ధరణిలో సమస్యలు.. ఆందోళనలో జనాలు! గ్లోబరీనా ముంచుతుందా?
posted on Nov 2, 2020 @ 3:32PM
అందరూ భయపడుతున్నట్లే జరుగుతోంది.. విపక్షాల అనుమానాలే బలపడుతున్నాయి.. రైతుల ఆందోళనే నిజమవుతోంది. తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన, సీఎం కేసీఆర్ గొప్పగా చెప్పుకుంటున్న ధరణి పోర్టల్ దరిద్రంగా ఉందని తెలుస్తోంది. అక్టోబర్ 29న ధరణి పోర్టల్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ జనగామ జిల్లాలో ప్రారంభించగా.. ఇవాళ్టి నుంచి అధికారికంగా సేవలు ప్రారంభమయ్యాయి. అయితే తొలిరోజే అధికారులకు చుక్కలు చూపిస్తోంది ధరణి పోర్టల్. సాంకేతిక లోపాలతో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఓపెన్ కావడం లేదని తెలుస్తోంది. ఓపెనా అయినా కొన్నివివరాలను చూపించడం లేదంటున్నారు.
శంషాబాద్‌లోని తహసీల్దార్ ఆఫీసులో ధరణి సేవలను సీఎస్ సోమేష్ కుమార్ ప్రారంభించారు. అపరేటర్ దగ్గర కూర్చుని పరిశీలించారు సీఎస్. అయితే ప్రారంభమైన వెంటనే ధరణి వెబ్‌సైట్‌లో సాంకేతిక లోపాలు తలెత్తాయి. మండల ఆఫీసులోని ఆపరేటర్ దగ్గర కూడా ధరణి పోర్టల్ ఓపెన్ కాలేదు. రంగారెడ్డి జిల్లా మొత్తంలో కేవలం ఐదు స్లాట్ల బుకింగ్ మాత్రమే ఉంది. గండిపేట తహసీల్దార్ కార్యాలయంలో స్లాట్‌లు బుకింగ్ అవడం లేదు.రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రారంభించిన తహసీల్దార్ ఆఫీసులోనే పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ధరణి వెబ్‌సైట్ ఓపెన్ కాకపోవడంతో రైతుల ఇబ్బందులకు గురవుతున్నారు. ఉదయం నుంచే ఈ-సేవా కేంద్రాల వద్ద రైతులు క్యూ కట్టారు.
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ ధరణి వెబ్ సైట్ లో సాంకేతిక సమస్యలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. దీంతో రైతులు, భూములున్నవారు ఆందోళన చెందుతున్నారు. అస్తవ్యస్థంగా ఉన్న ధరణి పోర్టల్ తో తమ భూముల లెక్క తప్పుగా వస్తుందోమోనన్నఆందోళనను వారు వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో రైతులు ఆందోళనలు కూడా చేస్తున్నారట. చాలాకాలంగా రిజిస్ట్రేషన్లు నిలచిపోవడంతో రియల్ వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ధరణి సేవలు ప్రారంభం కావడంతో రిజిస్ట్రేషన్ కోసం వెళ్లిన వారికి నిరాశే ఎదురవుతోంది. సాంకేతిక సమస్యలతో రిజిస్ట్రేషన్లు కాకపోవడంతో ఇంకా ఎన్ని రోజులు ఎదురుచూడాల్సి వస్తుందేమోనని వారు ఆవేదన చెందుతున్నారు.
నిజానికి ధరణి పోర్టల్ పై మొదటి నుంచి అనుమానాలు, అభ్యంతరాలు వస్తున్నాయి. ప్రజల భూములకు సంబంధించిన సమాచారం ఉండే రెవిన్యూ శాఖ పోర్టల్ ను ప్రైవేట్ సంస్థకు అప్పగించడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ప్రైవేట్ సంస్థ అక్రమాలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని కొందరు రెవిన్యూ నిపుణులు కూడా హెచ్చరించారు. ప్రజల భూములను తనఖా పెట్టి ప్రైవేట్ సంస్థ రుణాలు తీసుకోదనే గ్యారంటీ ఏంటని ప్రతి పక్ష నేతలు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అయినా ప్రభుత్వం అలాగే ముందుకెళ్లింది. ఇప్పుడు ప్రజలు భయపడ్డట్టే జరుగుతుండటంతో ధరణి పోర్టల్ భద్రతపై ప్రజల్లో అనుమానాలు మరింత పెరుగుతున్నాయి.
ధరణి పోర్టల్ కు సంబంధించి మరో విషయం కూడా వెలుగులోకి వస్తోంది. గత సంవత్సరం ఇంటర్ పరీక్షల ఫలితాల్లో తప్పులకు కారణమైన గ్లోబరీనా సంస్థే ధరణి పోర్టల్ ను తయారు చేసిందని చెబుతున్నారు.గ్లోబరీనా చేసిన నిర్వాకంతో ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకల కారణంగా లక్షలాదిమంది విద్యార్థులు సతమతమయ్యారు. పరీక్షల్లో ఫెయిల్ కారణంగా మనస్తాపంతో 25 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. ఇంటర్ ఫలితాల నిర్వహణ బాధ్యతను గ్లోబరీనా సంస్థకు అప్పగించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అనుభవంలేని సంస్థకు మూల్యాంకన బాధ్యతలు అప్పగించిన కారణంగానే ఇబ్బందులు తలెత్తాయనే ఆరోపణలు వచ్చాయి. ఆరోపణలపై విచారణకు ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ కూడా .. టెండర్ల నుంచి ఫలితాలు వెల్లడి దాకా జరిగిన అన్ని ఘటనలపై సమగ్ర విచారణ జరిపి పొరబాట్లలో గ్లోబరీనాకు బాధ్యత ఉందని తేల్చింది.
ఇంటర్ ఫలితాల నిర్వహణలో ఘోరంగా విఫలమై కొందరు విద్యార్థుల చావుకు కారణమైన గ్లోబరీనాకు అత్యంత కీలకమైన రెవిన్యూ శాఖ ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలు అప్పగించడం ఇప్పుడు ఆందోళన కల్గిస్తోంది. తమ ఆస్తులపై ప్రజలు, రైతులు కలవరపడుతున్నారు. పోర్టల్ లో తప్పులు జరిగితే భూముల లెక్కలన్ని తారుమారయ్యే అవకాశం ఉందని వారు ఆందోళన చెందుతున్నారు. ప్రజల ఆస్తులతో కేసీఆర్ సర్కార్ చెలగాటమాడుతుందని వారు ఆరోపిస్తున్నారు. ధరణి ద్వారా ఏమైనా తప్పులు జరిగితే అందుకే ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు.