ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల?.. విజయమ్మ సపోర్టే కీలకం!?
posted on Dec 28, 2023 @ 1:37PM
ఏపీ కాగ్రెస్ చీఫ్ గా వైఎస్ షర్మిలను నియమించబోతున్నారా అంటే కాంగ్రెస్ వర్గాలు అవుననే సమాధానమిస్తున్నాయి. తాజాగా ఢిల్లీలో ఏపీ కాంగ్రెస్ నేతలతో అధిష్ఠానం కీలక భేటీ నిర్వహించింది. ఆ భేటీలో వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించింది. అంతే కాకుండా ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు షర్మిలకు అప్పగించడంపై కూడా ఈ భేటీలో చర్చ జరిగిందని విశ్వసనీయ సమాచారం. అంతేకాదు, షర్మిలను హస్తిన రావాల్సిందిగా కూడా పిలిచినట్లు చెబుతున్నారు. నేడో రేపో షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అప్పగించే విషయమై అధికారిక ప్రకటన వెలువడుతుందనీ, అన్నీ అనుకున్నట్లు జరిగితే సరిగ్గా నూతన సంవత్సరం మొదటి రోజునే అంటే జనవరి 1నే షర్మిలను కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ప్రకటించే అవకాశాలున్నాయనీ కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకు షర్మిల కూడా అంగీకారం తెలిపినట్లు చెబుతున్నారు. మొత్తంగా ఏపీ కాంగ్రెస్ పగ్గాలు మళ్ళీ వైఎస్ ఫ్యామిలీ చేతికి వెళ్లనున్నాయి. దీంతో షర్మిల నెక్స్ట్ ప్లాన్ ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. అన్న జగన్ ను ఎదుర్కొనేందుకు షర్మిల ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? అన్నను షర్మిల విమర్శించేందుకు ఏయే అంశాలను ఎంచుకుంటారు? కేవలం జగన్ పాలనపైనే అస్త్రాలు సాధిస్తారా? లేక కుటుంబ వ్యవహారాలపై కూడా ప్రశ్నిస్తారా అన్న చర్చ విస్తృతంగా సాగుతోంది. ముఖ్యంగా వైసీపీ వర్గాలలో షర్మిల జగన్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తే పార్టీ పరిస్థితి ఏమిటన్న ఆందోళన వ్యక్తం అవుతున్నది.
షర్మిల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బేషరతుగా కాంగ్రెస్‌కు మద్దతిచ్చి బరి నుంచి తప్పుకున్నారు. గతంలో కాంగ్రెస్‌తో జరిపిన చర్చల సమయంలోనే పార్టీని విలీనం చేసి.. ఏఐసీసీలో కీలక పదవి చేపట్టేందుకు షర్మిల ఒకే చెప్పినట్లు ప్రచారం జరిగింది. ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే నాడు జరిగింది ఒట్టి ప్రచారం కాదని అర్ధమౌతోంది. నాటి చర్చలలో కుదిరిన ఒప్పందం మేరకే ఇప్పుడు షర్మిలను ఏపీకి పంపిస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు కూడా ధృవీకరిస్తున్నాయి. రాష్ట్ర విభజన జరిగిన దశాబ్దం తరువాత తొలిసారిగా కాంగ్రెస్ ఏపీపై దృష్టి పెట్టింది.
ఈ నేపథ్యంలో నే ఏపీ అత్యంత ప్రజాకర్షణ శక్తి ఉన్న వైఎస్ కుటుంబానికి చెందిన షర్మిలకు పార్టీ పగ్గాలు అప్పగిస్తోందని పరిశీలకులు అంటున్నారు. ప్రస్తుత సీఎం కూడా వైఎస్ కుటుంబీకుడే అయినప్పటికీ, వైఎస్ అభిమానులు సైతం ప్రస్తుతం జగన్ పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. వైఎస్ ఆత్మగా గుర్తింపు పొందిన కేవీపీ సైతం జగన్ ను దూరంగానే ఉంచుతున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ హై కమాండ్ షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అప్పగించేందుకు నిర్ణయం తీసుకుందని చెబుతారు.
ఏపీలో కాంగ్రెస్ పుంజుకోవాలంటే వైసీపీ బలహీనం కావాలి. అది జరగాలంటే రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ ను వీడి వైసీపీ పంచన చేరిన కాంగ్రెస్ వాదులంతా వెనక్కు రావాలి. షర్మిలకు పార్టీ రాష్ట్ర పగ్గాలు అప్పగిస్తే ఆ పని చాలా వరకూ పూర్తవుతుందన్నది కాంగ్రెస్ హై కమాండ్ ఆలోచనగా చెబుతున్నారు. ఇప్పటికే జగన్ పాలనలో పూర్తిగా విఫలమై తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. దానికి తోడు ఆయన వ్యక్తిగత నైజం కూడా ఆయన పార్టీలోని పలువురికి అక్కడ ఇమడలేని పరిస్థితిని తీసుకు వచ్చింది. అలా అటూ ఇటూ చూస్తున్న వారందరినీ షర్మిలకు ఏపీ పగ్గాలు అప్పగించడం ద్వారా ఆకర్షించవచ్చన్నది కాంగ్రెస్ హై కమాండ్ ఆలోచనగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
అలాగే కాంగ్రెస్ లో షర్మిల భవితవ్యం విషయంలో తల్లి విజయమ్మ పాత్ర కూడా కీలకమే. విజయమ్మ బహిరంగంగానే షర్మిలకు మద్దతు తెలపాలి. అవసరమైతే ఆమె కూడా ప్రచారం చేయాల్సి ఉంటుంది. తల్లిగా విజయమ్మ జగన్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తారా? కుమార్తె కోసం కుమారుడికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. నిజానికి విజయమ్మ షర్మిల రాజకీయ భవిష్యత్ కోసం తపన పడుతున్నారన్నది ఆ కుటుంబానికి దగ్గరగా ఉండేవారు చెప్పే మాట. షర్మిల కోసమే తల్లి విజయమ్మ జగన్ కు దూరంగా వచ్చేశారనీ, చివరికి వైసీపీ గౌరవాధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేసి తెగతెంపులు చేసుకున్నారని చెబుతారు. షర్మిలను రాజ్యసభకు పంపించాలని జగన్ తో విజయమ్మ పోరాటం చేశారు. కానీ అందుకు జగన్ ససేమిరా అనడంతోనే తల్లి, కుమార్తెలు రాష్ట్రాన్ని వీడి తెలంగాణ వెళ్లారంటారు. కానీ అక్కడా షర్మిలకు జగన్ అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. అయితే, ఇప్పుడు ఆమెకి ఏపీ కాంగ్రెస్ రూపంలో మంచి అవకాశం దక్కింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని షర్మిల డిసైడ్ అయిపోయారు. తల్లి సహకారం కూడా తనకే ఉంటుందని ధీమాగా ఉన్నారు.
వైఎస్ హయంలో పనిచేసిన సీనియర్ నేతలకు విజయమ్మపై గౌరవాభిమానాలు ఉన్నాయి. అవే ఇప్పుడు షర్మిలకు అండగా మారాలంటే విజయమ్మ కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అలాగే అప్పుడు జగన్ కోసం, జగన్ ను సీఎంగా చూడాలని కలలుకన్న విజయమ్మ.. ఇప్పుడు షర్మిలను రాజకీయంగా ఉన్నతంగా చూడాలని ఆశపడుతున్నారు. కనుక ఆమె కూడా షర్మిల కోసం ప్రచారం చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలాగే, వివేకా హత్య కేసులో నిందితులను జగన్ కాపాడడం వంటి అంశాలపై షర్మిల స్పందన ఎలా ఉండబోతున్నది? ఈ అంశంపై షర్మిల అన్నపై బహిరంగ విమర్శలు చేస్తారా అన్నది మరింత ఆసక్తికరంగా మారింది. షర్మిల ఇప్పటికే పలుమార్లు ఈ హత్యపై వివేకా కుమార్తె సునీతకు మద్దతుగా మాట్లాడారు. అ లాగే సొంత వాళ్ళే తన చిన్నాన్నను హత్య చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి సమయంలో ఏపీ కాంగ్రెస్ లో షర్మిల మార్క్ రాజకీయం ఎలా ఉండబోతుందన్నది ఆసక్తిగా మారింది.