జగన్ పరామర్శ అయినా, పలకరింపైనా రాజకీయ ప్రయోజనం ఉంటేనే?
posted on Jan 5, 2024 @ 12:44PM
నువ్వు మా ఇంటి కొస్తే ఏం తెస్తావ్.. నేను మీ ఇంటికొస్తే ఏం ఇస్తావ్ అన్న రీతిలో వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ తీరు ఉంటుంది. తాజాగా ఆయన గురువారం (జనవరి 4) హైదరాబాద్ వెళ్లి బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ను కలవడం కూడా ఆ కోవలోకే వస్తుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం తరువాత కానీ, ఆయన తన ఫామ్ హౌస్ లో జారి పడి తుంటి ఎముక మార్పిడి చికిత్స చేయించుకున్నప్పుకు కానీ కనీసం పరామర్శించని జగన్ ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన దాదాపు 20 రోజుల తరువాత, అదీ తన సోదరి షర్మిల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న తరువాత హడావుడిగా కేసీఆర్ వద్దకు వెళ్లారు.
తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమి ప్రభావం ఏపీలో ఏ మేరకు ఉంటుంది? తాను భావించినట్లు కేవలం సిట్టింగులను మార్చక పోవడం వల్లే కేసీఆర్ పార్టీ అక్కడ ఓటమి పాలయ్యిందా? తదితర అంశాలన్నీ బేరీజు వేసుకుని, తన రాజకీయ గురువుగా భావించే కేసీఆర్ నుంచి ఏపీలో ఓటమిని తప్పించుకోవడానకి ఏం చేయాలన్న దానిపై సలహాలూ, సూచనలూ తీసుకునేందుకు మాత్రమే పరామర్శ పేరుతో జగన్ హైదరాబాద్ ప్రయాణం పెట్టుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మామూలుగా అయితే జగన్ హైదరాబాద్ వెళ్లి కేసీఆర్ ను పరామర్శించి ఉంటే అదేం పెద్దగా చెప్పుకోవలసిన అవసరం కాదు. కానీ ఇరువురూ పరస్పరం రాజకీయ ప్రయోజనాల కోసం ఒకరికొకరు చేసుకున్న సహాయం, అందించుకున్న సహకారం నేపథ్యంలో ఈ పరామర్శ రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
2019 ఎన్నికల సమయంలో ఏపీలో జగన్ విజయం కోసం కేసీఆర్ చేసిన సహాయం, అందించిన తోడ్పాటు తెలియంది కాదు. అదే విధంగా ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కష్ట కాలంలో ఉన్న కేసీఆర్ ను ఆయన పార్టీనీ ఆదుకునేందుకు నాగార్జునసాగర్ డ్యాం వద్ద జగన్ సృష్టించిన హైడ్రామా కూడా తెలిసిందే. సాగర్ డ్యామ్ వద్ద హంగామా సృష్టించి తెలంగాణ సెంటిమెంట్ రగిలించి తద్వారా ఆ ఎన్నికలలో కేసీఆర్ పార్టీ లబ్ధి పొందేందుకు జగన్ తన శాయశక్తులా కృషి చేశారు. ఇక ఇప్పుడు కేసీఆర్ గాయపడి శస్త్ర చికిత్స చేయించుకుని ఇంటికి వచ్చేసిన 20 రోజుల తరువాత జగన్ పరామర్శ పేరుతో ఆయనను కలిసింది.. త్వరలో జరగనున్న ఏపీ ఎన్నికలలో గెలుపు మార్గాల అన్వేషణలో తోడ్పాటు కోరేందుకేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ పరామర్శ ప్రభావం ఏమిటన్నది త్వరలో బహిర్గతం కాకమానదని అంటున్నారు.