ఇక వార్ వన్ సైడే.. పని మొదలెట్టేసిన కేశినేని చిన్ని!
posted on Jan 5, 2024 @ 10:20AM
కేశినేని బ్రదర్స్ మధ్య పొలిటికల్ వార్ కు చంద్రబాబు ఫుల్ స్టాప్ పెట్టేశారు. పార్టీ ఎవరికి మద్దతుగా నిలుస్తుందన్నది చెప్పేశారు. దీంతో తిరువూరు సభ ఏర్పాట్ల బాధ్యతలు చేపట్టిన కేశినేని చిన్ని పని మొదలెట్టేశారు. తిరువురూలో చంద్రబాబు బహిరంగ సభ ఏర్పాట్ల బాధ్యతను పార్టీ ఇలా అప్పగించిందో లేదో అలా కార్యాచరణ ప్రారంభించేశారు. పార్టీ క్యాడర్ కు దిశా నిర్దేశం చేస్తూ లేఖ రాశారు.
విషయమేంటంటే.. గత కొంత కాలంగా పార్టీకి తలనొప్పిగా మారిన విజయవాడ ఎంపీ కేశినేనిని పార్టీ వ్యవహారాలలో జోక్యం చేసుకోవద్దనీ, వచ్చే ఎన్నికలలో టికెట్ ఇవ్వడం లేదనీ చంద్రబాబు విస్పష్టంగా తేల్చేశారు. ఆ విషయాన్ని కేశినేని నానికి పార్టీ పెద్దలను పంపి వారి ద్వారా తెలియజేశారు. చంద్రబాబు సందేశాన్ని మాజీ మంత్రి ఆలపాటి రాజా, ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు, మాజీ మంత్రి నెట్టెం రఘురాం, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ ఆయన నివాసానికి వెళ్లి మరీ తెలియజేశారు. అలాగే ఈ నెల 7న తిరువూరులో జరగనున్న చంద్రబాబు బహిరంగ సభ ఏర్పాట్ల బాధ్యతను కేశినేని చిన్నికి అప్పగించినట్లు స్పష్టం చేశారు.
అయితే కేశినేని నానికి ఈ విధంగా స్పష్టమైన సందేశం అందించడానికి ముందు పార్టీ అధినేత ఆయనకు చాలా అవకాశాలు ఇచ్చారు. వాస్తవానికి 2019 ఎన్నికలలో విజయవాడ నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా గెలిచిన నాటి నుంచే ఆయన శైలి వివాదాస్పదంగా మారింది. తరచూ పార్టీని ఇరుకున పెట్టేలా వ్యవహరించారు. తెలుగుదేశం పార్టీ కంటే తానే మిన్న అన్నట్లుగా ఆయన తీరు ఉంది. పార్టీ అధినేతపైనే పలు సందర్భాలలో విమర్శలు చేశారు. అయినా చంద్రబాబు తొలి నుంచీ పార్టీలో ఉన్న వ్యక్తి అన్న ఉద్దేశంతో ఆయనపై చర్య తీసుకోకుండా సముదాయించేందుకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు.
అయితే తాజాగా తిరువూరులో చంద్రబాబు సభ ఏర్పాట్ల సన్నాహాక సమావేశానికి అనుచరులతో కలిసి వచ్చి రచ్చ రచ్చ చేశారు. కేశినేని నాని సోదరుడు కేశినేని సోదరుడు శివనాథ్ అలియాస్ చిన్ని పార్టీలో చురుకుగా వ్యవహరిస్తున్నారు. అయితే కేశినేని నాని బ్రదర్స్ మధ్య ఎప్పటి నుంచో సఖ్యత లేదు. ఈ నేపథ్యంలో పార్టీలో చిన్ని చురుకుగా వ్యవహరించడాన్ని సహించలేని నాని తిరువూరు సభ సన్నాహక సమావేశంలో రభస సృష్టించారు. దీంతో పార్టీ కమాండ్ ఇక ఉపేక్షించరాదని నిర్ణయానికి వచ్చింది. కేశినేని నానికి మూడో చాన్స్ లేదని, సైలెంట్ గా ఉండాలని స్పష్టంగా చెప్పేసింది. ఈ నేపథంలోనే తిరువూరులో చంద్రబాబు సభ విజయవంతమే లక్ష్యంగా పని చేయాలంటూ కేశినేని చిన్ని పార్టీ క్యాడర్ కు బహిరంగ లేఖ రాశారు. శుక్రవారం నుంచి కార్యాచరణ ప్రారంభించాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు తిరువూరు సభ విజయవంతం చేయడమే ప్రథమ లక్ష్యంగా పని చేయాలని ఆ లేఖలో పేర్కొన్నారు. మీడియాలో వస్తున్న ప్రతికూల ప్రచారాన్ని పట్టించుకోవద్దనీ, సభ విజయవంతం, వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం విజయం లక్ష్యంగా పని చేయాలని ఆయన ఆ లేఖలో క్యాడర్ కు పిలుపునిచ్చారు.