Read more!

ఈ స్వేచ్ఛకు మూలం ఇదే!

దేశం యావత్తూ భారతదేశానికి వచ్చిన స్వాతంత్య్రం గురించి గొప్పగా పొంగిపోతుంది. స్వాతంత్య్రం సిద్దించినప్పుడు దేశాన్ని నడిపిస్తున్న నాయకుల వల్లనే దేశ స్వాతంత్య్రం సాధ్యమయ్యిందని నినదిస్తుంది. స్వాతంత్య్రం నుండి గణతంత్ర్యం వరకు ఇదే తీరు పెఅతి చోటా కనిపిస్తుంది. కానీ భారతదేశ స్వేచ్చా పోరాటాలు ముందుకు సాగడానికి ప్రాణాలను ఎంతో సునాయాసంగా చేతుల్లో నుండి జారవిడిచిన వీరుల ప్రేరణా ఫలితమే ఈ స్వాతంత్ర్య భారతం. అటువంటి వారిలో భగత్ సింగ్ మొదటి వరుసలో ఉంటారు. అతిచిన్న వయసులో దేశం కోసం ప్రాణాలు అర్పించిన భగత్ సింగ్ చివరి క్షణాల గురించి వింటే ప్రతి భారతీయ యువత గుండె ఉప్పొంగుతుంది. భారతీయులలో ఉత్తేసిజం కలుగుతుంది. 


 భారత స్వాతంత్ర్య విప్లవజ్యోతి సర్దార్ భగత్ సింగ్ కు ఉరిశిక్ష పడుతుందని ముందే తెలుసు. అందుకే తనతోపాటు శిక్ష పడుతున్న తన స్నేహితులు రాజగురు దత్తులకు, లియోనాయిడ్ ఆండ్రీన్ రాసిన  'సెవెన్ దట్ వర్ హ్యాంగ్' అనే  నవలను చదివి వినిపిస్తూ ఉండేవాడు. ఆ నవలలో ఒక పాత్రకు ఉరిశిక్ష పడుతుంది. అయితే ఆ పాత్ర “నన్ను ఉరి తీయకండి”, “నన్ను ఉరితీయకండి" అంటూ ఉంటుంది. చివరకు ఉరి తీయడానికి ఉరి కంబం వద్దకు తీసుకువెళ్ళేటప్పుడు కూడా “నన్ను ఉరి తీయకూడదు" అంటూనే ఉంటుంది.


భగత్ సింగ్ ఆ ఘట్టం వర్ణించేప్పుడు అతని కళ్ళు వర్షించేవి. అది చూసిన సదరు స్నేహితులు మృత్యువంటే రమ్మని సవాల్ చేసే తమ కామ్రేడ్, మరణభయంతో వణికే ఒక నవలా పాత్ర కోసం కన్నీరు కార్చే దృశ్యం చూసి ఆశ్చర్యపడ్డారు. 1931 మార్చి 23వ తేదీన భగత్ సింగ్ కు  ఉరిశిక్ష అమలు జరుపుతున్నా సమయంలో భగత్ సింగ్ ఉరి కంబం దగ్గరకు వెళ్ళాడు. అక్కడే ఉన్న మేజిస్ట్రేట్ తో..


"మేజిస్ట్రేట్ సాబ్! మీరు నిజంగా చాలా అదృష్టవంతులు. ఒక భారతీయ విప్లవకారుడు, తన మహత్తర లక్ష్యసాధన కోసం నవ్వుతూ ప్రాణాలర్పించడానికి ఉరి కంబం ఎలా ఎక్కుతాడో చూసే అవకాశం మీకు దొరికింది” అని చెప్పి చిరునవ్వుతో ఉరి కంబపు ఉరి తాడు మెడకు తగిలించుకున్నాడు.


 "నా జీవనజ్యోతి ఉదయపు వెలుగులా ఆరిపోయినా, మా ఆదర్శం, మా భావాలు విద్యుల్లతల్లా ప్రపంచాన్నంతా జాగృతం చేస్తాయి. నా పిడికెడు బూడిద నశించిపోతే ప్రపంచానికి నష్టమేమిటి?” అన్నాడు.


కేవలం ఇది మాత్రమే కాదు. భగత్ సింగ్ కు ఉరిశిక్ష అని తెలిసిన తరువాత ఆయన తాంత్రి తన కొడుకును ఆ శిక్ష నుండి తప్పించాలని ఎంతగానో ప్రయత్నం చేసాడు. అప్పుడు భగత్ సింగ్ తన తండ్రి కోసం ఒక ఉత్తరం రాసాడు. ఆ ఉత్తరాన్ని చదివితే ప్రతి భారతీయుడు దేశానికి ఎంతో గౌరవం ఇస్తాడు. ఆ ఉత్తరం ఇలా సాగుతుంది...


పూజ్యులైన తండ్రిగారికి,


నన్ను ఉరికంబం నుంచి తప్పించేందుకు కన్నతండ్రిగా మీరు పడుతున్న తపనకు కొడుకుగా సంతోషపడతానేమో, కానీ ఈ దేశపౌరుడిగా మాత్రం సిగ్గుపడుతున్నాను. మీ కొడుకునైనందుకు మీ ఆశల్ని, ఆకాంక్షల్ని గౌరవిస్తాను. కానీ మీ కన్నా ముందు ఈ మాతృభూమి రుణం తీర్చుకునే హక్కు నాకు లేదంటారా? నేను బ్రిటిషర్లపై చేసిన దాడిని నేరంగా భావించటం లేదు. అందుకే నేనెప్పుడూ మీ ముందు నిర్దోషినని నిరూపించుకునేందుకు, కోర్టులో వాదించేందుకు అంగీకరించలేదు. నాన్నా... నా జీవితం మనదేశం కన్నా విలువైందేమీ కాదు. కేవలం నా జీవితమే కాదు ప్రతి యువకుడి జీవితం కూడా ఇలా మాతృభూమికే సమర్పణం చేయాలని నమ్ముతాను. అందుకు ఎన్ని ప్రతిఘటనలనైనా ఎదుర్కోవాలి. అలాంటి ప్రగతి కోసం నిలబడే ఏ వ్యక్తి అయినా కాలం తీరిన పాత విశ్వాసాల్ని సవాలు చేయాలి. నాకు తెలుసు నా మెడకు ఉరితాడు బిగించడమే జీవితంలో ఆఖరిక్షణం అవుతుంది. అయినా ఒక లక్ష్యం కోసం పోరాడిన జీవితానికి అలాంటి ముగింపు గర్వకారణమే కాని దయనీయం కాదు. ఎలాంటి స్వార్ధం లేకుండా, ఎలాంటి పారితోషికం ఆశించకుండా నా జీవితాన్ని దేశస్వాతంత్య్రం కోసం అర్పించాననే సంతృప్తితో, చిరునవ్వుతో మృత్యువును ఆహ్వానిస్తున్నాను. మానవాళికి సేవచేయటానికి, పీడితులకు విముక్తిని కల్పించటానికి యువతరం ముందుకొచ్చినప్పుడే నవయుగానికి నాంది సాధ్యమవుతుంది.  నాన్నా... నా మరణం తరువాత  ముందు తరాలకు త్యాగమనే సుగుణం తీగలా వ్యాపించేలా చూడండి. ఎలాంటి పరీక్షాసమయంలోనైనా మహత్తరమైన మానసిక దృఢత్వాన్ని సడలనీకుండా చూసుకొమ్మని ప్రోత్సహించండి... ఇక సెలవు…


                        ఇట్లు

               మీ ప్రియ పుత్రుడు

                  భగత్ సింగ్.


ఓసారి ఇలాంటి విప్లవ వీరుల మాటలు, వారి అంతరంగం విన్నా, వారి నాటి స్థితిగతులు తెలుసుకున్నా దేశానికి తగిన మార్గం ఈ భారతీయ పౌరులకే అర్థమవుతుంది.


                                   ◆నిశ్శబ్ద.