కేశినేని నానికి చంద్రబాబు చెక్.. పార్టీ వ్యవహారాలలో జోక్యం వద్దని ఆదేశం
posted on Jan 5, 2024 6:22AM
కేశినేని బ్రదర్స్ వివాదానికి చంద్రబాబు ఫుల్ స్టాప్ పెట్టేశారు. వచ్చే ఎన్నికలలో కేశినేని నానికి బెజవాడ ఎంపీ టికెట్ లేదని స్పష్టం చేసేశారు. గత కొంత కాలంగా కేశినేని బ్రదర్స్ మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరుకు ముగింపు పలికేశారు. వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి సానుకూల పవనాలు వీస్తున్న సమయంలో కేశినేని బ్రదర్స్ మధ్య పొలిటికల్ వార్ పార్టీకి ఒకింత ఇబ్బందికరంగా మారింది. రాష్ట్రం అంతా తెలుగుదేశం పార్టీ విజయమే లక్ష్యంగా ఐక్యంగా ముందుకు సాగుతుంటే.. ఏపీకి పొలిటికల్ క్యాపిటల్ అయిన బెజవాడలో మాత్రం అన్నదమ్ముల మధ్య ఆధిపత్య పోరు పార్టీకి తలనొప్పిగా మారింది.
కేశినేని బ్రదర్స్ మధ్య పొలిటికల్ వార్ పార్టీకి, అధిష్ఠానానికీ కూడా ఇబ్బందికరంగా మారింది. ఈ నెల 7న ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడి సభ ఏర్పాట్ల విషయంలో కేశినేని నాని, కేశినేని చిన్ని వర్గాల మధ్య జరిగిన ఘర్షణ తరువాత ఇక ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టి తీరాలన్న నిర్ణయానికి చంద్రబాబు వచ్చేశారు. టీడీపీ సమన్వయ భేటీ ఫ్లెక్సీలో కేశినేని నాని ఫొటో విషయంలో తలెత్తిన వివాదం చినికిచినికి గాలివానగా మారి నాని, చిన్నీ వర్గీయుల మధ్య బాహాబాహీకి దారి తీసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. తిరువూరు సెక్టార్ 1 ఎస్సై సతీష్ ఫిర్యాదు మేరకు 36 మంది టీడీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఈ నేపథ్యంలోనే విజయవాడలో కేశినేని బ్రదర్స్ వ్యవహారంపై తెలుగుదేశం అధిష్ఠానం సీరియస్ గా దృష్టి పెట్టింది. పార్టీ నిర్ణయాలు, విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న నానికి చెక్ పెట్టకతప్పదన్న భావించారు. తొలి నుంచీ కూడా అంటే 2019 ఎన్నికలలో తెలుగుదేశం పరాజయం తరువాత నుంచీ విజయవాడ ఎంపీ కేశినేని నాని తీరు వివాదాస్పదంగానే ఉంటూ వచ్చింది. ఒక సమయంలో ఆయన పార్టీ మారుతారన్న వార్తలు కూడా బలంగా వినిపించాయి. ఈ క్రమంలో తిరువూరు ఘటన తరువాత కేశినేని నానికి చెక్ పెట్టాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది.
తిరువూరు సభ ఏర్పాట్ల విషయంలో ఎటువంటి జోక్యం చేసుకోవద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఆ విషయాన్ని కేశినేని నాని స్వయంగా సామాజిక మాధ్యమం ద్వారా తెలియజేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు మాజీ మంత్రి ఆలపాటి రాజా, ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు, మాజీ మంత్రి నెట్టెం రఘురాం, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణలు కేశినేని నానితో భేటీ అయ్యారు. ఆ భేటీలో తిరువూరులో చంద్రబాబు సభ విషయంలో ఎలాంటి జోక్యం చేసుకోవద్దని స్పష్టంగా చెప్పారు. ఇది చంద్రబాబు ఆదేశమని తెలియజేశారు. అంతే కాకుండా పార్టీ వ్యవహారాలలో కూడా జోక్యం వద్దన్నది చంద్రబాబు ఆదేశంగా కేశినేని నానికి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తాను పార్టీ ఆదేశాలను శిరసావహిస్తానని నాని చెప్పారు. ఈ విషయాన్ని నాని స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలిపారు. దీంతో విజయవాడలో కేశినేని నాని బ్రదర్స్ పోలిటికల్ వార్ కు తెరపడినట్టేనని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. ఇలా ఉండగా తిరువూరు సభ బాధ్యతలను కేశినేని నాని సోదరుడు కేశినేని చిన్నికి అప్పగించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీంతో కేశినేని నానికి ఎన్నికలలో పార్టీ టికెట్ ఇచ్చేది లేదని కూడా స్పష్టత ఇచ్చేసినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.