ఆర్జీవీ ఫిర్యాదు వెనుక జగన్ కుట్ర వ్యూహం?
posted on Jan 4, 2024 @ 12:47PM
మందు, మగువ, మాఫియాలకు సంబంధించిన విషయాలు, విశేషాలు విని, తెలుసుకుని వీలైతే చూసి ఆనందిద్దామనుకునే వాళ్లకు ఆర్జీవీ అంటే కచ్చితంగా ఇష్టం ఉంటుంది. అయినా నిత్యం వివాదాలతో సహవాసం చేసే రామ్ గోపాల్ వర్మ అలియాస్ ఆర్జీవీ అంటే తెలుగు రాష్ట్రాలలో అందరికీ పరిచయమైన పేరే. చాలా మంది రామ్ గోపాల్ వర్మ కాదు రాంగ్ గోపాల్ వర్మ అంటుంటారు. అదే పేరుతో ఆయనపై ఓ సినిమా కూడా తీశారనుకోండి అది వేరే విషయం. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గురించి ఆ ఉపోద్ఘాతం, ప్రస్తావన ఎందుకంటే.. ఎవరినీ లెక్క చేయను, ఎవరికీ భయపడను అంటూ గొప్పగా బిల్డప్ ఇచ్చుకునే రామ్ గోపాల్ వర్మ ఇప్పుుడ వణికి పోతున్నారు. నా సినిమా, నా ఇష్టం వచ్చినట్లు తీస్తాను, మీకు ఇష్టం ఉంటే చూడండి లేకపోతే మానేయండి అని ధీమాగా చెప్పే రామ్ గోపాల్ వర్మ తన వ్యూహం విడుదల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఇక విషయమేమిటంటే.
అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికిపూడి శ్రీనివాసరావు ఓ టీవీ చర్చా వేదికలో ఆర్జీవీ తలపై కోటి రూపాయలు ఫత్వా ప్రకటించారు. ఆ ప్రకటనే ఇప్పుడు ఆర్జీవీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఎన్నో మాఫియా సినిమాలలో హత్యా కాండను అత్యంత బీభత్సంగా చూపించిన రామ్ గోపాల్ వర్మ తన తల వద్దకు వచ్చే సరికి ఆ తలను ఎక్కడ దాచుకోవాలో తెలియకు బెంబేలెత్తిపోతున్నారు. వాస్తవానికి కొలికిపూడి శ్రీనివాసరావుకు ఆర్జీవీ తల తెచ్చిన వారికి కోటి రూపాయలు ఇచ్చే ఆర్థిక స్తోమత ఉందా లేదా అన్నది అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఎందు కంటే ఆయనకు అంత ఆర్థిక స్థోమత లేదు. మరి అలాంటి వ్యక్తి ప్రకటనకు ఆర్జీవీకి అంత బెదురెందుకు?
దీనికి సమాధానం కావాలంటే.. ఆయన కొలికిపూడి శ్రీనివాసరావుపై చేసిన ఫిర్యాదును ఒక సారి చూడాలి. రామ్ గోపాల్ వర్మ ఉండేది హైదరాబాద్ లో, కొలికిపూడి శ్రీనివాసరావు టీవీ చానల్ లో చేసిన ప్రకటన హైదరాబాద్ లోనే అటువంటప్పుడు రామ్ గోపాల్ వర్మ నిజంగా ఫిర్యాదు చేయదలచుకుంటే హైదరాబాద్ లో చేయాలి. కానీ ఆయన ఆల్ దీ వే విజయవాడకు వెళ్లి అక్కడ ఫిర్యాదు చేశారు. ఇంకేముంది.. అది తమ పరిధిలోకి వస్తుందా? రాదా అన్నది కూడా చూసుకోకుండా, ఏపీ సీఐడీ రంగంలోకి దిగిపోయింది. హైదరాబాద్ వచ్చి కొలికిపూడి ఇంటిపైకి వెళ్లి మరీ హడావుడి చేసింది. నోటీసులు ఇచ్చి విజయవాడ విచారణకు పిలిచింది. విచారణకు వచ్చిన కొలికిపూడిని అరెస్టు చేసినంత పని చేసింది. పొద్దుటి నుంచి సాయంత్రం దాకా ప్రశ్నలు వేసి ఆ తరువాత మళ్లీ పిలిస్తే రావాలని చెప్పి వదిలేసింది.
ఈ మొత్తం వ్యవహారంలో ఆర్జీవీ వ్యూహం సంగతేంటో తెలియదు కానీ, జగన్ తాడేపల్లి ప్యాలెస్ వ్యూహ కుట్రో, కుట్ర వ్యూహమో ఉందని మాత్రం పరిశీలకులు అంటున్నారు.
ఎందుకంటే తన విధానాలను విమర్శించే వారు, తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తేవారు ఎవరైనా సరే ఉండాల్సింది జైళ్లోనే అన్నట్లగా వ్యవహరించే జగన్.. నిత్యం తన ప్రభుత్వ విధానాలను తప్పుపడుతూ, విమర్శిస్తూ నిలదీసే కొలికిపూడి విషయంలో మరోలా ఎందుకు వ్యవహరిస్తారు? అందుకే ఆర్జీవీ ద్వారా ఫిర్యాదు చేయించి కేసులతో వేధించే వ్యూహం జగన్ సర్కార్ దేనని అంటున్నారు. నిజమే మరి వ్యూహం వారిది!