వైసీపీ నుంచి వీళ్లూ జారిపోతారా? దారెటు?
posted on Jan 5, 2024 @ 9:37AM
ఏపీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికలకు వైసీపి అభ్యర్ధుల రెండో జాబితా ప్రకటనతో వైసీపిలో అసమ్మతి సెగలు జ్వాలలయ్యాయి. పెను మంటలుగా మారుతున్నాయి. అసలు జగన్ తీరేంటో, ఉద్దేశమేంటో పార్టీ నేతలకే అర్ధం కావడంలేదు. వీర విధేయులను కూడా తిరగబడేలా చేసుకుని జగన్ ఏం సాధిద్దామనుకుంటున్నారు? అంటూ వైసీపీలోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుని పక్కన పెట్టి ఆ స్థానాన్ని వెల్లంపల్లి శ్రీనివాస్‌కు కేటాయించడం ద్వారా జగన్ అటు మల్లాదినీ, ఇటు వెల్లంపల్లినీ దూరం చేసుకున్నట్లే అంటున్నారు. ఇప్పటికే మల్లాది విష్ణు అనుచరులు జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. మల్లాది కూడా షర్మిల వెంట నడిచేందుకు అంటే కాంగ్రెస్ గూటికి చేరిపోవడానికి డిసైడైపోయారని చెబుతున్నారు. ఇప్పటికే తన అనుచరులతో వరుస భేటీలు, ఆత్మీయ సమ్మేళనాలు జరిపిన మల్లాది విష్ణు పార్టీ మారే విషయమై వారితో చర్చించారు. వైఎస్ షర్మిల ఎలాగూ ఏపీ కాంగ్రెస్ తలుపులు తెరువబోతున్నారు కనుక దానిలోకి జంప్ అయితే మంచిదని విష్ణు భావిస్తున్నారని అంటున్నారు. ఎన్నికలకు ఎక్కువ సమయం లేదు కనుక ముందు వచ్చిన వారికి ముందు సీటు అన్నట్లుగా ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన దారిని ప్రకటించేశారు. ఇప్పుడు మల్లాది విష్ణూ అదే దారిలో నడవడానికి డిసైడైపోయారు. పరిశీలకుల విశ్లేషణల మేరకు జగన్ టికెట్లు నిరాకరించిన వారూ, నియోజకవర్గాలు మార్చిన వారిలో అత్యధికులు అదే దారిలో నడిచే అవకాశం ఉంది. ఈ పరిణామం కాంగ్రెస్ కు ఏ మేరకు లాభిస్తుందో తెలియదు కానీ, నైతికంగా జగన్ పార్టీని ఇంకా ఇంకా బలహీనం చేస్తుందని అంటున్నారు.
ఇక విజయవాడ వెస్ట్ నుంచి విజయవాడ ఈస్ట్ కు మార్చడంతో వెల్లంపల్లి కూడా తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఇంత కాలం విజయవాడ వెస్ట్ లో పని చేస్తూ పట్టు సాధించుకున్నానని భావిస్తున్న వెల్లంపల్లి తన సీటును మార్చడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారంటున్నారు. విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ అంటే ఓటమేనని భావిస్తున్నారు. ఈ విషయంలో అధినేతను కలిసి మాట్లాడేందుకు తాడేపల్లి వెళ్లారు కూడా. అక్కడ ఏం జరిగిందన్నది తెలియదు కానీ, జగన్ తన నిర్ణయాన్ని మార్చుకోవడానికి ససేమిరా అన్నారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.
ఇక ఒంగోలు విషయానికి వస్తే తన పంతం నెగ్గించుకున్నాననీ, ఒంగోలు నుంచే బరిలోకి దిగుతాననీ ధీమాగా ప్రకటించిన ఆయనకు పార్టీ అధినేత షాక్ ఇచ్చేందుకే రెడీ అయిపోయారని అంటున్నారు. బాలినేనికి ఒంగోలు టికెట్ ఇచ్చే అవకాశం లేదనీ, ఇప్పటికే ఆయనకు ఆ విషయాన్ని జగన్ తేల్చి చెప్పారనీ, ఆయనను గిద్దలూరు నుంచి బరిలోకి దింపాలని జగన్ భావిస్తున్నారనీ చెబుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే పార్టీ పెద్దల నుంచి ఆయనకు ఫోన్ ద్వారా సమాచారం అందిందని చెబుతున్నారు. అయితే బాలినేని మాత్రం సీటు మారడం కాదు పార్టీయే మారతానని వారికి తెగేసి చెప్పినట్లు వైసీపీ వర్గాల సమాచారం. ఇక ఒంగోలు నుంచి సిద్దా రాఘవరావు కుమారుడు సుధీర్‌ని బరిలో కి దింపా లన్నది జగన్ యోచనగా చెబుతున్నారు. అదే విధంగా మరో మంత్రి చెల్లుబోయినకు కూడా జగన్ షాక్ ఇచ్చేశారు. ఆయనను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నుంచి కాకుండా రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేయాలంటూ పంపేశారు. రామచంద్రపురం నుంచి మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడు పిల్లి సూర్యప్రకాష్ ను నిలబెట్టాలని నిర్ణయించారు. దీంతో చెల్లుబోయిన వేణుగోపాల్ కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
ఇక జగన్ భజనలో ఆరితేరి, తన గుడ్డు సిద్ధాంతంలో బ్రహ్మాండమైన గుర్తింపు పొందిన మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా ఇప్పుడు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న అనకాపల్లి నుంచి మరో సారి బరిలోకి దిగే అవకాశం లేదని జగన్ స్పష్టం చేసేయడంతో ఆయన బహిరంగంగానే భోరు మన్నారు. వీరూ, వీళ్లతో పాటు పార్టీలో పెద్ద సంఖ్యలో అసంతృప్తితో, ఆగ్రహంతో ఉన్న నేతలు పార్టీ నుంచి జారిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మరి వారి అడుగులు ఎటో, వారి దారి ఏదో చూడాలి.