బీహార్ లో ఎన్డీయేకు అత్తెసరు మెజారిటీ.. ఇక దినదిన గండమేనా..
posted on Nov 11, 2020 8:58AM
దేశం మొత్తం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల పూర్తి ఫలితాలు ఈ రోజు తెల్లవారుఝామున 3 గంటలకు వచ్చిన తుది ఫలితంతో స్పష్టమయ్యాయి. ఈ ఎన్నికలలో ఎన్డీయే అత్తెసరు మెజారిటీతో అధికారాన్ని నిలుపుకుంది. నితీశ్ కుమార్ నేతృత్వంలోని కూటమి 125 స్థానాలను సాధించింది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రంలో మేజిక్ ఫిగర్ 122 కాగా, దానికంటే కేవలం మూడు సీట్లను మాత్రమే ఎక్కువగా సంపాదించడం ద్వారా ఎన్డీయే అధికారాన్ని నిలుపుకుంది. అయితే ఒక పక్క బొటాబొటి మెజారిటీ ఉండడమే కాకుండా మరోపక్క ప్రతిపక్షం చాలా బలంగా ఉండటంతో బీహార్ లో ఏర్పడే కొత్త ప్రభుత్వానికి ప్రతి రోజు గండాలు ఎదుర్కోవాల్సి రావచ్చని రాజకీయ విశ్లేషకుల అంచనా.
ఇది ఇలా ఉండగా కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి మహా ఘటబంధన్ 110 సీట్లకు పరిమితం కాగా, కేంద్రంలో ఎన్డీయేలో ఉండి కూడా రాష్ట్రంలో మాత్రం ఆ కూటమిలో చేరకుండా.. విడిగా పోటీ చేసిన చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీ 1 స్థానానికే పరిమితం కాగా, ఇతరులు 7 స్థానాల్లో గెలుపొందారు. పలు చోట్ల ఈవీఎంలు తెరచుకోకపోవడంతో.. కౌంటింగ్ ప్రక్రియ దాదాపు 15 గంటల పాటు కొనసాగింది.
హోరాహోరీగా సాగిన బీహార్ తాజా ఎన్నికలలో.. గెలిచిన, ఓడిపోయిన రెండు కూటముల మధ్య ఓట్ల తేడా కనీసం ఒక శాతం కూడా లేదు. ఇక ఎన్డీయే కూటమిలోని బీజేపీకి 74, జేడీయూకు 43, మాజీ సీఎం జతిన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని హిందుస్థానీ అవామ్ మోర్చాకు 4, వికాస్ షీల్ ఇన్సాన్ పార్టీకి 4 స్థానాలు గెలుచుకోగా.. ఈ మొత్తం కలిపి 125 సీట్లు అయ్యాయి. అయితే ఈ రెండు చిన్న పార్టీల్లోని ఏ పార్టీ దూరమైనా, బీహార్ లోని ఎన్డీయే సర్కారుకు గండమే. ఇక ఇప్పటికే హామీ ఇచ్చినట్టుగా బీజేపీ.. ప్రస్తుత సీఎం నితీశ్ కే సీఎం అవకాశాన్ని ఇస్తుందా.. లేక తమది పెద్ద పార్టీ కాబట్టి, మరో నేతను తెరపైకి తెస్తుందా? అనే విషయం రెండు మూడు రోజుల్లో తేలిపోతుంది.