నాగబాబు దృష్టిలో ఆర్జీవీ..?!
posted on Dec 28, 2023 @ 11:45AM
రామ్ గోపాల్ వర్మ పరిచయం అక్కర్లేని పేరు. నిత్యం వివాదాలతో సహవాసం చేస్తూ నెట్టింట ట్రోల్ అవుతూ వార్తల్లో ఉంటారు. ఆయన సినిమాలు, ఆయన మాటలూ, ఆయన చేతలూ అన్ని విలక్షణమే. వివాదాలు, విలక్షణతనే చవకగా, సులువుగా ఎక్కవ ప్రచారం పొందేందుకు రామ్ గోపాల్ వర్మ ఎన్నుకున్నారు. అయితే నటుడు, మెగా బ్రదర్, జనసేనాని పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు దృష్టిలో మాత్రం రామ్ గోపాల్ వర్మ అలియాస్ ఆర్జీవీ ఓ కమేడియన్ అంతే.. జస్ట్ కమేడియన్. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహం అవసరం లేదని గట్టిగా చెబుతున్నారు నాగబాబు. ఇందులో ఎలాంటి అనుమానం అవసరం లేదంటున్నారు నటుడు, జనసేన నేత నాగబాబు. ఆర్జీవీ అంటే ఇప్పుడు ఎవరు డబ్బులు ఇస్తే వారికి అనుకూలంగా సినిమా తెరకెక్కించే దర్శకుడు. ఈ విషయంలో తెలుగు ప్రేక్షకులకే కాదు ఇండస్ట్రీ పెద్దలకు కూడా ఎలాంటి డౌటానుమానాలూ లేవు. రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే ఈ కోవలో ఎన్నో సినిమాలు తీశాడు. బయోపిక్ సినిమాల పేరిట చరిత్రను తనకు ఇష్టం వచ్చినట్లు మార్చుకొని ఆర్జీవీ తీసిన సినిమాలు థియేటర్లకు ఎప్పుడు వచ్చి వెళ్లిపోయాయో కూడా ఎవరికీ తెలియదు. పట్టదు. నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీని నమ్ముకుని తన సినిమాలను ప్రమోట్ చేసుకోవడానికి ఆర్జీవీ ఎంత ప్రయత్నించినా ప్రేక్షకులు మాత్రం ఆయనను, ఆయన సినిమాలను చూసేందుకు ఎంత మాత్రం ఇష్టపడడం లేదు. కానీ ఎవరి అవసరం వారిది కనుక ఇప్పుడు వైసీపీ మరోసారి అదే ఆర్జీవీని నమ్ముకుంది. వర్మ అయితేనే తాను ఇచ్చిన సొమ్ములు పుచ్చుకుని వాస్తవాలను వక్రీకరించైనా సరే తనను ప్రమోట్ చేస్తారని జగన్ నమ్మారు. వర్మ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానంటూ.. జగన్ మోహన్ రెడ్డిని హీరోగా చూపిస్తూ వ్యూహం పేరుతో సినిమా తెరకెక్కించిన విషయం తెలిసిందే. డిసెంబర్ 29న ఈ సినిమా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.
కాగా ఈ సినిమాపై అమరావతి ఉద్యమ నేత కొలికపూడి శ్రీనివాసరావు ఓ టీవీ ఛానల్‌లో మాట్లాడుతూ.. తన సినిమాలతో ఆర్జీవీ సమాజానికి కంటకంగా మారాడని వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఆర్జీవీ లాంటి చీడపురుగు సమాజంలో ఉండకూడదని, కనుక ఆయన తల నరికి తెచ్చిన వారికి కోటి రూపాయల బహుమతి కూడా ఇస్తానని ప్రకటించారు. దీంతో వర్మ ఏపీ డీజీపీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు. కొలికపూడి శ్రీనివాసరావు వ్యాఖ్యల నేపథ్యంలో తనకు ప్రాణహాని ఉందని.. అతన్ని రెచ్చగొట్టేలా మాట్లాడించిన టీవీ యాంకర్, ఆ సంస్థ యాజమాన్యం కూడా బాధ్యులేనని ఫిర్యాదు చేశారు. ఆ విషయాన్ని స్వయంగా వర్మే ఎక్స్ వేదికగా తెలియజేశారు. దీనికి నటుడు, జనసేన నేత నాగబాబు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆర్జీవీ గారూ మీరేం భయపడకండి. మీ జీవితానికి ఏ ఢోకా లేదు. మీ ప్రాణానికి ఏ అపాయం వాటిల్లదని నేను హామీ ఇస్తున్నాను. ఎందుకంటే ఏపీలో.. ఆ మాటకొస్తే ఇండియాలో ఏ పనికిమాలిన వెధవా మీకెటువంటి హానీ తలపెట్టడు. ఎందుకంటే హీరో, విలన్ కొట్టుకుంటుంటే మధ్యలో కమెడియన్ గాడ్ని ఎవడూ చంపడు కదా! మీరేం వర్రీ అవకండి. నిశ్చింతగా, నిర్భయంగా ఓ ఓడ్కా పెగ్గేసి పడుకోండి. ఎల్లప్పుడూ మీ మంచి కోరే మీ శ్రేయోభిలాషి అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ఇది నెట్టింట వైరల్‌గా మారింది.
అయతే దీనికి వర్మ కూడా కౌంటర్ ఇచ్చారు. నాగబాబు సార్ నా కంటే పెద్ద కమెడియన్ ఎవడంటే నా సినిమాలో మీరు. మీ తమ్ముడి దగ్గర డబ్బులడుక్కుని టీ తాగి పడుకోండి సార్… అని కౌంటర్ ట్వీట్ చేశారు. వర్మ, నాగబాబు మధ్య ట్విట్టర్ వార్ రాజకీయ, సినీ వర్గాల్లో చర్చకు దారి తీసింది. వర్మ అంటేనే వివాదాలకు కేరాఫ్ అడ్రస్. ఒకరిని టార్గెట్ చేసి వారిని హింసించేలా.. వారి జీవితాలను ప్రభావితం చేసేలా సినిమాలు తీసి బతకడం నైజంగా మార్చుకున్నారు. అయితే, ఇలాంటి తప్పుడు కట్టు కథలను ఇంకా నమ్మే పరిస్థితిలో తెలుగు ప్రేక్షకులు లేరు. ముఖ్యంగా ఏపీ ప్రజలు వర్మనే కాదు ఆ దేవుడు దిగి వచ్చి జగన్ మోహన్ రెడ్డిని గెలిపించమని ఆదేశించినా వినే పరిస్థితిలో లేరు. నాలుగున్నరేళ్ల జగన్ పాలనలో విసిగిపోయిన జనం ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఓటు బటన్ నొక్కి జగన్ బటన్ పాలనకు చరమగీతం పాడదామా అని ఎదురు చూస్తున్నారు. జగన్ పై జనాగ్రహం తిరుగుబాటు స్థాయికి చేరుతోంది. సాక్షాత్తు సీఎం సొంత ఇలాకాలోనే ఓ దివ్యంగుడు జగన్ కాన్వాయ్ పై రాళ్లు విసిరిన ఘటనే ఇందుకు నిదర్శనం.
కనుక వర్మ లాంటి దర్శకుడు చెప్పే నీతి వాక్యాలను నమ్మే పరిస్థితి ఉండదు. వివేకానందరెడ్డి హత్య, కోడికత్తి దాడి, జగన్ తల్లి, చెల్లిని తరిమేయడం వంటి కీలకమైన అంశాలు లేకుండా కేవలం జగన్ ఓ అద్భుతమైన మేధస్సు గల నేత అంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇప్పుడు అదే చేస్తున్నారు. వర్మ అంటే ఎలాంటి విలువలు లేని మనిషి. తనకి ఎలాంటి బంధాలు బాంధవ్యాలు లేవని చెప్పుకుని విర్రవీగే విడ్డూరపు జీవి. అసలు తాను మనిషిని అని మీకు నేనెప్పుడు చెప్పానని ప్రశ్నించే వర్మను జనం మనిషిగా చూడటం ఎప్పుడో మానేశారు. అలాంటి వర్మ.. ఇప్పుడు సినిమా తీసి జగన్ మోహన్ రెడ్డికి కూడా అవేవీ ఉండవని.. అందుకే తన సినిమాలో హీరో అయ్యాడని చెప్పుకొనేలా ఉంది వ్యూహం పరిస్థితి.