Read more!

చాక్లెట్ చెమ్మక్ లో కరిగిపోండిక!

దేన్నైనా మన అనుకోవడం మన ఇండియన్స్ కి చాలా గొప్ప అలవాటు. అలాగే ఎక్కడి నుండో వచ్చిన వాలెంటైన్స్ డే ని మనదే మనదే అంటూ మనతో కలిపేసుకున్నాం.  ఫిబ్రవరి 2nd వీక్ మొత్తం వాలెంటైన్స్ డే సందడి మాములుగా ఉండదు. మరీ ముఖ్యంగా ఒక్కోరోజు ఒక్కో ప్రత్యేకతతో వాలెంటైన్స్ డే జపం చేస్తూ జుయ్.. జుయ్.. అంటూ ఫెరారీ కారులో తిరిగినట్టు యువత యమ స్పీడుగా, మరింత ఉత్సాహంతో తిరిగేస్తుంటారు. 

వాలెంటైన్స్ డే మూడవ రోజు తియ్యతియ్యని చాక్లెట్ డే.. చిన్నా పెద్దా తేడాల్లేకుండా చాక్లెట్లను చప్పరించేసే వారున్నారు. ఈకాలంలో ఈ షుగర్ అనే జబ్బు లేకుంటే చాక్లెట్ ల వ్యాపారం ఇంకెంత శుభ్రంగా ఉండేదో అనిపిస్తుంది. అయితే ప్రస్తుతానికి వస్తే.. ముచ్చటగా మూడవ రోజు చాక్లెట్ డే రోజు.. ప్రేమికులు చాక్లెట్ లను ఇచ్చి పుచ్చుకుని మనసులో దాగున్న ప్రేమను చాక్లెట్ అంత తియ్యగా వ్యక్తం చేసి మధురానుభూతిని పొందుతారు. 

సాధారణంగానే ప్రియురాలిని కలిసే ప్రియుడు చాక్లెట్ లేకుండా అస్సలు వెళ్ళడు. ఒకవేళ తొందరలో.. కిందామీద పడుతూ చాక్లెట్ లేకుండా వెళితే మాత్రం.. ఆ ప్రియురాలి ముఖం క్యారమిల్ లో ముంచి తీసినట్టు కన్నీళ్లు కారుతూ కనిపిస్తుంది.  అంతేనా.. ఎండలో నిలబడిన డైరీ మిల్క్ లాగా దిగులుపడిపోతుంది.

ఇకపోతే కమ్మగా కరిగిపోయే చాక్లెట్ వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.  అవేంటంటే…

చర్మానికి మేలు చేస్తుంది

 చాక్లెట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి, ఇందులో కోకో ఉంటుంది, ఇది చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది.  ఈ చాక్లెట్ డే రోజు ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న డార్క్ చాక్లెట్‌ మిమ్మల్ని మరింత ఉత్సాహంగా మారుస్తుంది.

 యాంటీ ఆక్సిడెంట్

 యాంటీ ఆక్సిడెంట్ అయిన పాలీఫెనాల్ వంటి ఫైటోకెమికల్, వాటి లక్షణాల కారణంగా చాక్లెట్ ఘూఢమైన  సువాసనను కలిగి ఉంటుంది.  ఇది వాలెరిక్ యాసిడ్ వంటి ఫ్లేవనాయిడ్లను కలిగి ఉంటుంది, ఇది శరీరానికి విశ్రాంతిని ఇస్తుంది.

బెస్ట్ స్ట్రెస్ బస్టర్

 ఈ కాలంలో ఒత్తిడి అనేది ఒక సాధారణ సమస్య అయిపోయింది. మీరు గనుక దానితో ఎక్కువగా టచ్ లో ఉన్నట్లయితే.. మీరు ప్రతిరోజూ డార్క్ చాక్లెట్ ను  తినాలి, ఎందుకంటే ఇది ఒత్తిడిని తగ్గించే లక్షణాలను కలిగి ఉంటుంది. ఎప్పుడైనా ఒత్తిడిగా అనిపించినప్పుడు, నీరసంగా, బద్ధకంగా  ఉన్నపుడు డార్క్ చాక్లెట్ తిన్నారంటే మీలో కనిపించే మార్పును మీరే స్పష్టంగా చూడగలరు.

మధుమేహం ఛాన్సెస్ తక్కువ.. 

వినడానికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ ఇదే నిజం. సహజంగా స్వీట్స్ అంటే ఇష్టపడేవారు ఇప్పటి కాలానికి తగ్గట్టు నచ్చినన్ని స్వీట్స్ తినాలంటే భయపడతారు. షుగర్ ఎక్కడ వస్తుందోనని వారి భయం. అయితే, డార్క్ చాక్లెట్‌ లో ఉండే ఫ్లేవనాయిడ్‌ లు మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. కాబట్టి డయాబెటిస్ అని భయపడేవారు తీపి తినాలని అనిపించినా, షుగర్ వస్తుందేమో అనే భయంతో తీపికి దూరం ఉండాలని అనుకున్నా ఆ భయాలు పక్కన పెట్టి హాయిగా డార్క్ చాక్లెట్ ని చప్పరించేయండి.

చూశారా??  కేవలం ప్రియురాలిని, ప్రియుడిని కూల్ చేయడమే కాదు, ఆరోగ్యాన్ని చక్కబెట్టగలదు మన చాక్లెట్.  చాక్లెట్ డే పేరు చెప్పుకుని ఇంకాస్త ఎక్కువ డోస్ వేసేయండి ఈరోజు..

                                    ◆నిశ్శబ్ద.