కులపోళ్లకే కీలక పోస్టులు! అక్కడా ఇక్కడా సేమ్ టు సేమ్
తెలుగు రాష్ట్రాల పాలనలో ప్రమాదకరమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రభుత్వంలోని కీలకమైన పోస్టుల్లో అధికారుల అనుభవం, పని తీరు కాకుండా తన అనుకున్న వారికే అందలం ఎక్కిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల కాలంలో ఇదీ మరీ ఎక్కువైందంటున్నారు. తన అనుకున్నవారితోనే ఆగకుండా ఇప్పుడు ఏకంగా తన కులానికి చెందిన వారికే ముఖ్యమైన పదవులు కట్టబెడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. తెలంగాణలో తాజాగా ప్రభాకర్‌రావును స్టేట్ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా నియమించడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. సీఎం సామాజిక వర్గానికి చెందిన వారు కాబట్టే ప్రభాకర్‌రావును స్టేట్ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా నియమించారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.
కేసీఆర్ సామాజిక వర్గానికి చెందిన రిటైర్డ్ అధికారులను కీలక పోస్టులలో నింపుతున్నారనే విమర్శలు చాలా కాలంగా వస్తున్నాయి. సీఐడీ, ఏసీబీ, విజిలెన్స్ వంటి కీలక విభాగాల్లో ఒక సామాజిక వర్గానికి చెందిన అధికారులే ఎక్కువగా ఉన్నారని చెబుతున్నారు. కేసీఆర్ కుటుంబాన్ని, టీఆర్ఎస్ ను విమర్శించే కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేసేందుకే ఏసీబీ, సీఐడీ, విజిలెన్స్ శాఖల్లో తన వారిని ముఖ్యమంత్రి నియమించుకున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి దీనిపై చాలా సార్లు గట్టిగానే మాట్లాడారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే నేతలపై అక్రమ కేసులు పెట్ట జైలుకు పంపాలనే కుట్రలో భాగంగానే కేసీఆర్.. ఈ మూడు విభాగాలను తనవారితో నింపేశారని ఆరోపించారు.
తెలంగాణలో ఇప్పటికే చాలా మంది అధికారులను పదవి కాలం ముగిసినా కొనసాగిస్తున్నారు. రిటైరై ఎక్స్ టెన్షన్ లో ఉన్నవాళ్లు, కన్సల్టెంట్లుగా నియమించినవాళ్లు దాదాపు 500 మంది వరకు ఉన్నట్లు అంచనా. వీళ్లే కాకుండా అన్ని శాఖలు, కమిషనరేట్లు, హెచ్.ఓ.డి. కార్యాలయాలు, జిల్లాల్లో చాలా మంది ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అందులో ఎక్కువ మంది ఒక సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారనే అరోపణలు వస్తున్నాయి. తనకు నచ్చిన వారిని కీలక పోస్టుల్లో నియమించడం.. నచ్చకపోతే లూప్ లైన్ లో పెట్టడం కూడా జరుగుతుందనే విమర్శలు చాలా కాలంగా ఉన్నాయి.
పోస్టింగుల్లో తమపై వివక్ష చూపుతున్నారంటూ గతంలో కొందరు ఐఏఎస్ లు ప్రత్యేకంగా సమావేశం పెట్టి సీఎస్ కు వినతిపత్రం ఇవ్వడం కలకలం రేపింది. పరిపాలనలో కీలక పాత్ర పోషించే ఐఏఎస్‌కూ వివక్ష తప్పడం లేదని, పదవుల నియామకంలో వివక్ష చూసి ప్రాధాన్యత లేని పోస్టింగులిస్తున్నారని ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన కొందరు ఐఏఎస్ అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. సీనియారిటీ, అను భవం ప్రాతిపదికన కాకుండా ప్రభుత్వాన్ని ప్రభావితం చేస్తున్న కొందరి వల్ల అనుభవం లేకపోయినా ఒక సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇస్తున్నట్టు ఐఏఎస్‌లు ఆరోపిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉందనే చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో ఏ ప్రాధాన్యమైన పోస్టు ఖాళీగా ఉన్నా అది రెడ్లకే ఇవ్వడం జగన్ ప్రభుత్వానికి అలవాటుగా మారిందనే ప్రచారం జరుగుతోంది. జగన్ సర్కార్ వచ్చాకా భర్తీ చేసిన కీలక పోస్టుల్లో మెజార్టీ ఆ సామాజిక వర్గానికే దక్కాయనే ఆరోపణలు ఉన్నాయి. టీటీడీ చైర్మెన్ గా, అదనపు ఈవోగా రెడ్లు ఉండగానే.. టీటీడీ ఈవోగా జవహర్ రెడ్డిని నియమించడం దుమారం రేపింది. ఏపీలో కీలకమైన పోస్టులన్ని ఆ సామాజిక వర్గానికే కట్టబెడుతూ..టీడీపీ అధినేత చంద్రబాబు వర్గానికి చెందిన అధికారులను లూప్ లైన్ లో వేస్తున్నారు. సిన్సియర్ అధికారులుగా పేరున్న వారిని అప్రాధాన్య శాఖలకు తరలించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
తెలుగు రాష్ట్రాల పాలనలో నెలకొన్న పరిస్థితులపై బ్యూరోకాట్లలో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటివి మంచిది కాదనే చర్చ జరుగుతోంది. పనితీరు ప్రామాణికంగా తీసుకోకుండా పోస్టింగులు ఇస్తే ఐఏఎస్ ల్లో జవాబుదారి తనం లోపిస్తుందని మేథావులు హెచ్చరిస్తున్నారు. ఒకరిని చూసి మరొకరు ఇలా చేసుకుంటూ పోతే పాలనంతా గాడి తప్పుతుందని, ప్రజాసంక్షేమం మూలకు పడుతుందని చెబుతున్నారు. ప్రజల కోణంలో కాకుండా తమ సొంత ప్రయోజనాల కోసం పాలకులు అధికారులకు పోస్టింగులు ఇస్తే చాలా ప్రమాదమంటున్నారు రాజ్యాంగ నిపుణులు.