బీఆర్ఎస్ అనుబంధ సంఘాన్ని తరిమేసిన సింగరేణి కార్మికులు

తెలంగాణ ఎన్నికల ఓటమి తరువాత సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ తుడిచిపెట్టుకుపోయింది. సింగరేణిలో బీఆర్ఎస్ కాంగ్రెస్, లెఫ్ట్ అనుబంధ కార్మిక సంఘాలను అణచివేసే లక్ష్యంతో తెలంగాణ బొగ్గుగని సంఘం ఏర్పాటు చేసింది. తెలంగణ సాధన ఉద్యమం నేపథ్యంలో సింగరేణి కార్మికులు తమ తమ అనుబంధ పార్టీలతో పాటే జై తెలంగాణ అన్నారు. ఆ నినాదాన్ని ఆసరాగా చేసుకుని బీఆర్ఎస్ కాంగ్రెస్, లెఫ్ట్ అనుబంధ కార్మిక సంఘాలను కాదని సొంతంగా  ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకుంది. రెండు సార్లు ఆ సంఘం సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘంగా విజయం సాధించింది కూడా.

అయితే తాజాగా జరిగిన సంగరేణి ఎన్నికలలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం దాదాపు తుడిచిపెట్టుకు పోయింది. ఆ సంఘానికి కనీస ఓట్లు కూడా రాలేదు. దీంతో ప్రశ్నార్థకంగా మారింది.  సింగరేణి గుర్తింపు సంఘంగా లెఫ్ట్ అనుబంధ సంఘం… ప్రాతినిధ్య సంఘంగా కాంగ్రెస్ అనుబంధ సంఘం గెలిచాయి. బీఆర్ఎస్ అనుబంధ సంఘం   రేసులో నే లేకుండా పోయింది. ఈ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా ప్రజలు తమ వైపు ఉన్నారని చెప్పాలని బీఆర్ఎస్ భావించింది. ఈ సంఘానికి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె  కవిత గౌరవాధ్యక్షురాలు. దీంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ ఓటమి అనంతరం జరిగిన ఈ ఎన్నికలలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం విజయాన్ని కవిత   ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

బీఆర్ఎస్ కూడా ఈ ఎన్నికలలో విజయంపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. అయితే అనుకున్నది ఒకటి, అయినది మరొకటి అన్నట్లుగా  ఘోరంగా ఓడిపోయి బీఆర్ఎస్ గాలి తీసేసినట్లైంది. వాస్తవానికి ఈ ఎన్నికలలో పోటీ వద్దని కేసీఆర్ పర్టీ శ్రేణులకు నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. కానీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తరువాత  బీఆర్ఎస్ ప్రజా మద్దతు కోల్పేలేదని చాటేందుకు ఈ ఎన్నికలలో పోటీ చేసి తీరాల్సిందేనన్న  కవిత పట్టుదల కారణంగానే తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం పోటీలో నిలిచింది. అయితే పోటీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎన్నికలకు ముందే  ఆ సంఘానికి చెందిన కీలక నేతలు ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీల్లో చేరారు. అది పక్కన పెడితే సింగరేణి ఎన్నికల ప్రచారంలో గనుల వద్ద ఎక్కడా  గులాబీ జెండా కనిపించలేదు. అసలు ప్రచార సందడే లేదు. దీంతో కేసీఆర్ అధికారమే కాదు, పార్టీపైనా, పార్టీ అనుబంధ సంఘాలపైనా పూర్తిగా పట్టు కోల్పోయారని తేటతెల్లమౌతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు

Teluguone gnews banner