నిర్లక్ష్యపు నీడలో రాయలవారి శాసనం!
posted on Dec 25, 2023 8:47AM
విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలి శాసనం పల్నాడు జిల్లా అటవీ ప్రాంతంలో మరుగునపడి ఉందని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. మాచర్లకు చెందిన వారసత్వ కార్యకర్త సతీష్ పావులూరి, శివశంకర్, మణిమేల ఇచ్చిన సమాచారం మేరకు పల్నాడు జిల్లా, మాచర్ల మండలం, కొప్పునూరు వద్ద అటవీ ప్రాంతంలో ఉన్న గుండాల శిథిలాలయం వద్ద భూమిలో కూరుకు పోయిన క్రీ.శ.1516 నాటి నాపరాతిపై చెక్కిన తెలుగు శాసనాన్ని ఆయన ఆదివారం (డిసెంబర్ 24) పరిశీలించారు.
ఆ శాసనంలో శ్రీకృష్ణదేవరాయలు కొండవీడు, నాగార్జున కొండలను జయించి పాలిస్తుండగా, ఆయన మహా మంత్రి తిమ్మరుసు చేత, నాగార్జున కొండ సీమను నాయంకరంగా పొందిన స్థానిక పాలకుడు బస్వానాయకుడు, నాగుల వరానికి దక్షిణంగా ఉన్న మల్లెగుండాల గ్రామాన్ని (ప్రస్తుతం ఆ గ్రామం లేదు) స్థానిక తిరువెంగళనాథునికి ఆలయ నిర్వహణకు దానం చేసిన వివరాలున్నాయని శివనాగిరెడ్డి తెలిపారు. ఆ శాసనం చారిత్రక ప్రాధాన్యతను గ్రామస్తులకు వివరించిన ఆయన, నిర్లక్ష్యంగా పడి ఉన్న ఈ శాసనాన్ని కొప్పునూరుకు తరలించి, పీఠంపై నిలబెట్టి చారిత్రక వివరాల బోర్డును ఏర్పాటు చేసి, భవిష్యత్ తరాల కోసం కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు.
కొప్పునూరుకు 5కిలోమీటర్ల దూరంలో నడచి వెళ్లటానికే కష్టమైన ప్రాంతంలో ఉన్న ఈ శాసనం వద్దకు వెళ్లటానికి సహకరించిన దుర్గంపూడి యుగ్నాథరెడ్డి, రమేష్ ఉప్పుతోళ్ల, డి.ఆర్. శ్యాంసుందరరావులకు శివనాగిరెడ్డి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.