మంత్రి ఉషశ్రీచరణ్ నియోజకవర్గం మారిపోయింది.. కల్యాణదుర్గం కాదు పెనుగొండ
posted on Dec 28, 2023 @ 11:17AM
ఏపీ సీఎం జగన్ సిట్టింగులను నియోజకవర్గాల నుంచి మార్చే ప్రక్రియను వేగవంతం చేశారు. అసంతృప్తులు, తిరుగుబాట్లు, అలకలు ఇలా వేటినీ పట్టించుకోకుండా.. బుజ్జగించో, బెదరించే తన నిర్ణయానికి సిట్టింగులు ఒప్పుకునేలా చేస్తున్నారు. అదే సమయంలో ప్రభుత్వ ముఖ్యసలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అధిష్ఠానం అంటే అధినేత నిర్ణయం నచ్చని వారు పార్టీ వదిలి వెళ్లిపోవచ్చని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తిరుగుబాటుకు రెడీ అయ్యే వారు రెడీ అవుతుండగా, కొందరేమో రాజకీయాల నుంచే విరమించుకుంటామంటూ ప్రకటనలు చేస్తున్నారు. మరి కొందరేమో ఇప్పటికే పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఈ నేపథ్యంలోనే కల్యాణదుర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి ఉషశ్రీచరణ్ అధిష్టానం ఆదేశాల మేరకు తాను వచ్చే ఎన్నికలలో కల్యాణ దుర్గం నుంచి కాకుండా పెనుగొండ నుంచి బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు.
అయితే ఇక్కడే ఆమె తన చాకచక్యాన్ని ఉపయోగించారు. కల్యాణ దుర్గంలో తన పట్ల వ్యతిరేకత ఇసుమంతైనా లేదనీ, సామాజిక వర్గ సమీకరణాలలో భాగంగానే జగన్ తన స్థానాన్ని పెనుగొండకు మార్చారనీ చెప్పుకున్నారు. కల్యాణ దుర్గం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బోయలను నిలబెట్టాలన్న ఉద్దేశంతోనే తన నియోజకవర్గాన్ని మారుస్తున్నారని వివరించారు. ఇంత కాలం తనను ఆదరించిన కల్యాణదుర్గం ప్రజలకు రుణపడి ఉంటాననీ, ఎక్కడ నుంచి పోటీ చేసినా తన నినాదం జగన్ నినాదమేనని ఉషశ్రీచరణ్ చెప్పుకున్నారు.
మొత్తం మీద తన నియోజకవర్గాన్ని జగన్ మార్చడానికి కారణాలుగా ఉషశ్రీచరణ్ ఏం చెప్పుకున్నా.. కల్యాణదుర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే పట్ల ఉన్న వ్యతిరేకత కారణంగానే ఆమెను అక్కడ నుంచి పోటీలోకి దించే ధైర్యం జగన్ చేయలేదని పరిశీలకులు అంటున్నారు.