Read more!

ఆకలి మంటలు చల్లార్చే ఆయుధం మనదగ్గరే ఉంది!

ఈ ప్రపంచంలో మనిషికి కావలసిన తప్పనిసరి అవసరాల్లో ఆహారం ఒకటి. దేశం ఏదైనా ప్రాంతం ఏదైనా ప్రాణి ఏదైనా ఆహారం లేకుండా బతకడం కష్టం. అందుకే ఆహారం అనేది ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ప్రతి మనిషి తనకు సరిపడిన ఆహారం పొందడం అనేది ప్రాథమిక హక్కుగా పరిగణించబడింది కూడా. అయితే ఈ ప్రపంచంలో ఉన్న జనాభాలో ప్రతి పదిమందిలో ఒక్కరు దీర్ఘకాలిక ఆకలితో అలమటిస్తున్నారు. 1945 సంవత్సరం నాటికి ఐక్యరాజ్యసమితి ప్రతి మనిషి ఆహారం పొందడాన్ని హక్కుగా గుర్తించలేదు. అయితే 1979, అక్టోబర్ 16 న ఆహారం పొందడం కూడా ఒక హక్కుగా ఐక్యరాజ్యసమితి గుర్తించడంతో ప్రతి సంవత్సరం అక్టోబర్ 16 న ప్రపంచ ఆహార దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 

ప్రపంచంలో ఆహార భద్రత ఉన్న దేశాల్లో భారతదేశం ప్రస్తుతం 68వ స్థానంలో ఉంది.  కొన్ని దేశాలలో కనీసం రొట్టె ముక్కకు నోచుకోని జీవితాలు ఉన్నాయి. ఆహారం కోసం తుపాకులు పట్టుకుంటున్న వాళ్ళు, దొంగలుగా మారుతున్న వాళ్ళు ఉన్నారు. మరికొందరు బానిసత్వంలో మునిగిపోతున్నారు.

భారతదేశం ఆహార భద్రత దృష్ట్యా 68 వ స్థానంలో ఉన్నా ఎంతో మందికి ఆహారం దొరకడం లేదు. అధిక జనాభా గల భారతదేశంలో సగటు పౌరుడు అన్నిరకాల అవసరాలకు పోరాటం చేయాల్సిందే.  అంతే కాదు మహా నగరాలుగా పిలవబడే ముంబై, హైదరాబాద్, ఢిల్లీ, కలకత్తా వంటి నగరాలలో స్లమ్ ఏరియాలలో, ఫుట్ పాత్ ల మీద ఎంతోమంది ఆహారం సరిగా లేక బిక్కు బిక్కు మంటూ బ్రతుకుతుంటారు. ఇలాంటి వారికోసం ఆహార రక్షణ కల్పించడం సగటు పౌరులుగా అందరి బాధ్యత. 

ఏమి చేయచ్చు!!

ప్రతి పౌరుడు ప్రపంచం మొత్తం ఆకలి మంటలు చల్లార్చలేకపోవచ్చు. కానీ ప్రతి వ్యక్తి మరొక వ్యక్తి ఆకలి తీర్చగలడు. ఆ విషయం గుర్తుపెట్టుకొని దాన్ని అనుసరిస్తే తప్పకుండా ఆహారం అందరికీ అందుతుంది. 

సామాజిక స్పృహ కలిగిన కొంతమంది కలసి ఫుడ్ బ్యాంక్ ఏర్పాటు చేయవచ్చు. ఆహారాన్ని సేకరించడం, అవసరమైన వారికి అందించడం ఈ పనిలో భాగం. దీనివల్ల కొందరికైనా ఆహార భద్రత కల్పించినవారు అవుతాము. భారతీయ ఫంక్షన్ లు, పెళ్ళిళ్ళ్ళు, ఇతర శుభకార్యాలలో చాలా ఆహారం మిగిలిపోతూ ఉంటుంది అలాంటి ఆహారాన్ని సదరు కార్యక్రమాలు జరుపుతున్న యజమానులతో మాట్లాడి ఆరోగ్యకరమైన రీతుల్లో సేకరించి ఎంతోమంది ఆకలి తీర్చవచ్చు. 

ఆహార భద్రత పెరగాలి అంటే చేయాల్సిన మరొక పని, చిన్న రైతులను ప్రోత్సహించడం. ఆహార ధాన్యాలను వారి నుండి కొనుగోలు చేస్తే వారికి పంట అమ్మకం మీద భరోసా వస్తుంది. వారు పంటలు పండించగలరు.

ఆహార భద్రత కోసం విరాళాలు సేకరించడం కూడా ఎంతో మంచి పని. దేశ వ్యాప్తంగా ఎన్నో స్వచ్చంధ సంస్థలు ఈ దిశగా అడుగులు వేస్తున్నాయి కూడా. ప్రతి గ్రామంలో బాధ్యతాయుతమైన యువత సమూహంగా ఏర్పడి విరాళాలు సేకరించి ఆయా గ్రామాల్లో ఉన్న వారికి ఆకలి తీర్చడానికి ప్రత్యామ్నాయాలు కనుగొనగలిగితే ప్రతి గ్రామం నుండి మొదలై దేశ వ్యాప్తమవుతుంది ఈ గొప్ప అడుగు. 

ఇకపోతే ఈ ఆహార దినోత్సవం ఎందుకు అంత ముఖ్యమైనది?? దీని గురించి ఎందుకు అంత ప్రాముఖ్యత ఇస్తూ చర్చించుకోవాలి అనే విషయంలోకి వెళితే. ప్రపంచంలో ఆకలి వల్ల మనుషుల ప్రవర్తనలు, ప్రవృత్తులు మారిపోతాయి. మనుషులు తమ తమ కౄరత్వాన్ని పెంచుకోవడానికి ఆహారం ముఖ్య కారణం అవుతుంది. ఆహార లభ్యత ఏర్పడితే మనుషులలో ఈరకమైన ప్రవృత్తి తగ్గే అవకాశాలు ఉంటాయి. మరీ ముఖ్యంగా ఐక్యరాజ్యసమితి పేర్కొన్నట్టు ఆహారం పొందడం ప్రతి మనిషి హక్కు అయినప్పుడు దాన్ని పొందడం అనేది మనిషి బాధ్యత కూడా. అందుకే ఆహారాన్ని వృధా చేయద్దు, అలా చేస్తే ఇతరుల ఆహారాన్ని వారి నోటి నుండి లాక్కున్నట్టే. ఇతరుల ఆకలి మంటలు చల్లార్చే ఆయుధం ఏదైనా ఉందంటే అది మనదగ్గరే ఉంది, ఆహారాన్ని వృధా చేయకపోవడమే ఆ గొప్ప ఆయుధం. ఈ విషయం మరిచిపోకండి.

                                        ◆నిశ్శబ్ద.