పీకే, చంద్రబాబు భేటీ.. విషయమేంటంటే?
posted on Dec 23, 2023 @ 3:29PM
దేశ రాజకీయాలలో ప్రశాంత్ కిషోర్ ది ఓ ప్రత్యేక పంథా. ఆయన ఏ పార్టీ తరఫున వ్యూహకర్తగా పని చేస్తే ఆ పార్టీ ఆ ఎన్నికలలో విజయం సాధిస్తుంది. 2014 ఎన్నికలలో బీజేపీ, 2019 ఎన్నికలలో వైసీపీ, ఆ తరువాత పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్. అయితే ఇటీవలి కాలంలో ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్త బాధ్యతల నుంచి కాదు కాదు కొలువు నుంచి వైదొలగి బీహార్ లో సొంత కుంపటి పెట్టుకుని తన రాజకీయం తాను చేసుకుంటున్నారు. అయితే అడపాదడపా మాత్రం ఆయన వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ అవ్వడం ద్వారా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు.
ఇక తన ఐప్యాక్ ను శిష్యులకు అప్పగించేశారు. అలా ఇప్పటికీ ఏపీలో ప్రశాంత్ కిషోర్ ఐ ప్యాక్ అధికార వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా పని చేస్తూనే ఉంది. సర్వేలూ, రహస్య నివేదికలూ ఇస్తూనే ఉంది. అలాగే ఐప్యాక్ నుంచి విడిపోయి షోటైమ్ కన్సల్టెన్సీ అంటూ సొంత కుంపటి పెట్టుకున్న రాబిన్ శర్మ తెలుగుదేశం పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా పని చేస్తున్నారు. సరే అదలా ఉంచితే.. ఎన్నికల వేళ ఏపీలో రాజకీయం ఊహకందని మలుపులు తిరుగుతున్నది. సరిగ్గా రెండు నెలలలోనే ఎన్నికలు జరగనున్నాయన్న ఊహాగానాల నేపథ్యంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఏపీలో ప్రత్యేక్షమయ్యారు. ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం ఈ అంశమే చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్ తో కలిసి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ప్రశాంత్ కిషోర్ లోకేష్ వాహనంలోనే చంద్రబాబు నివాసానికి వెళ్లి కలిశారు. ఈ అంశమే ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది.
తెలుగుదేశం పార్టీకి అంతకు ముందు సునీల్ కనుగోలు కూడా ఎన్నికల వ్యూహకర్తగా పని చేశారు. అంటే అప్పట్లో రాబిన్ శర్మతో పాటు సునీల్ కనుగోలు కూడా తెలుగుదేశం కోసం పనిచేశారు. ఏకకాలంలో ఇద్దరు వ్యూహకర్తలు టీడీపీ కోసం పనిచేయడం అప్పట్లో ఓ విశేషంగా రాజకీయవర్గాలలో చర్చ కూడా జరిగింది. అయితే కొద్ది కాలానికే సునీల్ కనుగోలు తెలుగుదేశం పార్టీకి ఎన్నికల వ్యూహకర్త బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అదలా ఉంచితే సునీల్ కూడా గతంలో ప్రశాంత్ కిషోర్ బృందంలో పని చేసిన వ్యక్తే. ఆ తర్వాత సునీల్ కనుగోలు కాంగ్రెస్ కు వ్యూహకర్తగా పనిచేశారు. కర్ణాటక, తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ విజయంలో సునీల్ కిషోర్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇక తెలుగుదేశం విషయానికి వస్తే ప్రస్తుతం తెలుగుదేశం ఎన్నికల వ్యూహకర్తగా రాబిన్ శర్మ పని చేస్తున్నారు. లోకేష్ యువగళం పాదయాత్ర నుండి చంద్రబాబు బస్సు యాత్ర వరకూ.. ఇదేం ఖర్మ రాష్ట్రానికి నుండి భవిష్యత్తుకు గ్యారంటీ వంటి కార్యక్రమాల వెనుక రాబిన్ శర్మ ఉన్నారని చెబుతారు.
అయితే ఇప్పుడు అకస్మాత్తుగా ప్రశాంత్ కిషోర్ ఉరుములేని పిడుగులా ఏపీకి వచ్చి చంద్రబాబుతో భేటీ కావడం రాజకీయంగా పెను సంచలనం సృష్టించింది. దీంతో రానున్న ఎన్నికలలో ఆయన తెలుగుదేశం, జనసేన కూటమి కోసం పని చేస్తారా అన్న చర్చ జరుగుతోంది. వాస్తవానికి ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఎన్నికల వ్యూహాలకు దూరంగా ఉంటున్నారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల తరువాత ఇక తాను రాజకీయ వ్యూహకర్తగా పని చేయబోనని స్వయంగా ప్రకటించారు. అప్పటి నుంచీ ఆయన ఐ ప్యాక్ ను రుషి రాజ్ సింగ్ నడిపిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ తన సొంత రాష్ట్రం బీహార్ లో సొంత పార్టీ ఏర్పాటు చేసి పాదయాత్ర చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన పాదయాత్ర నుంచి విరామం తీసుకున్నారు అది వేరే విషయం. కొద్ది రోజులు క్రితం నారా లోకేష్ ప్రశాంత్ కిషోర్ తో ఢిల్లీలో భేటీ అయినట్లు ప్రచారం జరిగింది. ఆ భేటీలో లోకేష్ పీకేను తెలుగుదేశం పార్టీకి రాజకీయ సలహాదారుగా పని చేయాలని ప్రతిపాదించారనీ, అలాగే ఓ సారి చంద్రబాబుతో భేటీ అవ్వాలని కోరారని అప్పట్లో ప్రచారం జరిగింది.
అయితే అప్పట్లో అది కేవలం ప్రచారం మాత్రమేనని అంతా అనుకున్నారు. అయితే ఇప్పుడు పీకే చంద్రబాబుతో భేటీ కావడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా ఈ భేటీ వైసీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. 2019 ఎన్నికలలో జగన్ పార్టీ తరఫున ఎన్నికల వ్యూహకర్తగా పీకే పని చేయడం, జగన్ బలాలు, బలహీనతలు, వ్యూహాలు, ఎత్తుగడలపై సంపూర్ణ అవగాహన ఉన్న వ్యక్తి కావడంతో ఆయన తెలుగుదేశంతో చేతులు కలిపితే తమ పుట్టి మునగడం ఖాయమన్న ఆందోళన వైసీపీలో కనిపిస్తోంది.
అందుకూ ఇంకా చంద్రబాబు, పీకే భేటీ ఎందుకు? వారి మధ్య జరిగిన చర్చలేమిటి? తెలుగుదేశం తరఫున పీకే పని చేస్తారా? చేయరా? అసలు పీకే, బాబు భేటీకి కారణమేమిటి? అన్న విషయాలేవీ బయటకు రాకుండానే మంత్రి అంబటి రాంబాబు మెటీరియలే మంచిది కాకపోతే మేస్త్రీ ఏం చేయగలడు? అంటూ ట్వీట్ చేసేసి తన అక్కసు వెళ్లగక్కుకున్నారు. దీనిని బట్టి చూస్తే ఈ భేటీతో పీకే టీడీపీ కోసం చేస్తారన్న ఆందోళన వైసీపీలో కలిగిందని అవగతమౌతోంది. ఏపీ రాజకీయాలలో పీకే, బాబు భేటీ ఒక న్యూ ట్విస్ట్ అనడంలో సందేహం లేదు. మరి వీరి భేటీ ఏపీ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది చూడాల్సి ఉంది.