అక్కడ ట్రంప్.. ఇక్కడ కేసీఆర్! దుబ్బాకపై సోషల్ మీడియా ట్రోల్స్
posted on Nov 10, 2020 @ 11:58AM
హోరాహోరీగా సాగిన దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం తెలంగాణలో తీవ్ర ఉత్కంఠగా మారింది. ఉదయం నుంచే ఫలితాలు తెలుసుకునేందుకు టీవీలకు అతుక్కుపోయారు జనాలు. ఇక సోషల్ మీడియాలో దుబ్బాక బైపోల్ ట్రెండింగ్ లో ఉంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియను సోషల్ మీడియా ప్రతి నిమిషం అప్‌డేట్ చేస్తోంది. వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్లలో దుబ్బాక కౌంటింగ్ వివరాలు ట్రోల్ అవుతున్నాయి. దుబ్బాక ఫలితాలను వాట్సాప్ స్టేటస్‌లలో వేలాది మంది పెట్టుకుంటున్నారు.గ్రూపు ఏదైనా, ఫేస్‌బుక్ తెరిచినా దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంపై చర్చే సాగుతోంది.
దుబ్బాకలో అధికార టీఆర్ఎస్ వెనుకంజలో ఉండటంపై సోషల్ మీడియాలో భారీగా పోస్టులు పెడుతున్నారు. అధికార పార్టీపై ఉన్న అక్కసును కొందరు సోషల్ మీడియా ద్వారా వెళ్లగక్కుతున్నారు. ఉద్యోగాల కల్పన, నిరుద్యోగ భృతి, సంక్షేమ పథకాల వెనకంజ, కుటుంబ పాలనకు చరమగీతం అంటూ ఫలితాలపై కొందరు విశ్లేసిస్తున్నారు. గులాబీకి అండగా ఉండే మీడియాను కూడా నెటిజన్లు ఆడుకుంటున్నారు. ఫలితాల సరళితో పింక్ మీడియా ముఖం చాటేస్తుందంటూ కొందరు ట్రోల్ చేస్తున్నారు. వచ్చే గ్రేటర్‌లో బీజేపీకే ఎక్కువ సీట్లు వస్తాయంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలను అమెరికా ఎన్నికలతో ముడి పెడుతూ కొందరు పోస్టులు పెడుతున్నారు. వైట్‌హౌస్ నుంచి ట్రంప్‌ను ఈడ్చి వేసే వీడియోలను ఇప్పుడు రాష్ట్రానికి క్రియేట్ చేస్తూ వీడియోలను అప్‌లోడ్ చేస్తున్నారు. అధికారంపై విర్రవీగిన ట్రంప్ ఎలాగైతే బోల్తా పడ్డారో… రాష్ట్రంలో కూడా అదే జరుగుతుందంటూ జోస్యం చెప్పుతూ వీడియోలను పెడుతున్నారు. ఇలాంటి వీడియోలు నెట్టింటా హల్‌చల్ చేస్తున్నాయి. దుబ్బాక ఫలితంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాంతో కేసీఆర్ సర్కార్ పై ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఉందా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.