ధరణి అక్రమాలు కోకొల్లలు.. మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య భూమీ మాయం!
posted on Dec 27, 2023 @ 10:27AM
సర్వరోగ నివారిణి జిందా తిలిస్మాత్ లా సకల భూ సమస్యలకూ ధరణి పరిష్కారం అంటూ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు అధికారంలో ఉన్నంత కాలం తెగ ఊదరగొట్టేశారు. ధరణి అత్యంత పారదర్శకమైందని గొప్పగా చెప్పుకున్నారు. ధరణిని తీసేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలోకి విసిరేయాలని ఆయన ఎన్నికలకు ముందు ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రచారంలోనూ అదే చెప్పారు. అయితే జనం మాత్రం కేసీఆర్ మాటలను నమ్మలేదు. ధరణి మొత్తం అవకతవకల మయం అని, ఆ బాధలు మేం పడ్డామని తేల్చేశారు. ధరణిని తీసేస్తాం అన్న కాంగ్రెస్ కే ఓటేశారు. మరీ ముఖ్యంగా ధరణి వల్ల తీవ్ర ఇబ్బందులు పడ్డది, నష్టపోయింది గ్రామీణులే. అందుకే గ్రామీణ ప్రాంతాలలో బీఆర్ఎస్ వ్యతిరేకంగా జనం ఓటెత్త్తారు. బీఆర్ఎస్ ను చిత్తుగా ఓడించారు. ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య సైతం ధరణి బాధితుడేనని తాజాగా వెల్లడైంది. బీఆర్‌ఎస్ ఓటమి తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆయన స్వయంగా ఆ విషయాన్ని వెల్లడించారు.
ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా గుమ్మడి నర్సయ్య జీవనశైలి అత్యంత సామాన్యంగా ఉంటుంది. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా బస్సులోనే ప్రయాణించేవారు. తన దుస్తులు తానే ఉతుక్కునేవాడు. అలాంటి నాయకుడిని కూడా ధరణి ముప్పు తిప్పలు పెట్టింది. గుమ్మడి నర్సయ్యకు ఆయనకు రెండెకరాల భూమి ఉంది. ధరణి పుణ్యమా అని అది కాస్తా మాయమైంది. ధరణిలో తన రెండెకరాల భూమి కనిపించకపోవడంపై రెండేళ్లుగా తాను అధికారుల చుట్టూ తిరుతున్నానని, ఎక్కడికి వెళ్లినా పరిష్కారం దొరకలేదని ఆయన ఇటీవల ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తన భూమి సమస్యను రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెప్పుకోవడానికి ఆయన సచివాలయానికి వచ్చారు. గుమ్మడి నర్సయ్యకు సమస్యను పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. అది వేరే సంగతి. కానీ అధికారంలో ఉన్నంత కాలం ధరణి అక్రమాలపై, తప్పులపై ఎవరు మాట్లాడినా బీఆర్‌ఎస్ నాయకులు ఎదురు దాడి చేస్తూ వచ్చారు. ధరణి అత్యంత పారదర్శకమైందని, దానిపై విమర్శలు గుప్పిస్తే సహించేది లేదనీ హెచ్చరికలు సైతం జారీ చేశారు. ఒఖ మాజీ ఎమ్యెల్యే భూమికే గతి లేదంటే ఇక సామాన్యుల విషయం ఏమిటని ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. అప్పట్లో గుమ్మడి నర్సయ్య ధరణికి వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఆయనపై ఒత్తిడి తెచ్చారని, అందుకే ఆయన అధికారుల చుట్టూ తిరిగి సమస్య పరిష్కరించుకుందామని భావించారని పరిశీలకులు అంటున్నారు.
మాజీ ఎమ్మెల్యే భూమికే దిక్కు లేకపోతే.. ఇక ధరణి కారణంగా ఎందరి భూములు గాయబ్ అయి ఉంటాయో అన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఇటీవల ధరణిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. దరణి తప్పుల తడక అని, గత ప్రభుత్వ హయాంలో భూముల గోల్‌మాల్ జరిగిందని ఆయన అంటూ ధరణి స్థానంలో భూమాత తీసుకుని వస్తామని చెప్పారు. ప్రభుత్వం నిర్వహించిన ప్రజావాణిలో కూడా రెవెన్యూ సమస్యలే ఎక్కువగా వచ్చాయి. ముఖ్యంగా ధరణి కారణంగా తమ భూములకు ఎసరు వచ్చిందన్నఫిర్యాదులే అధికంగా ఉన్నాయి. కేసీఆర్ చెప్పినట్లు ధరణి వల్ల ఎవరి భూములు వారికి ఉంటాయని, వారి భూములు సురక్షితంగా ఉంటాయని అవకతవకలు జరగడానికి వీలు లేకుంటే గుమ్మడి నర్సయ్య భూమి ఎలా మాయమైంది? ప్రజా వాణిలో అత్యధిక సమస్యలు ధరణి కారణంగానే అంటూ ఫిర్యాదులు వచ్చాయో ఇప్పుడు కేసీఆర్ సమాధానం చెప్పాల్సి ఉంటుంది.
ప్రభుత్వ భూములు సైతం కబ్జా అయి ప్రైవేట్ వ్యక్తుల పేర్ల మీద ధరణిలో చేరాయని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇటీవల చెప్పారు. ప్రభుత్వ భూములను కబ్జా చేసి పెద్దలు క్రమబద్దీకరించుకున్న విషయం కూడా రేవంత్ రెడ్డి నిర్వహించిన జిల్లా కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో చర్చకు వచ్చింది. ఇప్పుటికప్పుడు ధరణిలోని అవకతవకలను సరిచేస్తామని, ఆ తర్వాత భూమాత పోర్టల్‌ను తీసుకుని వస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. మొత్తం మీద రేవంత్ సర్కార్ ధరణి అవకతవకలు, అక్రమాలను సరిచేసి బాధితులకు న్యాయ చేస్తుందని ఆశిద్దాం.