులపై అకృత్యాలు, అరాచకాల విషయంలో కూడా రాష్ట్రాన్ని దేశంలోనే టాప్ లో నిలబెట్టారు. దళితుడిని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన సొంత పార్టీ ఎమ్మెల్సీని పక్కన కూర్చోపెట్టుకుని ఫొటోలు దిగారు. ఎంతో కొంత అభివృద్ధి జరిగిన తెలంగాణలో ప్రజలు కేసీఆర్ ను సాగనంపారు.. అలాంటిది అభివృద్ధి లేమిని అదనంగా అరాచకం, అవినీతి, అక్రమాలలో రాష్ట్రాన్ని దేశంలోనే టాప్ గా నిలిపిన జగన్ పాలనకు ప్రజా తీర్పు అనుకూలంగా ఎలా ఉంటుంది? అందుకే ఏపీలో ఎన్నికల షెడ్యూల్ రావడానికి ముందే జగన్ ఓటమి ఖరారైపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
-జ్వాల