ఆర్టీసీ డీల్ తో ఏపీకి గండం! బినామీ ఆస్తుల కోసమేనన్న అచ్చెన్న
posted on Nov 3, 2020 @ 10:20AM
ఏడు నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఏపీ, తెలంగాణ మధ్య ఆర్టీసీ బస్సులు ప్రారంభమయ్యాయి. చర్చల మీద చర్చల తర్వాత రెండు రాష్ట్రాల మధ్య డీల్ కుదిరింది. చెరో 1.60 లక్షల కిలోమీటర్ల మేర బస్సులు తిప్పుకునేందుకు ఇరు రాష్ట్రాలు ఓ అంగీకారానికి వచ్చాయి. అయితే తెలంగాణలో గతంలో కంటే ఏపీ ఆర్టీసీ లక్ష కిలోమీటర్లను తగ్గించుకుంది. ఇదే ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. ఏపీఎస్ఆర్టీసీ మనుగడకే ముప్పు తెచ్చేలా జగన్ సర్కార్ ఒప్పందం చేసుకుందనే ఆరోపణలు వస్తున్నాయి.
కొత్త ఒప్పందం కారణంగా ఏపీఎస్ఆర్టీసీ లక్షకు పైగా కిలోమీటర్లను కోల్పోవడం రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. ఈ ఒప్పందం ఆర్టీసీనే కాకుండా కార్మికులను కూడా నష్టపరుస్తుందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేస్తోందని, రాష్ట్ర ప్రయోజనాలను తెలంగాణకు తాకట్టు పెట్టారని అచ్చెన్న విమర్శించారు. తెలంగాణలో తన బినామీ ఆస్తులను కాపాడుకునేందుకు ఏపీ ప్రయోజనాలను జగన్మోహన్‌రెడ్డి పొరుగు రాష్ట్రానికి ధారాదత్తం చేస్తున్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఆర్టీసీ విషయంలో ప్రయాణికుల సౌకర్యాలతో పాటు ప్రజా ప్రయోజనాలను దెబ్బతీసేలా తెలంగాణ ప్రభుత్వంతో, జగన్ ప్రభుత్వం ఆనాలోచిత ఒప్పందం చేసుకుంది. దీనివల్ల రాష్ట్ర ప్రజలు పొరుగు రాష్ట్రాలకు వెళ్లాలంటే ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడిందని అచ్చెన్నాయుడు విమర్శించారు.
కరోనా లాక్ డౌన్ తో రెండు రాష్ట్రాల మధ్య బస్సులు నిలిచిపోయాయి. లాక్ డౌన్ ఎత్తేసి నెలలు కావస్తున్నా.. రెండు ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ఆర్టీసీ బస్సులు రోడెక్కని పరిస్థితి తలెత్తింది. చివరకి దసరా సమయంలోనూ ఆర్టీసీ బస్సులు నడవకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇదే అదనుగా ప్రైవేట్ ట్రావెల్స్ వారు భారీగా చార్జీలు పెంచి ప్రయాణికులను దోచుకున్నారు. ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో పండగకు ఎలాగైనా ఊరు వెళ్లేందుకు ప్రజలు ఆ భారాన్నిభరించారు. కరోనా భయంతో ఏప్రిల్, మే నెలల్లో హైదరాబాద్ నుంచి వేలాది మంది ఏపీ వాసులు సొంతూర్లకు వెళ్లారు. లాక్ డౌన్ తర్వాత వారు తిరిగి తమ పనుల కోసం వచ్చేందుకు చూసినా ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ప్రజలు ప్రయాణాల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోని జగన్ సర్కార్.. ఇప్పుడు తమ సొంత ప్రయోజనాల కోసం ఏపీ ఆర్టీసీకి నష్టం కలిగేలా నిర్ణయాలు తీసుకుందనే ఆరోపణలు ప్రజల నుంచి కూడా వస్తున్నాయి. మరోవైపు రాత్రి నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య అంతర్రాష్ట్ర బస్సులు మొదలైనా,, తొలిరోజున దాదాపు ఖాళీగానే తిరిగాయి. బస్సులు తిరగడంపై ప్రజల్లో అవగాహన లేకనే స్పందన లేదని అధికారులు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో విజయవాడ నుంచి హైదరాబాద్ కు, కర్నూలు నుంచి హైదరాబాద్ కు రెండు వైపులా ప్రయాణాలు సాగిస్తున్న వారు బస్టాండ్లకు వెళ్లడం లేదు. ఏ వాహనం అందుబాటులో ఉంటే దానిలోనే ప్రయాణిస్తున్నారు.
సోమవారం నాడు స్వల్ప సంఖ్యలోనే బస్సులు సరిహద్దులను దాటాయి. ప్రయాణికుల సంఖ్య పెరిగితే, ఆ మేరకు బస్సులను నడిపించేందుకు సిద్ధంగా ఉన్నామని రెండు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు. దీపావళి నాటికి పూర్తి స్థాయిలో సర్వీసులు తిరిగి ప్రారంభం అవుతాయన్న నమ్మకం ఉందన్నారు.