Read more!

సి.పి బ్రౌన్ పుట్టింది మన దేశంలోనే అని మీకు తెలుసా?

భారతదేశం ఆంగ్లేయుల పాలనలో ఉక్కిరిబిక్కిరి అవుతుండగా భారతీయుల పరిస్థితులను, ముఖ్యంగా తెలుగువారి పరిస్థితులను అర్థం చేసుకుని తెలుగువారి జీవితాలకు కొత్త దారి చూపించిన ఆంగ్లేయ అధికారులు నలుగురున్నారు. సర్ థామస్ మన్రో. కాలిన్స్ మెకెంజీ. సర్ ఆర్థర్ కాటన్. సి.పి. బ్రౌన్. ఆ నలుగురూ. తెలుగువారు ఈ నలుగురిని ఎప్పటికీ మరచిపోరు. ముఖ్యంగా తెలుగు భాష విషయంలో సి.పి. బ్రౌన్ కృషి మరువలేనిది. అయితే సి.పి. బ్రౌన్ ఆంగ్లేయ అధికారిగా ఇక్కడికి వచ్చినా ఆయన పుట్టింది మాత్రం భారతదేశంలోనే..


చాలా ఆశ్చర్యంగా అనిపించినా అదే నిజం. సి.పి. బ్రౌన్ తండ్రి రెవరెండ్ డేవిడ్ బ్రౌన్ క్రైస్తవ మత ప్రచారకుడిగా 1786లో కలకత్తా వచ్చాడు. హిందూ మతాచారాలను అవగతం చేసుకొనే లక్ష్యంతో భారతీయ భాషలను నేర్చుకున్నారు. ప్రాచ్యభాషా సంస్కృతులపట్ల ఆదరాభిమానాలు కలవాడు డేవిడ్ బ్రౌన్. ఈ క్రమంలోనే సి.పి.బ్రౌన్ రెండవ కొడుకుగా కలకత్తాలో జన్మించాడు. ఆ తరువాత తండ్రి చనిపోయిన తరువాత వీరు ఇంగ్లాండ్ కు వెళ్లిపోయారు. అయితే ఈస్టిండియా కంపెనీ కోసం బ్రౌన్ లండన్ (హెర్ట్ఫోర్డ్ లోని హెయిల్ బరీ కాలేజీలో చేర్పించారు. ఈ కాలేజీలో సంస్కృతం బోధించేవారు. సంస్కృతం లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు 'బంగారుపతకాలు' యిచ్చేవారు. ఆ పతకం అంచు చుట్టూ"తత్ సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం" అన్న సంస్కృత సూక్తి ఒకవైపు, మరోవైపు 'శ్రీవిద్యా వరాహ' అని చెక్కబడి వుండేది. ఆవిధంగా బ్రౌన్ సంస్కృతాభ్యాసం సాగించి బంగారు పతకం పొందాడు.


బ్రౌన్ భారతదేశానికి వచ్చినప్పటికీ ఆయన వయసు 19 ఏళ్ళు. తెలుగు నేర్చుకోవాలని పట్టుదలతో వెలగపూడి కోదండరామ పంతులు వద్ద తెలుగు అక్షరాలు నేర్చుకొన్నాడు. పదహారు నెలల్లో తెలుగులో మంచి ప్రావీణ్యం సంపాదించాడు. థామస్ మన్రో ప్రభావం, ఆయన 'కాన్వోకేషన్' ఉపన్యాసంలో తెలుగులో  చేసిన ప్రసంగం బ్రౌన్ మనసులో గాఢంగా పాతుకుపోయింది. ఈయన మొదటగా కడపలో ఉద్యోగ జీవితం ప్రారంభించాడు. తెలుగు సాహిత్యానికి సుక్షేత్రమైన కడపలో ప్రధాన కార్యస్థానాన్ని నెలకొల్పాడు. ఆయన పలు చోట్ల పని చేసినా ఎక్కడా స్థిరాస్తి సంపాదించలేదు. కడపలో పెద్ద బంగళా, తోట కొన్నారు. అప్పట్లో అతని వేతనం 5-6 వందలకు మించదు. బంగాళాలో పెద్ద గ్రంథాలయం నెలకొల్పాడు. సొంత డబ్బుతో పండితులను నియమించాడు. బంగళాను 'సాహిత్య కర్మాగారం'గా రూపొందించాడు.


అవిద్య ఆకాండతాండవం చేస్తున్న కాలమది. చదువుకొన్న తెలుగు యువకులు చాలా అరుదుగా వున్న కాలమది. 1821లో కడపలో రెండు బళ్ళు పెట్టాడు. ఉచితంగా తెలుగు, హిందూస్తానీలలో చదువు చెప్పించాడు. ఆ బళ్ళలో దేశీయ ఉపాధ్యాయులను నియమించాడు. విద్యార్థులకు ఉచిత భోజన సౌకర్యం కల్పించాడు.


"హిందూ మేనర్స్, కస్టమ్స్ అండ్ సెర్మనీస్"పుస్తకం చదువుతుండగా వేమన ప్రస్తావన కన్పించింది. వేమన పట్ల శ్రద్ధ పెరిగింది. వేమన పద్యాలు గల తాటాకు ప్రతులెన్నో తెప్పించాడు. మచిలీపట్నం కోర్టు పండితుడు తిప్పాభట్ల వెంకట శివశాస్త్రి, వర్యం అద్వైత బ్రహ్మ శాస్త్రి, ఆ దశలో సాహిత్య విద్యా గురువులయ్యారు. వేమన పద్యాలకు అర్థతాత్పర్యాలు బోధించారు. తెలుగు వ్యాకరణ, ఛందస్సూత్రాలు నేర్చుకొన్నాడు బ్రౌన్. దాదాపు 2 వేల వేమన పద్యాలను సేకరించి వాటిలో 633 పద్యాలను ఇంగ్లీషులోకి అనువాదం చేసి అచ్చు వేయించాడు. అలా వేమన పద్యాలకు ప్రపంచంలో విస్తృత ప్రచారం కావించాడు.


                                   ◆నిశ్శబ్ద.