దుబ్బాక ఉపఎన్నిక ఫలితంపై రాములమ్మ సెన్సేషనల్ కామెంట్స్
posted on Nov 11, 2020 @ 10:47AM
దుబ్బాక ఉపఎన్నిక టీఆరెఎస్ కు పెద్ద షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయమై టీపీసీసీ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి సెన్సేషనల్ కామెంట్స్ చేసారు. మంత్రి హరీశ్‌రావు లేకుంటే దుబ్బాక ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్ కు డిపాజిట్ కూడా దక్కేది కాదని అన్నారు. టీఆర్‌ఎస్ అహంకార ధోరణికి, కేసీఆర్ దొర నిరంకుశ పోకడలకు జవాబు దుబ్బాక తీర్పు అన్నారు. అధికార పార్టీ ప్రలోభాలకు ఓటర్లు ప్రభావితం కాకుండా పాలకులపై వ్యతిరేకతను ఓటు ద్వారా వెల్లడించారని మంగళవారం స్పష్టంచేశారు. లక్ష మెజారిటీ ఖాయమన్న టీఆర్‌ఎస్ నేతలు తర్వాత ఒక్క ఓటుతో గెలిచినా గెలుపే అన్నారని, అయితే కొన్ని రోజుల వ్యవధిలోనే ఎందుకు దిగజారారో వారికి వారే సమీక్షించుకోవాలని టీఆర్‌ఎస్ కు సూచించారు. దొర పాలనకు వ్యతిరేకంగా మరో ఉద్యమానికి దుబ్బాక ప్రజలు ఊపిరి పోశారని ఆమె అన్నారు. ఇది ఇలా ఉండగా టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్‌పర్సన్ విజయశాంతి త్వరలో బీజేపీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. ఈ నెల 14న ఆమె ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సమక్షంలో పార్టీలో చేరే అవకాశం ఉంది.