మీరూ జుట్టు పిచ్చోళ్లేనా?

డబ్బెవరికి చేదు టైపులో జుట్టెవరికి చేదు చెప్పండి. జుట్టేమైనా తింటామా చేదు, తీపి, కారం అనడానికి అని డౌట్ వస్తే దాన్ని అవతలికి తరిమేయ్యండి. ఒకప్పుడు నాగుపాము జడలు, జులపాల జుట్టులు, గాలికి ఎగిరెగిరి పదే హెయిర్ క్రాఫులు అబ్బో ఆ కాలమే వేరబ్బా!! మరిప్పుడో…..

హెయిర్ ఫాల్ అనే సమస్యతో కొట్టుమిట్టాడుతూ ఉన్న జుట్టుపోకుంటే చాలు దేవుడా అని కోటి నమస్కారాలు చేసేవాళ్ళు ఎక్కువున్నారు. చెబితే నమ్మరు కానీ అమ్మయిలలో కూడా బట్టతల సమస్య కనబడుతూ ఉంటుందనే మాట వింటే విచిత్రంగానే ఉంటుంది. అవన్నీ వొద్దులే కానీ ఇప్పుడు ఒక విషయం తెలుసుకోవాలి, తెలిసిన విషయం గురించి కాసింత మాట్లాడుకోవాలి, మాట్లాడుకుంటూ ఆలోచించాలి, ఆలోచించి ఇంకేం చేస్తాం మనం అలా చెయ్యకుండా ఉండాలి.

ఎలా చెయ్యకుండా ఉండాలి?

జుట్టెవరికీ చేదు కాదు. మళ్లీ అదేమాట ఎందుకంటారా?? సరే జుట్టు అంటే అందరికీ ఇష్టమే. కొంతమందికి అదృష్టవశాత్తు బాగానే ఉంటుంది. జుట్టు లేకపోవడం రాలిపోవడం, క్రమేణా దాని వాల్యూమ్ తగ్గిపోవడం వీటికి కారణాలు బోలెడు ఉంటాయి. 

వాటిలో మొదటిది డిప్రెషన్. ఈకాలంలో ఈ మాట సహజం అయిపోయింది. అందుకే జుట్టు తక్కువున్నోళ్లు కూడా ఎక్కువైపోయారు. బట్టతలలు, ఎలుక తోకలు కామన్ అయిపోయాయి. ఏదో ఈకాలం లో ఫాషన్ పుణ్యమా అని కాస్త జుట్టు లూజుగా వదుల్తారు కాబట్టి ఎలుక తోక కూడా చిన్న కాలువలాగా కళకళలాడుతూ ఊగుతూ ఉంటుంది.

రెండవ కారణం డిఎన్ఏ. నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ఫ్యామిలీస్ లో బట్టతల వంశపార్యపరంగా వస్తున్నవాళ్ళు పాపం బోలెడు ఉంటున్నారు. జుట్టు పలుచగా ఉండటం, బట్టతల రావడం మాత్రమే కాకుండా అతిగా జుట్టు పెరగడం కూడా డిఎన్ఏ మాజిక్కే.

మూడవ కారణం లైఫ్ స్టైల్. ఆహారంలో biotin పుష్కలంగా ఉండాలి. జుట్టు, గోర్లు, చర్మం మొదలైనవి ఆరోగ్యంగా పెరగాలంటే ఈ పోషకం అవసరం. అలాగే శరీరానికి కావలసినంత విటమిన్ డి, చర్మానికి విటమిన్ ఈ కూడా అవసరం. మొత్తంగా చెప్పాలంటే విటమిన్, ప్రోటీన్ బ్యాలెన్స్డ్ గా ఉండాలి. దాంతో పాటు జుట్టు సంరక్షణ ముఖ్యం. ప్రస్తుత కాలంలో పొల్యూషన్, జంక్ ఫుడ్ వంటివి మనిషి భౌతిక స్వరూపాన్ని పూర్తిగా మార్చేస్తుంటాయి. అదే అదే భౌతిక స్వరూపమంటే బాడీ షేప్ అన్నమాట.

ఇలా ఇన్ని సమస్యలు మనిషి చుట్టూరా ఉన్నప్పుడు ఆ జుట్టును కోల్పోయేవాళ్ళు కూడా  లోలోపల బాధపడుతూనే ఉంటారు. కానీ ఆ బాధ కంటే కూడా బయటి వాళ్ళు వేలెత్తి చూపించి వెకిలిగా నవ్వుతూ జోక్స్ వేస్తుంటే మాత్రం ఇంకా ఇంకా కుమిలిపోవడం జరుగుతుంది.

లేనిదాన్ని ఎక్కడి నుండి తెస్తారు?

అదే లేని జుట్టును ఎక్కడి నుండి తెస్తారూ అని ఎవరైనా ఆలోచిస్తారా?? ఎంతసేపూ నీ పిలక, నీ బట్టతల అని ఏకసెక్కాలే కానీ జట్టులో ఏముందిలే మనిషి స్వభావం మంచిది అని ఎవరైనా అనుకుంటారా?? లేదే ఇతరుల్ని ఇన్సల్ట్ చేయడం అదొక రాచకార్యం అయిపోయింది అందరికీ. 

ఇవన్నీ తెలిసాక ఇంకొక విషయం. ఉత్తరప్రదేశ్ లో ఉన్నావ్ లో రీసెంట్ గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక అరేంజ్డ్ మ్యారేజ్ లో పెళ్లిలో పెళ్లి కొడుకు పాపం కళ్ళు తిరిగి పడిపోయాడు. అమ్మాయి వాళ్ళ అన్నయ్య పెళ్లి కొడుకు ముఖం మీద నీళ్లు జల్లి పైకి లేపుతున్నపుడు అతడి టైమ్ బాగలేక పెట్టుకున్న విగ్గు జారిపోయింది, అప్పటివరకు పెళ్లి కొడుక్కు స్టైల్ హెయిర్ స్టయిల్ అనుకున్న అమ్మాయి డిజప్పాయింట్ అయిపోయింది. ఇంకేముంది సినిమాటిక్ గా ఈ పెళ్లి క్యాన్సిల్ డైలాగ్ కూడా చెప్పేసింది. చెప్పేసాక ఇక ఏమవుతుంది ?? పెళ్లి ఆగిపోయింది.

ఇలా ఇలా అన్నీ బాగున్నా కేవలం జుట్టు కారణంగా మనుషుల మధ్య ముఖ్యంగా ఆడ, మగ రిలేషన్స్ మధ్య ఈ జుట్టు పెద్ద సమస్యలే తెచ్చిపెడుతోంది. 

అందుకే జుట్టు విషయంలో పిచ్చిగా ఉండకండి. లైట్ తీసుకోండి.

                             ◆వెంకటేష్ పువ్వాడ.

Advertising
Advertising