ట్రబుల్ షూటర్ కు ట్రబులు మొదలయిందా! హరీష్ రావు ఫ్యూచరేంటీ?
posted on Nov 10, 2020 @ 4:29PM
తెలంగాణలో గతంలో ఎప్పుడూ లేనంత పొలిటికల్ హీట్ పుట్టించిన దుబ్బాక ఉప ఎన్నికలో అనూహ్యం జరిగింది. అధికార టీఆర్ఎస్ కు, కేసీఆర్ కు దిమ్మతిరిగే షాకిస్తూ దుబ్బాకలో బీజేపీ సంచలన విజయం సాధించింది. దుబ్బాకలో రఘునందన్ రావు గెలుపుతో ఇప్పుడు అందరి కళ్లు మంత్రి హరీష్ రావుపైనే పడ్డాయి. ట్రుబుల్ షూటర్ కు ట్రబుల్స్ వచ్చాయని చెబుతున్నారు. దుబ్బాక ఎన్నికలో అధికార పార్టీ తరపున అంతా తానే వ్యవహరించిన హరీష్ రావు ఇప్పుడు ఏం చేయబోతున్నారన్న చర్చ జరుగుతోంది. ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ హరీష్ రావు మంత్రి పదవికి రాజీనామా చేయవచ్చనే ప్రచారం జరుగుతోంది. దుబ్బాక ఓటమి వంకతో టీఆర్ఎస్ హైకమాండే ఆయనను కేబినెట్ నుంచి తప్పించవచ్చన్న వాదన కూడా కొన్నివర్గాల నుంచి వినిపిస్తోంది.
దుబ్బాక ఉప ఎన్నికలో పూర్తి బాధ్యత హరీష్ రావే తీసుకున్నారు. అయితే తీసుకోలేదని పార్టీ పెద్దలే అలా డిసైడ్ చేశారనే వాదన కూడా ఉంది. హోరాహోరీ పోరు జరుగుతున్నా టీఆర్ఎస్ నేతలెవరు దుబ్బాకను పట్టించుకోలేదు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ కూడా ప్రచారం చేయలేదు. దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారానికి కేటీఆర్ వెళ్లకపోవడం.. కవిత, ఎంపీ సంతోష్ రాకపోవడంపై రాష్ట్ర ప్రజల్లోనూ చర్చ జరిగింది. దుబ్బాకలో బీజేపీ గెలుపు కోసం ఆ పార్టీ నేతలంతా కలిది వచ్చారు. గల్లీగల్లీ తిరిగి ప్రచారాన్ని హోరెత్తించారు. కాంగ్రెస్ కూడా తమ నేతలందరిని దుబ్బాకలోనే మోహరించింది. విపక్షాల నేతలంతా దుబ్బాకలోనే ఉన్నా టీఆర్ఎస్ మాత్రం హరీష్ రావుపైనే భారం వేసింది. అయినా ఒంటరి పోరాటం చేశారు హరీష్ రావు. పార్టీ గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారు. అయినా ఫలితం దక్కలేదు.
ఉప ఎన్నిక సందర్భంగా జరిగిన పరిణామాలతో దుబ్బాక కేంద్రంగా మంత్రి హరీష్ రావుపై కుట్రలు జరిగాయని, ఆయన మెడపై కత్తి పెట్టారనే ఆరోపణలు వచ్చాయి. సొంత పార్టీనే హరీష్ ను టార్గెట్ చేసిందనే ప్రచారం జరిగింది. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని ముందే గ్రహించిన పార్టీ పెద్దలు కావాలనే హరీష్ రావు ఒక్కడికే ఉప ఎన్నిక బాధ్యత అప్పగించితప్పించుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. దుబ్బాకలో వ్యతిరేక ఫలితం వస్తే.. ఆ నెపమంతా హరీష్ రావుకు అంటగట్టే కుట్ర చేశారని హరీష్ రావు అనుచరులు చెబుతున్నారు. హరీష్ రావును ఇరికించే ప్రయత్నం దుబ్బాక ఉప ఎన్నిక సాక్షిగా జరుగుతుందని వారంతా బలంగా వాదిస్తున్నారు. టీఆర్ఎస్ లో మొదటి నుంచి హరీష్ రావుకు ట్రబుల్ షూటర్ గా పేరుంది. ఆయనకు బాధ్యతలు అప్పగించిన ప్రతి ఎన్నికల్లోనూ సక్సెస్ చేసి చూపించారని చెబుతారు. అలాంటి ట్రబుల్ షూటర్ కు ట్రబుల్స్ కలిగేలా టీఆర్ఎస్ లోని ఓ వర్గం ప్లాన్ చేసిందనే ప్రచారం జరిగింది.
పాలనలో మాార్పులు ఉంటాయని, కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళతారని కొంత కాలంగా ప్రచారం ఉంది. కేటీఆర్ కు రాష్ట్ర పాలనా పగ్గాలు అప్పగిస్తారని, కవితను కేబినెట్ లోకి తీసుకుంటారనే చర్చ కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో హరీష్ రావు కు చెక్ పెట్టి ఆ ప్లేస్ ను కవితతో భర్తీ చేస్తారనే వాదనలు వినిపించాయి. ఈ చర్చలు, ప్రచారాలకు అనుగుణంగానే దుబ్బాకలో పరిణామాలు చోటు చేసుకున్నాయని చెబుతున్నారు. దుబ్బాక ఫలితంతో ఇప్పుడు టీఆర్ఎస్ లో చాలా మార్పులు జరిగే అవకాశం ఉందంటున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక వ్యవహారంలో పార్టీ తీరుపై హరీష్ రావు కూడా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలింగ్ తర్వాత ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు కూడా అదే సంకేతమిచ్చాయి. పార్టీ నేతలు కొందరు నేతలు కీలక టైంలో హ్యాండిచ్చారని కూడా మంత్రి భావిస్తున్నారట. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో దుబ్బాక ఓటమిపై నైతిక బాధ్యత వహిస్తూ హరీష్ రావు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు.
హరీష్ రావు రాజీనామా చేయకపోయినా దుబ్బాక ఫలితం సాకుతో ఆయన్ను టీఆర్ఎస్ హైకమాండ్ దూరం పెట్టవచ్చని కూడా ప్రచారం జరుగుతోంది. నిజానికి చాలా కాలంగా ప్రభుత్వంతో పాటు పార్టీలో హరీష్ రావు ప్రాధాన్యత తగ్గింది. కీలక సమావేశాలకు కూడా ఆయనకు పిలుపు రావడం లేదు. ఇటీవల రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం కేసీఆర్ నిర్వహించిన సమావేశానికి ఆర్థికమంత్రి హాజరుకాకపోవడం చర్చనీయాంశమైంది. కావాలనే హరీష్ రావును కేసీఆర్ దూరం పెడుతున్నారని అంటున్నారు. దుబ్బాక ఫలితాన్ని సాకుగా చూపుతూ హరీష్ రావు రాజీనామాను సీఎం కేసీఆర్ కోరినా అశ్చర్యం లేదంటున్నారు. హరీష్ రావు ప్లేస్ లో కొన్నాళ్ల తర్వాత కవితను కేబినెట్ లోకి తీసుకోవచ్చని కూడా ప్రచారం జరుగుతోంది.
దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం టీఆర్ఎస్ పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు సాక్ష్యంగా నిలవగా.. ట్రబుల్ షూటర్ హరీష్ రావుకు పరీక్ష పెట్టిందనే అభిప్రాయం రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది. అయితే ఈ పరీక్షలో హరీష్ రావు చివరివరకుపోరాడి ఓడినా,,, ఆయన భవిష్యత్ పై మాత్రం ప్రభావం చూపుతుందంటున్నారు.