డీఎండీకే అధినేత విజయకాంత్ కన్నుమూత

ప్రముఖ తమిళ నటుడు, డీఎండీకే పార్టీ అధినేత కెప్టెన్ విజయకాంత్(71) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ గురువారం (డిసెంబర్ 28) ఉదయం  కన్నుమూశారు. 

ఇటీవల విజయకాంత్ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిపాలై, కాస్త కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. అయితే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో   కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఆయనకు కోవిడ్ కూడా సోకినట్లు నిర్దారణ అయింది. ఈ క్రమంలో చికిత్స పొందుతూ  మరణించారు.

తమిళనాట అగ్ర నటుల్లో విజయకాంత్ ఒకరు. 1979 లో 'ఇనిక్కుం ఇలామై' సినిమాతో  ఆయన నట ప్రస్థానం మొదలైంది. వరుస సినిమాలతో అలరిస్తూ కెప్టెన్ గా ఎదిగారు. ముఖ్యంగా పలు చిత్రాల్లో పోలీస్ పాత్రలు పోషించి మెప్పించారు. నాలుగు దశాబ్దాల సినీ కెరీర్ లో 150కి పైగా సినిమాల్లో నటించి తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్నారు. డీఎండీకే పార్టీని స్థాపించి తమిళ రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. 2005లో విజయకాంత్  తొలి సారి తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2011లో ప్రతిపక్ష నేతగా ఉన్నారు.