గెలుపు నాదే.. ఒపీనియన్ పోల్స్ తప్పు! చివరి సభలో ట్రంప్
posted on Nov 3, 2020 @ 9:38AM
అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. అమెరికాలో మొత్తం దాదాపు 25.52 కోట్ల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి వుంది. అయితే ఇప్పటికే 30 శాతానికి పైగా ఓట్లు నమోదయ్యాయని తెలుస్తోంది. అంటే సుమారు 9 కోట్లకు పైగా ఓట్లు ఇప్పటికే బ్యాలెట్ బాక్సుల్లోకి చేరిపోయాయి.ఇవాళ మరో 30 శాతం ఓటింగ్ నమోదవుతుందని అంచనా. 2016లో జరిగిన యూఎస్ పోలింగ్ లో 55.5 శాతం ఓటింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు ట్రంప్, బైడెన్ తమ సర్వ శక్తులనూ వినియోగించారు. కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతున్నప్పటికీ ముమ్మరంగా ప్రచారం చేశారు.
అమెరికాలో ఈసారి ట్రంప్ కు షాక్ తప్పదని మెజార్టీ ఒపినియన్ పోల్స్ ప్రకటించాయి. ముందస్తుగానే భారీగా జరిగిన బ్యాలెట్ ఓటింగ్ లోనూ ట్రంప్ కంటే బైడెన్ చాలా ముందున్నారని సమాచారం. అయితే ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ మాత్రం మరోసారి తన విజయం ఖాయమంటున్నారు. అధ్యక్ష ఎన్నికలకు ముందు చివరి ప్రచారాన్ని నిర్వహించిన ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, ఎలాగైనా తానే గెలవనున్నానని కీలక వ్యాఖ్యలు చేశారు. నార్త్ కరోలినా పరిధిలోని ఫ్యేటవిల్లీలో జరిగిన ప్రచార సభలో పాల్గొన్న ఆయన, అధ్యక్ష ఎన్నికలపై వచ్చినవన్నీ తప్పుడు ఒపీనియన్ పోల్సేనని కొట్టి పారేశారు.
తన ప్రత్యర్థి బైడెన్ గెలిస్తే, అవినీతి పెరిగిపోతుందని, వైట్ హౌస్ లో ఆయన నిద్రించడం మినహా మరేమీ చేయలేరని విమర్శలు గుప్పించారు ట్రంప్. నాలుగేళ్ల క్రితం మీరు ఓ బయటి వ్యక్తిని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అతను అమెరికాను అగ్రరాజ్యంగా నిలిపాడు. ఇప్పుడు వెళ్లండి. అందరూ ఓటేయండి. నేను మిమ్మల్ని కోరేది అదే. వస్తున్న ఒపీనియన్ పోల్స్ ఫలితాలను నేనూ చూస్తున్నాను. వాటిని నమ్మకండి. అవి తప్పుడు పోల్స్" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.