ఏడు నెలల తర్వాత రైట్ రైట్! తెలుగు రాష్ట్రాల మధ్య కుదిరిన డీల్
posted on Nov 2, 2020 @ 4:33PM
తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల రవాణాకు లైన్ క్లియరైంది. ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య జరిగిన చర్చలు ఎట్టకేలకు సఫలమయ్యాయి. ఏపీ, తెలంగాణ ఆర్టీసీల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఒప్పందం ప్రకారం ఏపీలో లక్షా 61 వేల 258 కిలోమీటర్ల మేర తెలంగాణ ఆర్టీసీ బస్సులు తిప్పనుంది. ఇక తెలంగాణలో ఏపీ ఆర్టీసీ లక్షా 60 వేల 999 కిలోమీటర్ల మేర బస్సులు నడపనుంది. ఏపీలో తెలంగాణ ఆర్టీసీ 826 బస్సులు తిప్పనుంది. అలాగే తెలంగాణలో ఏపీ 638 బస్సులు నడపనుంది.
రెండు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసుల విషయంలో క్లారిటీ రావడంతో దాదాపు ఏడు నెలల తర్వాత ఆర్టీసీ బస్సులు నడవనున్నాయి. లాక్‌డౌన్‌కు ముందు నుంచి తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. ప్రస్తుతం అన్‌లాక్ ప్రక్రియ నడుస్తున్నా.. బస్సు సర్వీసులు మాత్రం పునరుద్ధరించబడలేదు. పలుమార్లు ఇరు రాష్ట్రాల అధికారులు చర్చలు జరిపినా ఫలించలేదు. చివరికి చర్చలు కొలిక్కి రావడంతో బస్సులు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
గతంలో ఏపీఎస్‌ఆర్టీసీ తెలంగాణలో దాదాపు 2 లక్షల 65 వేల కిలో మీటర్ల తిప్పితే.. తెలంగాణ లక్ష మాత్రమే తిప్పేది. కొత్త ఒప్పందం ప్రకారం దాదాపు ఏపీఎస్‌ఆర్టీసీ లక్ష కిలోమీటర్లు తగ్గించుకోవడంతో పాటు కొన్ని బస్సులను కూడా తగ్గించింది. కొత్త ప్రతిపాదనలతో ఏపీఎస్‌ఆర్టీసీకి సంవత్సరానికి రూ.270 కోట్ల మేర నష్టం ఉండొచ్చని అంచనా. టీఎస్‌ఆర్టీసీ మాత్రం నష్టాల నుంచి గట్టెక్కే అవకాశం ఉందని చెబుతున్నారు. కరోనా కారణంగా బస్సులు నడవకపోవడంతో ఇరు రాష్ట్రాలకు భారీగా నష్టం వాటిల్లింది. అయితే ఏపీకి నడిపే తెలంగాణ ఆర్టీసీ బస్సు చార్జీల్లో ఎలాంటి మార్పు లేదని, టికెట్ల రేట్లు పెంచడం లేదని ఆ రాష్ట్ర రవాణాశాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.