ఆస్ట్రియా రాజధాని వియన్నాలో ముంబై తరహా ఉగ్ర దాడులు..
posted on Nov 3, 2020 @ 11:54AM
ఆస్ట్రియా దేశ రాజధాని వియన్నాలో కాల్పులు కలకలం రేపాయి. ఒకే సమయంలో ఆరు ప్రాంతాల్లో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో నలుగురు పౌరులు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. అయితే భద్రతాదళాల చేతిలో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. దీంతో వియన్నాలో ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. తప్పించుకున్న ఉగ్రవాదుల కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. ఈ సమయంలో ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని పోలీసులు హెచ్చరించారు.
2008 నవంబర్ (26 /11) లో ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడుల తరహాలో ఏక కాలంలో కాల్పులకు తెగబడాలని ఉగ్రవాద సంస్థ ప్లాన్ చేసినట్లు సమాచారం అందుతోంది. పోలీసుల కాల్పుల్లో చనిపోయిన ఉగ్రవాది ఇస్లామిక్ స్టేట్ సానుభూతిపరుడని ఆస్ట్రియా హోమ్ మంత్రి కార్ల్ నెహ్‌మర్ తెలిపారు. అయితే ప్రశాంతతకు మారు పేరైన ఆస్ట్రియాలో ఊహించని ఈ ఉగ్ర దాడులతో వియన్నా ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
ఇది ఇలా ఉండగా.. వియన్నాలో జరిగిన ఉగ్రవాదుల దాడిపై మన ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ క్లిష్ట సమయంలో ఆస్ట్రియాకు భారత్ పూర్తి అండగా ఉంటుందని అయన ట్వీట్ చేశారు. అంతేకాకుండా ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన వారి కుటుంబాలకు ప్రధాని తమ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.