వరద బాధితులకు రూ.20 వేల సాయం! కారుకు కౌంటర్ ప్లాన్
posted on Nov 19, 2020 @ 3:34PM
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచేందుకు ప్రధాన పార్టీలు పోటాపోటీ వ్యూహాలు రచిస్తున్నాయి. ఎలాగైనా బల్దియాపై జెండా ఎగురవేయాలని పావులు కదుపుతున్న బీజేపీ.. అధికార టీఆర్ఎస్ కు ధీటుగా ఎత్తులు వేస్తోంది. వరద సాయాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని చూస్తున్న కారు పార్టీకి కౌంటర్ ప్లాన్ వేసింది కమలదళం. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే వరద బాధితులకు ఇంటికి రూ. 20 వేలు ఇస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. వరద నష్టం ఎంత వస్తే అంత లెక్క కట్టి ఇస్తామని చెప్పారు. నష్టపోయిన కార్లు, బైక్‌లు ఇప్పిస్తామన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ కార్యకర్తల్ని ఇబ్బంది పెడితే చుక్కలు చూపిస్తామని బండి సంజయ్ హెచ్చరించారు. జనసేనతో పొత్తుపైనా మరోసారి క్లారిటీ ఇచ్చారు బండి సంజయ్. జనసేనతో పొత్తుకు సంబంధించి బీజేపీలో చర్చే జరగలేదన్నారు. పొత్తులపై జనసేన నుంచి కూడా ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని చెప్పారు సంజయ్. గ్రేటర్‌లో ఒంటరిగా పోటీ చేయానికి ఏర్పాట్లు పూర్తయ్యాయని స్పష్టం చేశారు. తనకు, పవన్ కళ్యాణ్‌కు మధ్య మధ్యవర్తులు అవసరం లేదన్నారు సంజయ్. ఏపీలో మత మార్పిడిలను వ్యతిరేకించిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పారు. పొత్తుల అంశం మాట్లాడటానికి తాను పవన్ కల్యాణ్‌ను కలవటంలేదని స్పష్టం చేశారు బండి సంజయ్.