పసిపిల్లలను పని పిల్లలుగా చేయొద్దు!

చట్టాల ప్రకారం బడి వయసు పిల్లలు బడిలో ఉండాలి. వాళ్ళు బయట పనులు చేయకూడదు. అందరికీ విద్యలో భాగంగా ప్రభుత్వాలు అన్ని వర్గాల వారికీ ఉచిత విద్యను ప్రవేశ పెట్టాయి. ఎన్నో పథకాలు ప్రవేశపెట్టాయి. ఆఖరికి పాఠశాలలోనే భోజనము పెడుతూ పిల్లలను విద్యాధికులుగా మార్చి ఈ దేశానికి బంగారు బాటలు వేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి.కానీ పిల్లలందరూ చదువుకోవడం లేదేందుకు?

పేదరికం!

పసిపిల్లల జీవితాలు పనిపిల్లల వర్గంలో పడిపోవడానికి కారణం పేదరికం అనేది నమ్మాల్సిన నిజం. పేదరికం ఉంటే ఏంటి ప్రభుత్వాలు ఉచిత విద్య అందిస్తున్నాయి కదా అనే ప్రశ్న అందరికీ వస్తుంది. కానీ సమస్య కేవలం పసిపిల్లలదే అయితే పరిష్కారం అయిపోతుంది. ఇక్కడ  సమస్య ఆ పసిపిల్లల కుటుంబాలది. చిన్నతనంలోనే కుటుంబాన్ని మోయాల్సిన బాధ్యతాయుతమైన వ్యక్తులు చనిపోవడం వల్ల ఇంటి భారాన్ని భుజాలకు ఎత్తుకుని పనిపిల్లలుగా మారుతున్నవాళ్ళు అధికం. 

బాలకార్మికులు!

ఈ కాలంలో ప్రతిరోజూ ప్రతి వీధిలో కనీసం ఒక్కరైనా బడిలో ఉండాల్సిన పిల్లలు పనులు చేస్తూ కనిపిస్తారు. ఇంటి పనులు చేస్తూ, బిల్డింగ్ వర్క్ లు, షాప్ లలోనూ ఆఫీసులలోనూ ఫ్లోర్ తుడుస్తూ, ఇంకా వీధుల్లో ఆహారపదార్థాలు అమ్ముతూ, ట్రైన్ లలోనూ, బస్టాండ్ లలోనూ, ఫ్లాట్ ఫామ్ ల మీద ఎక్కడ చూసినా లేత చేతులు, కాళ్ళు మోయలేని బరువులతో ఆగని నడకలతో సాగుతూనే ఉంటారు. వీళ్ళందరూ తమ బాల్యాన్ని సంతోషంగా గడపలేకపోయినా చెప్పలేనంత భారంతో జీవిత బండ్లు లాగుతున్నవాళ్ళు. సమాజం వీళ్ళను బలకార్మికులు అంటోంది. సుమారు 5 నుండి 14 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవాళ్లు ఈ బాలకార్మికులలో భాగంగా ఉన్నారు.

కారణాలు!

పైన చెప్పుకున్నట్టు పేదరికం బాలకార్మికులు తయారవ్వడానికి మూలకారణం. అది మాత్రమే కాకుండా అనాథ పిల్లలు ఈ వర్గంలోకి అర్థాంతరంగా వచ్చి పడుతున్నారు. పిల్లల బరువు మోయలేమనే కారణంతో కొందరు పిల్లలను ఎక్కడంటే అక్కడ వదిలేసి బరువు దించేసుకుంటారు. అలాంటి పిల్లలు బ్రతకడానికి  ఎన్నో మార్గాలు వెతుకుతూ పనివాళ్లుగా మారిపోతున్నారు. 

ఆర్థిక భరోసా లేని జీవితాల వల్ల పిల్లలకు ఎలాంటి రక్షణ ఉండదు. పెద్దవాళ్ళ లాగా పనికి తగ్గ పలితాన్ని డిమాండ్ చేసే ఆలోచన, ధైర్యం వాళ్లకు ఉండవు. జీవితం గురించి ఒకానొక భయం వాళ్ళను వెంటాడుతూ ఉంటుంది. కేవలం కడుపు నింపుకోవడానికి అడ్డమైన చాకిరీ చేస్తుంటారు. యజమానులు కూడా కఠినంగా ఉంటూ పిల్లల్ని తమ గుప్పెట్లో పెట్టుకుని శ్రమదోపిడి చేస్తారు. 

తల్లిదండ్రులు, సంరక్షకులు ఉండే పిల్లలు ఈ వర్గంలోకి రావడం చాలా అరుదు. ఎటొచ్చి అయినవాళ్ళు లేకుండా వీధినపడ్డ వాళ్ళు ఎక్కువ. ఇంకా పేదరికంలో ఉండే కుటుంబాలలో బాధ్యత లేని తండ్రుల వల్ల బాలకార్మికులుగా మారుతున్నవాళ్ళు ఎక్కువ. 

ముంబయ్, ఢిల్లీ, హైదరాబాద్, కలకత్తా వంటి రాజధాని ప్రాంతాలలో స్లమ్స్ ఏరియాలలో ఇలాంటి బాలకార్మిక పసి కుసుమాలు ఎక్కువ.

పరిష్కారాలు!

ఈ బాలకార్మికులకు నివాసం, రక్షణ అనేది పెద్ద ప్రశ్నలుగా ఉంటాయి. ప్రస్తుత భారతదేశంలో పిల్లలకు ఉచిత విద్య అందించినా సరైన రక్షణ లేక, ఒక మంచి మార్గనిర్దేశకం చేసేవాళ్ళు లేక చాలా అయోమయంలో పడిపోతున్నారు. నిజానికి సమాజంలో ఉన్న అందరూ సంకల్పం చేసుకుంటే బాలకార్మిక వ్యవస్థను చాలా వరకు నిర్మూలించవచ్చు. ప్రస్తుత కాలంలో పిల్లలకు మేమున్నామనే ధైర్యం ఇస్తూ ఉంటే ఎంచక్కా చక్కగా చదువుకుంటారు. వాళ్ళ ప్రతిభను అనుసరించి ఎన్నో ఫౌండేషన్ లు డొనేషన్ లు విద్యార్థులను ఆదుకుంటున్నాయి. ఆలోచించుకోలేని వయసులో కాసింత ఆవాసం ఇస్తే బాలకార్మికులు కాస్తా బావిభారత పౌరులు అవుతారు.

◆వెంకటేష్ పువ్వాడ.

Advertising
Advertising