కంగారెత్తిస్తున్న కరోనా.. నాలుగో వేవ్?
posted on Dec 23, 2023 @ 1:40PM
దేశంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. పది రోజుల కిందట రోజుకు పదీ ఇరవై లోపు నమోదైన కేసులు తాజాగా వేలల్లోకి చేరాయి. వారం కిందట మొత్తం బాధితుల సంఖ్య వందల్లో ఉండగా నేడు అది వేలల్లోకి చేరింది.గడిచిన 24 గంటల్లో నమోదైన కొత్త కేసుల సంఖ్య శనివారానికి 752 కు చేరింది. దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 3,420 కాగా ఇందులో ఎక్కువ శాతం కేరళలోనే నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. అయితే, ముందుజాగ్రత్త చర్యగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఇప్పటికే అలర్ట్ చేసినట్లు తెలిపింది.
వైరస్ తో గడిచిన 24 గంటల్లో నలుగురు చనిపోయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. జేఎన్.1 సబ్ వేరియంట్ కేసులు బయటపడ్డ కేరళలోనే వైరస్ బాధితుల సంఖ్య ఎక్కువగా నమోదవుతోందని తెలిపారు. నిన్న బయటపడ్డ కొత్త కేసులు మొత్తం 752 కాగా అందులో 565 మంది కరోనా బాధితులు కేరళలోనే ఉన్నారని వివరించారు. యాక్టివ్ కేసులు కూడా కేరళలోనే అత్యధికమని, వైరస్ బాధితులలో 2,872 మంది కేరళలోనే ఉన్నారని చెప్పారు. గోవాలోనూ జేఎన్.1 సబ్ వేరియంట్ కేసులు 21 నమోదయ్యాయని చెప్పారు.
కొత్త వేరియంట్‌లు వల్ల శ్వాసకోశ వైరస్ లక్షణాలు అలాగే ఉంటాయని నిపుణులు అంటున్నారు. స్థానికంగా కేసుల సంఖ్య విస్తరిస్తున్న పక్షంలో రద్దీగా ఉండే ప్రాంతాలలో మాస్క్ వేసుకోవాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. బాగా వెంటిలేషన్ ఉన్న ప్రదేశాలలో ఉండడం వల్ల ఇన్ఫెక్షన్ వ్యాప్తి తగ్గుతుంది. అలాగే తరచుగా చేతులు కడుక్కోవడం వల్ల ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం కొత్త కోవిడ్ వేరియంట్‌తో సంబంధం ఉన్న లక్షణాలు సాధారణమైనవి. జెఎన్ వన్ ఇప్పటికే చెలామణిలో ఉన్న వైవిధ్యాల కంటే వేగంగా వ్యాప్తి చెందుతుంది. జ్వరం, ముక్కు కారటం, గొంతు నొప్పి తలనొప్పి వంటి లక్షణాలు ఉండవచ్చు. చాలా మంది రోగులు తేలికపాటి శ్వాసకోశ లక్షణాలు కనిపిస్తాయి. ఈ వేరియంట్ నుండి నాలుగు నుండి ఐదు రోజులలో బయటపడవచ్చు.