బీహార్ లో ఆర్జేడీ కూటమి కొంప ముంచిన బీజేపీ సీక్రెట్ పార్ట్నర్ ఎంఐఎం..!
posted on Nov 10, 2020 @ 6:45PM
హైదరాబాద్ తో పాటు తెలంగాణ లో తన ఉనికి చాటుకుంటున్నఅసదుద్దీన్ ఒవైసీకి చెందిన ఎంఐఎం పార్టీ మెల్లమెల్లగా పక్క రాష్ట్రాలతో పాటు.. ఉత్తరాది రాష్ట్రాలలో కూడా పోటీ చేస్తూ తన ఉనికిని చాటుకుంటోంది. అయితే కేంద్రంలో మోడీ నాయకత్వం లోని బీజేపీ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తరువాత ఎంఐఎం పార్టీ దూకుడు మరింత పెరిగింది. దీని పై రాజకీయ విశ్లేషకుల అంచనా ఏంటంటే.. తెలంగాణ వరకు ఎంఐఎం పార్టీ, టీఆరెఎస్ కు మిత్ర పక్షం అన్న సంగతి తెల్సిందే. ఇక బీజేపీ, ఎంఐఎం వ్యవహారం చూస్తే.. ఒవైసీని, అయన పార్టీని హైదరాబాద్, తెలంగాణ బీజేపీ నేతలు తీవ్రంగా విమర్శిస్తుంటారు. అదే సమయంలో ఒవైసి కూడా తెలంగాణ బీజేపీ నేతలతో పాటు సాక్షత్తు పీఎం మోడీపై కూడా మాటల దాడి చేస్తారు. అయితే బీజేపీకి అవసరమైన ఇతర రాష్ట్రాలలో మాత్రం మైనారిటీ ఓట్లు చీల్చి అక్కడ ప్రతిపక్షాన్ని దెబ్బ తీస్తూ.. ఒక పక్క తన సీక్రెట్ పార్ట్నర్ బీజేపీకి పరోక్షంగా సాయ పడుతూ.. మరో పక్క తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తోంది.
తాజాగా బీహార్‌లో విజయం పక్కా అనుకున్న ఆర్జేడీ కూటమికి ఫలితాల్లో పెద్ద షాక్ తగిలింది. దాదాపుగా ఆ కూటమి విజయానికి దూరంగానే ఆగిపోవాల్సి వచ్చింది. ఇదే సమయంలో బీజేపీ జెడియు కూటమికి కూడా తిరుగులేని మెజార్టీ రాలేదు. అయితే బొటా బోటి మెజారిటీ లేదంటే ఒకటి, రెండు సీట్లు తక్కువ పడవచ్చు. అయితే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం విక్టరీ ఖాయమనుకున్న ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమికి విజయాన్ని దూరం చేసిన ఘనత అసదుద్దీన్ ఓవైసీ ఆధ్వర్యంలోని ఎంఐఎం పార్టీ కి దక్కుతుంది. దాదాపుగా బీజేపీ కూటమి మరోసారి బీజేపీ అధికారంలోకి రావడానికి పరోక్ష కారణంగా అసదుద్దీన్ ఒవైసి నిలిచారు. ముస్లిం జనాభా ఎక్కువ ఉన్న ప్రతి చోటా తన పార్టీ అభ్యర్థులను నిలబెట్టి.. ముస్లింల ఓట్లను భారీగా చీల్చి.. భారతీయ జనతా పార్టీకి మేలు చేస్తున్నారు. దీంతో అక్కడ కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారు. కేవలం ఐదు ఎమ్మెల్యే సీట్లలో లీడ్ లో ఉన్న ఎంఐఎం.. కనీసం మరో ఇరవై చోట్ల కాంగ్రెస్ కూటమి అభ్యర్థుల పరాజయానికి కారణంగా నిలిచింది.