మండలి ఎన్నికలపై దుబ్బాక ఎఫెక్ట్! కారుకు కష్టమేనా?
posted on Nov 10, 2020 @ 4:38PM
దుబ్బాక ఉప ఎన్నికలో అధికార పార్టీకి షాక్ తగిలింది. బీజేపీ సంచలన విజయం సాధించింది. దుబ్బాకలో కాంగ్రెస్ మూడో ప్లేస్ కు పడిపోయింది. దుబ్బాక బైపోల్ ఫలితంతో తెలంగాణ పొలిటికల్ ఈక్వేషన్స్ మారిపోయే అవకాశం ఉంది. త్వరలో జరగనున్న రెండు పట్టభద్రుల శాసనమండలి స్థానాల ఎన్నికలపైనా దుబ్బాక ప్రభావం ఉంటుందంటున్నారు. రెండు ఎమ్మెల్సీ స్థానాల కోసం గతంలో ఉన్న ఆరు ఉమ్మడి జిల్లాలు పట్టభద్రులు ఓటేయనున్నారు. దుబ్బాక ఫలితమే శాసనమండలి ఎన్నికల్లో పునరావృతం అవుతుందని బీజేపీ ధీమాగా చెబుతోంది. దుబ్బాకలో ఓడిపోయినా మండలి ఎన్నికల్లో సత్తా చాటుతామని కాంగ్రెస్ కవరింగ్ ఇస్తోంది. అధికార టీఆర్ఎస్ లో మాత్రం ఎమ్మెల్యీ ఎన్నికలపై ఆందోళన కనిపిస్తోంది.
దుబ్బాక ఉప ఎన్నికతో పోలిస్తే పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలే అధికార టీఆర్ఎస్ కు గండం. ఎందుకంటే దుబ్బాక సీఎం కేసీఆర్ సొంత జిల్లాలో ఉంది. అక్కడి ప్రజలతో ఆయనకు అనుబంధం ఉంది. అందులోనూ అది రూరల్ ప్రాంతం. రైతు బంధు తీసుకునే రైతులు దుబ్బాక నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్నారు. అదే శాసనమండలి ఎన్నికలకు వస్తే పట్టభద్రులు, ఉద్యోగులు మాత్రమే ఓటర్లుగా ఉంటారు. ఇదే ఇప్పుడు కారు పార్టీని కలవరపెడుతోంది. యువతలో కేసీఆర్ సర్కార్ పై బాగా వ్యతిరేకత కనిపిస్తోంది. ఉద్యోగాల కల్పనలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందనే భావనలో ఉన్నారు వారంతా. ఉద్యోగులైతే ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పీఆర్సీలో జాప్యం, డీఏ సరిగా ఇవ్వకపోవడం, బదిలీలు చేపట్టకపోవడం, ప్రమోషన్లు ఇవ్వకపోవడం.. ఇలా చాలా అంశాల్లో వారు గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో శాసనమండలి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ పోటీ ఇవ్వడం కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సీఎం కేసీఆర్ సొంత జిల్లా, ఎమ్మెల్యే చనిపోయిన సెంటిమెంట్, అధికార పార్టీగా అదనపు ప్రయోజనాలు. ఇన్ని ఉన్నా దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఓడిపోయింది. ఉద్యోగులు ఎక్కువగా ఉండే దుబ్బాక అర్బన్ లో బీజేపీకి భారీ లీడ్ వచ్చింది.దుబ్బాకలోని మెజార్టీ యూత్ అంతా టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పని చేశారని తెలుస్తోంది. అధికార పార్టీ నేతలు కూడా దీన్ని అంగీకరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పూర్తిగా విద్యావంతులే ఓటు వేసే శాసనమండలి ఎన్నికలు కారు పార్టీకి కలిసివచ్చే అవకాశాలు ఎంతమాత్రం లేవనే అభిప్రాయాలే రాజకీయ విశ్లేషకుల నుంచి వస్తున్నాయి.
గతంలో జరిగిన శాసనమండలి ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ ఓడిపోయింది. రెండోసారి అధికారంలోకి వచ్చాకా జరిగిన కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ పోటీలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన జీవన్ రెడ్డి ఘన విజయం సాధించారు. టీఆర్ఎస్ అభ్యర్థి ఆయనకు గట్టి పోటీ కూడా ఇవ్వలేకపోయారు. నల్గొండ, కరీంనగర్ కోటా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లోనూ అధికార పార్టీ అభ్యర్థులు ఘోరంగా ఓడిపోయారు. గత శాసనమండలి ఎన్నికల కంటే ఇప్పుడు టీఆర్ఎస్ పరిస్థితి మరింత దిగజారిందని చెబుతున్నారు. ఇటీవల కాలంలో ప్రభుత్వంపై వ్యతిరేకత మరింత పెరిగినట్లు కనిపిస్తోంది. దుబ్బాక ఉప ఎన్నికలోనూ అది కనిపించింది. ఇలాంటి పరిస్థితిలో పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో టీఆర్ఎస్ కనీసం పోటీ కూడా ఇవ్వకపోవచ్చని చెబుతున్నారు.
త్వరలో జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నల్గొండ స్థానం నుంచి టీజేఎస్ అధినేత కోదండరామ్ పోటీ చేస్తున్నారు. ఇప్పటికే ఆయన ప్రచారం చేస్తున్నారు. తీన్మార్ మల్లన్న కూడా పాదయాత్ర చేస్తూ జనంలోకి వెళ్లారు. మల్లన్నకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందంటున్నారు. మహబూబ్ నగర్ సీటు కోసం బీజేపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్సీ రాంచంద్రరావు బరిలో మళ్లీ ఉంటున్నారు. ఆయన కూడా ప్రచారం ముమ్మరం చేశారు. గతంలో ఒకసారి విజయం సాధించిన ప్రోఫెసర్ నాగేశ్వర్ కూడా పోటీ చేస్తానని ప్రకటించారు. టీఆర్ఎస్ మాత్రం ఇంకా స్పందించడం లేదు. గత అనుభవాలతో అధికార పార్టీ నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం నల్గొండ సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా పోటీకి వెనుకంజ వేశారని చెబుతున్నారు.
ఇప్పటికే శాసనమండలి ఎన్నికల్లో పోటీ చేయడానికి టీఆర్ఎస్ కు అభ్యర్థులు దొరకడంలేదు. తాజాగా వచ్చిన దుబ్బాక ఫలితంతో ఆ పార్టీ నుంచి పోటీకి ఎవరూ ముందుకు రావచ్చని చెబుతున్నారు. ఎలాగూ గెలిచే అవకాశాలు లేవు కాబట్టి టీఆర్ఎస్ కూడా శాసనమండలి ఎన్నికలకు దూరంగా ఉండే ప్రయత్నాలు కూడా చేయవచ్చనే ప్రచారం జరుగుతోంది.