దిశా చట్టానికే దిక్కు లేదు! ఈ నేరాలు, ఘోరాలు ఆపేదెవరు?

దిశ పోలీస్ స్టేషన్లు దిక్కు లేకుండా పోయాయా? దిశా చట్టం అటకెక్కిందా? నేరాలు, ఘోరాలను భరించాల్సిందేనా?. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి వస్తున్న సూటి ప్రశ్నలవి. ఆంధ్రప్రదేశ్ లో వరుసగా జరుగుతున్న దారుణ ఘటనలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలు అద్భుతుంగా ఉన్నాయని, గతంలో కంటే క్రైమ్ రేట్ 18 శాతం తగ్గిందని వైసీపీ నేతలు గొప్పలు చెప్పకుంటుండగా... క్షేత్రస్థాయిలో అసలు పరిస్థితి మాత్రం దారుణంగా తయారైంది. రోజూ ఎదో ఒక చోటు దారుణం జరుగుతూనే ఉంది. మహిళలు, పిల్లలపై అమానుష ఘటనలు వెలుగు చూస్తున్నాయి . దారుణ హత్యలు జరుగుతున్నాయి.     విజయవాడలో ఇంజనీరింగ్ విద్యార్థినిని ఓ ఉన్మాది కత్తితో దాడి చేసి హత్యచేసిన దుర్మార్గాన్ని మరిచిపోకముందే విశాఖపట్నంలో మరో కిరాతకం జరిగింది. గాజువాకలో వరలక్ష్మి అనే విద్యార్థినిని అఖిల్ వెంకటసాయి అనే యువకుడు దారుణంగా హత్య చేశాడు. విశాఖ నగరం నడిరోడ్డుపై యువతి గొంతు ను కత్తితో కోసి దారుణానికి ఒడిగట్టాడు. కొన్నిరోజుల కిందట విజయవాడలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థినిని ఓ ఉన్మాది కత్తితో దాడి చేసి చంపేశాడు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. అంతకుముందు కుడా రాష్ట్రంలో దారుణ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. దళితులపై దాడులు, శిరోముండనాల కేసులు పెద్ద ఎత్తున దుమారం రేపాయి. న్యాయం కోసం  స్టేషన్ కు వచ్చిన వారిపై పోలీసులే శిరోముండనం వేయడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.    రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలపై విపక్షాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. వైసీపీ పాలనలో ప్రజలకు రక్షణే  లేకుండా పోయిందనే ఆరోపణలు వస్తున్నాయి.  దిశ చట్టం చేశాం, దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశాం అని ప్రకటనలు చేసి ప్రచారం చేసుకున్న పాలకులు రాష్ట్రంలో మహిళలపై పెరుగుతున్న దాడులకు ఏం సమాధానం చెబుతారని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.  చట్టాలు చేశామని చేతులు దులుపుకుంటే ఏమిటి ప్రయోజనం అని పేర్కొన్నారు. దిశ చట్టం ఇప్పటికీ అమల్లోకి రాకపోవడానికి కారణం ఏంటో ప్రజలకు వివరించాలని స్పష్టం చేశారు. దిశ చట్టం అమలులోకి  తెచ్చామని చెబుతున్న వైసీపీ ప్రభుత్వ పెద్దలు.. వరుసగా జరుగుతున్న ఘటనలకు బాధ్యతగా  సిగ్గుతో తలదించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.   ప్రభుత్వ అసమర్దత వల్లే ఇలాంటి  ఘటనలు జరుగుతున్నాయని టీడీపీ, జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. ఉద్యమాలు, ఆందోళనలను  అణచివేయడంలో ఉక్కుపాదం మోపుతున్న ఏపీ సర్కారు ఇతర అసాంఘిక శక్తులను ఎందుకు కంట్రోల్ చేయలేకపోతుందని నిలదీస్తున్నారు. విద్యార్థినులు, యువతులు, మహిళలకు రక్షణ కల్పించే విషయంలో ప్రభుత్వం నిర్లిప్తంగా వ్యవహరించకూడదని హితవు పలికారు. ఇలాంటి దుర్మార్గానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పాఠశాల స్థాయి నుంచి విద్యార్థినులకు ఆత్మరక్షణ విద్యలు తప్పనిసరి చేయాలని, యువతులకు, మహిళలకు ఆత్మరక్షణ విద్యలు తప్పనిసరి చేయాలని సూచిస్తున్నారు.  

సీజేఐకి అన్ని విషయాలు తెలుసు: అటార్నీ జనరల్

ఏపీ సీఎం వైఎస్ జగన్‌ పై కోర్టు ధిక్కారం కేసు నమోదుకు అనుమతి కోరుతూ భారత అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కు ఢిల్లీకి చెందిన న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ లేఖ రాసిన సంగతి తెలిసిందే. అందులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సీఎం జగన్ లేఖ రాసిన అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. సీజేఐకి రాసిన లేఖను బహిర్గతం చేయడం కోర్టు ధిక్కారం కిందకే వస్తుందని అన్నారు. జగన్ పై 31 కేసులు ఉన్నాయని, ప్రజాప్రతినిధుల కేసులకు సంబంధించి జస్టిస్‌ ఎన్వీ రమణ తీర్పు ఇచ్చిన తర్వాత.. జగన్ ఈ లేఖ రాయడం అనేక అనుమానాలకు దారి తీస్తోందన్నారు.    కాగా, ఈ లేఖపై స్పందిస్తూ అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ తాజాగా అశ్వినీ ఉపాధ్యాయకు  ప్రత్యుత్తరం ఇచ్చారు. సీఎం జగన్ పై కోర్టు ధిక్కారం కేసు నమోదు కోసం తాను అనుమతి ఇవ్వలేనని స్పష్టం చేశారు. అన్ని విషయాలు సీజేఐకి తెలుసని, అందుకే ప్రత్యేకంగా కోర్టు ధిక్కారం కోసం తాను అనుమతి ఇవ్వాల్సిన అవసరం లేదని అటార్నీ జనరల్ పేర్కొన్నారు.

ధరణిలో సమస్యలు.. ఆందోళనలో జనాలు! గ్లోబరీనా ముంచుతుందా? 

అందరూ భయపడుతున్నట్లే జరుగుతోంది.. విపక్షాల అనుమానాలే బలపడుతున్నాయి.. రైతుల ఆందోళనే నిజమవుతోంది. తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన, సీఎం కేసీఆర్ గొప్పగా చెప్పుకుంటున్న ధరణి పోర్టల్ దరిద్రంగా ఉందని తెలుస్తోంది. అక్టోబర్ 29న ధరణి పోర్టల్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ జనగామ జిల్లాలో  ప్రారంభించగా.. ఇవాళ్టి నుంచి అధికారికంగా సేవలు ప్రారంభమయ్యాయి. అయితే తొలిరోజే అధికారులకు చుక్కలు చూపిస్తోంది ధరణి పోర్టల్. సాంకేతిక లోపాలతో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఓపెన్ కావడం లేదని తెలుస్తోంది. ఓపెనా అయినా కొన్నివివరాలను చూపించడం లేదంటున్నారు.    శంషాబాద్‌లోని తహసీల్దార్‌ ఆఫీసులో ధరణి సేవలను సీఎస్ సోమేష్ కుమార్ ప్రారంభించారు. అపరేటర్ దగ్గర కూర్చుని పరిశీలించారు సీఎస్. అయితే  ప్రారంభమైన వెంటనే ధరణి వెబ్‌సైట్‌లో సాంకేతిక లోపాలు తలెత్తాయి. మండల ఆఫీసులోని ఆపరేటర్ దగ్గర కూడా ధరణి పోర్టల్‌ ఓపెన్ కాలేదు. రంగారెడ్డి జిల్లా మొత్తంలో కేవలం ఐదు స్లాట్ల బుకింగ్‌ మాత్రమే ఉంది. గండిపేట తహసీల్దార్‌ కార్యాలయంలో స్లాట్‌లు బుకింగ్‌ అవడం లేదు.రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రారంభించిన తహసీల్దార్‌ ఆఫీసులోనే పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ధరణి వెబ్‌సైట్‌ ఓపెన్‌ కాకపోవడంతో రైతుల ఇబ్బందులకు గురవుతున్నారు. ఉదయం నుంచే ఈ-సేవా కేంద్రాల వద్ద రైతులు క్యూ కట్టారు.    రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ ధరణి వెబ్ సైట్ లో సాంకేతిక సమస్యలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. దీంతో రైతులు, భూములున్నవారు ఆందోళన చెందుతున్నారు. అస్తవ్యస్థంగా ఉన్న ధరణి పోర్టల్ తో తమ భూముల లెక్క తప్పుగా వస్తుందోమోనన్నఆందోళనను వారు వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో రైతులు ఆందోళనలు కూడా చేస్తున్నారట. చాలాకాలంగా రిజిస్ట్రేషన్లు నిలచిపోవడంతో రియల్ వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ధరణి సేవలు ప్రారంభం కావడంతో రిజిస్ట్రేషన్ కోసం వెళ్లిన వారికి నిరాశే ఎదురవుతోంది. సాంకేతిక సమస్యలతో రిజిస్ట్రేషన్లు కాకపోవడంతో ఇంకా ఎన్ని రోజులు ఎదురుచూడాల్సి వస్తుందేమోనని వారు ఆవేదన చెందుతున్నారు.                       నిజానికి ధరణి  పోర్టల్ పై మొదటి నుంచి అనుమానాలు, అభ్యంతరాలు వస్తున్నాయి. ప్రజల భూములకు సంబంధించిన సమాచారం ఉండే రెవిన్యూ శాఖ పోర్టల్ ను ప్రైవేట్ సంస్థకు అప్పగించడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ప్రైవేట్ సంస్థ అక్రమాలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు  ఎదుర్కొవాల్సి వస్తుందని కొందరు రెవిన్యూ నిపుణులు కూడా హెచ్చరించారు. ప్రజల భూములను తనఖా పెట్టి ప్రైవేట్ సంస్థ రుణాలు తీసుకోదనే గ్యారంటీ ఏంటని ప్రతి పక్ష నేతలు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అయినా ప్రభుత్వం అలాగే ముందుకెళ్లింది. ఇప్పుడు ప్రజలు భయపడ్డట్టే జరుగుతుండటంతో ధరణి పోర్టల్ భద్రతపై ప్రజల్లో అనుమానాలు మరింత పెరుగుతున్నాయి.   ధరణి పోర్టల్ కు సంబంధించి మరో విషయం కూడా వెలుగులోకి వస్తోంది. గత సంవత్సరం ఇంటర్ పరీక్షల ఫలితాల్లో తప్పులకు కారణమైన గ్లోబరీనా సంస్థే ధరణి పోర్టల్ ను తయారు చేసిందని చెబుతున్నారు.గ్లోబరీనా చేసిన నిర్వాకంతో ఇంటర్‌ ఫలితాల్లో జరిగిన అవకతవకల కారణంగా  లక్షలాదిమంది విద్యార్థులు సతమతమయ్యారు. పరీక్షల్లో ఫెయిల్ కారణంగా మనస్తాపంతో 25 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. ఇంటర్ ఫలితాల నిర్వహణ బాధ్యతను గ్లోబరీనా సంస్థకు అప్పగించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అనుభవంలేని సంస్థకు మూల్యాంకన బాధ్యతలు అప్పగించిన కారణంగానే ఇబ్బందులు తలెత్తాయనే ఆరోపణలు వచ్చాయి. ఆరోపణలపై విచారణకు ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ కూడా ..  టెండర్ల నుంచి ఫలితాలు వెల్లడి దాకా జరిగిన అన్ని ఘటనలపై సమగ్ర విచారణ జరిపి  పొరబాట్లలో గ్లోబరీనాకు బాధ్యత ఉందని తేల్చింది.   ఇంటర్ ఫలితాల నిర్వహణలో ఘోరంగా విఫలమై కొందరు విద్యార్థుల చావుకు కారణమైన గ్లోబరీనాకు అత్యంత కీలకమైన రెవిన్యూ శాఖ ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలు అప్పగించడం ఇప్పుడు ఆందోళన కల్గిస్తోంది. తమ ఆస్తులపై ప్రజలు, రైతులు కలవరపడుతున్నారు. పోర్టల్ లో తప్పులు జరిగితే భూముల లెక్కలన్ని తారుమారయ్యే అవకాశం ఉందని వారు ఆందోళన చెందుతున్నారు. ప్రజల ఆస్తులతో కేసీఆర్ సర్కార్ చెలగాటమాడుతుందని వారు ఆరోపిస్తున్నారు. ధరణి ద్వారా ఏమైనా తప్పులు జరిగితే అందుకే ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు.

బీజేపీపై మాయావతి సంచలన వ్యాఖ్యలు.. మతతత్వ పార్టీలతో జట్టుకట్టం

అవసరమైతే రాజకీయ సన్యాసం తీసుకుంటాను కానీ బీజేపీతో పొత్తు పెట్టుకునే పరిస్థితి లేదని బీఎస్పీ చీఫ్ మాయావతి స్పష్టం చేశారు. రాజ్యసభ, మండలి ఎన్నికల్లో సమాజ్‌ వాది పార్టీ అభ్యర్థులను ఓడించేందుకు బీజేపీ లేదా ఇతర అభ్యర్థులకు తాము ఓట్లు వేస్తామంటూ ఆమె ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ, బీఎస్పీ మధ్య పొత్తుపొడిచే అవకాశాలున్నాయంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పందించిన మాయావతి.. బీజేపీకి అనుకూలంగా ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్, సమాజ్‌ వాది పార్టీలు ప్రజలను పక్కదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నాయని మండిపడ్డారు. బీఎస్పీ నుంచి ముస్లింలను దూరం చేసేందుకే తమకు వ్యతిరేకంగా ఆ పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.    అసెంబ్లీ ఎన్నికల్లో గానీ, సార్వత్రిక ఎన్నికల్లో గానీ బీజేపీతో తమ పార్టీ కూటమి కట్టే ప్రసక్తే లేదని మాయావతి స్పష్టం చేశారు. ఈ రెండు పార్టీల సిద్ధాంతాల మధ్య తీవ్ర వైరుధ్యం ఉన్నందున జట్టుకట్టడం సాధ్యం కాదని ఆమె పేర్కొన్నారు. తమది సర్వజన హితం కోరే పార్టీ అని, మతతత్వ పార్టీలతో స్నేహం చేయదని అన్నారు. కుల, మత, పెట్టుబడిదారీ సిద్ధాంతాలున్న వారితో బీఎస్పీ కూటమి కట్టడం జరగదు అని పేర్కొన్నారు. మతతత్వ పార్టీలపై తన పోరాటం కొనసాగుతూనే ఉంటుందని, తాను ఎవరి ముందు మోకరిల్లే ప్రసక్తే లేదని చెప్పారు. తాను అవసరమైతే రాజకీయ సన్యాసం తీసుకుంటాను కానీ అలాంటి పార్టీల కూటమిలో మాత్రం చేరబోనని మాయావతి స్పష్టం చేశారు. 

సీఎం కేసీఆర్ హరీష్ రావుకు షాక్ ఇవ్వబోతున్నారా..? 

దుబ్బాక ఉపఎన్నిక అటు బీజేపీకి ఇటు టీఆర్ఎస్ కు చాలా కీలకంగా మారిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్ర మంత్రి హరీష్‌రావుకి సీఎం కేసీఆర్ ఊహించని షాక్ ఇచ్చినట్టు పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోందని కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి తాజాగా పేర్కొన్నారు. దుబ్బాక ఉపఎన్నిక తరువాత జీహెచ్ఎంసీ ఎన్నికలను నిర్వహించి.. ఆ ఫలితాలు వచ్చిన వెంటనే కేటీఆర్‌కు సీఎం పీఠం అప్పగించేందుకు సీఎం కేసీఆర్ రంగం సిద్ధం చేశారని సోషల్ మీడియా వేదికగా విజయశాంతి పేర్కొన్నారు. ‘‘దుబ్బాక ఉప ఉపఎన్నికలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు డిపాజిట్లు రాకుండా చేయాలని కంటి మీద కునుకు లేకుండా.. చెమటోడ్చి పనిచేస్తున్న తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు గారికి ఆయన మామ, సీఎం కేసీఆర్ గారు ఊహించని షాక్ ఇచ్చినట్లు చర్చ జరుగుతోంది. దుబ్బాక ఉపఎన్నిక తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికలను నిర్వహించి, ఆ ఫలితాలు వచ్చిన వెంటనే, సీఎం కేసీఆర్ గారు తన కుమారుడు కేటీఆర్‌ను సీఎం పదవిలో కూర్చోబెట్టేందుకు రంగం సిద్ధం చేసినట్టు టీఆర్ఎస్ వర్గాలు ప్రచారం మొదలు పెట్టాయి. అంతేకాకుండా ఈ వాదనకు బలం చేకూర్చే విధంగా... మొదటిసారిగా సీఎం కేసీఆర్ నోట సీఎం పదవికి రాజీనామా మాట బయటకు వచ్చింది. బీజేపీ మీద నెపం పెట్టి... తాను సీఎం పదవికి రాజీనామా చేస్తానని కేసీఆర్ సంకేతాలివ్వడం భవిష్యత్ రాజకీయానికి అద్దం పడుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.   గతంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనలో ఉన్నప్పుడు.. కేసీఆర్ ప్రభుత్వం కేంద్ర నిధులను దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. దీనిపై అప్పట్లో స్పందించిన కేసీఆర్, నోటికొచ్చినట్లు ఆరోపణలు చేయడం కాదు... ఆధారాలను చూపించకపోతే అమిత్ షా గారిని తెలంగాణ భూభాగం నుంచి కదలనివ్వనని వార్నింగ్ ఇచ్చిన విషయాన్ని ఎవరూ మర్చిపోలేరు. తర్వాత ఆ వార్నింగ్ ఏమైందో ఎవరికీ అంతుబట్టలేదు. అంతేకాకుండా తనపైనా.. తన ప్రభుత్వం పైనా నిరాధార ఆరోపణలు చేస్తే, ప్రతిపక్ష నేతలను జైలుకు పంపిస్తానని కేసీఆర్ గారు బెదిరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. తన ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తే వాటిపై విరుచుకుపడే కేసీఆర్ గారు, ఇప్పుడు సీఎం పదవికి రాజీనామా చేస్తానని కొత్త అంశాన్ని ఎందుకు తెరమీదకు తెచ్చారు అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఒక వైపు హరీష్ రావు గారు దుబ్బాకలో ప్రచారం చేస్తూ బీజేపీ నేతల మీద విరుచుకు పడుతున్న తరుణంలో.. ఆయన ప్రచారాన్ని కూడా డామినేట్ చేసే విధంగా సీఎం కేసీఆర్ గారు బీజేపీ నేతలకు సవాల్ విసరడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ ప్రకటన అటు బీజేపీ నేతలకే కాదు.. ఇటు హరీష్ రావు గారికి కూడా పరోక్షంగా సంకేతం ఇచ్చినట్టే అని తెలంగాణ సమాజం భావిస్తోంది. మొత్తం మీద కేసీఆర్ గారి రాజీనామా ప్రకటన చూస్తుంటే.. దుబ్బాక ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించిన తర్వాత (ఒకవేళ గెలిస్తే) హరీష్ రావు గారికి ఆయన మామ ఐన కేసీఆర్ గారు బంపర్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారని... ఆ గిఫ్ట్ ఏంటంటే.. తాను సీఎం పదవికి రాజీనామా చేసి, కేటీఆర్‌ను సీఎం గద్దెపై కూర్చోబెట్టబోతున్నారన్న వాదన వినిపిస్తోంది. ఎంతైనా నమ్మినవారిని గొంతు కోయడంలో కేసీఆర్ గారు అనుసరించే స్టైలే వేరు’’ అని విజయశాంతి తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

జీవీఎల్.. లోకలా? నాన్ లోకలా?

కోర్ కమిటీలో ఆయనొక్కరికే ఆహ్వానమా?   కన్నా, సుజనా, రమేష్, వెంకటేష్ లు అంటరానివారా?   జీవీఎల్‌ను ఏ అర్హతతో ఆహ్వానించారు?   బీజేపీలో ఇదో లిమిటెడ్  పాలిటిక్స్   జీవీఎల్ నరసింహారావు. బీజేపీ యుపి రాజ్యసభ సభ్యుడు. మొన్నటి వరకూ ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి. దక్షిణ భారతదేశం నుంచి తానొక్కడినే జాతీయ అధికార ప్రతినిధిని కాబట్టి.. అమరావతిపై తాను చెప్పిందే ఫైనలన్నది, మొన్నటి వరకూ ఆయన వాదన. రైటే. ఇప్పుడాయనకు జాతీయ పార్టీలో ఏ హోదా లేదు. ఇప్పటిక యితే.. జీవీఎల్ గారు కేవలం, యుపి బీజేపీ రాజ్యసభ సభ్యుడు మాత్రమే. మరి విశాఖలో జరిగిన బీజేపీ కోర్ కమిటీ సమావేశానికి, ఆయనొక్కరినే ఎలా ఆహ్వానించారు?  ఏపీ బీజేపీ మాజీ దళపతి కన్నా లక్ష్మీనారాయణ, ఆ పార్టీ రాజ్యసభ సభ్యులయిన కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి, సీఎం రమేష్, టిజి వెంకటేష్‌ను ఎందుకు పిలవలేదు? మరి వీరంతా ఏపీకి చెందిన వారే కదా? వీరికి లేని అర్హతలు, జీవీఎల్‌కు మాత్రమే ఉన్న అర్హతలేమిటి? అంటే జాతీయ పార్టీ కూడా.. రాష్ట్రాల్లో ‘లిమిటెడ్ లీడర్స్’కు పరిమితమవుతుందా? అసలు ఇది జాతీయ విధానమా? లేక ఏపీలో మాత్రమే సంఘటనా కార్యదర్శి వైఫల్యంతో నడుస్తున్న స్వతంత్ర విధానమా?.. ఇదీ ఇప్పుడు ఏపీ బీజేపీలో జరుగుతున్న చర్చ.   విశాఖలో ఆదివారం కోర్ కమిటీ భేటీ జరిగింది. దానికి ఏపీ ఇన్చార్జి సునీల్ దియోథర్, పార్టీ సంఘటనా జాతీయ కార్యదర్శి సతీష్‌జీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందీశ్వరి, యుపి ఎంపి జీవీఎల్ నరసింహారావు, ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు. అయితే, రాష్ట్రానికి చెందిన ఎంపీలనెవరినీ ఈ భేటీకి ఆహ్వానించని వైనంపై చర్చ జరిగింది. దీనిపై.. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్‌రెడ్డి స్పందిస్తూ, ఇది సంస్థాగతపరమైన సమావేశమేనని, అందులో ఎంపీలు ఉండరని చెప్పారు. బాగానే ఉంది. ఆయన చెప్పిందే నిజం. మరి.. జీవీఎల్ నరసింహారావు కూడా ఎంపీనే కదా? ఆయనొక్కరినే ఎలా ఆహ్వానించారు?పోనీ కోర్ కమిటీ సభ్యుడైనందుకే ఆయనను పిలిచారనుకున్నా... మరి ఆ లెక్కన, మిగిలిన ముగ్గురు ఎంపీలు, రాష్ట్ర మాజీ అధ్యక్షుడిని కూడా పిలవాలి కదా? అన్నది ప్రశ్న.   నిజానికి జీవీఎల్‌కు, ఏపీతో సాంకేతికంగా ఎలాంటి సంబంధం లేదు. ఆయన సాంకేతికంగా యుపి నుంచి ఎన్నికయిన రాజ్యసభ సభ్యుడు మాత్రమే. గతంలో ఉన్న జాతీయ అధికార ప్రతినిధి హోదా కూడా లేదు. ఇటీవల ఆయనకు ఓ కార్పొరేషన్ స్థాయి పదవి ఇచ్చారు. అది పార్టీ సమావేశాలకు సంబంధం లేదు. అధికారికంగా ఆయనకు కోర్ కమిటీలో ఆహ్వానం పంపడానికి వీల్లేదు. రాష్ట్రానికి సంబంధించిన వారు మాత్రమే ఆ కమిటీలో ఉండాలి. ఆ లెక్కన ఆయన ఏపీ నుంచి ఎన్నికయిన ఎంపీ కాదు. గతంలో నిర్మలాసీతారామన్ ఏపీ నుంచి ఎన్నికయినందున, ఆమె కోర్ కమిటీ సభ్యురాలయ్యారు. ఇప్పుడు పురందీశ్వరి జాతీయ ప్రధాన కార్యదర్శి. పైగా ఆమె గతంలో కూడా కోర్ కమిటీ సభ్యురాలే కాబట్టి, ఆమె హాజరవడాన్ని అర్ధం చేసుకోవచ్చు.  కానీ, జీవీఎల్‌ను ఏ ప్రాతిపదికన కోర్ కమిటీ భేటీకి పిలిచి, ఏ అనర్హతతో రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ముగ్గురు ఎంపీలను అంటరానివారిగా పక్కనపెట్టారన్న ప్రశ్నలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అసలు రాష్ట్రంలో ఉండే లోకల్ లీడర్లకు, వేరే రాష్ట్రం ఎంపీగా ఉంటూ ఢిల్లీలో ఉండే నాన్ లోకల్ లీడర్ జీవీఎల్‌కు, సంబంధం ఏమిటన్న లాజిక్కు నేతల నుంచి వినిపిస్తోంది. సోము వీర్రాజు అధ్యక్షుడయిన తర్వాత, పార్టీ కార్యక్రమాలు-తీసుకుంటున్న నిర్ణయాలన్నీ, ‘లిమిటెడ్ వ్యవహారం’గా మారిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.   సోము అండ్ కో నిర్ణయాలు నచ్చని ఓ  రాజ్యసభ సభ్యుడు, తనను టెలికాన్ఫరెన్సులకు పిలవద్దని నిర్మొహమాటంగా చెప్పారట. ఇటీవల కేంద్ర మంత్రి ఒకరు టెలికార్ఫరెన్సు తీసుకుంటే, దానికి ఎంపీలతో సహా పార్టీ నేతలంతా హాజరయ్యారు. అయితే, సదరు మంత్రి మాత్రం,  చివరలో ఒక్క జీవీఎల్‌ను ఉద్దేశించి మాత్రమే మాట్లాడటంతో, ఎంపీలంతా అగ్గిరాముళ్లయ్యారట. దానితో ఓ ఎంపీ, ఇకపై తనను టెలీకాన్ఫరెన్సులకు తీసుకోవద్దని నిర్మొహమాటంగానే చెప్పారట.   అసలు సాంకేతికంగా, ఏపీకి ఎలాంటి సంబంధం లేని జీవీఎల్‌కు..ఏపీ పార్టీ వ్యవహారాల్లో,  పెద్ద పీట వేయడం ఏమిటని సీనియర్లంతా గుర్రుమంటున్నారు. ఆయన ఏ అర్హతతో ఏపీ కోర్ కమిటీ సమావేశాలకు వస్తున్నారు? ఏపీ రాజ్యసభ సభ్యులు యుపి కోర్ కమిటీకి వెళితే, వారిని అనుమతిస్తారా? అందాకా ఎందుకు.. ఇప్పుడు కర్నాటక ఎంపీ అయిన నిర్మలాసీతారామన్, ఏపీ కోర్‌కమిటీలో వస్తే అనుమతిస్తారా? మరి ఆమెది కూడా ఏపీనే కదా? ఈ విషయంలో ఒక్క జీవీఎల్‌కు మాత్రమే ఎలా మినహాయింపు ఇస్తున్నారు? ఆయన ఏపీకి చెందిన వారయినప్పటికీ.. యుపీ నుంచి ఎన్నికయిన ఎంపీ కాబట్టి, ఇక్కడ కోర్ కమిటీలో ఉండకూడదు కదా? అని నిలదీస్తున్నారు.   అయినా ఆయనను రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర సంఘటనా కార్యదర్శి ఎలా అనుమతిస్తున్నారు? అంటే వాళ్లిద్దరే ఆయనను ప్రోత్సహిస్తున్నారని భావించాలా? అసలు రాష్ట్ర సంఘటనా కార్యదర్శి మధుకర్‌రెడ్డిజీ  స్వతంత్రంగా పనిచేస్తున్నారా? లేక అధ్యక్షుడి ఆదేశాల మేరకు పనిచేస్తున్నారా? అదీకాకపోతే, అంతా కలసి ఓ వర్గంగా పనిచేస్తున్నారా? జాతీయ సంఘటనా కార్యదర్శి సతీష్‌జీ కూడా, ఇలాంటి చర్యలను ఖండించకపోవడం ఏమిటి? జీవీఎల్ కోర్ కమిటీకి ఎలా హాజరవుతారు? మిగిలిన ఎంపీలను ఎందుకు పిలవలేదని సతీష్‌జీ ప్రశ్నించకపోవడం ఏమిటి? అన్న ప్రశ్నలు సీనియర్ల నుంచి వినిపిస్తున్నాయి.   -మార్తి సుబ్రహ్మణ్యం

అలవాటులో పొరపాటు.. హస్తం గుర్తుకే మీ ఓటు అని నాలుక కరుచుకున్న జ్యోతిరాదిత్య

రెండు తరాలుగా సింధియా వంశం కాంగ్రెస్ లో కొనసాగిన సంగతి తెలిసిందే. తండ్రి మాధవరావు సింధియా.. ఇపుడు జోతిరాధిత్య సింధియా కూడా కాంగ్రెస్ నాయకులే అయినా.. కొద్దీ నెలల క్రితం జ్యోతిరాదిత్య కాంగ్రెస్ ను వీడి బీజేపీ లో చేరిన సంగతి తెలిసిందే. అయితే అయన ప్రస్తుతం బీజేపీలో ఉన్నా, జ్యోతిరాదిత్య సింధియా నోటి వెంట కాంగ్రెస్ అనే మాట మాత్రం అనుకోకుండా వచ్చేస్తోంది. తాజాగా దబ్రా నియోజకవర్గంలో జరుగుతున్న ఉప ఎన్నికల ప్రచార సభలో ఇదే విషయం ఆయనను ఇబ్బందికి గురి చేసింది. అక్కడ బీజేపీ అభ్యర్థిని ఇమర్తీ దేవి తరుఫున ప్రచారం చేస్తున్న ఆయన అనుకోకుండా "హస్తం గుర్తుకే మన ఓటు" అని గట్టిగా పిలుపునిచ్చి.. అందరినీ ఆశ్చర్యపరచి.. తరువాత జరిగిన పొరపాటు తెలుసుకుని నాలుక కరుచుకున్నారు .   కొద్ది రోజుల క్రితం కమల్ నాథ్ ఇక్కడ ఒక సభలో మాట్లాడుతూ, బీజేపీ అభ్యర్థి ఇమర్తీ దేవిని ఉద్దేశించి "ఐటమ్" గ పేర్కొనడంతో తీవ్ర విమర్శలు పాలైన సంగతి తెలిసిందే. తాజాగా, ఆమె తరఫున ప్రచారం నిర్వహించేందుకు వచ్చిన జ్యోతిరాదిత్య కూడా "దాబ్రా ప్రజలారా, మీ చేతులు కలపండి. నన్ను, సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ను గెలిపిస్తామని చెప్పండి. 3వ తేదీన జరిగే పోలింగ్ లో మీరంతా హస్తం గుర్తుకు ఓటు వేయాలి" అని అన్నారు. అయితే వెంటనే జరిగిన తప్పును తెలుసుకున్న ఆయన, వెంటనే దాన్ని సరిదిద్దుకున్నారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సోషల్ మీడియాలో జ్యోతిరాదిత్య సింధియా వీడియోలు వైరల్ కావడంతో, మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ తన ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోకు విపరీతమైన ప్రచారం కల్పిస్తూ.... "సింధియా గారూ... మధ్యప్రదేశ్ ప్రజలు కూడా నవంబర్ 3న హస్తం గుర్తుకు ఓటు వేస్తామని చెబుతున్నారు" అని క్యాప్షన్ పెట్టింది. ఇది ఇలా ఉండగా.. ఇమర్తీ దేవితో సహా కాంగ్రెస్ కు చెందిన 22 మంది ఎమ్మెల్యేలు గత మార్చిలో కాంగ్రెస్ కు రాజీనామా చేసి, బీజేపీలో చేరడంతో అక్కడ ప్రస్తుతం ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.

కరోనా వాక్సిన్ వచ్చేది అప్పటికే... తేల్చి చెప్పిన భారత్ బయోటెక్

కరోనా వైరస్ సెకండ్ వేవ్ తో ప్రపంచం మొత్తం మరోసారి గడగడా వణుకుతున్న సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో మన దేశానికి చెందిన భారత్ బయోటెక్ రూపొందించిన "కొవాక్సీన్"  టీకా మూడో దశ ట్రయల్స్ దేశ వ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో 25 నుంచి 30 కేంద్రాల్లో మొదలు పెట్టబోతున్న సంగతి తెలిసిందే.  దీని కోసం ఒక్కో కేంద్రంలో 2 వేల మందిని వాలంటీర్లను సిద్ధం చేసినట్లు భారత్ బయోటెక్ అంతర్జాతీయ వ్యవహారాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి ప్రసాద్ తెలిపారు. అంతేకాకుండా మూడవ దశ కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ విజయవంతం అయి, ప్రభుత్వం నుండి అనుమతులు వస్తే, వచ్చే సంవత్సరం ఏప్రిల్, జూన్ మధ్య కాలంలో కొవాక్సీన్ ప్రజలకు అందుబాటులోకి వస్తుందని అయన ప్రకటించారు.   అయితే ప్రస్తుతం మూడవ దశ ట్రయల్స్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుని, విజయవంతంగా పూర్తి చేయడంపైనే తాము దృష్టి పెట్టామని, దీని కోసం బలమైన క్లినికల్ ఎవిడెన్సులతో పాటు.. వ్యాక్సిన్ సామర్థ్యం, సమాచార భద్రత తదితర అంశాలు ఈ దశలో కీలకమని అన్నారు. వాక్సిన్ కు భారత నియంత్రణ సంస్థల అనుమతి లభిస్తే, వచ్చే ఏడాది రెండో త్రైమాసికంలో వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి వస్తుందని అయన తెలిపారు.   అంతేకాకుండా వ్యాక్సిన్ ను భారీ ఎత్తున తయారు చేసేందుకు అవసరమైన మౌలిక వసతుల కోసం రూ. 350 కోట్ల నుంచి రూ. 400 కోట్ల నిధులను పెట్టుబడిగ పెట్టనున్నామని ఆయన తెలిపారు. ప్రభుత్వంతో పాటు ప్రైవేటు కంపెనీలకు కూడా తాము వాక్సిన్ ను అందిస్తామని తెలిపారు. ఇక వాక్సిన్ ఎగుమతికి సంబంధించి పలు దేశాల ఫార్మా కంపెనీలతో ఇప్పటికే ప్రాథమిక చర్చలు సాగుతున్నాయని సాయి ప్రసాద్ తెలిపారు.

కేంద్రాన్ని అడ్డంగా ఇరికించిన కేసీఆర్

పెన్షన్ పైసలపై రాజీనామాకు సవాల్   రుజువు చేస్తేనే బీజేపీకి విలువ   పెన్షన్లపై తరచూ సవాళ్లు విసురుతున్న బీజేపీ నేతలకు, తెలంగాణ సీఎం కేసీఆర్ తిరుగులేని సవాల్ విసిరారు. కేంద్రం.. రాష్ర్టానికి పెన్షన్ల కింద ఏడాదికి ఇచ్చే సొమ్ము కేవలం 107 కోట్లు మాత్రమేనని కేసీఆర్ కుండబద్దలు కొట్టారు. దీనిని కాదని నిరూపిస్తే, రాజీనామా చేసేందుకు సిద్ధమేనన్న సవాల్ విసిరి, కమలనాధులను ఆత్మరక్షణలో నెట్టడం చర్చనీయాంశమయింది.   కొంతకాలం నుంచి, తెలంగాణ బీజేపీ నేతలు పెన్షన్లపై చర్చను విస్తృతం చేస్తున్నారు. పెన్షన్లలో సింహభాగం సొమ్ము, నరేంద్రమోదీ సారధ్యంలోని కేంద్రం ఇస్తోందని ప్రచారం చేస్తున్నారు. ఆ సొమ్ముతో కేసీఆర్ ప్రచారం చేసుకుంటున్నారని దుమ్మెత్తిపోస్తున్నారు. దీనిపై దమ్ముంటే చర్చకు రావాలని.. బండి సంజయ్ నుంచి, రాష్ట్ర నేతల వరకూ టీఆర్‌ఎస్‌కు సవాళ్లు విసురుతున్నారు. ఇటీవల ఆర్ధికమంత్రి హరీష్‌రావు.. కేంద్ర నిధుల విడుదలపై చేసిన సవాలుకు, బీజేపీ నేతలెవరూ నేరుగా స్పందించలేదు. అసలు లెక్కలను బయటపెట్టలేదు.   తాజాగా.. కేసీఆర్ రంగంలోకి దిగి, ఈ సవాళ్లను కొత్తమలుపు తిప్పారు. తెలంగాణలో.. 38 లక్షల 64 వేల 751 మందికి అన్ని రకాల పెన్షన్లు ఇస్తుంటే, అందులో కేంద్రం కేవలం 7 లక్షల మందికే, అది కూడా మనిషికి 200 రూపాయలు మాత్రమే పెన్షన్లు ఇస్తోందన్నారు. అవన్నీ కలిపితే 105 కోట్లు మాత్రమేనని బట్టబయలు చేశారు. కానీ తన ప్రభుత్వం, 10 నుంచి 11 వేల కోట్లు ఖర్చు పెడుతోందంటూ తన వద్ద ఉన్న కాగ్ రిపోర్టును చూపించారు. ఇది కాదని రుజువు చేస్తే, తాను ఒక్క నిమిషంలోనే రాజీనామా చేసి వెళ్లిపోతానని సవాల్ విసరడం సంచలనం సృష్టించింది.   సహజంగా కేసీఆర్ అనేక సందర్భాల్లో అనేక సవాళ్లు విసిరినా, రాజీనామా అంశాన్ని ప్రస్తావించలేదు. గతంలో తాను సీఎం పదవి దళితుడికి ఇస్తానని చెప్పడంతోపాటు, అనేక అంశాల్లో తాను చెప్పిన హామీలకే విరుద్ధమైన వ్యాఖ్యలు చేసి విమర్శల పాలయ్యారు. కానీ ఇప్పుడు పెన్షన్ల అంశాన్ని బీజేపీ యాగీ చేస్తుండటంతో, ఆయన హటాత్తుగా కేంద్ర నిధులపై తాడోపేడో తేల్చుకునేందుకు, ఎదురుదాడి ప్రారంభించడం ఆసక్తికరంగా మారింది. తాజాగా ఆయన వైఖరి బీజేపీ బండారాన్ని తేల్చాలన్నట్లుగానే కనిపించింది. కాగ్ రిపోర్టు ఆధారంగా, ఆయన సంధించిన అస్త్రం.. సహజంగానే బీజేపీని సంకటంలో పడేసింది.   ఇక ఇప్పుడు పెన్షన్ల బంతి బీజేపీ కోర్టులోనే ఉంది. కేసీఆర్ చేసిన సవాలుకు, నిర్దిష్టమైన జవాబు ఇవ్వడంపైనే, ఆ పార్టీ విశ్వసనీయత ఆధారపడిఉంది. ఇప్పటికే సవాళ్లు విసిరి, పారిపోతున్నారన్న విమర్శను మూటకట్టుకున్న బీజేపీ.. కనీసం తాను చేసిన పెన్షన్ల అంశం ఆరోపణలకయినా, కట్టుబడి ఉండక తప్పదు. ఒకవేళ కాదని తప్పించుకుని తిరిగే మార్గాలు ఎన్నుకుంటే.. బీజేపీ బురద రాజకీయాలకే పరిమితమవుతుందన్న విమర్శను, స్థిరం చేసుకోవలసి వస్తుంది.   తాము కేసీఆర్ చెప్పిన దానికంటే, ఎక్కువగా రాష్ర్టానికి పెన్షన్లు ఇస్తున్నామని నిరూపించుకునే బాధ్యత, కచ్చితంగా కమలదళానిదే. బీజేపీ నేతలు, తమ వివరణ పత్రంలో కేసీఆర్ చెప్పినట్లే లెక్కలు చూపిస్తే మాత్రం, ప్రజాక్షేత్రంలో దోషులుగా నిలబడక తప్పదు. ఒకవేళ అంతకుమించి చూపిస్తేనే, కేసీఆర్ సర్కారు బోనెక్కే అవకాశం ఉంటుంది. నిజానికి ఇది కమలదళానికి, కేసీఆర్ ఇచ్చిన అపూర్వ అవకాశం. ఇద్దరూ సవాళ్లు విసిరినందున, ఎవరి మాట నిజమో, ఎవరి వాదన అబద్ధమో తెలుసుకునే హక్కు ప్రజలకూ ఉంది.   నిజంగా బీజేపీ నాయకత్వానికి.. కేసీఆర్ సారథ్యంలోని టీఆర్‌ఎస్‌ను, జనం ముందు ముద్దాయిగా నిలబెట్టాలన్న లక్ష్యం ఉంటే, కేసీఆర్ విప్పిన కాగ్ నివేదిక చిట్టా తప్పని నిరూపించాల్సిందే. ఆమేరకు వాస్తవ గణాంకాలు విడుదల చేయాల్సి ఉంటుంది. లేకపోతే.. కమలం పార్టీ నాయకులు, కేవలం కాగితం పులులన్న ముద్ర నిజం చేసుకునే ప్రమాదం లేకపోలేదు. ఇప్పటిదాకా కేసీఆర్‌వి.. జూటా మాటలని ధ్వజమెత్తుతున్న కమలదళాలు, వాటిని నిరూపించుకోవాలి.   కేసీఆర్ విప్పిన కాగ్ లెక్కలన్నీ టీఆర్‌ఎస సర్కారు సొంతగా సృష్టించినవి కాదు. ఏ రాష్ర్టానికి కేంద్రం ఎంత ఇస్తుందో, ఆ సంస్థ నివేదిక రూపంలో ఇస్తుంది. ఒకవేళ కేసీఆర్ మాటలు అబద్ధమని తేల్చాలన్నా, కమలదళం మళ్లీ కాగ్ లెక్కలే బయటపెట్టాలి. చూడాలి ఏం జరుగుతుందో? సరే.. ఇంతకూ మరి, పెన్షన్ల గుట్టు విప్పే బాధ్యత కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తీసుకుంటారా? లేక అధ్యక్షుడు బండి సంజయ్ తీసుకుంటారా అన్నదే చూడాలి.   -మార్తి సుబ్రహ్మణ్యం

సారీ చెబితే సరిపోతుందా.. సారూ?

రైతులకు బేడీలు వేసిన పోలీసులపై సస్పెన్షన్లు ఎత్తవేత   రైతులని తెలియక బేడీలు వేశారట   మరి తెలియక పోస్టింగులు పెట్టారంటే కేసులు ఎత్తివేస్తారా?   పోలీసులు అమాయకులు. వారికి ఏ పాపమూ తెలియదు. ఏదో పాపం తెలియక.. రైతుల చేతికి జస్ట్ బేడీలు వేశారు. అంతే. వారి అమాయకత్వంపై ప్రాధమిక విచారణ జరిపి సస్పెన్షన్లు ఎత్తేశారు. ఇదీ అమరావతి రైతుల చేతికి, బేడీలు వేసిన పోలీసులపై విధించిన సస్పెన్షను ఎత్తవేస్తూ.. పోలీసు బాసులు ఇచ్చిన ప్రకటన.   అమరావతి రైతుల ఉద్యమానికి పోటీగా.. అధికార వైసీపీ నేతలు రంగంలోకి దించిన,  పెయిడ్ ఆటో బ్యాచ్‌ను  రైతులు అడ్డుకున్నారు. వారి ఆధార్ కార్డులు చూపమని నిలదీశారు. దానితో ఆ పెయిడ్ బ్యాచ్‌ను అడ్డుకున్న రైతులపై, ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. కేసులు బనాయించిన వారిలో ఎస్సీ, ఎస్టీలు కూడా ఉండటం మరో విచిత్రం. అంటే ఎస్సీలే ఎస్సీలపై కేసులు పెట్టడం తమాషా అన్నమాట. ఈ ప్రకారంగా.,. దళితులకు బాసటగా నిలవాల్సిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చ ట్టం, రాజకీయుల చేతిలో ఏవిధంగా దుర్వినియోగం అవుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.   రైతుల చేతికి బేడీలు వేసిన వైనం, రాష్ట్రంలో ఆందోళనకు దారితీసింది. దేశానికి అన్నం పెట్టే రైతన్న చేతికి బేడీలు వేసిన పోలీసుల తీరు, రైతాంగం గుండెను రగిలించింది. వారి ఆత్మాభిమానం దెబ్బతీసింది. అయినా.. ఇప్పటివరకూ సర్కారు ఆ ఘటనపై, కనీసం విచారం వ్యక్తం చేయలేదు. ప్రభుత్వాలకు రైతులపై ఉన్న ప్రేమ అదన్నమాట! సరే.. దానిపై మీడియా విరుచుకుపడటంతో, ఎస్కార్టుగా వచ్చిన పోలీసులను, జిల్లా ఎస్పీ సస్పెన్షన్ వేటు వేశారు. మళ్లీ అంతలోనే సదరు పోలీసులంతా అమాయకులని సర్టిఫికెట్ ఇచ్చి, అది తెలియక చేసిన తప్పిదంగా అభివర్ణించారు. అంటే వారంతా దోపిడీదొంగలు, హంతకులనే భావించి, ఎస్కార్టు పోలీసులు రైతుల చేతికి బేడీలు వేశారన్నది అధికారుల కవిహృదయం!     ఫర్వాలేదు. కింది స్ధాయి సిబ్బందిపై, పోలీసు బాసులకు ఆపాటి సానుభూతి ఉండటం మెచ్చతగిందే. కింది వారు చేసిన తప్పులను, మాఫీ చేసే ధైర్యం కూడా అధికారులందరికీ సాధ్యం కాదు. కానీ, శాఖాపరమైన విచారణ జరుగుతుందని మాత్రం సెలవిచ్చారు. ఎలాగూ,  తెలియక బేడీలు వేశామని చెప్పిన వారిని మన్నించారు కాబట్టి.. మళ్లీ శాఖాపరమైన విచారణలెందుకు? సమయం వృధా తప్ప!   సరే.. పాపం ఏదో తెలియక చేసిన తప్పు అని,  సస్పెన్షన్లు ఎత్తేసిన ఖాకీ కామందుల వారు .. మరి తెలియక సోషల్ మీడియాలో,  పోస్టింగులు పెడుతున్న చిరంజీవులపై మాత్రం ఎందుకు కేసులు పెడుతున్నారు? వారిని రాష్ర్టాల సరిహద్దులు దాటి మరీ వెతికి పట్టుకొచ్చి, ఎందుకు కేసులు నమోదు చేస్తున్నారు? ఆ చర్యలు కూడా, ఏదో తెలియక చేసిన తప్పులుగానే భావించాలి కదా?   ఆ మేరకు రైతుల చేతికి బేడీలు వేసిన పోలీసులపై సస్పెన్షన్లు ఎత్తివేసినట్లే.. పోస్టింగులు పెట్టిన వారిని, షేర్ చేసిన వారిపై కేసులు ఎత్తివేయాలి కదా? ఎవరో అన్న మాటలను టెలికాస్టు చేసి, ఎవరో అధికారి ఇచ్చిన ఉత్తర్వునే ప్రసారం చేసిన జర్నలిస్టులను.. సీఐడి పోలీసులు విచారణ పేరిట వేధించకుండా, కేసులు తొలగించాలి కదా? అదే కదా చట్టం? న్యాయం-చట్టం అందరికీ సమానమైనప్పుడు, మళ్లీ ఈ వివక్ష ఎందుకు సారూ?   చట్టం కళ్లతో కాకుండా పాలకుల కళ్లతో చూడటం వల్లే.. బుద్ధిజీవులకు ఈ సందేహాలు వస్తున్నాయి. ధర్మం-చట్టం-న్యాయం నాలుగుపాదాల నడుస్తున్న ఆంధ్రాలో.. ఈ ప్రశ్నలకు బదులిచ్చే పోలీసు పెద్దసార్లు ఎవరున్నారు? పనిలో పనిగా, మానవ హక్కులు దివ్యంగా వెలిగిపోతున్న ఏపీలో,  ఇలాంటి అమాయక పోలీసులు ఉన్న విషయం,  మానవ హక్కుల కమిషన్ చెవిన పడేస్తే బాగుండేది. రైతుల చేతికి బేడీలు వేసిన పోలీసులను, వారిపై సస్పెన్షన్ ఎత్తివేసిన అధికారులకు.. మానవ హక్కుల కమిషన్‌తో  సన్మానం చేయించుకునే, గొప్ప అవకాశాన్ని పోలీసు బాసులు వదులుకోవడమే ఆశ్చర్యం. ఈ లెక్కన కొంపదీసి.. హైకోర్టు న్యాయమూర్తులకు వ్యతిరేకంగా,  సోషల్‌మీడియాలో పోస్టింగులు పెట్టిన వారంతా.. అమాయకులనే నిర్ణయించి, అరెస్టు చేయకుండా వదిలేశారా?.. ఏమో? ఏపీలో ఏదైనా సాధ్యమే. -మార్తి సుబ్రహ్మణ్యం

భలేవాడికి అన్నయ్య.. ఏపీ సీఎం జగనన్నయ్య!

లిక్కర్, బదిలీలపై రివర్స్ గేర్   తత్వం తెలుసుకుంటున్న ఏపీ సీఎం   సహజంగా మనం అతను భలేవాడని అంటుంటాం. కానీ ఏపీ సీఎం జగనన్న మాత్రం.. ఆ భలేవాడికి అన్నయ్యలా ఉన్నాడన్న కొత్త సామెత ఒకటి,  ఇప్పుడు వాడుకలోకి వచ్చింది. ముందు కాదనడం, ఆ తర్వాత దానినే తూచ్ అవుననడం అలవాటయిపోయింది. బహుశా అందుకే ఈ పద ప్రయోగం ప్రచారంలోకి వచ్చినట్లుంది. మొన్నటికి మొన్న సీఎస్ రేసులో ఉన్న ఓ సీనియర్ ఐఏఎస్‌ను బదిలీ చేసి, మళ్లీ రెండోరోజునే పోస్టింగు ఇచ్చి హాశ్చర్యపరిచారు.   నిన్నటికి నిన్న లిక్కర్ పాలిసీపై అసెంబ్లీలో దంచికొట్టి చేసిన ప్రసంగాలన్నీ, తాజా రేట్ల తగ్గింపుతో.. తస్సాదియ్యా తుస్సుమన్నట్లయింది. ఫర్వాలేదు. పాలకులు వెనకడుగు వేసినంత మాత్రాన విమర్శించకూడదు. ఆలస్యంగానయినా తత్వం బోదపడినందుకు సంతోషించాలి. ఇప్పుడు మొండివాడిగా పేరున్న ఏపీ సీఎం జగనన్నను, ఆ మేరకు అఖిలాంధ్రులు అభినందించాలి.   మద్యం మాన్పించేందుకు.. షాక్ కొట్టేలా మందు ధరలు పెంచామన్నారు. మద్యాన్ని దశల వారీగా నిషేధించే క్రమంలోనే, వాటి రేట్లు కావాలనే పెంచామని.. జగన్ అండ్ ‘పెద్దగొంతు’ అంబటి రాంబాబు సభలో సెలవిచ్చారు. పెంచిన ధరలు, ప్రపంచంలో ఎక్కడా లేని మందు బ్రాండ్లు చూసిన జనం కూడా,  జగనన్నయ్య అండ్ అంబటి అన్నయ్యలు చెప్పింది నిజమే కామోసనుకున్నారు.   చంద్రబాబులా తమకు, మద్యం నుంచి ఆదాయం సంపాదించే ఖర్మ లేదన్న మాటనూ జనం నమ్మేశారు. దానిని మద్యనిషేదానికి ఏర్పాటుచేసిన, కార్పొరేషన్ చైర్మన్ లక్ష్మణరెడ్డి కూడా సమర్ధించారు. అది చాలదన్నట్లు.. కోట్ల రూపాయలు పెట్టి పత్రికల్లో ప్రకటనలూ ఇచ్చారు. ఇంతమంది మహానుభావులు, మహనీయులు చెప్పింది ఎవరు మాత్రం తప్పనుకుంటారు చెప్పండి? పైగా ఈ జన్మలో.. గాంధీ గారి అంశలో పుట్టిన,  జగనన్నయ్య చెప్పిన తర్వాత ఇక తిరుగే ఉండదు కదా?!   కానీ, విచిత్రంగా.. మద్యం మాన్పించేందుకే కొండెక్కించిన మందు ధరలను, కొండ కిందకు దించేశారు. పైగా పిచ్చి బ్రాండ్లతో పాటు,  ప్రీమియం  బ్రాండ్ల రేట్లపైనా దయదలిచారు. యస్. నిజంగా ఇవన్నీ మొండివాడుగా పేరున్న,  మన అఖిలాంధ్రకోటి జగనన్నయ్య తీసుకున్న నిర్ణయాలే. సంతోషం. మందు తాగనివారికి ఈ గోలతో ఎలాగూ సంబంధం ఉండదు. కానీ కొన్న నెలల తరబడి, పిచ్చి బ్రాండ్లు తాగలేకపోతున్న మందుబాబుల దృష్టిలో,  జగనన్నయ్య దేవుడయిపోయారు. బాగానే ఉంది. మందు అలవాటు పూర్తిగా మార్పించి, ద శలవారీ మద్యనిషేధంలో భాగంగానే... మందురేట్లు పెంచామని భాష్యం చెప్పిన.. ఒక అంబటి రాంబాబు, ఇంకో బొత్స సత్తిబాబు, మరో శ్రీకాంత్‌రెడ్డి అండ్ అదర్స్.. తగ్గించిన రేట్లపై ఏం భాష్యం ఇస్తారో చూడాలి.   పక్క రాష్ర్టాల నుంచి,  మద్యం స్మగ్లింగ్ జరుగుతున్నందున  మందు ధరలు తగ్గించామని,  సర్కారు ఉత్తర్వుల్లో పేర్కొంది. బాగుంది. ఈ విషయం అంతకుముందు తెలియదా? సరిహద్దు రాష్ర్టాల  పక్కనే ఉన్న వైన్‌షాపులో.. వెయ్యి రూపాయలకు  బ్రాండెడ్ మందు దొరుకుతుంది.  కానీ సొంత రాష్ట్రంలోని పిచ్చి బ్రాండ్ల రేట్లు దానితో పోలిస్తే మూడింతలు ఎక్కువ. అప్పుడు బుద్ధి-బుర్ర ఉన్న ఎవరైనా, సరిహద్దు దాటి తీసుకుంటాడన్న అంచనా, అధికారులకు అప్పుడు లేదా? మరిప్పుడు ధరలు తగ్గించారు కాబట్టి.. బ్రాండెడ్ మందుతో జనం ఆరోగ్యం పదికాలాల పాటు చల్లగా, తమ ఖజానా వెచ్చగా ఉండేందుటే పెంచామని చెబుతారా? అన్నవి ఇప్పుడు వినిపిస్తున్న ప్రశ్నలు. హేమో... చెప్పినా చెప్పగల సమర్ధులు మరి?!   సరే.. జగనన్నయ్య తన నిర్ణయం వాపసు తీసుకున్నందుకు, ఆయననేమీ తప్పు పట్టాల్సిన పనిలేదు. ఎందుకంటే తప్పులు చేయడం మానవ సహజం. సజ్జల, చల్లా రామకృష్ణారెడ్డి చెప్పినట్లు.. జగనన్నయ్య ఆధునిక గాంధీ మహాత్ముడు అయినప్పటికీ, మహాత్ములు కూడా తప్పులో కాలేస్తుంటారు. కాబట్టి, జగనన్నయ్యను నిందించాల్సిన పనిలేదు. కాకపోతే.. ఈ 17 నెలల పరిపాలనా కాలంలో తత్వం తెలుసుకుంటున్నందుకు, ఆయనను అభినందించాలి.   తగులుతున్న ఎదురుదె బ్బలే, ఆయనకు గుణపాఠాలుగా మారుతున్నాయి. ఏది మంచి, ఏది చె డు? ఏది ఆదాయం? ఏది వృధా అన్న వాస్తవాలు,  అనుభవంలో తెలిసివస్తున్నట్లు కనిపిస్తోంది. యువకుడు, పులివెందుల బిడ్డ.. పైగా రాజారెడ్డి మనువడు ప్లస్ 151 మంది ఎమ్మెల్యేల బలం.. వీటికి మించి రాజకీయ ప్రత్యర్థుల కుట్రకు బలయి,  16 నెలలు జైల్లో మగ్గిన నాటి జ్ఞాపకాలు! ఇవన్నీ కలసి వెరసి,  జగనన్నయ్యను అలా తయారుచేశాయని అనుకోవడంలో తప్పు లేదు. అనుభవాలు-ఎదురుదె బ్బలే గుణపాఠాలయినప్పుడు, ఏ మనిషి మారినా స్వాగతించడమే గొప్పతనం. అందుకు జగనన్నయ్య కూడా మినహాయింపు కాదు.   కాబట్టి మందు రేట్ల తగ్గింపుపై.. జగనన్నయ్యను కాకుల్లా పొడవకుండా, మారిన జగన్‌బాబును, ఈ  విశాల ప్రపంచంలోకి ఆహ్వానించండి. పనిలో పనిగా మారిన జగనన్న.. పోస్టింగులివ్వకుండా, అధికారుల పట్ల అనుసరిస్తున్న  వేధింపు పర్వానికి తెరదించితే, ఆయనను నిజంగానే ఈ విశాల ప్రపచంలోకి ఆహ్వానిస్తారేమో?  కానీ.. ఆ సీఎంఓ సైంధ వుడు ఇక్కడ కూడా అలవాటు ప్రకారం, అడ్డం పడితే చేసేదేమీ లేదు!   -మార్తి సుబ్రహ్మణ్యం

టీఆర్ఎస్ లోకి భారీ చేరికలు! బండికి హరీష్ 18 ప్రశ్నలు

రెండు రోజుల్లో ఉప ఎన్నిక జరగనున్న దుబ్బాకలో చివరి నిమిషంలో రాజకీయ సమీకరలు వేగంగా మారిపోతున్నాయి. ప్రచార గడువు ముగుస్తున్న సమయంలో అధికార పార్టీలోకి భారీగా వలసలు జరిగాయి. తమ పార్టీలకు హ్యాండిస్తూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు గులాబీ గూటికి  చేరుతున్నారు. మంత్రి హరీష్ రావు గారి సమక్షంలో బిజెపి బహిష్కృత నేత తోట కమలాకర్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరారు. తమ అభ్యర్థి రఘునందన్ రావుపై తీవ్ర ఆరోపణలు చేయడంతో తోట కమలాకర్ రెడ్డిని బీజేపీ బహిష్కరించింది. అప్పటి నుంచి ఆయన సైలెంట్ గానే ఉంటున్నారు. కాంగ్రెస్ లో చేరాలని పీసీసీ పెద్దలు తోటను సంప్రదించారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తోట కమలాకర్ రెడ్డి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ లోకి రావాలని ఆహ్వానించారు. దీంతో బీజేపీ మాజీ కిసాన్ నాయకుడైన తోట హస్తం గూటికి చేరుతారని అంతా భావించారు. అయితే పోలింగ్ కు రెండు రోజుల ముందు అనూహ్యంగా మంత్రి హరీష్ రావు సమక్షంలో అధికార పార్టీలో చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది.    దుబ్బాక ఉప ఎన్నికలో గట్టి పోటీ ఎదుర్కొంటున్న టీఆర్ఎస్ విజయం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ప్రచారాన్ని అంతా తానే నడిపిస్తున్న మంత్రి హరీష్ రావు.. ఇతర పార్టీల నేతలకు వల వేస్తున్నారని చెబుతున్నారు. అందులో భాగంగానే రెండు రోజుల క్రితం చేగుంట మండలంలో కాంగ్రెస్, బీజేపీలకు చెందిన ముఖ్య నేతలు, వందలాది మంది కార్యకర్తలు గులాబీ గూటికి చేరారు. ఇక బీజేపీ కేడర్ లో కొంత పట్టున్న తోట కమలాకర్ రెడ్డిని పార్టీలో చేర్పించడంలో హరీష్ రావు సక్సెస్ అయ్యారని తెలుస్తోంది. చివరి గంటల్లో దుబ్బాకలో మరిన్ని రాజకీయ కీలక పరిణామాలు జరుగుతాయని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.    వలసలు పెరగడంతో ఉత్సాహంగా కనిపిస్తున్న మంత్రి హరీష్ రావు బీజేపీ చీఫ్ బండి సంజయ్ కు 18 ప్రశ్నలతో బహిరంగ లేఖ రాశారు.  తెలంగాణలో నైతిక విలువలను మంట కలిపేలా బీజేపీ పనిచేస్తోందని మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. సీలేరుని ఏపీకి ఇచ్చింది ఎవరు? అని ఆయన ప్రశ్నించారు. తాను ఓ తెలంగాణ పౌరుడిగా ఈ లేఖ రాస్తున్నానని చెప్పిన హరీష్.. తన లేఖకు సంజయ్ స్పందిస్తారని ఆశిస్తున్నానని తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు అడుగడుగునా అన్యాయం చేసిందని చెప్పారు. తాను పింఛన్లపై సవాలు చేస్తే సంజయ్ ఇప్పటివరకూ స్పందించలేదన్నారు హరీష్ రావు. ఏపీ పునర్విభజన చట్టంలో అప్పటి పది జిల్లాల సరిహద్దులతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, అందులో ఏడు మండలాలను వేరే రాష్ట్రంలో కలపడం బీజేపీ చేసిన అన్యాయం కాదా? అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో అంతర్భాగమైన 460 మెగావాట్ల లోయర్ సీలేరు హైడల్ పవర్ ప్లాంటును బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు అప్పగించిందని అన్నారు.    బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉందని, విభజన చట్టంలో కూడా బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ పెడతామని హామీ ఇచ్చారని హరీష్ రావు గుర్తు  చేశారు.స్టీల్ ఫ్యాక్టరీ ఎందుకు పెట్టడం లేదని  ప్రశ్నించారు.  హైదరాబాద్ ఐటీఐఆర్ ప్రాజెక్టును కేంద్రం ఎందుకు రద్దు చేసింది? అని ఆయన నిలదీశారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ నిర్మించాలని ఎప్పటి నుంచో వరంగల్ జిల్లా ప్రజలు ఉద్యమాలు చేశారని, బీజేపీ సర్కారు కాజీపేటకు మంజూరైన వ్యాగన్ ఫ్యాక్టరీని రద్దు చేసిందని హరీష్ ఆరోపించారు. నీటి కేటాయింపులు చేయకుండా ప్రాజెక్టుల విషయంలో తలెత్తే అభ్యంతరాలను బీజేపీ నేతలు ప్రోత్సహిస్తున్నారని, ఇది ఆ పార్టీ నేతల కపట నీతి కాదా? అని నిలదీశారు.  తెలంగాణలోని నీటి పారుదల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకపోవడం వివక్ష కాదా? అని  ప్రశ్నించారు.    ఆరేళ్ల నుంచి తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర ఉద్యోగులను భరిస్తోందని, ఏటా వెయ్యి కోట్ల భారం పడుతోందని, ఇది కేంద్ర ప్రభుత్వ నిష్క్రియాపరత్వం కాదా? అని లేఖలో హరీశ్ పేర్కొన్నారు. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం 1,855 కిలోమీటర్ల జాతీయ రహదారులకు నిధులు ఇవ్వలేదని ఆరోపించారు.తెలంగాణలో అర్హులైన అందరికీ కాకుండా కొంతమందికి మాత్రమే పెంఛను ఇవ్వడంలో బీజేపీ ఉద్దేశం ఏమిటి? అని ప్రశ్నించారు. వరంగల్ విమానాశ్రయాన్ని ఎందుకు పునరుద్ధరించడం లేదని, టెక్స్ టైల్స్ అభివృద్ధి నిధులను తెలంగాణకు ఎందుకు ఇవ్వడం లేదని సంజయ్ ని లేఖలో నిలదీశారు హరీష్ రావు.   ఆదిలాబాద్‌లో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని సార్లు కోరినా ఎందుకు పట్టించుకోవడం లేదు? అని మంత్రి ప్రశ్నించారు.   తెలంగాణలో విద్యా వసతుల పట్ల  కేంద్ర సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరించట్లేదా? అని నిలదీశారు.హైదరాబాద్ నుంచి ఎంపీలుగా గెలిచి, కేంద్ర మంత్రులైన బీజేపీ నేతలు ఎందుకు మూసీ ప్రక్షాళనకు నిధులు తేవడం లేదు? అని నిలదీశారు. ఏపీ విభజన బిల్లు ప్రకారం రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధికోసం ఏటా రూ.450 కోట్ల ఇవ్వాలని ఆయన గుర్తు చేశారు. ఇవన్నీ ఎందుకు ఇవ్వట్లేదని హరీశ్ రావు లేఖలో ప్రశ్నించారు.

ప్రభుత్వ కార్యక్రమంలో ఎన్నికల ప్రచారమా! కేసీఆర్ పై విపక్షాల ఫైర్

తెలంగాణ ముఖ్యమంత్రికి చట్టాలు వర్తించవా? కేసీఆర్ ఏది చేసినా నడుస్తుందా? ఎన్నికల కోడ్ ను ఆయన పట్టించుకోరా?. తెలంగాణలోని విపక్షాలు ఇప్పుడు ఇవే ఆరోపణలు చేస్తున్నాయి. జనగామ జిల్లాలో పర్యటించిన సీఎం కేసీఆర్ అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతు వేదికను ప్రారంభించి ప్రసంగించారు. ఇంతవరకు బాగానే ఉన్న ఆ సభలో ఆయన దుబ్బాక ఉప ఎన్నికపై మాట్లాడటం ఇప్పుడు వివాదామవుతోంది. ప్రభుత్వ కార్యక్రమంలో ముఖ్యమంత్రి హోదాలో పాల్గొంటూ ఉప ఎన్నికపై మాట్లాడటాన్ని విపక్షాలు తప్పుపడుతున్నాయి. ఎన్నికల చట్టాలను ముఖ్యమంత్రి గౌరవించకపోవడం దారుణమంటూ ప్రతిపక్ష నేతలు తీవ్ర స్థాయిలో ఫైరవుతున్నారు.    మూడు రోజుల్లో దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక జరగనుంది. ఉప ఎన్నిక ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం దుబ్బాకలో రాజకయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. అధికార పార్టీకి గెలుపు కష్టమనే ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. టీఆర్ఎస్ ఎదురీదుతుందని చర్చ జరుగుతున్నా సీఎం కేసీఆర్ దుబ్బాక ఉప ఎన్నికపై ఎక్కడా స్పందించలేదు. అయితే ప్రచారం మరికొన్ని గంటల్లో ముగుస్తుందనగా మాత్రం ఆయన స్పందించారు. కేసీఆర్ దుబ్బాక ఉపఎన్నికపై మాట్లాడటంలో తప్పు లేదు కాని.. ప్రభుత్వ కార్యక్రమాన్ని అందుకు వేదికగా చేసుకోవడమే విపక్షాల ఆరోపణలకు కారణమవుతోంది.   జనగామ జిల్లాలో జరిగిన సభలో మాట్లాడిన  కేసీఆర్ .. దుబ్బాకలో విపక్షాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. బీజేపీని ఆయన ఎక్కువగా టార్గెట్ చేశారు. ప్రభుత్వం ఇస్తున్న అసరా పెన్షన్లలో కేంద్రంపై ఎక్కువ డబ్బులు ఇస్తుందని ప్రజలకు కమలం నేతలు అబద్దాలు చెబుతున్నారని ఫైరయయ్యారు. రాష్ట్రంలో  38 లక్షల మందికి 2 వేల రూపాయల పెన్షన్ ఇస్తుంటే.. అందులో కేవలం 7 లక్షల మందికి మాత్రమే అది కూడా కేవలం 2 వందల రూపాయలు మాత్రమే కేంద్రం ఇస్తుందని చెప్పారు. బీజేపీ నేతలు చెబుతున్నట్లు  పెన్షన్  కోసం కేంద్రమే ఎక్కువ నిధులు  ఇస్తున్నట్లు నిరూపిస్తే నిమిషంలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు కేసీఆర్. పెన్షన్ విషయంలో బీజేపీ నేతల ప్రచారంపై కేసీఆర్ స్పందించడం బాగానే ఉన్నా అందుకు ప్రెస్ మీట్ పెడితే సరిపోతుందని, ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో మాట్లాడటం ఎందుకనే విమర్శలు వస్తున్నాయి.    మరోవైపు దుబ్బాకలో రోజురోజుకు టీఆర్ఎస్ పరిస్థితి దిగజారిపోతుందని, ఇంటలిజెన్స్ తాజా సర్వేలో మరింత షాకింగ్ విషయాలు తెలిశాయని బీజేపీ నేతలు అంటున్నారు. అందుకే జనగామ సభలో దుబ్బాక గురించి మాట్లాడారని, మనమే గెలుస్తున్నామంటూ చెబుతూ నిరాశలో ఉన్న కేడర్ లో జోష్ నింపే ప్రయత్నం చేశారంటున్నారు. ప్రభుత్వ కార్యక్రమంలో దుబ్బాక ఉప ఎన్నికపై మాట్లాడటాన్ని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామంటున్నారు బీజేపీ నేతలు. పెన్షన్ డబ్బుల్లో కేంద్రం వాటా ఉందన్న విషయాన్ని మాత్రమే తాము ప్రజలకు చెబుతున్నామని, ఓటమి భయంతోనే కేసీఆర్ తమపై అబాండాలు వేస్తున్నారని విమర్శిస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం తర్వాత కేసీఆరే రాజీనామా చేయాల్సి వస్తుందేమోనని బీజేపీ నేతలు జోస్యం చెబుతున్నారు.

ఉచిత కరోనా వ్యాక్సిన్ హామీపై ఈసీ స్పందన

బీహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్డీయే తిరిగి అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇస్తామంటూ బీజేపీ మేనిఫెస్టోలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, దీనిపై విపక్ష పార్టీలు మండిపడ్డాయి. ఒక రాష్ట్ర ప్రజలకే ఉచితంగా ఎలా ఇస్తారని, మిగతా రాష్ట్రాలు ఈ దేశంలో లేవా? అంటూ విపక్షాలు విమర్శలు గుప్పించాయి. మరోవైపు ఎన్నికల సమయంలో హామీని ఇవ్వడం ద్వారా బీజేపీ ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించిందంటూ ఎన్నికల సంఘానికి ఆర్టీఐ కార్యకర్త సాకేత్ గోఖలే ఫిర్యాదు చేశారు. ఎన్నికల వేళ కేంద్రం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, వివక్షతతో కూడి వాగ్దానాలు చేస్తోందని మండిపడ్డారు. బీజేపీ ప్రకటించిన హామీ సరైందా? కాదా? అంటూ ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించారు.    దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందిస్తూ.. ఎన్నికల కోడ్ ను బీజేపీ ఉల్లంఘించలేదని తెలిపింది. ఉచిత కరోనా వ్యాక్సిన్ హామీ ఎంత మాత్రమూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కాదని స్పష్టం చేసింది. ప్రజలకు సంక్షేమ పథకాన్ని ప్రకటించడంలో ఎలాంటి తప్పు లేదని వ్యాఖ్యానించింది. ఎన్నికలకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు మేనిఫెస్టోలు ప్రకటించడం సాధారణ అంశమేనని తెలిపింది. బీజేపీ హామీలో తమకు ఎలాంటి తప్పు కనిపించలేదని స్పష్టం చేసింది.

సీఈసీ బీజేపీలో ఒక శాఖ! శివసేన నేత సంచలన ఆరోపణలు 

సంచలన, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో ఉండే శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఈసారి ఆయన ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘాన్నే టార్గెట్ చేశారు. ఈసీ బీజేపీలో ఓ శాఖగా మారిందంటూ సంచలన ఆరోపణలు చేశారు ఎంపీ సంజయ్‌ రౌత్‌. ఎన్నికల కమిషన్‌ బీజేపీకి కొమ్ము కాస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.    బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ ఉచిత కోవిడ్‌ వ్యాక్సిన్‌ హామీ ఇచ్చింది. దానిపై కొన్ని పార్టీలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. దానిపై స్పందించిన కేంద్ర ఎన్నికల కమిషన్‌.. అయితే బీజేపీ కరోనా వ్యాక్సిన్ హామీ ఎలక్షన్‌ కోడ్‌ ఉల్లంఘన కిందకు రాదని ప్రకటించింది. దీనిపై శివసేన నాయకుడు సంజయ్‌ రౌత్‌ స్పందించారు. ‘భారత ఎన్నికల కమిషన్‌ బీజేపీకి చెందిన ఓ శాఖ. దాని నుంచి ఇంతకంటే ఎక్కువ ఆశించలేం’ అన్నారు. ఎన్నికల వేళ బిహార్‌లో ఏం జరుగుతుందో అందరికి తెలుసన్నారు సంజయ్‌ రౌత్‌.    బీహార్ ఎన్నికలపై సంజయ్ రౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్జేడీ చీఫ్‌, విపక్షాల సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్‌ బీహార్ ముఖ్యమంత్రి అయినా ఆశ్చర్య పోవాల్సిన పని లేదన్నారు.  ‘ఓ యువకుడు.. ఎవరి మద్దతు లేదు.. తండ్రి జైలులో ఉన్నాడు. సీబీఐ, ఐటీ డిపార్ట్‌మెంట్లు అతడి వెంట పడుతున్నాయి. ఇన్ని అడ్డంకులు ఉన్నప్పటికి రేపు అతడు ముఖ్యమంత్రి అయినా పెద్దగా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. మెజారిటీ ఓట్లు సంపాదించుకుంటాడు అనిపిస్తుంది’ అంటూ తేజస్విని ఉద్దేశించి మాట్లాడారు సంజయ్ రౌత్.

కేబినెట్ స్పెల్లింగ్ తెలీదు కానీ సీఎం అభ్యర్థి అట.. కేంద్ర మంత్రి ఘాటు వ్యాఖ్యలు

బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి(మహాఘటబంధన్) సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ పై తాజాగా కేంద్ర మంత్రి అశ్వినీ చౌబే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తేజస్వికి అసలు "కేబినెట్" అనే పదం పలకడం కూడా సరిగా రాదని అయన ఎద్దేవా చేశారు. కనీసం 10వ తరగతి కూడా చదవని తేజస్వి యాదవ్.. ఇంజినీరింగ్ చదివిన సీఎం నితీశ్ కుమార్ ను విమర్శిస్తున్నారని అయన మండిపడ్డారు. రాష్ట్రానికి సంబంధించిన ఏ సమస్య గురించి కూడా తేజస్వికి ఒక స్పష్టమైన అవగాహన లేదని అయన విమర్శించారు. అసలు కేబినెట్ అనే పదానికి స్పెల్లింగ్ కూడా తేజస్వి రాయలేడని అయన ఎద్దేవా చేశారు.   తేజస్వి తండ్రి ఒకప్పటి సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ తన తొలి కేబినెట్ సమావేశంలో లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పారని... దీనికోసం ప్రజల దగ్గర నుండి డబ్బులు కూడా వసూలు చేశారని... అయితే, అప్పటి ఆ అప్లికేషన్లన్నీ ఇప్పటికీ డస్ట్ బిన్ లోనే ఉన్నాయని అశ్వినీ చౌబే తీవ్ర స్థాయిలో విమర్శించారు. అంతేకాకుండా... జేడీయూ, కాంగ్రెస్ కూటమిని "గప్పు - పప్పు" అని ఎద్దేవా చేశారు. ఈ గప్పు-పప్పుల కూటమి ప్రజలకు నెరవేర్చలేని తప్పుడు హామీలను ఇస్తుందని, ప్రజలు ఈ నాయకుల పట్ల చాల జాగ్రత్తగా ఉండాలని అయన అన్నారు. ప్రభుత్వాలు ప్రజలకు మెరుగైన వసతులను కల్పించినప్పుడే దాన్ని మంచి పాలన అంటారని... లేకపోతే అది దోపిడీ ప్రభుత్వం అవుతుందని అయన తెలిపారు.   ఇది ఇలా ఉండగా మొన్న జరిగిన మొదటి విడత పోలింగ్ లో కాంగ్రెస్, ఆర్జేడీ కూటమికి ఎక్కువ స్థానాలు వస్తాయని అంచనాలు ఉన్న నేపథ్యంలో జెడియూ, బీజేపీ కూటమి తేజస్వి యాదవ్ ను తీవ్రంగా టార్గెట్ చేస్తున్నాయని తెలుస్తోంది. ఎలాగైనా మిగిలిన విడతల ఎన్నికలలో మెజారిటీ సాధించేందుకు ఆ పార్టీలు ఈ విధంగా తమ ప్రత్యర్థిని టార్గెట్ చేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ప్రధానికి సీఎం జగన్ లేఖ.. పోలవరం పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే

పోలవరం ప్రాజెక్టు నిధుల్లో కేంద్ర ప్రభుత్వం భారీ కోత విధించడంతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. ప్రధాని మోదీతో పాటు కేంద్ర జలశక్తి, ఆర్థిక మంత్రులకు ఏపీ సీఎం జగన్ లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ ఏడు పేజీల లేఖ రాశారు. ప్రాజెక్టు నిధుల విషయంలో జోక్యం చేసుకోవాలని లేఖలో సీఎం జగన్ కోరారు.   విభజన చట్ట ప్రకారం పోలవరాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనని గుర్తుచేశారు. పోలవరం ఆంధ్రప్రదేశ్‌ కు జీవనాడి లాంటిదని పేర్కొన్నారు. ప్రాజెక్టు పనులతో పాటు నిర్వాసితుల సమస్యలపై కూడా కేంద్రం దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. భూసేకరణ, పునరావవాస చర్యలకు కూడా నిధులను ఇవ్వాలంటూ 2014 ఏప్రిల్ 29న కేబినెట్ చేసిన తీర్మానాన్ని లేఖలో ప్రస్తావించారు. నిధుల విడుదల జాప్యం, పనులు ఆలస్యంతో అంచనా వ్యయం పెరిగే అవకాశం ఉందని లేఖలో సీఎం జగన్ పేర్కొన్నారు.

వరద సాయమే కొంప ముంచుతుందా? గ్రేటర్ గులాబీలో టెన్షన్

అనుకున్నదొక్కటి.. అయిందొక్కటి.. బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్టా. ఈ పాట ఇప్పుడు హైదరాబాద్ లో అధికార టీఆర్ఎస్ పార్టీకి అచ్చు గుద్దినట్లు సరిపోయేలా ఉంది. ఇటీవల కురిసన భారీ వర్షాలు, వరదలకు నగరంలోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. దాదాపు 15 వందల కాలనీలను వరద ముంచెత్తిందని ప్రభుత్వ వర్గాలే ప్రకటించాయి. మోకాళ్ల లోతు నీటిలోనే రెండు, మూడు రోజుల పాటు వేలాది కుటుంబాలు ఉన్నాయి. వరద పోటెత్తడంతో ఇండ్లలోని సామాగ్రి కూడా ధ్వంసమైంది. అయితే వరదలపై స్పందించిన సీఎం కేసీఆర్.. సిటీలో వరదతో ఇబ్బంది పడిన ప్రతి కుటుంబానికి 10 వేల రూపాయలు పరిహారంగా ఇస్తామని ప్రకటించారు. ఇందుకోసం 3 వందల కోట్ల రూపాయలు కూడా వెంటనే రిలీజ్ చేశారు.    గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు డిసెంబర్ లో నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీంతో ఇప్పుడు చేస్తున్న వరద సాయం తమకు బల్దియా ఎన్నికల్లో కలిసి వస్తుందని అధికార పార్టీ ఆశించింది. వరద సాయం చేస్తున్న కాలనీలు, బస్తీలన్ని గంపగుత్తగా తమకే మద్దతిస్తాయని గులాబీ నేతలు భావించారు. అందుకే కేసీఆర్ వరద సాయం ప్రకటన చేసిన వెంటనే టీఆర్ఎస్ నేతలు హడావుడి చేశారు. తమ డివిజన్ లోని లోతట్టు ప్రాంతాలు, బస్తీల్లో తిరుగుతూ వరద సాయం చేస్తామంటూ ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. అయితే ప్రస్తుతం పరిస్థితి మరోలా మారిపోయింది. అధికార పార్టీ అంచనాలకు భిన్నంగా  తమకు గ్రేటర్ ఎన్నికల్లో కలిసి వస్తుందనుకున్న వరద సాయం పంపిణి.. కొంప ముంచేలా మారిపోయిందని టీఆర్ఎస్ నేతలు తలలు పట్టుకునే పరిస్థితులు నెలకొన్నాయి.    నగరంలో వరద సహాయం వివాదంగా మారుతోంది. నీట మునిగిన ప్రాంతాలు, వాటిల్లిన నష్టం అంచనాలు, బాధితులకు ప్రస్తుతం పంపిణీ చేస్తున్న నష్ట పరిహారంలో తేడాలు పలు అనుమానాలకు  తావిస్తున్నాయి. వరద నీటితో నష్టపోయిన వారికి కాకుండా అనర్హులకు ఇచ్చారని, మునిగిపోయిన తమను పక్కన పెట్టారంటూ సిటీలోని అన్ని ప్రాంతాల్లోనూ అందోళనలు జరుగుతున్నాయి. గడ్డిఅన్నారం, చంపాపేట, ఉప్పల్, రామంతాపూర్, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, రాంనగర్‌ ఏరియాలో అయితే గత వారం రోజులుగా ప్రజలు ధర్నాలు చేస్తున్నారు. తమకు వరద సాయం చేయాలంటూ మున్సిపల్ కార్యాలయాలు, వార్డు కార్యాలయాల దగ్గర నిరసనలు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో కార్పొరేటర్లను చుట్టుముట్టారు. మున్సిపల్‌ అధికారులను నిర్బంధించారు. ఉప్పల్‌లో మున్సిపల్‌ కార్యాలయంలో ఎదుటే భోజనాలు చేసి ఆందోళనకు దిగారు.     అధికారులు పంపిణీకి సిద్ధం చేసిన జాబితాపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. క్షేత్ర స్థాయిలో పరిశీలించకుండా, కార్పొరేటర్లు, నాయకులకు చెప్పిన ప్రాంతాలను సైతం జాబితాలో చేర్చారు. ముంపు బాధితుల్లో ఎక్కువ మందికి నగదు సాయం అందుతున్నా కొన్ని ప్రాంతాల్లో అందడం లేదు. ముంపునకు గురికాని ప్రాంతాల్లో సైతం నగదు పంపిణీ చేశారు. కొన్ని డివిజన్లలో స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకులు వ్యవహారం తలనొప్పింగా మారింది. నగదు పంపిణీ అయిన తర్వాత డబ్బులు వసూలు చేస్తుండంతో ఇటీవల ఎమ్మెల్యే మౌలాలి డివిజన్‌లో ముగ్గురిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. అయినా నాయకుల తీరు మారడం లేదు. చాలా డివిజన్లలో కూడా అదే పరిస్థితి నెలకొంది. బాధితులకు అందజేసిన పరిహారంలో కొంత మొత్తాన్ని వసూళ్లు చేస్తున్నారు అధికార పార్టీ నేతలు. ముంపునకు గురికాని ప్రాంతాల్లో రూ.5వేలు పంపిణీ చేస్తున్నారు.    వరద సహాయంలో దళారీ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని టీఆర్ఎస్ నేతలు డబ్బులు సూలు చేస్తున్నారనే ఆరోపణలు దాదాపుగా అన్ని ప్రాంతాల నుంచి వస్తున్నాయి.వరద సహాయం రూ.10వేలు ఇచ్చినట్టే ఇచ్చి వెంటనే సగం డబ్బులు తిరిగి ఇవ్వాలని కొందరు నేతలు బాధితులను డిమాండ్‌ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.. ఎందుకివ్వాలని బాధితులు ప్రశ్నిస్తే ‘అసలు మీ ఇల్లు మునగనే లేదు అని చెప్పి మొత్తం డబ్బులు తీసుకుంటాం’ అని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముంపు బారిన పడని కాలనీల్లో సైతం డబ్బులు ఇస్తున్నారని అసలైన అర్హులకు ఎందుకు ఇవ్వరని వాపోయారు.  కొందరి దగ్గర ఆధార్‌కార్డు తీసుకుని ఓటీపీ వచ్చిన తర్వాత లబ్ధిదారుని సంతకం తీసుకుని.. తర్వాత డబ్బులు ఇచ్చేది లేదని లోకల్ లీడర్లు వెళ్లిపోయారని కొందరు బాధితులు ఆరోపిస్తున్నారు. శవాల మీద ప్యాలాలు ఏరుకుంటున్నట్లు స్థానిక నేతలు వ్యవహరిస్తున్నారని ముంపు బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.   గ్రేటర్ లో ప్రస్తుతం వరద సాయం అందిన వ్యక్తులు అదృష్టవంతుడిగా మారుతున్నాడు. డబ్బులు తీసుకున్నవారు సంతోష పడుతుండగా.. మిగతా వారంతా సర్కార్ పై ఆగ్రహంగా ఉంటున్నారు. దీంతో ప్రతి డివిజన్ లో సాయం అందని వారే ఎక్కువగా ఉంటారని.. వారంతా తమకు వ్యతిరేకమవుతున్నాయని గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న టీఆర్ఎస్ నేతలు ఆందోళన చెందుతున్నారు. వరద సాయం కలిసి వస్తుందనుకుంటే .. అదే ఇప్పుడు తమకు ఇబ్బందిగా మారిందని, డివిజన్ లో తిరగలేకపోతున్నామని మరి కొందరు గులాబీ నేతలు కలవరపడుతున్నారు. మొత్తంగా గ్రేటర్ లో సర్కార్ చేస్తున్న వరద సాయం తమ కొంప ముంచుతూ విపక్షాలకు వరంగా మారిందనే చర్చే అధికార పార్టీలో ఎక్కువగా జరుగుతోంది.

కేంద్రంపై రైతులు పిడికిలి బిగించి ఉద్యమించాలి

జనగామ జిల్లా కొడకండ్లలో రైతు వేదికను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలో ఎక్కడా రైతులకు వేదికలు లేవని, కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టామని అన్నారు. ఇప్పటి వరకు రైతులకు ఒక వ్యవస్థ అంటూ లేదని, రైతులు కూర్చొని మాట్లాడుకునేందుకు వేదిక ఏర్పాటు చేసినందుకు గర్వపడుతున్నానని కేసీఆర్ అన్నారు. తెలంగాణ రైతులను దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దుతామని చెప్పారు.   ఇతర దేశాల్లో ప్రభుత్వాలు సబ్సిడీలు ఇస్తాయి. మన దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాలనుకున్నా కేంద్రం ఆంక్షలు అడ్డుపతున్నాయని ఆరోపించారు. కేంద్రం నిర్థారించిన మద్దతు ధర కంటే ఎక్కువ ఇచ్చి ధాన్యం కొనుగోలు చేయొద్దని ఎఫ్‌సీఐ అంటోందని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ధాన్యం కొనుగోలు చేయట్లేదు. రైతులను నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.    కేంద్ర ప్రభుత్వానికి రైతులపై ప్రేమ లేదు. కేంద్రం రైతులకు అన్యాయం చేస్తుందని, కార్పొరేట్ కంపెనీల కోసమే వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చిందని కేసీఆర్ విమర్శించారు. వ్యవసాయ బిల్లును అడ్డగోలుగా పాస్ చేసిందని ధ్వజమెత్తారు. వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయని, కేంద్రం తీరు బాగోలేదు కాబట్టే దసరా పండుగ రోజు రావణాసురుడికి బదులు మోదీ బొమ్మలు తగలబెట్టారని అన్నారు. కేంద్రంపై రైతులు పిడికిలి బిగించి ఉద్యమించాలని కేసీఆర్‌ పిలుపునిచ్చారు.