గీతంకు వర్సిటీ హోదా తొలగించండి.. యూజీసీకి, హెచ్చార్డీకి ఎంపీ విజయ్ సాయిరెడ్డి లేఖ 

కొద్ది రోజుల క్రితం విశాఖలోని గీతం విద్యాసంస్థ ప్రభుత్వ భూమిని కబ్జా చేసిందని చెబుతూ అక్కడి పలు నిర్మాణాలను విశాఖ అధికారులు తొలగించిన సంగతి తెలిసిందే. తాజాగా గీతం ను మరోసారి టార్గెట్ చేస్తూ.. గీతం యూనివర్సిటీ యాజమాన్యం యూజీసీ నిబంధనలను కూడా అతిక్రమించిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ కు లేఖ రాశారు. దీనిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో అయన కోరారు. దీనితోపాటు గీతం యూనివర్సిటీకి ఉన్న డీమ్డ్ యూనివర్సిటీ హోదాను యూజీసీ రద్దు చేయాలనీ, అయితే విద్యార్థులు మాత్రం నష్టపోకుండా గీతంను ఆంధ్రా యూనివర్సిటీకి అనుబంధంగా చేయొచ్చని అయన పేర్కొన్నారు.   గీతం సంస్థ విశాఖ క్యాంపస్‌ కోసం ప్రభుత్వ భూమిని కబ్జా చేసినట్లు తన దృష్టికొచ్చిందని సాయిరెడ్డి తెలిపారు. క్యాంపస్‌ కోసం నిబంధనలు ఉల్లంఘించి భూములు సేకరించారని సాయిరెడ్డి ఆ లేఖలో ఆరోపించారు. గీతం సంస్థ నిబంధనల ఉల్లంఘన, డాక్యుమెంట్లు బహిర్గతం చేయకపోవడంపై అభ్యంతరం తెలిపారు. యూజీసీ చట్టంలోని పలు నిబంధనలను గీతం ఉల్లంఘించినట్లు సాయిరెడ్డి ఆరోపించారు. గీతం విద్యా సంస్థకు.. సినీ నటుడు బాలకృష్ణ చిన్నఅల్లుడు, టీడీపీ నేత అయిన శ్రీ భరత్ చైర్మన్‌గా ఉన్న సంగతి తెలిసందే.

గజపతి రాజుల పరువు బజారున పడేస్తున్న వారసులు...

కొన్ని నెలల క్రితం మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా, సింహాచలం దేవస్థానం ట్రస్ట్ చైర్మన్ గా ఆనంద గజపతిరాజు మొదటి భార్య సంతానం ఐన సంచయిత గజపతిరాజు పదవి చేపట్టిన నాటి నుండి గజపతి రాజు కుటుంబీకుల మధ్య వివాదాలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా, విజయనగరం పైడితల్లి సిరిమానోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన తమను సంచయిత అవమానించిందని ఆనంద గజపతిరాజు రెండో భార్య కుమార్తె ఊర్మిళ గజపతిరాజు ఆరోపించారు. ఈరోజు తమ బంగ్లాలో ఊర్మిళ మీడియా సమావేశం ఏర్పాటు చేసి సంచయితపై తీవ్ర విమర్శలు చేశారు. పైడితల్లి అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొనడం రాజ కుటుంబికులుగా తమకు ఎప్పటినుంచో ఆనవాయితీగా వస్తోందని, ఈ ఏడాది కూడా తన తల్లి సుధా గజపతిరాజుతో కలిసి సిరిమాను ఉత్సవానికి వచ్చానని ఆమె తెలిపారు. అమ్మవారి వేడుకలు చూసేందుకు కోటలోకి వచ్చిన తమ పట్ల సంచయిత అవమానకర రీతిలో ప్రవర్తించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాను తన తల్లితో కలిసి కోటలోకి ప్రవేశించగానే... తమ రాకను గమనించిన సంచయిత తన సిబ్బందిపై మండిపడి, వీళ్లను కోటలోకి ఎవరు రానిచ్చారు అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసిందని ఊర్మిళ వెల్లడించారు. దీంతో కోటపై ముందు వరుసలో ఉన్న తమను వెనక్కి వెళ్లాలని తమ దగ్గరకు వచ్చి ఈవో చెప్పారని ఆమె వివరించారు. అయితే, ఆ ఈవోను పర్మిషన్ అడిగి కొంతసేపు అక్కడే కూర్చుని దర్శనం చేసుకుని వచ్చేశామని ఆమె తెలిపారు.   అయితే ఈ తరహా అనుభవం ఎదురవుతుందని తమకు ముందే తెలుసని, సంచయిత ఎంతో అహంకారంతో ప్రవర్తిస్తోందని ఆమె ఆరోపించారు. అంతేకాకుండా మాన్సాస్ ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా తన తల్లిని ఇంతవరకు ప్రమాణస్వీకారం కూడా చేయనివ్వలేదని ఊర్మిళ వెల్లడించారు. మాన్సాస్ ట్రస్టును సంచయిత తన సొంత సంస్థలా భావించి అధికారం చెలాయిస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. సంచయిత చేస్తున్న చేష్టలు దివంగత ఆనంద గజపతిరాజుకు అవమానకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. కోట బురుజుపై నుంచి సిరిమాను ఉత్సవం తిలకించే హక్కు ఆనంద గజపతి వారసులుగా తమకు కూడా ఉందని ఊర్మిళ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.   కాగా, నిన్న ఊర్మిళ, సుధా గజపతిరాజులను అక్కడ్నించి పంపించేందుకు పోలీసులు నిస్సహాయత వ్యక్తం చేయడంతో... సంచయిత కోట బురుజుపై మరో వైపున కుర్చీ వేసుకుని కూర్చుని సిరిమానోత్సవ వేడుకలు తిలకించారు. దీంతో పైడితల్లి సిరిమానోత్సవం ఈసారి వివాదాలకు కేంద్ర బిందువుగా మారిపోయింది. అమ్మవారి సాక్షిగా రాజ కుటుంబంలో ఇప్పటికే ఉన్న విభేదాలు తాజా ఘటనతో మరింత చెలరేగాయి.   దీంతో సింహాచలం దేవస్థానం బోర్డు ఛైర్మన్‌గా నియమించబడ్డ సంచయిత వ్యవహార శైలి తీవ్ర విమర్శలకు గురవుతోంది. ఎంతో గౌరవంగా జరగాల్సిన ఈ పవిత్ర కార్యక్రమం రసాభాసగా మారింది. దీంతో అందరి దృష్టి రాజకుంటుంబంపై పడింది. తాజా ఘటనపై సంచయిత గొప్పగా ఫీలవుతుంటే.. మరో పక్క ఊర్మిళ గజపతి మాత్రం ఇది రాజ కుటుంబానికి అవమానకరమని, బాధాకరమని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులందరూ హాజరు కావాల్సిన కార్యక్రమంలో మమ్మల్ని పాల్గొనకూడదని ఆంక్షలు విధించడానికి అసలు సంచయిత ఎవరని ఊర్మిళ ప్రశ్నించారు.  

పాక్ పార్లమెంట్ లో మోడీ నినాదాలు! అసహనంతో ఉడికిపోయిన మంత్రులు 

పాకిస్తాన్ పార్లమెంట్ లో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నినాదాలు. ఏంటీ తప్పుగా రాశారని అనుకుంటున్నారా.. అయితే మీరు తప్పులో కాలేసినట్టే. మీరు చదివింది అక్షరాల నిజమే. మన దాయాది పాకిస్తాన్ పార్లమెంట్ లోనే ప్రధాని మోడీ పేరు మార్మోగింది. దీంతో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సహా మంత్రులు అసహనానికి గురయ్యారు. దీన్ని జీర్ణించుకోలేక కొందరు మంత్రులు పార్లమెంట్ నుంచి బయటికి వెళ్లిపోయారు.             పాకిస్థాన్ పార్లమెంటులో విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. బలూచిస్థాన్ ఉద్యమం గురించి పాక్ విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషీ సభలో ప్రసంగిస్తుండగా, బలూచిస్థాన్ ఎంపీలు అడ్డుతగిలారు. వారు సభాముఖంగా భారత ప్రధాని నరేంద్ర మోడీని వేనోళ్ల పొగుడుతూ పాక్ విదేశాంగ మంత్రిని తీవ్ర అసహనానికి గురిచేశారు. ఆ ఎంపీలు ఎంతకీ తగ్గకుండా మోడీ, మోడీ అంటూ బిగ్గరగా నినాదాలు చేస్తుండడంతో ఖురేషీ ఉడికిపోయారు.   బలూచిస్థాన్ ఎంపీల మనసుల్లోకి మోడీ భావనలు చొరబడినట్టున్నాయని, భారత అజెండాను విపక్ష సభ్యులు పాక్ లో అమ్ముతున్నారని ఖురేషీ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత అనుకూల నినాదాలతో జాతీయ సంస్థలను అవమానానికి గురిచేస్తున్నారని విమర్శించారు. విపక్ష సభ్యుల నియోజకవర్గాల నుంచి బలూచిస్థాన్ స్వాతంత్రం కోసం నినాదాలు రావడం సిగ్గుచేటన్నారు పాక్ విదేశాంగ శాఖ మంత్రి. అయినా బలూచిస్థాన్ ఎంపీలు ఖురేషీకి పదేపదే అడ్డుతగిలారు. దాంతో ఆయన తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసి సభ నుంచి అర్థాంతరంగా వెళ్లిపోయారు.   అంతకుముందు  ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ వైఖరిని ఖండిస్తూ ఆయనకు వ్యతిరేకంగా పాకిస్థాన్ పార్లమెంటు తీర్మానం ఆమోదించింది. మహ్మద్ ప్రవక్తను కించపరిచేలా చార్లీ హెబ్డో పత్రికలో వ్యంగ్య చిత్రణ చోటుచేసుకోవడాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ ఖండించకపోవడాన్ని నిరసిస్తూ పాక్ పార్లమెంటులో తీర్మానం చేశారు. ఈ సందర్భంగా విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషీ ప్రసంగిస్తూ, మధ్యలో బలూచిస్థాన్ ప్రస్తావన తీసుకువచ్చారు. దాంతో బలూచిస్థాన్ ప్రాంత ఎంపీలు రెచ్చిపోయి మంత్రి ప్రసంగాన్ని రసాభాస చేశారు. భారత ప్రధాని మోడీకి జై కొడుతూ నినాదాలు చేశారు.

ధరణి పోర్టల్ దేశానికే మార్గనిర్దేశం

ధరణి వెబ్ పోర్టల్‌ ను తెలంగాణ సీఎం కేసీఆర్ గురువారం అధికారికంగా ప్రారంభించారు. నవంబర్ 2 నుంచి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే భూమి యజమానుల వివరాలు కనిపించేలా ధరణి వెబ్‌సైట్‌ ను రూపొందించారు. ఇక మీదట వ్యవసాయ భూములన్నీ ఎమ్మార్వో కార్యాలయంలోనే రిజిస్ట్రేషన్‌ ‌తోపాటు మ్యుటేషన్ కూడా జరిగే విధంగా ధరణి వెబ్ సైట్లో మార్పులు చేశారు. భూముల రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకోవాలి. ఆ తరువాత స్లాట్ సమయానికి ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్తే కేవలం 10-15 నిమిషాలలో రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియ జరిగిపోతుంది. భూముల రిజిస్ట్రేషన్‌ జరగాలంటే.. ఇకపై భూమిని విక్రయించేవారు, కొనుగోలు చేసేవారు ఇద్దరూ తహసీల్దార్‌ ఎదుట హాజరు కావాల్సిందే.    ధరణి పోర్టల్ ను ప్రారంభించిన అనంతరం కేసీఆర్ ప్రసంగిస్తూ.. ధరణి పోర్టల్ దేశానికే మార్గనిర్దేశంగా నిలుస్తుందని చెప్పారు. ధ‌ర‌ణి పోర్ట‌ల్ ప్రారంభంతో రాష్ర్టంలోని 570 ఎమ్మార్వో కార్యాల‌యాన్ని స‌బ్ రిజిస్ర్టార్ కార్యాల‌యాలుగా మారాయ‌ని స్ప‌ష్టం చేశారు. ఈ పోర్టల్ వల్ల అందరి ఆస్తులు, భూములకు రక్షణ ఉంటుందని, అక్రమ రిజిస్ట్రేషన్లకు తావుండదని చెప్పారు. ఈ పోర్టల్ వల్ల క్రయ, విక్రయాలన్నీ నమోదు చేసిన 15 నిమిషాల్లో పూర్తవుతాయని అన్నారు. కాళ్లు అరిగేలా ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని, పైరవీలు చేసుకోవాల్సిన అవసరం ఉండదని చెప్పారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచలేదని, పాత చార్జీలే అమల్లో ఉంటాయని తెలిపారు. గొప్పగొప్ప సంస్కరణలను తీసుకొచ్చినప్పడు ఇబ్బందులు రావడం సహజమని.. వాటిని ఎదుర్కొని నిలబడ్డప్పుడే అభివృద్ధి సాధించగలుగుతామని సీఎం కేసీఆర్ చెప్పారు.

రాజకీయాలకు సెలవ్! రజనీకాంత్ రివర్స్ గేర్ 

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ పార్టీ లేనట్టేనా? రజనీ మక్కల్ మండ్రం గుడారం ఎత్తేసినట్టేనా! అంటే తమిళనాడులో జరుగుతున్న తాజా పరిణామాలతో అవుననే తెలుస్తోంది. రజనీకాంత్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారని సమాచారం. రజనీకాంత్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారని, ఆయన ఆరోగ్య పరిస్థితి రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నారని ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై రజనీకాంత్ స్పందించారు. ఆ లేఖ తనది కాదని, కానీ అందులో తన ఆరోగ్యం గురించి ఉన్న సమాచారం నిజమేనని స్పష్టం చేశారు. త్వరలోనే 'రజనీ మక్కల్ మండ్రం' సభ్యులతో చర్చించిన తర్వాత రాజకీయ పార్టీపై అధికారిక ప్రకటన ఉంటుందని రజనీ వెల్లడించారు.   దక్షిణాది రాష్ట్రాల్లో సూపర్ స్టార్ గా పేరున్న రజనీ కాంత్ త్వరలో రాజకీయపార్టీ స్థాపిస్తానంటూ హడావుడి చేశారు. తన అభిమానసంఘాలతో పలు దఫాలు సమావేశాలు నిర్వహించారు. మొదట నుంచీ రాజకీయ ప్రవేశంపై సరైన స్పష్టత లేకుండా ఎప్పటికప్పుడు పార్టీ ఆవిష్కరణ వాయిదా వేస్తూ వచ్చారు బాషా. చివరికి ఇప్పుడు రాజకీయ రంగప్రవేశం లేదనే సంకేతమిచ్చారు. అభిమానసంఘాలతో చర్చించి తుదినిర్ణయం చెబుతానంటూ మరో మాట చెప్పారు.    తమిళనాడు మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో 69ఏళ్ళ రజనీకాంత్ ఆరోగ్యంపై డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేయడంతో, ఆయన రాజకీయ ప్రవేశానికి దాదాపుగా తెరపడిపోయినట్లు కనిపిస్తోంది. ఆయనకు కిడ్నీ సమస్య ఉండడంతో ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల్లో ఆయన బయట తిరగడం మంచిది కాదంటూ డాక్టర్లు సలహా ఇచ్చారని చెబుతున్నారు.   రజనీ కాంత్ పేరిట వచ్చిన లేఖలో ఆయన ఆరోగ్య పరిస్థితి సమాచారం ఉంది. 2011లో రజనీకాంత్ కిడ్నీ వ్యాధి బారినపడడంతో సింగపూర్ లో వైద్యం చేయించుకున్నారని, 2016లో కిడ్నీ సమస్య తిరగబెట్టడంతో అమెరికా వెళ్లి చికిత్స తీసుకున్నారని అందులో వివరించారు.  ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభిస్తున్నందున, కిడ్నీ వ్యాధిగ్రస్తుడైన రజనీకాంత్ ఎంతమాత్రం బయట తిరగలేని పరిస్థితి ఉందని లేఖలో వివరించారు. ఒకవేళ కరోనా వ్యాక్సిన్ వచ్చినా కానీ ఆయన హెల్త్ కండీషన్ రీత్యా బయట తిరగడం సాధ్యం కాకపోవచ్చని అందులో పేర్కొన్నారు. కిడ్నీ మార్పిడి వల్ల రోగనిరోధక శక్తి కనిష్టస్థాయికి చేరిందని, ఇన్ఫెక్షన్లు త్వరగా సోకే అవకాశం ఉన్నందున బహిరంగ సభల్లో పాల్గొనడం రజనీకాంత్ ప్రాణాలకే ముప్పు అని లేఖలో వివరించారు.    రజనీకాంత్ పేరిట సర్క్యూలేట్ అవుతున్న లేఖ, ఆయన ఆరోగ్య పరిస్థితి, డాక్టర్ల అభిప్రాయాల ప్రకారం ఆయన రాజకీయ పార్టీ దాదాపుగా లేనట్టేనని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే రజనీ మక్కల్ మండ్రం ప్రతినిధులు అధికారిక ప్రకటన చేస్తారని చెబుతున్నారు. మొత్తానికి రజనీకాంత్ రాజకీయ పార్టీపై కొంత కాలంగా జరుగుతున్న ప్రచారానికి తెర పడనుండటంతో తమిళనాడు రాజకీయాల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది. రజనీకాంత్ పార్టీ పెట్టడం లేదన్న వార్తలతో ప్రతిపక్ష డీఎంకేలో సంతోషం వ్యక్తం అవుతుండగా అధికార అన్నాడీఎంకే నేతలు మాత్రం ఢీలా పడుతున్నారని చెబుతున్నారు.  

డిసెంబర్ కల్లా ఆక్స్ ఫర్డ్ వాక్సిన్..  కానీ భారత్ లో మాత్రం ఆలస్యం .. కారణం అదే..! 

కరోనాను ఎదుర్కొనేందుకు ఆక్స్ ఫ‌ర్డ్ - ఆస్ట్రాజెనెకాలు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ "కోవిషీల్డ్" వాక్సిన్ వచ్చే డిసెంబర్ లో మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉందని భారత్ లో దీనిపై ట్రయల్స్ చేసి ఉత్పత్తి చేసే సీరం ఇండియా సంస్థ సిఇవో ఆధార్ పూనావాలా తెలిపారు. ప్రస్తుతం బ్రిటన్ లో ఈ వాక్సిన్ మూడో దశ ట్రయల్స్ చివరి దశలో ఉన్నాయని.. దీంతో డిసెంబర్ నెలలో ఈ వాక్సిన్ అందుబాటులోకి వస్తుందని అయన తెలిపారు. ఈ వాక్సిన్ పై బ్రిటన్ లో జరుగుతున్న ట్రయల్స్ లో ఇటు యువకులలో అటు వృద్దులలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తోందని.. తీపి కబురు చెప్పారు. అయితే భారత్ లో మాత్రం తొలి బ్యాచ్ 2021 జులై- సెప్టెంబ‌ర్ మ‌ధ్య‌లో ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని వెల్లడించారు. అయితే మనదేశంలో మాత్రం వాక్సిన్ ఎపుడు వస్తుందనే విషయం.. డిసిజిఐ అనుమతుల పై ఆధారపడి ఉంటుందని అన్నారు. తాము 10కోట్ల వాక్సిన్ డోసుల‌ను సిద్ధం చేస్తున్నామ‌ని… వ్యాక్సిన్ సేఫ్ అని ఫైనల్ ట్రయల్స్ లో తేలితే ప్రజల విస్తృత ప్ర‌యోజ‌నాల దృష్ట్యా వ్యాక్సినేష‌న్ కు వెంట‌నే అవ‌కాశం ఇవ్వాల‌ని తాము భార‌త ప్ర‌భుత్వానికి ద‌ర‌ఖాస్తు చేస్తామ‌ని అయన వెల్ల‌డించారు. అయితే ఈ విషయంలో వైద్యారోగ్య శాఖ నిర్ణ‌య‌మే కీల‌క‌మ‌ని అయన వ్యాఖ్యానించారు. ఒకవేళ భార‌త ప్ర‌భుత్వం కనుక అత్య‌వ‌స‌రం అని భావించి అనుమ‌తిస్తే మాత్రం జ‌న‌వ‌రి నాటికి సామాన్య ప్రజలకు క‌రోనా వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉంటాయి. లేదంటే మాత్రం ఆల‌స్యం అవుతుంద‌ని ఆయ‌న వ్యాఖ్యలను బట్టి అర్ధమవుతోంది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఈ వ్యాక్సిన్ సేఫ్ అనే తేల‌టంతో… బ్రిట‌న్ లో అత్య‌వ‌స‌రంగా వ్యాక్సిన్ ఇచ్చే ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి.

బోగస్ బ్యాలెట్ ఓట్లు! దుబ్బాకలో మరో రచ్చ 

తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతున్న సిద్ధిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నిక అనూహ్య పరిణామాలకు వేదికవుతోంది. ప్రధాన పార్టీలు సవాల్ గా తీసుకోవడంతో ఇక్కడ ప్రతి విషయం వివాదాస్పదమే అవుతోంది. అన్ని గ్రామాల్లోనూ అలర్ట్ గా ఉంటున్న పార్టీ శ్రేణులు చీమ చిటుక్కుమన్నా సీరియస్ గా స్పందిస్తున్నాయి. ఇటీవల జరిగిన నోట్ల కట్టల రగడ అలా ఉండగానే.. కొత్తగా బోగస్ బ్యాలెట్ ఓట్లు వేస్తున్నారనే రచ్చ నియోజకవర్గంలో దుమారం రేపుతోంది. అధికార పార్టీ నేతలు అధికారులతో కుమ్మక్కై బోగస్ బ్యాలెటు ఓట్లు వేయించుకుంటున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.   కరోనా వైరస్ కారణంగా ఈసారి ఎన్నికల సంఘం కొన్ని ప్రత్యేక నిర్ణయాలు తీసుకుంది. డెబ్బై ఏండ్ల పైబడిన వృద్ధులు, వికలాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బందులు పడేవారు పోలింగ్ కేంద్రానికి రాకుండా ఇంట్లోనే ఉండి బ్యాలెట్ ఓటు వేసే అవకాశం కల్పించింది. ఇందుకోసం ప్రత్యేకంగా సిబ్బందిని కూడా నియమించింది. ఎన్నికల సంఘం అలాట్ చేసిన అధికారులు పోలింగ్ కేంద్రాల వారీగా గ్రామాలకు వెళ్లి.. వృద్ధులు, వికలాంగులు, వ్యాధిగ్రస్తుల నుంచి బ్యాలెట్ ఓట్లు తీసుకుంటున్నారు. ఇదే ఇప్పుడు సమస్యగా మారింది. బ్యాలెట్ ఓట్ల కోసం అధికార పార్టీ నేతలు తమను అనుకూలంగా ఉన్నవారినే నియమించారని, వారు బ్యాలెట్ ఓట్లలో అక్రమాలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. గ్రామాల్లోకి వస్తున్న పోలింగ్ సిబ్బందిని అడ్డుకుంటున్నారు. దీంతో దుబ్బాక నియోజకవర్గంలోని గ్రామాల్లో ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి.   దుబ్బాక నియోజకవర్గంలోని చేగుంట, మిరుదొడ్డి మండలాల్లోని పలు గ్రామాలు అధికార, విపక్ష పార్టీల మధ్య బ్యాలెట్ ఓట్ల విషయంలో గొడవలు జరిగాయి. గ్రామాల్లోకి వస్తున్న ఎన్నికల సిబ్బంది.. వృద్ధులను అధికార పార్టీకి ఓటేయమని ప్రలోభాలకు గురి చేస్తున్నారని విపక్ష కార్యకర్తలు చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో బ్యాలెటు ఓటు వినియోగించుకుంటున్న ఓటరు చెప్పిన గుర్తుకు కాకుండా కారు పార్టీకే అధికారులు ఓట్లు వేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇంకొన్ని చోట్ల వృద్ధుల ఓట్లన్ని ఒకచోటే గంపగుత్తగా టీఆర్ఎస్ నేతలే వేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రతిపక్ష పార్టీల నేతలు. ఎన్నికల సంఘం ఇచ్చిన వెసులుబాటును తమకు అనుకూలంగా మలుచుకుంటూ అధికార టీఆర్ఎస్ పార్టీ అక్రమాలకు పాల్పడుతుందని, అడ్డదారిలో గెలిచేందుకు కుట్రలు చేస్తుందని బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.   ఇక బ్యాలెటు ఓటు వినియోగించుకునే అర్హులంతా ఆసరా పెన్షన్లుదారులే. ఇది కూడా అధికార పార్టీకి కలిసి వస్తుందని చెబుతున్నారు. కారు గుర్తుకు ఓటేయకుంటే ఫించన్ ఆగిపోతుందని వారిని గులాబీ నేతలు భయపెడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పెన్షన్ పోతుందన్న భయంతో ఇష్టం లేకున్నా కొందరు వృద్ధులు, వికలాంగులు అధికార పార్టీ నేతలకే తమ బ్యాలెటు పేపర్లు ఇస్తున్నారని చెబుతున్నారు. ఓటమి భయంతోనే బ్యాలెటు ఓట్లను భారీగా వేసుకునేలా టీఆర్ఎస్ ప్లాన్ చేస్తుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన ప్రత్యేక పరిశీలకుడి దృష్టికి అధికార పార్టీ చేస్తున్న అక్రమాలను తీసుకువెళ్లేందుకు కమలనాధులు సిద్ధమవుతున్నారట.   మరోవైపు ఎన్నికల సిబ్బంది మాత్రం ఎలాంటి అక్రమాలు జరగడం లేదంటున్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారమే బ్యాలెటు ఓట్లు తీసుకుంటున్నామని, తామెవరిని ప్రభావితం చేయడం లేదని చెబుతున్నారు. వృద్ధులు, వికలాంగుల కుటుంబ సభ్యుల సమక్షంలోనే వారితోనే ఓట్లు వేయిస్తున్నామని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ నేతలు కూడా విపక్షాల ఆరోపణలకు కౌంటరిస్తున్నారు. కరోనా తర్వాత జరుగుతున్న ఎన్నికల కోసం ఈసీనే ఈ వెసులుబాటు కల్పించిందని, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ అమలు చేస్తున్నారని చెప్పారు. ఓటమిని ముందే గ్రహించిన విపక్షాలు.. అందుకు కారణాలు వెతుక్కుంటున్నాయని, అందులో భాగంగానే తమపై అర్ధం లేని ఆరోపణలు చేస్తున్నాయని కారు పార్టీ నేతలు మండిపడుతున్నారు.    మొత్తంగా ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన దుబ్బాక ఉప ఎన్నిక పొలిటికల్ హీట్ పెంచుతుండటంతో పోలింగ్ నాటికి ఇంకా ఎలాంటి పరిస్థితులు ఉంటాయోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. పోలింగ్ రోజున ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనవచ్చనే భయాందోళన కొన్ని వర్గాల నుంచి వ్యక్తమవుతోంది.

ఫ్రాన్స్ లో మొదలైన కరోనా సెకండ్ వేవ్.. గడప దాటాలంటే పర్మిషన్ కావాల్సిందే

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ సెకండ్ వేవ్ యూరప్ లో మొదలైంది. తాజాగా ఫ్రాన్స్ దేశంలో కూడా కరోనా వైరస్ సెకండ్ వేవ్ మొదలవడంతో ఫ్రాన్స్ మళ్లీ లాక్‌డౌన్ ప్రకటించింది. దేశంలో పరిస్థితి అదుపులో ఉంచేందుకు ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ నిన్న దేశవ్యాప్త లాక్‌డౌన్ ప్రకటించారు. ఈ ఆంక్షలు డిసెంబరు 1 వరకు అమల్లో ఉంటాయని ఆదేశాలు జరీ చేసారు. ఈ విషయం పై ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ సెకెండ్ వేవ్ మొదలైందని, ఇది మొదటి దశ కంటే మరింత ప్రమాదకరంగా ఉంటుందని, కాబట్టి అందరూ మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అంతేకాకుండా నేటి రాత్రి నుంచి అత్యవసరాలు మినహా మిగతా వ్యాపార సంస్థలన్నీ మూసివేయాలని, ప్రజలు ఇళ్ల నుండి బయటకు అడుగుపెట్టాలంటే సంబంధిత అధికారుల నుంచి తప్పనిసరిగా రాతపూర్వక అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలు మరింత జాగ్రత్త పడకుంటే 4 లక్షలకు పైగా మరణాలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. నవంబర్ నెల 15 నాటికి దాదాపు 9 వేల మందికి ఐసీయూలో చేర్పించి చికిత్స అందించాల్సిన పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని అయన పేర్కొన్నారు.   రాజధాని పారిస్ సహా మరి కొన్ని ప్రధాన పట్టణాల్లో రెండో దశ ప్రారంభం కాకుండా ఉండాలనే ఉద్దేశంతో రెండు వారాల క్రితమే కర్ఫ్యూ విధించినా సెకెండ్ వేవ్‌ను కట్టడి చేయలేకపోయామని మాక్రాన్ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఇప్పటికే 35 వేలకు పైగా మరణాలు కూడా నమోదైనట్టు చెప్పారు. అయితే వచ్చే రెండు వారాల్లో మహమ్మారి వ్యాప్తి నెమ్మదిస్తే సడలింపులు ఇస్తామని మాక్రాన్ స్పష్టం చేశారు.

రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తారు - కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు 

దుబ్బాక ఉప ఎన్నిక , విపక్షాల ఆరోపణలపై హాట్ కామెంట్స్ చేశారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిపై ఆయన మండిపడ్డారు. రేవంత్ రెడ్డి అసలు లీడరే కాదన్నారు కేటీఆర్. గతంలో టీడీపీలో ఉన్న రేవంత్ ఇప్పుడు  కాంగ్రెస్ లో ఉన్నారని... త్వరలోనే బీజేపీలోకి వెళ్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలు త్వరలోనే పార్టీ మారుతారని చెప్పారు కేటీఆర్. దుబ్బాకలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు డిపాజిట్లు కూడా రాకపోవచ్చని మంత్రి జోస్యం చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోంది కాబట్టే ప్రతి ఎన్నికలో టీఆర్ఎస్ గెలుస్తోందన్నారు కేటీఆర్.   సిద్ధిపేటలో రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలపైనా స్పందించారు కేటీఆర్. సిద్ధిపేటలో బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయని... లేనిది ఉన్నట్టు చెప్పడం బీజేపీ నేతల అలవాటని కేటీఆర్ విమర్శించారు. తాము ఎంతో సహనంతో వ్యవహరిస్తున్నామని... తమ ఓపిక నశిస్తే ప్రధాని మోడీని కూడా వదిలిపెట్టబోమని హెచ్చరించారు. మాట్లాడటం తమకు కూడా వచ్చని అన్నారు. బీజేపీ నేతలను అదుపులో పెట్టుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డికి సూచించారు కేటీఆర్.   మంత్రి హరీష్ రావు విసిరిన సవాల్ కు ఇంత వరకు బీజేపీ నేతలు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు కేటీఆర్. ఇప్పటి వరకు 27 వేల కోట్ల రూపాయల వరకు రైతు రుణమాఫీ చేశామని చెప్పారు. బీజేపీ నేతలు అసత్యాలు చెప్పడం మానుకంటే వారికే మంచిదన్నారు. దుబ్బాక ఉప ఎన్నికపై ఇంతవరకు మాట్లాడని కేటీఆర్.. పోలింగ్ కు ఐదు రోజుల ముందు హాట్ కాెమెంట్స్  చేయడం చర్చనీయాంశంగా మారింది. దుబ్బాకలో పోటీ తీవ్రంగా ఉండటం వల్లే కేటీఆర్ స్పందించారనే ప్రచారం జరుగుతోంది.  

బైడెన్ అవినీతిని దాస్తున్నారు.. మీడియాపై ట్రంప్ ఫైర్  

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు కొద్దీ రోజులు మాత్రమే గడువు ఉండడంతో ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ లో టెన్షన్ మరింత పెరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. ఎపుడు తన అనుచిత వ్యాఖ్యలతో వివాదాల్లో మునిగి తేలే ట్రంప్ తాజాగా అమెరికన్ మీడియాపై ఫైరయ్యారు. తన ప్రత్యర్థి, డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ అవినీతిని అమెరికన్ మీడియా తొక్కిపెడుతోందని అయన మండిపడ్డారు. కొన్ని మీడియా సంస్థలు, అలాగే బడా టెక్నాలజీ కంపెనీలు బైడెన్‌ నుంచి లబ్ది పొంది, ఆయనను రక్షించేందుకు ఆరాటపడుతున్నాయని ట్రంప్ ఆరోపించారు. బైడెన్ అవినీతి గురించి ప్రజలకు తెలియకుండా ఉద్దేశపూర్వకంగానే ఆ సంస్థలు అడ్డుకుంటున్నాయని అయన విమర్శించారు.   అమెరికాలో ఇటువంటి పక్షపాత వైఖరి ఇంతకుముందు ఎప్పుడూ లేదని, ఇప్పుడే మొదటి సారి చూస్తున్నామని అయన అన్నారు. అయితే చివరికి ఇది ఆ సంస్థలకే నష్టం చేస్తుందని ట్రంప్ హెచ్చరించారు. ఈ ఎన్నికలను ప్రస్తుత ప్రభుత్వ సూపర్ ఎకనమిక్ రికవరీకి, బైడెన్ డిప్రెషన్‌కు మధ్య జరుగుతున్న పోటీగా ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా ప్రజలకు ఈ రెండింటిలో ఏది కావాలో నిర్ణయించుకోవాలని కోరారు. ఇది ఇలా ఉండగా, మాస్కో మేయర్‌కు అత్యంత సన్నిహితుడైన డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్‌కు రష్యా నుంచి 3.5 మిలియన్ డాలర్లు అందినట్టు ట్రంప్ కొద్దికాలం క్రితం ఆరోపించారు.

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి కరోనా పాజిటివ్

ఇప్పటికే పలువురు కేంద్రమంత్రులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా కరోనా బారిన పడ్డారు. దీంతో ఆమె స్వీయ గృహ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని ఆమె బుధవారం సాయంత్రం ట్విటర్ ద్వారా తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని స్మృతి ఇరానీ సూచించారు.   మరోవైపు.. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 80 లక్షలకు చేరువైంది. కొత్తగా 43,893 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 79,90,322కి చేరింది. కరోనాతో మరో 508 మంది మరణించడంతో.. మొత్తం మరణాల సంఖ్య 1,20,010 కి చేరింది. ప్రస్తుతం 6,10,803 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

గొర్రెకుంట తొమ్మిది మంది హత్య కేసులో తుదితీర్పు

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గొర్రెకుంట తొమ్మిది మంది హత్య కేసులో తుదితీర్పు వెల్ల‌డైంది. ఈ కేసులో నిందితుడు సంజయ్ కుమార్ యాదవ్‌ (24) కు ఉరిశిక్ష విధిస్తూ వరంగల్ అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి జయ్‌కుమార్ తీర్పు ప్రకటించారు.   బీహార్‌కు చెందిన సంజ‌య్ కుమార్ ఒక హత్యను కప్పిపుచ్చుకునేందుకు తొమ్మిది మందిని దారుణంగా హత్య చేశాడు. ఈ ఏడాది మే 21న తొమ్మిది మందిని ఆహారంలో విషం కలిపి హ‌త్య‌చేసి వరంగల్ శివారులోని గొర్రెకుంట బావిలో పడేశాడు.   గొర్రెకుంటలోని గోనె సంచుల గోదాంలో మక్సూద్ కుటుంబం నివసించేది. ఆ పక్కనే ఇద్దరు బీహారీ యువకులు అద్దెకు ఉండేవారు. మక్సూద్ కుటుంబంతో సంజయ్‌ కి పరిచయం ఉంది. మక్సూద్ మరదలు రఫీకాతో సంజయ్ కొన్నాళ్లు సహజీవనం కూడా చేశాడు. అయితే ఆమె పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయడంతో.. తమవాళ్లకు పరిచయం చేస్తానని నమ్మించి తీసుకెళ్లి.. రైలు నుంచి తోసి హత్య చేశాడు.   అయితే, మక్సూద్ కుటుంబం రఫీకా గురించి ఆరా తీయడం, పోలీస్ కేసు పెడుతామని బెదిరించడంతో.. పోలీసులకు దొరికిపోతానన్న భయంతో ఆ కుటుంబం మొత్తాన్ని లేకుండా చేయాలనుకున్నాడు. ఇదే క్రమంలోమక్సూద్ ఇంట్లో జరిగిన అతని మనవడి బర్త్ డే పార్టీకి హాజరయ్యాడు. ఆ పార్టీకి ఇద్దరు బీహారీ యువకులు కూడా హాజరయ్యారు. పథకం ప్రకారం ఆహారంలో విషం కలిపి అందర్నీ హత్య చేశాడు.    నిజానికి తొలుత ఇద్దరు బిహారీ యువకులను వదిలేద్దామని భావించినట్టు సంజయ్‌ విచారణలో వెల్లడించాడు. కానీ హత్యల విషయం వారి ద్వారా బయటకు వస్తుందన్న భయంతో వారిని కూడా హత్య చేసినట్టు అంగీకరించాడు. అలా ఒక్క హత్యను కప్పి పుచ్చుకోవడానికి మరో తొమ్మిది మందిని సంజయ్ హత్య చేశాడు.

కొంపదీసి ఓట్లు కేసీఆర్ ఫామ్ హౌస్‌లో లెక్కిస్తారా.. విజయశాంతి

దుబ్బాక ఉపఎన్నిక నేపథ్యంలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. దుబ్బాక టీఆర్‌ఎస్ అభ్యర్థి తరుఫున అన్ని తానే అయి ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్న హరీష్ రావు ఈ ఉప ఎన్నికలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట్ కూడా రాదని సెన్సేషనల్ కామెంట్స్ చేసారు. తాజాగా మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు అనేక సందేహాలకు తావిస్తున్నాయని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి అనుమానం వ్యక్తం చేసారు. మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై తాజాగా ఆమె సోషల్ మీడియా వేదికగా కొన్ని అనుమానాలు వ్యక్తం చేసారు. ఫలితాలు ఎలా ఉండాలో ఎన్నికలకు ముందే టీఆర్‌ఎస్ పార్టీ నిర్ణయించే స్థాయికి వెళ్లి పోయిందంటే... అధికార పార్టీ అరాచకాలపై దుబ్బాక ఓటర్లకు ఒక స్పష్టత వచ్చి ఉంటుందని విజయశాంతి తెలిపారు. హరీష్ రావు వ్యాఖ్యలను పరిశీలిస్తే... దుబ్బాకలో పోలింగ్ జరిగిన తర్వాత ఈవీఎం మిషన్లను కేసీఆర్ ఫామ్ హౌస్‌లో పెట్టి, ఓట్లను లెక్కిస్తారేమోనని అనుమానం కలుగుతోందని ఆమె ఎద్దేవా చేశారు.   అసలు అధికార పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే మరణించడంతో జరిగే ఉప ఎన్నిక విషయంలో టీఆర్‌ఎస్ పార్టీ.. అలాగే హరీష్ రావు ఎందుకు ఇంత హైరానా పడుతున్నారో ఎవరికి అంతుబట్టడం లేదని ఫేస్‌బుక్‌ కామెంట్ లో ఆమె ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీలకు గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఉప ఎన్నికలో ఎక్కువ ఓట్లు వస్తే.. దాని ప్రభావం హరీష్ రావు మంత్రి పదవి మీద పడుతుందని సీఎం కేసీఆర్ ఏదన్నా అల్టిమేటం జారీ చేశారేమోనన్న చర్చ కూడా ప్రజలలో జరుగుతోందని విజయశాంతి సందేహం వ్యక్తం చేశారు. అందుకే తెలంగాణ ఆర్థికశాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు, కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు మెదక్ జిల్లాకు కేటాయించిన నిధుల కంటే.. దుబ్బాకలో ఓటర్లను కొనేందుకు ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తున్నట్టుగా ఉందని స్థానికులు చర్చించుకుంటున్నారని విజయశాంతి తెలిపారు.

ఎస్వీబీసీ ఛానెల్ ఛైర్మన్‌ గా మాజీ ఎమ్మెల్యే

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడిచే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్‌(ఎస్వీబీసీ)కు ప్రభుత్వం కొత్త ఛైర్మన్‌ ను నియమించింది. ఎస్వీబీసీ ఛైర్మన్‌ గా నెల్లూరు జిల్లా వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే సాయికృష్ణ యాచేంద్రను నియమిస్తూ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. రెండేళ్లపాటు పదవిలో ఆయన కొనసాగనున్నారు.   కాగా, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్వీబీసీ చైర్మన్‌ గా సినీనటుడు పృథ్వీరాజ్ ని నియమించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో ఆయన వ్యవహారంతో ఛానల్ ప్రతిష్ఠ బజారున పడే స్థితికి చేరుకుంది. మహిళా ఉద్యోగినితో ఆయన ఫోన్ కాల్ లీక్ కావడంతో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో ప్రభుత్వం ఆయనను ఆగమేఘాలు మీద సాగనంపింది.     ఆ తర్వాత ఎస్వీబీసీ కొత్త చైర్మన్ ఎంపిక పై ప్రభుత్వం దృష్టి సారించింది. చైర్మన్ రేసులో జర్నలిస్ట్ స్వప్న, శ్రీనివాసరెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపించాయి. ప్రస్తుతం ఎస్వీబీసీలో స్వప్న, శ్రీనివాసరెడ్డిలు డైరక్టర్లుగా పనిచేస్తున్నారు. జగన్ సీఎం అయ్యాక వీరికి ఎస్వీబీసీలో డైరెక్టర్లుగా స్థానం కల్పించారు.    అయితే, ఇప్పటికే తిరుమల పవిత్రతను జగన్ సర్కార్ దెబ్బతీస్తోందని ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నాయి. దీంతో తిరుమలకు సంబంధించిన పదవుల ఎంపికపై ఇక ఎలాంటి పొరపాట్లకు తావు ఇవ్వకూడదని జగన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందులోభాగంగానే ఎస్వీబీసీ ఛైర్మన్‌ గా సాయికృష్ణ యాచేంద్రను ఎంపిక చేశారని సమాచారం.

పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం.. ఆరుగురు విద్యార్థులు మృతి

పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వేలేరుపాడు మండలం వసంతవాడ వాగులో ఆరుగురు విద్యార్థులు గల్లంతు అయ్యారు. గజ ఈతగాళ్ల సాయంతో గల్లంతైన ఆరు మృతదేహాలను వెలికితీశారు. మృతులు భూదేవి పేటకు చెందినవారుగా గుర్తించారు. దేవీ నవరాత్రుల పురస్కరించుకుని కొన్ని కుటుంబాలు వాగు స‌మీపంలో వ‌న‌భోజ‌నాల‌కు వెళ్లారు. ఈ క్రమంలో అక్కడ వాగులో స్నానానికి వెళ్లి ఆరుగురు విద్యార్థులు మృతి చెందారు. మృతులు గొట్టుపర్తి మనోజ్ (15), కూనవరపు రాధాకృష్ణ (15), కర్నాటి రంజిత్ (16), శ్రీరాముల శివాజీ (17), గంగాధర వెంకట్ (15), కెల్లా ప‌వ‌న్ (17)గా గుర్తించారు. ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

నోట్ల కట్టల వ్యవహారం తేల్చేందుకు.. దుబ్బాక ఉప ఎన్నికకు సీఈసీ ప్రత్యేక పరిశీలకుడు 

దుబ్బాక ఉపఎన్నిక సందర్భంగా మొన్న ఆదివారం సిద్దిపేటలో రాష్ట్ర పోలీసులకు బీజేపీ నాయకులకు మధ్య నోట్ల కట్టల స్వాధీనంపై తీవ్ర దుమారం రేగిన సంగతి తెల్సిందే. ఇదే విషయమై బీజేపీ, టీఆర్ఎస్ ల మధ్య మాటల యుద్ధం తో అక్కడి పరిస్థితులు మరింత వేడెక్కాయి. దీనిపై స్థానిక పోలీసులు అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న‌ర‌ని బీజేపీ ఆరోపించింది. సిద్ధిపేట ఘ‌ట‌న త‌ర్వాత కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌త్యేక ప‌రిశీల‌కుడిని పంపాల‌ని, కేంద్ర బ‌లగాల ర‌క్ష‌ణ‌లో ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని బీజేపీ కోరింది. మరోవైపు దుబ్బాకలో బీజేపీ, టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాయని కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో దుబ్బాక ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక పరిశీలకుడిని నియమించింది. తాజాగా నోట్ల కట్టల కలకలంతో కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. తమిళనాడుకు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి సరోజ్ కుమార్‌ను కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకుడిగా నియమించింది. ఈ మొత్తం వ్యవహారం పై స్పెషల్ ఆఫీసర్ సమీక్ష చేయనున్నారు. ఐపీఎస్ అధికారి స‌రోజ్ కుమార్ కు పార‌ద‌ర్శ‌కంగా ఎన్నిక‌లు జ‌రిపినందుకు గ‌తంలో కేంద్ర ప్ర‌భుత్వం అవార్డు కూడా ల‌భించింది.

పోలింగ్ కు ముందు రైతు బంధు! దుబ్బాకలో హజూర్ నగర్ ప్లాన్

తమకు సవాల్ గా మారిన దుబ్బాక ఉప ఎన్నికలో గెలిచేందుకు అధికార టీఆర్ఎస్ పార్టీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే చివరి అస్త్రంగా రైతు బంధును ఉపయోగించుకోవాలని ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది. దుబ్బాక అసెంబ్లీ సెగ్మెంట్‌ రైతులకు ఈసారి అందరికన్నా ముందు రైతుబంధు డబ్బులు వేసేలా సర్కారు కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది.    నవంబర్‌ 3న పోలింగ్ జరగనుండగా.. అందుకు ఒకటి, రెండు రోజుల ముందు రైతుల అకౌంట్లలోకి నగదు పడేలా సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.ప్రగతి భవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే అమలు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారట. అంతేకాదు దుబ్బాక జనానికి ఆసరా పెన్షన్లూ ముందే ఇవ్వాలని సర్కారు ఆలోచిస్తున్నట్టు సమాచారం.    దుబ్బాక నియోజకవర్గంలో 1.82 లక్షల మంది ఓటర్లు ఉండగా వీళ్లలో 60 వేల మంది రైతులున్నారు. ఈ రైతుల్లో రెండు, మూడు ఎకరాల్లోపు వాళ్లే ఎక్కువున్నారు. వీళ్లందరికీ రైతుబంధు ఇవ్వడానికి సుమారు రూ. 300 కోట్లు అవసరమవుతుందని అధికారులు లెక్కలేసినట్టు తెలిసింది. రాష్ట్రమంతా డబ్బులేయాలంటే రూ. 7,220 కోట్లు కావాలని, ప్రస్తుతం సర్కారు దగ్గర డబ్బుల కొరత ఉందని అధికారుల్లో చర్చ నడుస్తోంది. కాబట్టి ముందు దుబ్బాకకు, విమర్శలు రాకుండా ఇంకొన్ని ప్రాంతాలకు నగదు బదిలీ చేయాలని సర్కారు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల టైమ్‌‌లోనూ అధికార పార్టీకి రైతుబంధు మేలు చేసిందని ప్రచారం ఉంది. కొన్నిచోట్ల ఓటర్లు క్యూలో ఉన్నప్పుడే వాళ్ల అకౌంట్ లోకి డబ్బులు పడ్డాయని టాక్ ఉంది.    ఈ మధ్య కురిసిన వానలకు వరి, పత్తి, పెసర, కంది పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మక్కలను కొనేందుకు సర్కారు ముందుకు రాలేదు. మార్కెట్ లో ధర లేదని, కొనలేమని చేతులెత్తేసింది. రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో దిగొచ్చింది. ఈ విషయంలో దుబ్బాక రైతులూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని టీఆర్ఎస్ లీడర్లు ఆందోళన చెందుతున్నారు. వాళ్ల కోపం చల్లార్చేందుకు రైతుబంధు సాయం చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు పార్టీ లీడర్లు చెబుతున్నారు. పోలింగ్ కు ముందు పథకం సొమ్ము అందిస్తే రైతులు టీఆర్‌‌ఎస్‌‌కు అనుకూలంగా ఓటేస్తారని లీడర్లు అనుకుంటున్నారు.   గతేడాది అక్టోబర్‌‌లో హుజూర్‌‌నగర్ ఉప ఎన్నిక జరిగింది. పోలింగ్‌‌కు ముందు హుజూర్ నగర్ రైతులతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులకు రైతుబంధు సాయం అందించారు. వానకాలం సీజన్ బకాయిలను నిధుల కొరత కారణంగా వాయిదా వేసి ఎన్నికల ప్రచారం మొదలైన వెంటనే విడుదల చేశారు. ఓ వైపు ప్రచారం జరుగుతోంటే మరోవైపు రైతుల అకౌంట్లలో డబ్బులు పడ్డాయి. రైతుల ఓటింగ్ శాతం పెరిగి టీఆర్ఎస్ క్యాండిడేట్‌‌ గెలిచారని ఇప్పటికి టీఆర్ఎస్ లీడర్లు చెబుతుంటారు.   రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నెల 10వ తేదీ నాటికి ఆసరా పెన్షన్లను లబ్ధిదారులకు అందిస్తారు. దుబ్బాక సెగ్మెంట్‌లో ఆసరా లబ్ధిదారులు దాదాపు 20 వేల మంది ఉన్నారు.  బై ఎలక్షన్‌ దృష్ట్యా దుబ్బాకలో ఈ పెన్షన్లను ముందే అందించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. వీరందరికీ పోలింగ్‌కు ముందు పెన్షన్లు  అందించే చాన్స్ ఉందా అని రూరల్ డెవలప్ మెంట్ అధికారులను ప్రగతిభవన్ వర్గాలు ఆరా తీసినట్టు తెలిసింది.

కరోనా వాక్సిన్ పై బ్రిటన్ ప్రత్యేక అధికారి సెన్సేషనల్ కామెంట్స్ 

ప్రపంచం మొత్తాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని నిరోధించేందుకు వాక్సిన్ల కోసం తీవ్ర ప్రయత్నాలు జరుగుతన్న సంగతి తెలిసిందే. వీటిలో కొన్ని వాక్సిన్లు ఫైనల్ ట్రయల్స్ లో ఉన్నాయి. అయితే మరో పక్క కొంత మంది శాస్త్రవేత్తలు మాత్రం తొలి తరం వాక్సిన్ల విషయంలో అతి విశ్వాసం పనికిరాదని, ప్రజలు మాస్కులు, సామాజిక దూరం వంటి నియమాలు కచ్చితంగా పాటించాలని చెబుతూ వస్తున్నారు. తాజాగా ఈ అంశంపై బ్రిటన్ ప్రభుత్వ ఉన్నాతాధికారి ఒకరు సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. త్వరలో రాబోయే మొదటి తరం టీకాలు పూర్తిస్థాయిలో పనిచేయకపోవచ్చని బ్రిటన్ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక కరోనా వాక్సిన్ టాస్క్ ఫోర్స్‌ చీఫ్ కేట్ బింగమ్ బాంబు పేల్చారు. ఈ వాక్సిన్లు పూర్తి సామర్థ్యంతో పనిచేయకపోవచ్చని, కరోనా నుండి ప్రతి ఒక్కరినీ ఇవి రక్షించలేకపోవచ్చని ఆమె తెలిపారు. కరోనా వాక్సిన్ కోసం ప్రపంచమంతా వేయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న ప్రస్తుత సమయంలో బ్రిటన్ ప్రభుత్వ ఉన్నతాధికారి చేసిన ఈ కామెంట్స్ కు చాలా ప్రాధాన్యం ఏర్పడింది.   "అసలు మనకు ఎప్పటికైనా కరోనా వాక్సిన్ అందుబాటులోకి వస్తుందా రాదా అనే దానిపై చాలా సందేహాలున్నాయి. అందుకే.. మనం అంతాబాగానే ఉంటుందిలే అనే అలోచన ధోరణితో కాకుండా జాగ్రత్త పడాలి. అతివిశ్వాసానికి దూరంగా ఉండాలి" అంటూ కేట్ బింగమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. "తొలి తరం వ్యాక్సిన్లు కరోనా నుంచి పూర్తి రక్షణను ఇవ్వలేకపోవచ్చు. అసలు కరోనా సోకకుండా ఆపలేకపోవచ్చు. ఇవి కేవలం వ్యాధి తీవ్రతను మాత్రమే తగ్గించవచ్చు. ఇది కూడా ప్రతి ఒక్కరి విషయంలో నిజం కాకపోవచ్చు. అయితే మనం ఆశిస్తున్న సుదీర్ఘ రక్షణను మాత్రం ఇవ్వలేకపోవచ్చు. ఇటువంటి పరిస్థితి తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో మనం సిద్ధంగా ఉండాలి" అని ఆమె తెలిపారు.   అంతేకాకుండా.. మొదటి తరం వాక్సిన్లలో చాలావరకు విఫలం కూడా కావచ్చని, ఒకవేళ అన్నీ విఫలమైనా ఆశ్చర్య పోవద్దని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే 65 ఏళ్లు పైబడిన వారికి రక్షణ కల్పించే వాక్సిన్లకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని ఆమె అన్నారు. ఇదే సమయంలో ప్రపంచానికి కోట్ల సంఖ్యలో కరోనా డోసుల అవసరం ఉందని, కానీ..ప్రస్తుతమున్న వాక్సిన్ తయారీ సామర్థ్యం ప్రపంచ జనాభాకు అసలేమాత్రం సరిపోదని ఆమె తేల్చి చెప్పారు. బ్రిటన్ తో స‌హా ప్ర‌పంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని అన్నారు.   ఇది ఇలా ఉండగా.. ఇంపీరియల్ కాలేజ్ లండన్ సైన్టిస్టులు నిన్న ఒక కీలక అధ్యయానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. కరోనా నుండి కోలుకున్న వారిపై జరిగిన పరిశోధనలో.. కరోనా నుంచి రక్షించే యాంటీబాడీల సంఖ్య బ్రిటన్ ప్రజల్లో క్రమంగా తగ్గుతోందని, వారిలో ఈ నిరోధక శక్తి తక్కువ కాలం పాటు మాత్రమే ఉండే అవకాశం ఉందని ఈ అధ్యయనంలో వెల్లడైంది. దీంతో సమాజంలో కరోనా రోగనిరోధశక్తి వేగంగా తగ్గిపోవచ్చనే ఆందోళన అక్కడి ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమవుతోంది. మరోపక్క రెండో సారి కరోనా దాడిచేయచ్చనే అంచనాతో బ్రిటన్ ప్రభుత్వం సిద్ధం అవుతోందని వార్తలు వస్తున్నాయి.