కేసీఆర్ నోట మళ్లీ సినిమా సిటీ మాట! నమ్మేవారున్నారా?
posted on Nov 10, 2020 @ 11:48AM
మాటలతో గారడీ చేసే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఇటీవలే ఓ ప్రకటన చేశారు. అయితే కొత్తదేమి కాదు. గతంలో చెప్పిన మాటనే మళ్లీ చెప్పారు. త్వరలో జరగనున్న గ్రేటర్ ఎన్నికల్లో ప్రయోజనం కోసమే మరో కారణమో తెలియదు కాని.. హైదరాబాద్ శివారులో 15 వందల నుంచి 2 వేల ఎకరాల్లో సినిమా సిటి నిర్మిస్తామని మళ్లీ ఫ్రెష్ గా ప్రకటించారు కేసీఆర్. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటనపై టాలీవుడ్ నుంచి అసలు స్పందనే రాలేదు. ఒక్కరంటే ఒక్కరు కూడా కేసీఆర్ ను అభినందిస్తూ ప్రకటన చేయడం గాని.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కాని చేయలేదు. దీన్నిబట్టే తెలుస్తోంది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనను ఫిల్మ్ వర్గాలు ఎంత లైట్ తీసుకున్నాయో. టాలీవుడ్ అలా స్పందించటానికి బలమైన కారణాలు కూడా కనిపిస్తున్నాయి.
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే 2014 జూలై 31న సచివాలయంలో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. నగర శివారు ప్రాంతంలోని రెండు వేల ఎకరాల్లో ఫిలిం సిటీని నిర్మిస్తామని ప్రకటించారు. ఇందుకోసం ఐదారు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని చెప్పారు. అన్ని హంగులూ ఇక్కడే కల్పిస్తామని హామీ ఇచ్చారు. నటుడు కృష్ణను ఫిలిం సిటీ నిర్మాణానికి సంబంధించిన బోర్డులో సభ్యుడిగా నియమిస్తామని కూడా చెప్పారు. ఆ తర్వాత జరిగిన మరో కార్యక్రమంలో అల్లూరి సీతారామరాజు సినిమా ప్రస్తావన తెచ్చిన కేసీఆర్ బాలీవుడ్ తరహాలో ఏ స్థాయిలోనైనా సినిమా షూటింగులు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు, డబ్బింగ్ తదితర అన్ని రకాల అవసరాలకు ధీటుగా ఫిలిం సిటీ ఉంటుందని ప్రకటించారు. దీనిని అవసరమైతే నాలుగైదు వేల ఎకరాలకు విస్తరిస్తామని చెప్పారు. సినిమాలకు మాత్రమే కాక టీవీ షూటింగులకు కూడా ఉపయోగపడుతుందన్నారు. స్థల ఎంపిక కోసం సీఎం కేసీఆర్ స్వయంగా ఏరియల్ సర్వే కూడా నిర్వహించారు.
కేసీఆర్ ఫిలిం సిటీ ప్రకటన చేయడం, స్థల ఎంపిక కోసం ఏరియల్ సర్వే కూడా చేయడంతో టాలీీవుడ్ సంతోషంలో మునిగిపోయింది. కేసీఆర్ ప్రకటనపై సినీ వర్గాల నుంచి భారీ స్పందన వచ్చింది. హీరోలు, దర్శకులు, నిర్మాతలు.. ఇలా అందరూ కేసీఆర్ ప్రశంసలతో ముంచెత్తారు. హీరో కృష్ణ అయితే ఒక అడుగు ముందుకేసి ఫిలిం సిటీకి కేసీఆర్ పేరే పెడతామని కూడా ప్రకటించారు. అయితే ఆరున్నర ఏండ్లు గడిచిపోయినా సీఎం కేసీఆర్ ఫిల్మ్ సిటి ప్రకటన హామీగానే మిగిలిపోయింది. తానిచ్చిన హామీపై ఈ ఆరెండ్లలో మరోసారి సమీక్ష కూడా చేయలేదు కేసీఆర్. గతంలోనూ సిని ప్రముఖులు చాలా సార్లు ఆయన్ను కలిసినా తన హామీపై మాత్రం మాట్లాడలేదు ముఖ్యమంత్రి. సడెన్ గా ఇటీవలే ఆయన మళ్లీ సినిమా సిటి ప్రస్తావన తెచ్చారు. వరద విపత్తు సాయంగా తాము ప్రకటించిన విరాళాలు అందించేందుకు చిరంజీవి, నాగార్జున ప్రగతి భవన్ వెళ్లడంతో మళ్లీ కేసీఆర్ కు ఆ హామీ గుర్తు వచ్చినట్లుంది. అందుకే వెంటనే అక్కడే ఉన్న ఒకరిద్దరు అధికారులను కూర్చుబెట్టుకుని సమీక్ష చేశారు. మళ్లీ ఎప్పటిలాగానే ఆరున్నర ఏండ్ల క్రితం చేసిన ప్రకటనే మళ్లీ చేశారు.
తెలంగాణ ఏర్పడినాక సినీ పరిశ్రమ విశాఖపట్నం లేదా నెల్లూరు జిల్లాకు తరలిపోతుందన్న ప్రచారం జరగడంతో సీఎం కేసీఆర్ ఫిలిం సిటీ నిర్మాణం గురించి ప్రస్తావించారు. సినీ పరిశ్రమ తెలంగాణ నుంచి తరలిపోకుండా చూస్తామని చెప్పారు. హైదరాబాద్ లేదా రంగారెడ్డి జిల్లాల్లో ఒకే చోట రెండు వేల ఎకరాల స్థలం దొరకడం కష్టమని భావించిన అప్పటి ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారులు.. రాచకొండలో సుమారు 30 వేల ఎకరాల స్థలం ఉందని గుర్తించారు. ఇదే అనువైన ప్రదేశమని ప్రభుత్వానికి, సినీ ప్రముఖులకు సూచించారు. అయితే అందులో ఎలాంటి పురోగతి లేకపోవడంతో అది అలాగే మిగిలిపోయింది. అందుకే అయితే గతంలో సినిమా సిటి ప్రకటన చేసినప్పుడు పోటీ పడి మరీ కేసీఆర్ పై ప్రశంసలు కురిపించిన టాలీవుడ్ పెద్దలు.. ఈసారి మాత్రం సైలెంట్ గా ఉండిపోయారు.
నిజానికి హైదరాబాద్ కు కూతవేటు దూరంలోనే ఉన్న రాచకొండలో వేలాది ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది. సినిమా షూటింగులకు అది అనువైన ప్రాంతంగా కూడా ఉంది. కేసీఆర్ సర్కార్ కు నిజంగా చిత్తశుద్ది ఉంటే.. అక్కడ ఫిలింసిటి నిర్మించవచ్చు. కాని మాటలతోనే ఆయన కాలం వెల్లబుచ్చారు. అందుకే ఇప్పుడాయన 2 వేల ఎకరాల్లో సినిమా సిటి కడతామని చెప్పినా సినిమా ఇండస్ట్రీలో స్పందించేవారు కరువయ్యారనే అభిప్రాయం వస్తోంది.