పేరెంట్స్ వద్దంటున్నా స్కూళ్లెందుకు! కరోనాతో గేమ్స్ వద్దంటున్న జనాలు
posted on Nov 3, 2020 @ 1:03PM
విద్యార్థుల జీవితాలతో ఏపీ సర్కార్ చెలగాటమాడుతుందా? స్కూళ్లు నడపించడంపై అత్యుత్సాహం చూపిస్తోందా?. అంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఇదే చర్చనీయాంశంగా మారింది. స్కూళ్లకు వెళుతున్న ఉపాద్యాయులు, విద్యార్థులకు కరోనా పాజిటివ్ వస్తుండటంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలం గొల్లపల్లి స్కూల్‌లో ఓ ఉపాధ్యాయునికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో స్కూల్‌లోని విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అధికారులు హుటాహుటిన కరోనా టెస్టులు చేయిస్తున్నారు. తొలిరోజే ఉపాధ్యాయునికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ఇతర విద్యార్థులు, ఉపాధ్యాయులు భయాందోళనకు గురవుతున్నారు.
స్కూళ్ల ప్రారంభం, అవగాహనపై ఆదివారం పేరెంట్స్ కమిటి సమావేశాలు నిర్వహించారు. అయితే అనుమానాల నివృత్తికి పాఠశాలకు వచ్చిన విద్యార్థులలో కొత్తపట్నం మండలం గవండ్ల పాలెం జడ్పీ హైస్కూలు ఇద్దరు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు కొవిడ్ బారిన పడ్డారు. ముండ్లమూరు మండలం మా రెళ్ళ జడ్పీ హైస్కూలు విద్యార్థులు 8మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.
కేంద్ర ప్రభుత్వం నవంబరు 30 వరకు పాఠశాలలు తెరవవద్దని సూచించినా జగన్ ప్రభుత్వం మాత్రం మొండిగా స్కూళ్లను తెరిచింది. కరోనా మహమ్మారి ప్రభావం ఇంకా కొనసాగుతున్నా స్కూళ్లు తెరవడాన్ని తల్లిదండ్రులు కొందరు వ్యతిరేకిస్తున్నారు. పాఠశాలకు వచ్చిన తమ పిల్లలకు కరోనా వస్తే ఎవరు బాధ్యత వహిస్తారని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. కొవిడ్ 19 సెకండ్ వేవ్‌పై వస్తున్న సమాచారం తెలుసుకుంటున్న తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపేందుకు విముఖత చూపుతున్నారు.
కరోనా భయంతో మూత పడిన స్కూళ్లు సుదీర్ఘ విరామం తర్వాత సోమవారం తెరుచుకున్నాయి. కొవిడ్ సెకండ్ వేవ్ ప్రమాదకరంగా ఉంటుందన్న వార్తల నేపథ్యంలో తమ పిల్లలను పాఠశాలలకు పంపేందుకు తల్లి దండ్రులు జంకుతున్నారు. దీంతో తొలిరోజు స్కూళ్లలో హాజరు 30శాతం కూడా దాటలేదు. విద్యార్థులు స్కూళ్లకు నామమాత్రంగానే హాజరయ్యారు. ఎవరిలోనూ ఉత్సాహం కనిపించలేదు. అంతా జాగ్రత్తలపైనే శ్రద్ధ చూపారు. అన్ని పాఠశాలలో కొవిడ్ 19తో తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ, ఎయిడెడ్, ఇతర ప్రైవేటు యాజమాన్యాల్లోని జూనియర్ కళాశాల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది.
కరోనా భయం ఇంకా ఉన్నా, కేంద్ర సర్కార్ నవంబర్ 30 వరకు స్కూళ్లు తెరవొద్దని చెప్పినా జగన్ సర్కార్ ఎందుకు అత్యుత్సాహం చూపుతుందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో స్కూళ్లు తెరవలేదు. ఏపీకి పక్కనున్న మిగితా రాష్ట్రాల్లోనూ అంతే. అయినా విద్యార్థుల తల్లిదండ్రుల వ్యతిరేకిస్తున్నా స్కూళ్లు తెరవాల్సి అవసరం ఏముందని ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. తమ అనాలోచిత నిర్ణయాలతో జగన్ సర్కార్ పిల్లలకు ప్రమాదకర పరిస్థితులు కనిపిస్తుందనే అభిప్రాయమే ఏపీలోని మెజార్టీ వర్గాల నుంచి వస్తోంది. స్కూళ్లు తెరవడంపై ఉప్యాద్యాయ సంఘాలు ఆందోళనగా ఉన్నాయి.