దారీ తెన్నూ లేని బీజేపీ.. రాష్ట్రంపై కమలం హైకమాండ్ లోనూ అయోమయం?
posted on Jan 5, 2024 @ 11:05AM
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి ఒక దారీ తెన్నూ ఉన్నట్లు కనిపించడం లేదు. గత నాలుగున్నరేళ్లుగా, ఆ మాటకొస్తే 2019 ఎన్నికలకు ముందు నుంచీ కూడా అంటే తెలుగుదేశం ఎన్డీయే నుంచి బయటకు వచ్చేసిన క్షణం నుంచీ కమల నాథులు రాష్ట్రంలో వైసీపీతోనూ, ఆ పార్టీ అధినేత జగన్ తోనూ బహిరంగంగానే రహస్య మైత్రి కొనసాగిస్తూ వస్తున్నారు. తెలుగుదేశం పార్టీని బలహీనం చేయడం అన్నది ఒక్కటే ఎజెండాగా ఆ పార్టీ రాష్ట్ర ప్రయోజనాలను బలి చేసి మరీ రాజకీయం చేసింది. 2019 ఎన్నికలలో ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడానికి తన వంతు సహకారం అందించింది. కానీ జగన్ అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్లలో తన విధానాలతో, వ్యవహారశైలితో తన ప్రతిష్టనే కాకుండా, తనకు అండదండగా నిలిచిన బీజేపీ ప్రతిష్టనూ మంటగలిపేశారు. ఆ విషయాన్ని ఒకింత ఆలస్యంగానైనా బీజేపీ అధిష్ఠానం గుర్తించింది. అయినా జగన్ తోనే రాష్ట్రంలో తన భవిష్యత్ అని భావిస్తూ, భ్రమిస్తూ..జగన్ కు సహకారం కొనసాగిస్తూ వచ్చింది. అడ్డగోలు అప్పులకు అంతే అడ్డగోలుగా అనుమతులిస్తూ, కేంద్ర పథకాలకు జగన్ తన ఫొటోలు పెట్టుకుని సొంత వ్యవహారంగా బిల్డప్ ఇచ్చినా చూసిచూడనట్లు వ్యవహరిస్తూ వచ్చింది. ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి కన్నాను తప్పించి సోము వీర్రాజుకు బాధ్యతలు కట్టబెట్టినప్పటి నుంచీ రాష్ట్రంలో బీజేపీ, వైసీసీ వేరువేరు కాదన్న భావన వచ్చేలా ఆ రెండు పార్టీల బంధం పెనవేసుకుంది.
దీంతో అప్పట్లో బీజేపీ అధిష్ఠానం ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఎందుకు ఎదగడం లేదు. ఏపీలో బీజేపీ అడుగు పెందుకు కదలడం లేదు? రాష్ట్రంలో బీజేపీ ప్రజలకు ఎందుకు దూరం అయ్యింది. ఏ వర్గం ప్రజలనూ ఎందుకు ఆకట్టుకోలేక పోతోంది? దేశమంతా మోడీ.. మోడీ అంటున్నా.. ఏపీలో మాత్రం పార్టీనీ, మోడీనీ ఎందుకు ఛీ కొడుతున్నారు? అంటున్నా ఏపీలో మాత్రం, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా, పార్టీ ఎందుకు పడకేసింది? ఎందుకు పార్టీలో ఏ ఇద్దరు నాయకుల మధ్య ఏకాభిప్రాయం లేకుండా పోయింది? రాష్ట్ర అధ్యక్షునిగా .. మీ సంజాయిషీ సమాధానం ఏమిటి? అని ప్రశ్నిస్తే అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆడ లేక మద్దెల ఓడన్న సామెతను గుర్తుకు తెచ్చేలా ఓ పొడుగాటి లేఖ రాశారు. ఆ లేఖలో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తమను ఎదగ నీయడం లేదనీ, అడుగడుగునా అడ్డు పడుతున్నారనీ వాపోయారు. అప్పుడే కాదు.. ఇప్పుడు సోము వీర్రాజు స్థానంలో పార్టీ రాష్ట్ర సారథ్య బాధ్యతలు దగ్గుబాటి పురంధేశ్వరి చేపట్టిన తరువాత కూడా ఏపీలో బీజేపీ పరిస్థితి ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు చందంగానే ఉంది.
పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత పురంధేశ్వరి జగన్ సర్కార్ పై విమర్శల దాడిని రోజు రోజుకూ ఉధృతం చేస్తూ, ఏపీలో బీజేపీ వైఖరిలో స్పష్టమైన మార్పు వచ్చిందన్న అభిప్రాయం జనసామాన్యంలో కలిగేలా చేయడంలో ఫుల్ గా సక్సెస్ అయ్యారు. అయితే అదే సమయంలో కొందరు నేతల తీరు కారణంగా ఏపీలో బీజేపీ ఎటు? ఆ పార్టీ వైఖరి ఏమిటి? అన్న విషయంలో అనుమానాలూ, సందేహాలూ మాత్రం అలాగే ఉండిపోయాయి. తాజాగా గురువారం (జనవరి 4)న జరిగిన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో మెజారిటీ నేతలు తెలుగుదేశం, జనసేనతో కలిసే వచ్చే ఎన్నికలలో పోటీకి దిగాలని నిర్ద్వంద్వంగా చెప్పేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ మద్దతు దారులు కూడా తమ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటు తెలుగుదేశం పార్టీకి వేసిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. ఇప్పుడు కూడా అంటే వచ్చే ఎన్నికలలో సైతం ప్రభుత్వ వ్యతిరేక ఓటు గంపగుత్తగా తెలుగుదేశం పార్టీకే వెళుతుందని కుండబద్దలు కొట్టారు.
ఈ పరిస్థితుల్లో కూడా పార్టీ స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోతే ఈ మాత్రం ఉనికి కూడా బీజేపీ రాష్ట్రంలో కోల్పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా కేంద్ర మంత్రులు రాష్ట్ర పర్యటనలకు వచ్చిన సందర్భాలలో ముఖ్యమంత్రి జగన్ ను కలవడానికి వెళ్లడంపై కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఏపీలో బీజేపీ, వైసీపీ ఒక్కటే అన్న భావన పోయేలా పార్టీ కార్యాచరణ ఉండాలని మెజారిటీ నేతలకు అభిప్రాయపడ్డారు. స్కిల్ కేసులో చంద్రబాబును జగన్ సర్కార్ అక్రమంగా అరెస్టు చేసిన సందర్భంలో మెజారిటీ ప్రజలు బీజేపీని అనుమానించిన విషయాన్ని గుర్తు చేశారు. తెలుగుదేశం, జనసేనతో పొత్తుకు వెడితేనే రాష్ట్రంలో బీజేపీ బతికి బట్టకడుతుందనీ, అంతకంటే ముందు రాష్ట్ర రాజధాని అమరావతేనని ప్రకటించాలనీ సూచించారు. సింగిల్ గా వెళ్తే బీజేపీ కనీసం ఒక్క సీటు కూడా గెలవలేదనీ, గెలవడం మాట అటుంచి కనీసం డిపాజిట్లు కూడా రావనీ కుండబద్దలు కొట్టారు.
అయితే ఈ సమావేశం తరువాత పార్టీ నేత సత్యకుమార్ మాత్రం మీడియా ముందు డాంబికాలు పోయారు. రాష్ట్రంలో ఒక్క శాతం ఓటు స్టేక్ కూడా లేని బీజేపీతో ఎవరైనా పొత్తు పెట్టుకోవాలంటే ప్రతిపాదన వారి నుంచే రావాలన్నారు. ముందుగా తెలుగుదేశం పొత్తు ప్రతిపాదనతో వస్తే అప్పుడు ఆలోచిస్తామన్నట్లుగా ఆయన మాట్లాడారు. ఇటువంటి వైఖరితోనే బీజేపీ ఏపీలో ఇప్పటికీ వైసీపీతోనే అంటకాగుతోందన్న అభిప్రయాం ప్రజలలో బలంగా నాటుకుపోయింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో బీజేపీ వైఖరి ఏమిటి? పొత్తు విషయంలో ఆ పార్టీ నిర్ణయం ఏమిటి అన్న విషయంలో అయోమయం అలాగే కొనసాగుతోంది.