రాష్ట్రంలో గంజాయి తోటలకు కాపలా కాస్తున్న జగన్ సర్కార్.. లోకేష్
posted on Dec 28, 2023 @ 10:24AM
దేశంలో ఏమూల గంజాయి పట్టుబడినా ఆ లింకులు ఏపీలోనే ఉంటయి. దేశంలోనే గంజాయి సాగులో, సరఫరాలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలిచింది. ఏపీలో జగన్ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత గంజాయి అంటే కేరాఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఈ విషయాన్ని ఎవరో వాళ్లూ వీళ్లూ చెప్పడం కాదు.. స్వయంగా నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో గణాంకాలతో సహా అధికారికంగా వెల్లడించింది. ఏపీలో జగన్ సర్కార్ గంజాయి వనాలకు కాపలాదారుగా మారిపోయిందని తెలుగుదేశం జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. ఆయన ఆరోపణలను అక్షర సత్యాలేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత గంజాయి నిర్మూలన కోసం ప్రభుత్వం ఏటా విడుదల చేసే నిధుల విడుదల ఆగిపోవడమే ఇందుకు ఉదాహరణ అని అంటున్నారు.
ఇక ఏపీలో విచ్చలవిడిగా గంజాయి వాడకం పెచ్చరిల్లింది. దేశ వ్యాప్తంగా ఎక్కడ గంజాయి పట్టుబడినా అది ఏపీ నుంచి సరఫరా అయినదేనని తేలుతోందనీ, గంజాయి సరఫరాను, వినియోగాన్ని అడ్డుకోవలసిన ప్రభుత్వమే ప్రోత్సాహం అందిస్తోందా అన్నట్లుగా పరిస్థితి ఉందనీ చెబుతున్నారు.
రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఏటా గంజాయి తోటల ధ్వంసానికి నిధులు విడుదల చేస్తుందనీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచీ ఇది కొనసాగుతోందనీ, అయితే జగన్ సీఎం అయిన తరువాత ఈ నాలుగున్నరేళ్లలో గంజాయి తోటల ధ్వంసానికి నిధులు కేటాయించలేదనీ నారా లోకేష్ పేర్కొన్నారు.
పోలీస్,ఎక్సైజ్, రెవిన్యూ, మైనింగ్ ఇలా అన్ని శాఖల సమన్వయంతో, ఒడిశా ప్రభుత్వ సహకారంతో కూంబింగ్ ఆపరేషన్ చేపట్టి మరీ ప్రతి ఏటా డిసెంబర్ లో గంజాయి తోటలను ధ్వంసం చేస్తారని తెలిపారు. దీని కోసం అవసరమయ్యే నిధులను కేటాయించి గంజాయి తోటల ధ్వంసం చేపడతారని అయన వివరించారు.
తెలుగు దేశం హయాంలో ఐదేళ్లపాటు ఇలాగే గంజాయి తోటలను పెద్ద ఎత్తున ధ్వంసం చేసిన సంగతిని గుర్తు చేశారు. అయితే రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం కొలువదీరాకా ఈ నాలుగున్నరేళ్లలో ఏ ఏడాదీ కూడా గంజాయి తోటల ధ్వంసం ఆపరేషన్ చేపట్టలేదని, ఇందుకోసం నిధులు కూడా కేటాయించలేదని లోకేష్ పేర్కొన్నారు. గంజాయిని అరికట్టే విషయంలో కనీసం ఒక్కటంటే ఒక్క సమీక్ష కూడా చేయలేదని లోకేష్ వెల్లడించారు.
ఏపీ డ్రగ్స్ హబ్‌గా మారిపోయినా, గంజాయి గుప్పుమంటున్నా..జగన్ సర్కారు గంజాయి తోటల ధ్వంసాన్ని ఆపేయడంతో జగన్ ప్రభుత్వం ఏమైనా గంజాయి తోటలకు కాపలా కాస్తోందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. ఏపి ని జగన్ గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియా గా మార్చేశారని, ఇతర రాష్ట్రాలకి గంజాయి తరలింపు లో ప్రధాన పాత్ర వైకాపా నాయకులదేనని ఆరోపించారు. వైకాపా గంజాయి మాఫియా ఒత్తిడితోనే డిసెంబరు నెలలో జరగాల్సిన గంజాయి తోటల ధ్వంసం ప్రక్రియ నిలిపేశారని ఆరోపించారు.