ప్రచారంలో కరోనా రూల్స్ పాటించాల్సిందే! ఎస్ఈసీ తాజా ఆదేశాలు

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో ఎవరూ కరోనా మార్గదర్శకాలు పాటించడం లేదు. మాస్కులు కూడా లేకుండానే గుంపులు గుంపులుగా తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. ప్రచారంలో ఎక్కడా శానిటైజర్లు వాడటం లేదు. రాజకీయ నేతలు కూడా మాస్కులు లేకుండానే ప్రచారంలో పాల్గొంటున్నారు. దీంతో హైదరాబాద్ లో మళ్లీ కరోనా మహమ్మారి విజృంభిస్తుందేమోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై స్పందించిన రాష్ట్ర ఎన్నికల సంఘం.. రాజకీయ పార్టీలకు మరోక సారి కరోనా మర్గదర్శకాలు జారీ చేసింది.    ఎన్నికల సందర్భంగా నిర్వహించే ఇంటింటి ప్రచారం, రోడ్‌షోలు, ర్యాలీల్లో అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్ధులు, కార్యకర్తలు కచ్చితంగా కరోనా కోడ్‌ నిబంధనలు పాటించాల్సిందేనని ఆదేశించింది. పలు పార్టీలు ఎన్నికల సంఘం జారీ చేసిన కోవిడ్‌ నిబంధనలు పాటించడం లేదని గుర్తు చేసిన ఎన్నిక సంఘం.. ఎట్టి పరిస్థితుల్లోనూ కోవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించరాదని సూచించింది. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టంచేసింది. అన్నిపార్టీల అభ్యర్ధులు, వారి కార్యకర్తలు ఎన్నికల ప్రచారం సందర్భంగా తప్పని సరిగా ముఖానికి మాస్క్‌ ధరించాలి. అలాగే శానిటైజర్లను వినియోగిస్తూ భౌతిక దూరం పాటించాలని సూచించింది.    ఇంటింటి ప్రచారానికి వెళ్లినప్పుడు అభ్యర్ధితో పాటు ఐదుగురు మాత్రమే వెళ్లాలని ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇతరులు ప్రచారంలో పాల్గొంటే తప్పని సరిగా ఫేస్‌మాస్క్‌ ధరించాలని ఎన్నికల కమిషన్ సూచించింది. తప్పని సరిగా శానిటైజర్‌ వినియోగిస్తూ భౌతిక దూరం పాటించాలని సూచించింది. రోడ్‌షోలు, ర్యాలీలు నిర్వహించే సమయంలోనూ తప్పని సరిగా ఫేస్‌మాస్క్‌లను ప్రతి ఒక్కరూ ధరించేలా చూడాలని... చేతులను శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలని..సమావేశాలు, బహిరంగ సభల్లోనూ భౌతిక దూరం తప్పని సరి అని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టంచేసింది.

రెచ్చగొట్టే మాటలు.. విద్వేష ప్రసంగాలు! గాడి తప్పిన గ్రేటర్ ప్రచారం

రోహింగ్యాలు.. పాకిస్తాన్.. సర్జికల్ స్ట్రైక్.. కూల్చేస్తాం.. తరమికొడతాం. ఇవి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో వినిపిస్తున్న మాటలు. స్థానిక ఎన్నికల్లో సాధారణంగా స్థానిక సమస్యలే కీలకంగా ఉంటాయి. స్థానిక సమస్యలు, ప్రజల అవసరాల అంశాలపైనే గతంలో ప్రచారాలు జరిగేవి. కాని ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో స్థానిక అంశాల ప్రస్తావనే రావడం లేదు. జాతీయ , అంతర్జాతీయ అంశాలు గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారాస్త్రాలుగా మారిపోయాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. విద్వేషపూరిత ప్రసంగాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ కలకలం రేపుతున్నారు లీడర్లు.    నిన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ నగరంలో నేతల విద్వేశపూరిత ప్రసంగాలు దుమారం రేపుతున్నాయి. అన్ని పార్టీల నేతలు పోటీపడీ మరీ నోటికి పనిచెబుతున్నారు. ఒకరిని మించి మరొకరు రెచ్చగొట్టే ప్రసంగాలతో విరుచుకుపడుతున్నారు. ఇష్టమెచ్చినట్లుగా మాట్లాడుతూ అలజడి రేపుతున్నారు. జనం సమస్యలు పట్టించుకోకుండా.. కాంట్రవర్సీ కామెంట్లతో కాక రేపుతున్నారు. ప్రచారాల తీరు, నేతల దూకుడుతో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం దారి తప్పిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గ్రేటర్ ఎన్నికల్లో జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులతో నగర ప్రజల్లో ఆందోళన కూడా పెరుగుతోంది.    బీజేవైఎం చీఫ్, బెంగళూరు బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య రాకతో మొదలైన గ్రేటర్‌ రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది. మంగళవారం హైదరాబాద్‌ లో పర్యటించిన సూర్య.. ఎంఐఎం నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ పాకిస్తాన్‌ ఏజెంట్‌గా పనిచేస్తున్నారని విమర్శించారు.అసద్ ను పాకిస్తాన్‌ జాతిపిత మహ్మద్‌ అలీ జిన్నాతో పోల్చారు సూర్య. దేశ విభజన సమయంలో హైదరాబాద్‌ సంస్థానాన్ని పాకిస్తాన్‌లో విలీనం చేయాలని జిన్నా డిమాండ్‌ చేశారని, ఒవైసీ కూడా అదే ఆలోచన విధానం ఉన్న వ్యక్తి అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున రొహింగ్యాలు, పాకిస్తాన్‌ ఓట్లు ఉన్నాయని.. పాకిస్తాన్‌ మద్దతు దారులే ఎంఐఎం పార్టీలో ఉన్నారని వ్యాఖ్యానించారు. తేజస్వి సూర్య విమర్శలపై ఒవైసీ ఘాటుగా స్పందించారు. హైదరాబాద్‌లో పాకిస్తాన్‌, రొహింగ్యా ఓటర్లు ఉంటే కేంద్రహోం మంత్రి అమిత్‌ షా ఏం చేస్తున్నారు..? నిద్రపోతున్నారా? అంటూ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ అనుమతితోనే భాగ్యనగరంలో రొహింగ్యాలకు షెల్టర్‌ ఇచ్చారని ఒవైసీ గుర్తుచేశారు.    ఇక తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ వివాదాస్పద వ్యాఖ్యలతో అలజడి సృష్టిస్తున్నారు. గ్రేటర్‌ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే పాతబస్తీలో సర్జికల్‌ స్ట్రైక్‌ చేస్తామన్న ఆయన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. సంజయ్‌ కామెంట్స్‌ తెలంగాణలోనే కాకుండా దేశ వ్యాప్తంగానూ హాట్‌ టాపిక్‌గా మారాయి. సంజయ్ వ్యాఖ్యలపై దుమారం రేగుతుండగానే.. ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ రెచ్చిపోయారు. అక్రమ కట్టడాల తొలగింపుపై మాట్లాడుతూ.. మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు, మాజీ సీఎం ఎన్టీఆర్‌ ఘాట్స్‌ను కూల్చివేయాలంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అక్భర్ కామెంట్లకు కౌంటరిచ్చిన బండి సంజయ్.. పీవీ, ఎన్టీఆర్ సమాధులు కూల్చివేస్తే రెండు గంటల్లో ఎంఐఎం కార్యాలయం దారుస్సలాంను నేలమట్టం చేస్తామని హెచ్చరించాారు. బండి సంజయ్. అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.    గ్రేటర్‌ ఎన్నికల సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు చేస్తున్న ప్రసంగాలపై నగర ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రాలేదని, ప్రస్తుత పరిణామాలతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయం వస్తుందని చెబుతున్నారు. గ్రేటర్ ప్రచారంలో జరుగుతున్న పరిణామాలపై సోషల్‌ మీడియా వేదికగా నెటిజన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల మధ్య చిచ్చుపెట్టే విధంగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రజలను ఆకట్టుకునే విధంగా పథకాలు, మేనిఫేస్టోలు తయారుచేసి, ఓటర్లను ఆకర్శించాలే గానీ ఇలా రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయవద్దని హితవు పలుకుతున్నారు.

సర్జికల్ స్ట్రైక్ చేస్తాం అన్న నేతలపై కేసులు! రెచ్చగొట్టే పోస్టులు వద్దన్న డీజీపీ 

జనాలను రెచ్చగొట్టే పోస్టులు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి హెచ్చరించారు. గ్రేటర్ ఎన్నికలను ఆసరాగా తీసుకొని విధ్వంసక శక్తులు మత కల్లోలాలకు కుట్ర చేస్తున్నాయని చెప్పారు. శాంతిభద్రతలకు భంగం కలిగేలా వ్యవహిరిస్తే కఠినచర్యలు తప్పవని.. కుట్రలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. తన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో డీజీపీ మాట్లాడారు. సోషల్ మీడియా పైన పోలీస్ శాఖ పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసిందన్నారు. నూతన టెక్నాలజీని ఉపయోగించి అలాంటి వారిని గుర్తిస్తున్నామన్నారు. వదంతులు, నకిలీ వార్తల గురించి తెలిస్తే సమీపంలోని పోలీస్‌స్టేషన్‌కు తెలియజేయాలన్నారు.    తెలంగాణ రాష్ట్రం శాంతి భద్రతలకు నిలయంగా ఉందని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. గత ఆరేళ్లుగా ప్రజల సహకారంతో ఎలాంటి అసాంఘిక సంఘటనలు జరగకుండా పోలీస్‌ శాఖ అన్ని చర్యలు తీసుకుందని వెల్లడించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియాలో ఎవరైనా తప్పుడు ప్రచారాలు చేస్తే వాటిని ఎవ్వరు ఫార్వర్డ్‌‌ చేయ్యొద్దని తెలిపారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు శాంతియుత వాతావరణంలో జరిగేలా చూడాలని కోరారు.    గ్రేటర్ పరిధిలోని మూడు కమిషనరేట్లలో 51,500 మందితో భారీ భద్రత ఏర్పాటు చేశామని, ఎమర్జెన్సీ కోసం బ్లూ కోడ్స్ సీనియర్ అధికారులను అందుబాటులో ఉంచామని డీజీపీ తెలిపారు.ఇప్పటి వరకు రాజకీయ నాయకులపై 50 కేసులు నమోదు చేశామని తెలిపారు. సర్జికల్ స్ట్రైక్ చేస్తాం అన్న నేతలపై కేసులు నమోదు చేస్తామని వెల్లడించారు. రోహింగ్యాలపై ఇప్పటి వరకు 50 నుంచి 60 కేసులు నమోదు చేశామని, క్రిమినల్ చరిత్ర ఉన్న వారే మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్నారు. ఓయూ రిజిస్టర్ ఇచ్చిన ఫిర్యాదుతో బెంగళూరు ఎంపీ తేజస్వి సూర్య పై కేసు నమోదు చేశామని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు.

ఏబీ వెంకటేశ్వరరావుకు సుప్రీంకోర్టులో చుక్కెదురు

సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయన సస్పెన్షన్‌ విషయంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది.    గత ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు.. నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఆయనను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్‌ చేసిన విషయం విదితమే. ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని క్యాట్ కూడా సమర్థించింది. ప్రభుత్వం జారీ చేసిన సస్పెన్షన్‌ ఉత్తర్వులను రద్దు చేయాలని ఏబీ దాఖలు చేసిన పిటిషన్‌ను క్యాట్‌ కొట్టివేసింది. ఈ క్రమంలో ఆయన హైకోర్టును ఆశ్రయించగా సస్పెన్షన్‌ పై హైకోర్టు స్టే ఇచ్చింది.   హైకోర్టు ఆదేశాలను ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. తాజాగా ఈ పిటిషన్ ను విచారించిన ధర్మాసనం హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు స్టే కొనసాగుతుందని తెలిపింది. మూడు వారాల్లోగా సమాధానం చెప్పాలని ఏబీ వెంకటేశ్వరరావుకు నోటీసులు జారీ చేసింది. ఛార్జిషీట్ ను ఏబీ వెంకటేశ్వరరావుకు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఫ్రీ కరోనా వ్యాక్సిన్.. ఎల్‌ఆర్‌ఎస్ రద్దు! గ్రేటర్ బీజేపీ మేనిఫెస్టో 

గ్రేటర్ హైదరాబాద్‌లో అందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. గ్రేటర్‌లో అధికారంలోకి వస్తే ఎల్‌ఆర్‌ఎస్ రద్దు చేస్తామని ప్రకటించింది. నగరంలోని అన్ని ప్రాంతాలకు మెట్రో రైలు, ఎంఎంటీఎస్‌ సేవలు అందిస్తామని తెలిపింది. విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్‌లు, వై-ఫై సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చింది. పేదలకు వంద యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది. ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని, లంచాలు లేని, నూటికి నూరుశాతం పారదర్శక జీహెచ్ఎంసీ పాలన సాగిస్తామని తెలిపింది.    మహిళల కోసం ఐదేళ్లలో 15 కొత్త మహిళా పోలీస్‌స్టేషన్ల ఏర్పాటు, మహిళల కోసం నగరంలో కిలోమీటరుకో టాయిలెట్, టూవీలర్లు, ఆటోలపై ఇప్పటివరకు ఉన్న చలాన్లు రద్దు, గ్రేటర్‌లో ఇంటింటికి నల్లా కనెక్షన్, 24 గంటలు ఉచితంగా మంచినీరు సరఫరా, కులవృత్తులకు ఉచిత విద్యుత్ , ఎస్సీ కాలనీలు, బస్తీల్లో ఆస్తిపన్ను మాఫీ, వరదల నివారణకు సమగ్ర ప్రణాళిక, వరదసాయం కింద అర్హులందరికీ రూ.25 వేల చొప్పున నగదు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది బీజేపీ.    మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చేతుల మీదగా గ్రేటర్ హైదరాబాద్ బీజేపీ మేనిఫెస్టో విడుదలైంది. సామాన్యుడి ఆకాంక్షల మేరకే మేనిఫెస్టో విడుదల చేస్తున్నామని, ప్రజల సలహాలు స్వీకరించి మేనిఫెస్టోను రూపొందించామని ఫడ్నవీస్ తెలిపారు. కరోనా పేరుతో హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రులు సామాన్యులను దోచుకున్నాయని చెప్పారు. ఎల్‌ఆర్‌ఎస్ ద్వారా ప్రజలపై రూ.15 వేల కోట్ల భారం మోపారని ఆరోపించారు. రాజ్యాంగాన్ని మోడీ సర్కారు కాపాడుతోందని చెప్పారు. ఓటు బ్యాంకు కోసం చేసిన తప్పిదాల వల్లే హైదరాబాద్ మునిగిపోయిందని, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని తెలిపారు.

49 మంది అభ్యర్థులకు నేరచరిత్ర! గతంలో కంటే బెటర్

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల బరిలో 49 మంది నేర చరిత్ర గల అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌, మజ్లిస్‌ అభ్యర్థుల అఫిడవిట్లను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ వెబ్‌సైట్‌ నుంచి తీసుకుని విశ్లేషించిన ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ సంస్థ ఈ వివరాలు వెల్లడించింది. నేరచరిత కలిగిన అభ్యర్థులు పార్టీల వారిగా చూస్తే టీఆర్‌ఎస్‌ నుంచి 13 మంది, బీజేపీ తరపున 17 మంది, కాంగ్రెస్‌ నుంచి 12, మజ్లిస్‌ నుంచి ఏడుగురు ఉన్నారు. ఎన్నికల బరిలో ఉన్న ఆరుగురి మహిళా అభ్యర్థులపైనా కేసులున్నాయని ఎఫ్‌జీజీ తెలిపింది. గ్రేటర్‌లో నేరచరిత్ర కలిగిన వారు పోటీ చేస్తున్న వార్డుల సంఖ్య 41 కాగా .. మల్కాజ్‌గిరిలో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులందరికీ నేరచరిత్ర ఉందని ఎఫ్‌జీజీ సంస్థ కార్యదర్శి పద్మనాభరెడ్డి తెలిపారు.    కేపీహెచ్‌బీ కాలనీ డివిజన్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న ప్రీతం కుమార్‌ రెడ్డిపై అత్యధికంగా 9 కేసులు ఉన్నాయి. ఆ తర్వాత షాలిబండ 48 వార్డు నుంచి పోటీ చేస్తున్న ఎంఐఎం అభ్యర్ధి మహ్మద్‌ ముస్తఫా అలీపైన 7 కేసులు ఉన్నాయి. మారెడ్‌పల్లి వార్డు బీజేపీ అభ్యర్థి టి. శ్రీనివాస్‌ రెడ్డిపై 5 కేసులు, మోండా మార్కెట్‌ నుంచి టీఆర్‌ఎస్‌ తరఫున బరిలో దిగిన ఆకుల రూపపైన 5 కేసులు ఉన్నాయని ఎఫ్‌జీజీ వెల్లడించింది. మిగతా వారిలో కొందరిపై నాలుగు, మరికొందరిపై మూడు, రెండు కేసులు ఉండగా చాలా మంది అభ్యర్ధులు కేవలం ఒకే కేసులో నిందితులుగా ఉన్నారు.   గత గ్రేటర్‌ ఎన్నికల్లో 72 మంది నేరచరితులకు వివిధ పార్టీలు టికెట్లు ఇవ్వగా ఈ సారి 49 మందే ఉన్నారు. పోటీ చేస్తున్న వారిలో నేర చరిత్ర ఉన్న వారు తగ్గడం శుభపరిణామని పద్మనాభరెడ్డి చెప్పారు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్‌లో నేరమయ రాజకీయాలు తగ్గిపోతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మంచి నాయకుల్ని ఎన్నుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఓటు వేసి తమకు అవసరమైన వారిని ఎన్నుకోవాలని పద్మనాభరెడ్డి విజ్ఞప్తి చేశారు. 

బీజేపీ, ఎంఐఎంల మధ్య ఫోన్ కాన్ఫరెన్స్! అమిత్ షానే సంధానకర్తన్న రేవంత్ రెడ్డి

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో నేతలు చేస్తున్న హాట్ కామెంట్స్ కాక రేపుతున్నాయి. అక్బరుద్దీన్, బండి సంజయ్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి. బీజేపీ, ఎంఐఎం నేతల మధ్య ప్రతిరోజు రాత్రి ఫోన్ కాన్ఫరెన్స్ నడుస్తోందని ఆరోపించారు. ఫోన్ కాన్ఫరెన్స్ కు అమిత్ షానే సంధానకర్తగా ఉన్నారని చెప్పారు. రాత్రి సమయంలో బండి సంజయ్, అరవింద్, అసద్, అక్బరుద్దీన్ స్క్రిప్ట్ తయారు చేసుకోవడం..ఉదయం సురభి నాటకానికి తెర లేపుతున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు.   పీవీ, ఎన్టీఆర్ లాంటి మహానేతల పేర్లను బీజేపీ, ఎంఐఎంలు రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం దుర్మార్గమని రేవంత్ రెడ్డి విమర్శించారు. సొంత పార్టీ నేతలైన అద్వానీ, జోషి, కల్యాణ్ సింగ్ లను గౌరవించుకోలేని బీజేపీ.. పరాయి పార్టీ నేతలపై ప్రేమ ఒలకబోస్తోందని ఎద్దేవా చేశారు. పీవీ, ఎన్టీఆర్ లపై నిజంగా బీజేపీకి ప్రేమ ఉంటే వారిద్దరికి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నెల 29న హైదరాబాద్ కు వస్తున్న అమిత్ షా.. ఆ మహానేతల ఘాట్లను సందర్శించి, అక్కడే ప్రకటన చేయాలని రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల తర్వాత పీవీ, ఎన్టీఆర్ పేరు కూడా బీజేపీ ఉచ్ఛరించదని తెలిపారు. ఎన్నికల తర్వాత పీవీ, ఎన్టీఆర్ పేరు కూడా బీజేపీ ఉచ్ఛరించదన్నారు. ప్రజలు ఇలాంటి ఎమోషన్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు రేవంత్ రెడ్డి.

కాయో పండో తేలని ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ కథ.. తయారీలో తప్పు జరిగిపోయిందట

కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రపంచం మొత్తం ఈ మహమ్మారి నుండి కాపాడే వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తోంది. సామాన్యులలో ఎంతో ఆసక్తిని రేపుతున్న ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ తుది దశ ట్రయల్ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ వ్యాక్సిన్ గురించి ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనికా ఫార్మాలు మరో సంచలన విషయం ప్రకటించాయి. తాము రూపొందించిన కరోనా వ్యాక్సిన్ తయారీ ప్రక్రియలో తప్పు జరిగిపోయిందని, దీంతో వ్యాక్సిన్ ట్రయల్స్ లో వచ్చిన ప్రాధమిక ఫలితాలు అనేక ప్రశ్నలను రేపాయని ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. తామిచ్చిన వ్యాక్సిన్ డోస్ లను తీసుకున్న వారిలో కరోనా నిరోధక శక్తి భారీగా పెరిగిందని ఆక్స్ ఫర్డ్ ప్రకటించిన కొన్ని రోజుల తరువాత, కొంతమంది వాలంటీర్లు రెండు డోస్ లను తీసుకున్నా, వారిలో వ్యాధి నిరోధకత పెంపొందలేదని వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా ఆస్ట్రాజెనికా ఫార్మా స్పందించింది. ఆ వాలంటీర్లు తీసుకున్న వ్యాక్సిన్ తయారీలో తప్పు జరిగిందని తెలిపింది.   అసలు విషయం ఏంటంటే ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ తక్కువ డోస్ తీసుకున్న వారిలో కరోనా వైరస్ ను ఎదుర్కునే శక్తి ఎక్కువగా ఉందని, అయితే నిర్దేశించిన రెండు డోస్ లను తీసుకున్న వారిలో మాత్రం రోగనిరోధక శక్తి ఆశించిన స్థాయిలో లేదని తన ట్రయల్స్ ఫలితాల రిపోర్టులో పేర్కొన్న సంగతి తెలిసిందే. వ్యాక్సిన్ తక్కువ డోస్ తీసుకున్న వారిలో 90 శాతం పనితీరు కనిపించిందని, అయితే రెండు డోస్ లను పొందిన వారిలో ఇది 62 శాతంగా నమోదైందని ఆస్ట్రాజెనికా వెల్లడించింది. ప్రస్తుతం బ్రిటన్ తో పాటు బ్రెజిల్ లోనూ ఈ వ్యాక్సిన్ పైన పెద్ద ఎత్తున ట్రయల్స్ జరుగుతున్నాయి. ఆస్ట్రాజెనికా ఈ రెండు దేశాల్లో జరుగుతున్నా ట్రయల్స్ ఫలితాలను విడుదల చేయగా వాటిలో ఈ తేడాలు కనిపించాయి. దీంతో ప్రజలలో ఈ వ్యాక్సిన్ పై గందరగోళం నెలకొంటున్నది.

రైతులను అడ్డుకుంటున్న పోలీసులు! ఢిల్లీ బార్డర్ లో హై టెన్షన్! 

రైతుల ఆందోళనతో దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో హై టెన్షన్‌ నెలకొంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తూ రైతు, కార్మిక సంఘాలు చేపట్టిన ఛలో ఢిల్లీ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. పంజాబ్‌ నుంచి వేలాది మంది రైతులు హర్యానా మీదుగా రాజధాని వస్తుండగా... వారిని అడ్డుకునేందుకు హర్యానా సర్కార్‌ పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించింది. బారికేడ్లు పెట్టి ఎక్కడిక్కడ రైతులను, కార్మిక సంఘాల నేతలను అడ్డుకుంటోంది. పంజాబ్‌, ఉత్తర ప్రదేశ్‌, రాజస్తాన్‌ హర్యానా రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున రైతులు ఢిల్లీకి బయలుదేరడంతో ఢిల్లీ ప్రభుత్వం సైతం అప్రమత్తమైంది. రైతులను జల ఫిరంగులు ప్రయోగిస్తూ ఎవరినీ కూడా నగరం లోపలకు అనుమతించకుండా అడ్డుకుంటున్నారు. ఢిల్లీ సరిహద్దులైన గురుగ్రామ్, ఫరీదాబాద్ వద్ద కూడా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.    రైతుల నిరసనలతో రెండు రోజుల పాటు పంజాబ్‌కు బస్సు సర్వీసులను హర్యానా ప్రభుత్వం నిలిపివేసింది. హర్యానాలో బారీగేట్లను పెట్టి ట్రాఫిక్‌ను మళ్లించారు. పంజాబ్‌కు చెందిన వేలాది రైతులు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో కవాతుగా ఢిల్లీకి బయలుదేరారు. వారంతా హర్యానా సరిహద్దు వద్ద సమావేశమయ్యారు. దీంతో వారిని అడ్డుకునేందుకు హర్యానా ప్రభుత్వం తన భద్రతా సిబ్బందిని సరిహద్దుల దగ్గర మోహరించింది. కరోనావైరస్ వ్యాప్తి విజృంభిస్తున్న తరుణంలో ఢిల్లీ ప్రభుత్వం నగరంలో ఎటువంటి ర్యాలీని అనుమతించడం లేదు. దీంతో ఢిల్లీ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.

ఏపీ బీజేపీ నాయకత్వం తీరు... ఏమీ బాగోలేదట!

తిరుపతిలో మేమే పోటీ చేస్తాం   ఏకపక్షంగా అభ్యర్ధిని ఎలా ప్రకటిస్తారు?   అమరావతి-పోలవరంపై స్పష్టత కావలసిందే   జనసేన-బీజేపీ సమన్వయ కమిటీ కావాలన్న పవన్   నద్దాతో జనసేనాధిపతి భేటీ   బీజేపీ ఏపీ నాయకత్వ పనితీరుపై జనసేనాధిపతి పవన్‌కల్యాణ్.. ఆ పార్టీ జాతీయ దళపతి నద్దాకు ఫిర్యాదు చేశారా? అమరావతిపై జీవీఎల్, సోము, విష్ణువర్దన్‌రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను, జనసేనాధిపతి కమలదళపతికి ఫిర్యాదు చేశారా? అమరావతిలోనే రాజధాని ఉండాలన్న విషయంపై బీజేపీ స్పష్టత ఇవ్వాలని కోరారా? వీటికి మించి... తిరుపతి లోక్‌సభ ఎన్నికలో తమ పార్టీ పోటీచేస్తుందని స్పష్టం చేశారా? అసలు తమతో సంప్రదింకుండానే ఎంపీ జీవీఎల్.. బీజేపీ అభ్యర్ధి పోటీ చేస్తారని ప్రకటించడంపై పవన్ అగ్గిరాముడయ్యారా?.. తాజాగా ఢిల్లీలో బీజేపీ బాస్ నద్దాతో, జనసేనాధిపతి పవన్ భేటీ వివరాలివేనని జనసేన వర్గాలు చెబుతున్నాయి.   జనసేన  వర్గాల సమాచారం ప్రకారం... రానున్న తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో,  జనసేన కచ్చితంగా పోటీ చేస్తుందని పవన్ స్పష్టం చేశారట. బీజేపీ నాయకత్వ సూచన ప్రకారం తాము గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ నుంచి విరమించుకున్నందున, తిరుపతి లోక్‌సభ తమకే ఇవ్వాలని పవన్, బీజేపీ బాసును కోరారట. బీజేపీతో మిత్రపక్షంగా ఉన్న తమ అభిప్రాయం తెలుసుకోకుండా, తమతో చర్చింకుండానే తిరుపతిలో బీజేపీ పోటీ చేస్తుందని ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రకటించడంపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు  చెబుతున్నారు. అసలు తాము తిరుపతి విషయంలో ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదని, అయితే ఏదో లీకు వార్తలకు బీజేపీ నేతలు  స్పందించడమంటే.. తమను అవమానించినట్లేనని వ్యాఖ్యానించినట్లు తెలిసింది.   అదేవిధంగా అమరావతి అంశంపై,  రాష్ట్ర బీజేపీ నాయకత్వం వ్యవహారశైలిపై పవన్ ఫిర్యాదు చేశారట. రాజధాని అమరావతిలోనే ఉండాలన్నది జనసేన విస్పష్ట విధానమని, కానీ జీవీఎల్-సోము వీర్రాజు-విష్ణువర్దన్‌రెడ్డి అందుకు విరుద్ధమైన ప్రకటలిచ్చి,  రైతుల్లో గందరగోళం రేపడాన్ని నద్దా వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. బీజేపీ అమరావతికి అనుకూలమని చెబితేనే, తాను మీకు మద్దతునిచ్చిన విషయాన్ని నద్దాకు గుర్తు చేశారట. దీనిపై ఏపీ నాయకత్వం స్పష్టతనివ్వాలని సూచించారు. రాష్ట్ర  బీజేపీ నాయకత్వం, తాము ఆశించిన స్థాయిలో జగన్ ప్రభుత్వంపై పోరాడటం లేదని.. కొన్ని సంఘటనలు-అంశాలను నద్దా దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం.   అటు పోలవరంపైనా గందరగోళం నెలకొందని, ఆ ప్రాజెక్టును కేంద్రమే చేపట్టాలని పవన్ కోరారట. అయితే ఆ విషయంలో కేంద్రం ఒకే అభిప్రాయంతో ఉందని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సమాచారం రావడంలో ఆలస్యమవతుతోందని నద్దా వివరించారట. రెండు పార్టీల మధ్య కీలక అంశాల్లో అభిప్రాయబేధాలు తలెత్తుతున్నందున, తక్షణమే రెండు పార్టీలతో సమన్వయ కమిటీ వేయాలని పవన్ సూచించారట.  అందుకు నద్దా అంగీకరించినట్లు చెబుతున్నారు. తాము హైదరాబాద్‌కు వస్తున్నందున, మరోసారి అక్కడ చర్చిద్దామని పవన్‌తో అన్నారట.  -మార్తి సుబ్రహ్మణ్యం

రాములమ్మకు సిగ్నల్ రాలేదా! ఆ సెంటిమెంటే భయపెడుతోందా? 

తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ నాయకురాలిగా పేరున్న విజయశాంతి రాజకీయ భవిష్యత్ పై సస్పెన్స్ కొనసాగుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మెన్ గా ఉన్న విజయశాంతి.. కొంత కాలంగా ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ప్రజాక్షేత్రంలో తిరగకున్నా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు రాములమ్మ. టీఆర్ఎస్ సర్కార్, సీఎం కేసీఆర్ పని తీరుపై ఆమె ఘాటుగా ఆరోపణలు సంధిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. కేసీఆర్, కేటీఆర్ లను వ్యక్తిగతంగానూ టార్గెట్ చేస్తున్నారు విజయశాంతి. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని మోడీని ప్రశంసిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. దీంతో ఆమె బీజేపీలో చేరతారనే ప్రచారం కొన్ని రోజులుగా జరుగుతోంది. కాని కమలం గూటికి ఇంకా చేరలేదు రాములమ్మ.    దుబ్బాక ఉప ఎన్నిక సమయంలోనే విజయశాంతితో సమావేశమయ్యారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మెదక్ జిల్లాకు గతంలో ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన రాములమ్మ దుబ్బాకలో కాంగ్రెస్ తరపున ప్రచారం కూడా చేయలేదు. దీంతో అప్పుడే ఆమె బీజేపీలో చేరతారని భావించారు. కాని ఎందుకో ఆమె జాయినింగ్ ఆగిపోయింది. దుబ్బాకలో రఘునందన్ రావు విజయంతో ఆమె బీజేపీలో చేరడం ఖాయమనుకున్నారు. అది కూడా జరగలేదు. గ్రేటర్ ఎన్నికలకు ముందు విజయశాంతి కాషాయ కండువా కప్పుకుంటారని ప్రచారం జరిగింది. ఈనెల 14న రాములమ్మ ఢిల్లీకి వెళుతున్నారని, జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరుతారని ప్రచారం జరిగింది. కాని ఆమె ఢిల్లీ వెళ్లలేదు.. బీజేపీలో చేరలేదు. గ్రేటర్ పోలింగ్ సమయం దగ్గరపడుతున్నా విజయశాంతి కమలం గూటి చేరే ముహుర్తం ఇంకా ఫిక్స్ కాలేదు.    బీజేపీలో విజయశాంతి చేరిక ఆలస్యమవుతుండగా.. శాసనమండలి చైర్మెన్ స్వామి గౌడ్ ఢిల్లీకి వెళ్లి జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. స్వామి గౌడ్ బీజేపీలో చేరడం.. ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతున్నా విజయశాంతి ఇంకా జాయిన్ కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. విజయశాంతి బీజేపీలో చేరుతారని రాష్ట్ర నేతలు కూడా చెబుతూ వస్తున్నారు. కాని ముహుర్తం ఫిక్స్ చేయడం లేదు. దీంతో విజయశాంతి బీజేపీలో చేరికపై కొత్త చర్చలు మొదలయ్యాయి. విజయశాంతి పార్టీలో చేరికకు బీజేపీ హైకమాండ్ ఇంకా సిగ్నల్ ఇవ్వలేదనే చర్చ జరుగుతోంది. దీనికి కొన్ని బలమైన కారణాలు ఉన్నాయంటున్నారు.    రాజకీయాల్లో విజయశాంతికి ఐరెన్ లెగ్ అనే ప్రచారం ఉంది. ఆమె ఏ పార్టీలో చేరినా ఆ పార్టీకి వ్యతిరేక ఫలితాలు వస్తాయని చెబుతుంటారు. 2009లో విజయశాంతి టీఆర్ఎస్ లో చేరగా.. ఆ సంవత్సరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఆశించిన ఫలితాలు రాలేదు. 56 నియోజకవర్గాల్లో పోటీ చేసి కేవలం 10 ఎమ్మెల్యే సీట్లనే గెలుచుకుంది. కేసీఆర్ తో పాటు ఆమె మాత్రం ఎంపీలుగా విజయం సాధించారు. 2014లో రాములమ్మ కాంగ్రెస్ లో చేరగా.. ఆ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. 2018 అసెంబ్లీ ఎన్నికలకు విజయశాంతిని ప్రచార కమిటి చైర్మెన్ గా నియమించింది కాంగ్రెస్. ఆ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కథ మారలేదు. దీంతో విజయశాంతి ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి మంచి ఫలితాలు రావనే సెంటిమెంట్ క్రియేట్ అయింది. ఈ నేపథ్యంలోనే విజయశాంతి చేరికపై బీజేపీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారని చెబుతున్నారు. విజయశాంతికి ఉన్న ఐరెన్ లెగ్ ముద్ర కమలనాధులను భయపెడుతున్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ ఎన్నికలకు ముందు ఆమె పార్టీలో చేరితే వ్యతిరేక ఫలితాలు వస్తాయోమనన్న ఆందోళన కొందరు బీజేపీ నేతలు వ్యక్తం చేస్తున్నారట. అందుకే గ్రేటర్ ఎన్నికల తర్వాతే విజయశాంతిని పార్టీలో చేర్చుకోవాలని బీజేపీ నిర్ణయించిందని చెబుతున్నారు.

ట్రాఫిక్‌కు అడ్డంగా ఉందని చార్మినార్‌ను కూల్చాలంటే! 

పీవీ ఘాట్, ఎన్టీఆర్ ఘాట్‌లను కూల్చాలన్న ఎంఐఎం నేత అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై మండిపడ్డారు విజయశాంతి. అక్భరుద్దీన్ ఒవైసీకి, ఎంఐఎం నేతలకు ఆమె చురకలంటించారు. అక్బరుద్దీన్ ఒవైసీ జీ ఆక్రమణల పేరుతో పీవీ ఘాట్, ఎన్టీఆర్ ఘాట్‌లను కూల్చాలని డిమాండ్ చేస్తే, మరి కొందరు ప్రజలు ఎఫ్‌టీఎల్ వాటర్ సమస్యలో ఉంది కాబట్టి తాజ్‌మహల్‌ని కూల్చమని అనవచ్చని విజయశాంతి ట్వీట్ చేశారు. ట్రాఫిక్‌కు అడ్డంగా ఉంది కనుక చార్మినార్‌ను కూల్చాలని కూడా అనవచ్చని ఆమె అన్నారు. ఈ విధమైన ప్రకటనలు అక్బరుద్దీన్ ఒవైసీ జీ ఎర్రగడ్డ ప్రాంతంలో మాట్లాడినప్పుడు చేసినందువల్ల.. స్థల ప్రభావంగా భావించి పెద్దగా స్పందించనవసరం లేదని అభిప్రాయపడుతున్నానని విజయశాంతి చురకలంటించారు.

జైలు నుండి ఎన్డీయే ఎమ్మెల్యేకు ఫోన్.. లాలూప్రసాద్ యాదవ్ పై జార్ఖండ్ సర్కార్ విచారణ

గడ్డి కుంభకోణంలో ప్రస్తుతం జార్ఖండ్ లోని రాంచి జైలులో శిక్ష అనుభవిస్తున్న బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ఓ ఎన్డీయే ఎమ్మెల్యేకు ఫోన్ చేసి స్పీకర్ ఎన్నికల్లో ఓటింగ్ కు దూరంగా ఉండాలని మాట్లాడినట్టుగా బయటపడిన ఆడియో టేపులు తాజాగా బీహార్ లో కలకలం రేపుతున్నాయి. జుడిషియల్ కస్టడీలో ఉన్న లాలూ ఫోన్ ఎలా వినియోగించారన్న విషయాన్ని తేల్చేందుకు జార్ఖండ్ సర్కారు విచారణకు ఆదేశించినట్లు ఆ రాష్ట్ర జైళ్ల శాఖ ఐజీ వీరేంద్ర భూషణ్ వెల్లడించారు. రాంచీ డిప్యూటీ కమిషనర్, ఎస్పీ, బిస్రా ముండా జైలు సూపరింటెండెంట్ ల ఆధ్వర్యంలో ఈ విచారణ జరుగుతుందని ఆయన వెల్లడించారు.   అంతేకాకుండా ఆ ఆడియో క్లిప్ ను తాను కూడా విన్నానని, దాని ఆధారంగానే తాము విచారణకు ఆదేశించామని భూషణ్ వెల్లడించారు. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న వారికి జైలు మాన్యువల్ ప్రకారం మొబైల్ ఫోన్ అందుబాటులో ఉండే అవకాశం లేదని, ఆయన ఫోన్ వాడుంటే, ఎవరి ఫోన్ ను వాడారన్న విషయాన్ని కూడా విచారణలో తేలుస్తామని తెలిపారు. మొత్తంగా ఈ వ్యవహారానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అయన అన్నారు. ప్రస్తుతం లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్నతాధికారుల అనుమతితో రిమ్స్ డైరెక్టర్ బంగళాలో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో లాలూను కలవడానికి వచ్చే వారి విషయంలో రాంచీ జిల్లా అధికారులే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆయనను మళ్ళీ జైలుకు పంపేందుకు ఇప్పటికే అనుమతి కోరుతూ జార్ఖండ్ హైకోర్టులో ఒక పిటిషన్ విచారణలో ఉంది. వైద్యులు ఒకసారి ఆయనను పరిశీలించి, ఆరోగ్యం విషయంలో నివేదిక ఇస్తే, దాన్ని బట్టి తాము నిర్ణయం తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.

ఫుట్‌బాల్ మాంత్రికుడు డీగో మారడోనా హఠాన్మరణం.. క్రీడా ప్రపంచం దిగ్భ్రాంతి 

ఫుట్‌బాల్ మాంత్రికుడు డీగో మారడోనా 60 ఏళ్ల వయసులో బుధవారం గుండె పోటుతో హఠాత్తుగా కన్నుమూశారు. అర్జెంటీనాలోని టిగ్రే పట్టణంలోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. నవంబరు మొదటి వారంలో మారడోనాకు మెదడులో రక్తం గడ్డకట్టడంతో శస్త్రచికిత్స జరిగింది. గతంలో జరిగిన ప్రమాదం వలన మారడోనాకు ఈ సమస్య వచ్చిందని న్యూరాలజిస్ట్ లీయోపోల్డో లాఖ్ గతంలోనే తెలిపారు. అయితే సర్జరీ తరువాత వారం రోజుల క్రితమే బ్యూనస్ ఏర్స్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఓ ప్రైవేట్ హోమ్‌లో ఉంటూ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. కానీ అంతలోనే గుండె పోటు రావడంతో హఠాన్మరణం చెందారు మారడోనా.   అర్జెంటీనా తరఫున మారడోనా 91 మ్యాచ్‌ల్లో 34 గోల్స్‌ సాధించాడు. 16 ఏళ్ల వయసులో 1977లో హంగేరిపై మొదటి మ్యాచ్‌ ఆడాడు. 1978లో సొంతగడ్డపై జరిగిన వరల్డ్‌ కప్ లో డీగోకు చోటుదక్కలేదు. వయసు తక్కువ కావడంతో అతడిని టీమ్‌కు ఎంపిక చేయలేదు. 1979లో జరిగిన ఫిఫా యూత్‌ వరల్డ్‌ చాంపియన్‌షి్‌ప్సలో మారడోనా స్టార్‌ ఆఫ్‌ ది టోర్నీగా నిలిచాడు. స్కాట్లాండ్‌తో మ్యాచ్‌లో తొలి అంతర్జాతీయ గోల్‌ సాధించాడు. నాలుగుసార్లు ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీల్లో పాల్గొన్న మారడోనా 1986లో అర్జెంటీనా కు ప్రపంచ కప్ అందించారు. 1991లో డోపింగ్ పరీక్షల్లో పట్టుబడి ఏడాదిన్నరపాటు నిషేధానికి గురయ్యారు. 1997లో రిటైర్ అయ్యారు. ప్రస్తుతం అర్జెంటైనా జట్టుకు మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు. అయన కెరీర్‌, జీవితంలో మారడోనా అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నాడు. డ్రగ్స్‌ బారినపడి చావు అంచుల వరకు వెళ్లినా.. మళ్లీ రాగలిగాడు.

ఎన్టీఆర్ పేరు పెట్టుకున్న కేటీఆర్.. డ్రామారావు! 

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మాటల తూటాలు పేలుతున్నాయి. ట్యాంక్ బండ్ వద్ద ఉన్న ఎన్టీఆర్, పీవీ నరసింహారావుల ఘాట్ లను కూల్చివేయాలన్న ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అక్భర్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటరిచ్చింది బీజేపీ. పీవీ ఘాట్, ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్లారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఆయన సందర్శనకు అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పినప్పటికీ ఆయన అక్కడకు వెళ్లి నివాళులర్పించారు. అక్బరుద్దీన్‌పై విమర్శలు గుప్పించారు బండి సంజయ్. ఎన్టీఆర్ కాలిగోటికి ఎంఐఎం పార్టీ సరిపోదని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కనుమరుగు కాబోతుందని చెప్పారు బండి సంజయ్.          ఎన్టీఆర్ పేరు పెట్టుకున్న కేటీఆర్.. డ్రామారావు అయ్యారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. పీవీ, ఎన్టీఆర్‌పై గౌరవం ఉంటే అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై కేసీఆర్ వెంటనే స్పందించాలని.. ఆయన డిమాండ్ చేశారు. మత విద్వేషాల కుట్రలపై పక్కా సమాచారం ఉంటే ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ముఖ్యమంత్రిని నిలదీశారు. ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని చెప్పారు బండి సంజయ్.

కాంగ్రెస్ లో ఒకే ఒక్కడు! ఆయనపైనే గ్రేటర్ ఆశలు

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. గెలుపు కోసం అభ్యర్థులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. టీఆర్ఎస్, బీజేపీలు ప్రచారంలో దూకుడుగా కనిపిస్తుండగా.. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మాత్రం వెనకబడిపోయినట్లు కనిపిస్తోంది. ముందు కొంత ఉత్సాహంగా ఉన్నా పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్ది కాంగ్రెస్ అభ్యర్థులు కాడి ఎత్తేస్తున్నట్లు కనిపిస్తుందనే చర్చ జరుగుతోంది. మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఒక్కడే గ్రేటర్ లో కాంగ్రెస్ గెలుపు  కోసం ముమ్మర ప్రచారం చేస్తున్నారు. రేవంత్ రెడ్డ ప్రచారానికి ప్రజల్లోనూ మంచి స్పందన కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి కూడా రోజు 10 డివిజన్ల వరకు రోడ్ షో నిర్వహిస్తున్నారు. అయితే  ఆయనకు మద్దతుగా ఇతర కాంగ్రెస్ నేతలెవరు గ్రేటర్ ప్రచారంలో యాక్టివ్ గా కనిపించడం లేదు. పీసీసీ ముఖ్య నేతలు కూడా హైదరాబాద్ ప్రచారంలో అంతంత మాత్రంగానే కనిపిస్తున్నారు.    గ్రేటర్ ఎన్నికలను సవాల్ గా తీసుకున్న బీజేపీ ప్రచారంలో  కేంద్రమంత్రులు, ఇతర రాష్ట్రాలు సీఎంలు, ఆ పార్టీ జాతీయ నేతలు పాల్గొంటున్నారు. టీఆర్ఎస్ అయితే రాష్ట్రంలోని ప్రజా ప్రతినిధులందరిని గ్రేటర్ లోనే మోహరించింది. డివిజన్ కో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీని ఇంచార్జ్ గా పెట్టడంతో .. వారంతా గల్లి గల్లీ తిరిగి టీఆర్ఎస్ అభ్యర్థుల కోసం ఓట్లు అడుగుతున్నారు. ర్యాలీలు, సభలు నిర్వహిస్తూ హడావుడి చేస్తున్నారు. మంత్రి కేటీఆర్ కూడా ఉదయం హుషార్ హైదరాబాద్ సభలు, సాయంత్రం రోడ్ షోలు నిర్వహిస్తూ కారు ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. కాంగ్రెస్ లో మాత్రం రేవంత్ రెడ్డి ఒక్కడే ఆ పార్టీ అభ్యర్థులకు దిక్కయ్యారని చెబుతున్నారు. ఇతర నేతలు చురుకుగా లేకపోవడం, ప్రచారానికి వచ్చినా ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో.. కాంగ్రెస్ అభ్యర్థులంతా తమ డివిజన్ లో ప్రచారం చేయాలని రేవంత్ రెడ్డిని అభ్యర్థిస్తున్నారని చెబుతున్నారు. అయితే సమయం తక్కువగా ఉండటంతో రేవంత్ రెడ్డి కూడా అన్ని డివిజన్లకు వెళ్లలేకపోతున్నారని చెబుతున్నారు.   తమ  పార్టీ నేతల సహకారం లేకపోవడం.. టీఆర్ఎస్, బీజేపీ దూకుడుగా ఉండటంతో కాంగ్రెస్ అభ్యర్థులు చాలా మంది గ్రేటర్ రేసు నుంచి ముందే తప్పుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కొంత మంది అభ్యర్థులు ప్రచారం కూడా ఆపేశారని చెబుతున్నారు. అధికార పార్టీతో పాటు బీజేపీ అభ్యర్థులు భారీగా ఖర్చు చేస్తుండటంతో.. వారిని తట్టుకోవడం సాధ్యం కాదని భావిస్తున్న కొందరు కాంగ్రెస్ అభ్యర్థులు ప్రచారం సమయంలోనే హ్యాండప్ అంటున్నారని సమాచారం. గ్రేటర్ లో 150 డివిజన్లు ఉండగా... పాతబస్తిలోనే 50 వరకు ఉన్నాయి. అక్కడ ఎంఐఎంకి తప్ప ఏ పార్టీకి ఆశలు ఉండవు. మిగిలిన వంద డివిజన్లలో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి. ఇందులో ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థులు కేవలం 20 నుంచి 25 స్థానాల్లో మాత్రం ప్రత్యర్థులకు పోటీ ఇస్తుందని తెలుస్తోంది. ముందు దాదాపు 60 డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థులు ఉత్సాహంగానే ప్రచారం చేసినా.. పరిస్థితులను బట్టి చాలా మంది హస్తం అభ్యర్థులు వెనక్కి తగ్గారని చెబుతున్నారు.   కాంగ్రెస్ అభ్యర్థులు గట్టి పోటీ ఇస్తున్న డివిజన్లు అన్ని మల్కాజ్ గిరి లోక్ సభ పరిధిలోనే ఉన్నాయని తెలుస్తోంది. ఎంపీ రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం వల్లే అక్కడ కాంగ్రెస్ పోటీ ఇస్తుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తన ఎంపీ పరిధిలోకి వచ్చే మల్కాజ్ గిరి, ఎల్బీ నగర్, ఉప్పల్, కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను బరిలోకి దింపారు రేవంత్ రెడ్డి. వారి కోసం ప్రచారం కూడా ముమ్మరంగా చేస్తున్నారు. దీంతో ఈ నాలుగు నియోజకవర్గాల పరిధిలోనే కాంగ్రెస్ అభ్యర్థులు రేసులో ఉన్నారని, మిగితా అన్ని నియోజకవర్గాల్లో ముందే చేతులెత్తేశారని చెబుతున్నారు. రేవంత్ రెడ్డి ప్రచారానికి మంచి స్పందన వస్తుండటంతో కుత్బుల్లాపూర్, ఉప్పల్, మల్కాజ్ గిరి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కు మంచి ఫలితాలు రావచ్చని చెబుతున్నారు. ఎల్బీ నగర్ లో రేవంత్ రెడ్డి క్రేజీ  ఉన్నప్పటికి.. కొందరు ముఖ్యనేతలు బీజేపీలో చేరడంతో  కాంగ్రెస్ కు బలమైన అభ్యర్థులు దొరకలేదని తెలుస్తోంది. మొత్తంగా గ్రేటర్ కాంగ్రెస్ గెలుపు భారమంతా రేవంత్ రెడ్డిపైనే పడిందని, ఆయన కూడా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలే చెబుతున్నారు. మరీ ఒకే ఒక్కడుగా పోరాడుతున్న రేవంత్ రెడ్డి.. జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ కు ఎన్ని సీట్లు సాధించి పెడతారో చూడాలి మరీ...

సంఘ విద్రోహ శక్తులను అణిచివేయండి! పోలీసులకు స్వేచ్చ ఇచ్చిన కేసీఆర్ 

తీవ్ర నిరాశ నిస్పృహలో ఉన్న కొన్ని అరాచక శక్తులు హైదరాబాద్ నగరంలో, తెలంగాణ రాష్ట్రంలో ఘర్షణలు సృష్టించి మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి కుట్ర పన్నుతున్నాయని, వారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి పోలీసు అధికారులను ఆదేశించారు. అరాచక శక్తుల కుట్రలకు సంబంధించి ప్రభుత్వానికి ఖచ్చితమైన సమాచారం ఉందని సిఎం అన్నారు. హైదరాబాద్ నగరంలో, తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడడమే అత్యంత ప్రధానమని, సామరస్య వాతావరణాన్ని దెబ్బతీసి రాజకీయ ప్రయోజనం పొందాలనుకునే వ్యక్తులు, శక్తుల పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని, సంఘ విద్రోహ శక్తులను ఉక్కుపాదంతో అణచివేయాలని చెప్పారు. సంఘ విద్రోహ శక్తులను అణచివేసే విషయంలో పోలీసులకు ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ ఇస్తుందని సిఎం ప్రకటించారు.   రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డి.జి.పి. మహేందర్ రెడ్డి, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సిపిలు అంజనీ కుమార్, విసి సజ్జనార్, మహేశ్ భగవత్, అడిషనల్ డిజిపి జితేందర్, ఐజిలు స్టీఫెన్ రవీంద్ర, వై. నాగిరెడ్డి, నిజామాబాద్ ఐజి శివ శంకర్ రెడ్డి, వరంగల్ ఐజి ప్రమోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.   జిహెచ్ఎంసి ఎన్నికల సందర్భంగా రాజకీయ లబ్ది పొందడానికి కొందరు అనేక కుట్రలు చేస్తున్నారు. మొదట సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారాలు చేశారు. మార్ఫింగ్ ఫోటోలతో ప్రజలను ఏమార్చాలని చూశారు. తర్వాత మాటలతో కవ్వింపు చర్యలకు పూనుకున్నారు. అయినప్పటికీ సహజంగానే శాంతి కాముకులైన హైదరాబాద్ ప్రజలు వారి కవ్వింపు మాటలను, అబద్ధపు ప్రచారాన్ని పట్టించుకోలేదు. మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఎన్ని మాటలు మాట్లాడినా ప్రజల నుంచి స్పందన రావడం లేదు. డబ్బులు పంచి ఓట్లు దండుకోవాలనే ప్రయత్నాలు కూడా హైదరాబాద్ లో నడవవు అని వారికి తెలిసింది. దీంతో వారు మరింత దిగజారి రాష్ట్రంలో, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఘర్షణలు సృష్టించి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారు. రాష్ట్రంలోని ఏ కరీంనగర్లోనో, వరంగల్ లోనో, ఖమ్మంలోనో, మరో చోటనో గొడవలు రాజేసి, దాన్ని హైదరాబాద్ లో విస్తృత ప్రచారం చేయాలని చూస్తున్నారు. హైదరాబాద్ నగరంలో కూడా ఏదో ఓ చోట గొడవ పెట్టుకోవాలని, దానికి మతం రంగు పూయాలని, ప్రార్థనా మందిరాల దగ్గర ఏదో ఓ వికృత చేష్ట చేయాలని చూస్తున్నారు. అలా చేసి ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారు. పెద్ద ఎత్తున గొడవలు చేసి, ఘర్షణ వాతావరణాన్ని సృష్టించి అసలు జిహెచ్ఎంసి ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేకుండా చేయాలని, ఎన్నికలు వాయిదా వేయించాలని పక్కా ప్రణాళిక రచించారు. దీనికి సంబంధించిన సమాచారం ప్రభుత్వం వద్ద ఉంది అని సిఎం కేసీఆర్ చెప్పారు.    హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలో శాంతి సామరస్యాలు యథావిధిగా కొనసాగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఎట్టి పరిస్థితుల్లో సంఘ విద్రోహ శక్తుల ఆటలు సాగనీయవద్దు. ఎంతో పోరాడి తెలంగాణ సాధించుకున్నాం. కడుపు కట్టుకుని, నోరు కట్టుకుని నిబద్ధతతో పనిచేసి రాష్ట్రాన్ని ఓ దరికి తెచ్చాం. శాంతిభద్రతల పరిరిక్షణలో రాజీలేకుండా వ్యవహరిస్తున్నాం. పేకాట కబ్బులు, గుడుంబా లాంటి మహమ్మారులను దూరం చేశాం. సంఘ విద్రోహ శక్తుల పట్ల, మాఫియాల పట్ల, విచ్చిన్నకర శక్తుల పట్ల టిఆర్ఎస్ ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరించిందో ప్రజలు చూశారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. శాంతి భద్రతలను కాపాడే విషయంలో, సంఘ విద్రోహ శక్తులను అణచివేసే విషయంలో ప్రభుత్వం మొదటి నుంచి రాజీలేని ధోరణి అవలంభిస్తున్నది. కాబట్టే నేడు హైదరాబాద్ నగరం, రాష్ట్రం ప్రశాంతంగా ఉంది. ప్రజలు సుఖంగా ఉన్నారు. ఎవరి పని వారు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకుంటున్నారని చెప్పారు కేసీఆర్.   ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్ నగరానికి సేఫ్ సిటీ అనే మంచి పేరు వచ్చింది. పెద్ద ఎత్తున పెట్టుబడులు నగరానికి వస్తున్నాయి. యువకులకు ఉపాధి దొరుకుతున్నది. హైదరాబాద్ మహా నగరంలో మూడు కమిషనరేట్ల పరిధిలో దాదాపు కోటి 60 లక్షల జనాభా ఉంది. ఈ నగరాన్ని కాపాడుకోవడం ప్రభుత్వానికున్న ప్రధాన బాధ్యత. ప్రభుత్వానికి ఈ రాష్ట్రం బాగుండడం ముఖ్యం. హైదరాబాద్ ప్రశాంతంగా ఉండడం ముఖ్యం. ఇక్కడి ప్రజలు సుఖ సంతోషాలతో జీవించడం ముఖ్యం. ప్రశాంత హైదరాబాద్ నగరంలో, తెలంగాణకు గుండె కాయ లాంటి హైదరాబాద్ లో మత విద్వేషాలు రెచ్చగొట్టి, మత ఘర్షణలు పెట్టి, రాజకీయ లబ్ది పొందాలని కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాద్ నగర ప్రశాంతతను ఫణంగా పెట్టి ఎవరినో క్షమించాల్సిన అవసరం లేదు. ఘర్షణలు సృష్టించే వారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలి. ఎంతటి వారినైనా సరే, వారు అధికార పార్టీ సభ్యులైనా సరే వదలొద్దు. ఎక్కడికక్కడ సమాచారం సేకరించి, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి కుట్రలను భగ్నం చేయాలని అని సిఎం కేసీఆర్ స్పష్టం చేశారు.    ప్రశాంత హైదరాబాద్ లో మత చిచ్చు పెట్టడానికి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించడానికి ప్రయత్నాలు చేసే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సిఎం కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఉద్వేగాలు, ఉద్రేకాలు రెచ్చగొట్టే వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోవద్దని యువకులను కోరారు. ఎన్నికల్లో ప్రజాస్వామ్య బద్ధంగా, పారదర్శకంగా పోరాడాలని రాజకీయ పార్టీలను కోరారు. పోలీసు యంత్రాంగం పూర్తి అప్రమత్తతతో ఉంటుందని, ఎట్టి పరిస్థితుల్లో అరాచక, సంఘ విద్రోహ శక్తుల కుట్రలు భగ్నం చేసి తీరుతామని పోలీసు అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు. హైదరాబాద్ లోనే కాకుండా, రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉంటారని, ఎక్కడ ఏ చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా చూస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

బీజేపీలోకి స్వామి గౌడ్! కారుకు ఇక పంక్చర్లేనా?

టీఆర్ఎస్ లో అసమ్మతి బాంబ్ పేలబోతుందా? కేసీఆర్ కు షాకిచ్చేందుకు నేతలు ఒక్కొక్కరుగా సిద్ధమవుతున్నారా? కారు పార్టీకి ఇకపై వరుస కష్టాలేనా? తెలంగాణలో జరుగుతున్న రాజకీయ మార్పులతో జనాల్లో ఇదే చర్చ జరుగుతోంది. శాసనమండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ బీజేపీలో చేరడంతో.. ఆయన బాటలోనే మరికొందరు గులాబీ నేతలు కమలం గూటికి చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారని తెలుస్తోంది. కేసీఆర్ తీరుపై గుర్రుగా ఉన్న నేతలంతా బయటికి రాబోతున్నారనే ప్రచారం జరుగుతోంది.    శాసనమండలి మాజీ చైర్మెన్ స్వామి గౌడ్ కొంత కాలంగా కేసీఆర్ తీరుపై అసంతృప్తిగా ఉన్నారు. శాసనమండలి చైర్మెన్ పదవి కాలం ముగిసాకా ఆయనను పట్టించుకోవడమే మానేశారట టీఆర్ఎస్ పెద్దలు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాజేంద్రనగర్ నుంచి పోటీకి సిద్ధమైన స్వామి గౌడ్ కు టికెట్ ఇవ్వలేదు. లోక్ సభ ఎన్నికల్లో చేవెళ్ల టికెట్ ఇస్తారని ప్రచారం జరిగినా అది కూడా జరగలేదు. దీంతో కేసీఆర్ వైఖరి, టీఆర్ఎస్ సర్కార్ పై చాలా సార్లు అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తపరిచారు స్వామి గౌడ్. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులందరిని ఏకం చేసిన తనకు ప్రభుత్వంలో తగిన ప్రాధాన్యత దక్కడం లేదని ఆయన ఆగ్రహంగా ఉన్నారనే ప్రచారం జరిగింది. రెండు నెలల క్రితం కూడా హాట్ కామెంట్స్ చేశారు. టీఆర్ఎస్ లో బీసీ నేతలను పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. దీంతో స్వామి గౌడ్ పార్టీ మారతారని ప్రచారం జరిగినా ఆయన ఖండిస్తూ వచ్చారు.    దుబ్బాక ఉప ఎన్నిక విజయంతో స్పీడ్ పెంచిన బీజేపీ.. మూడేళ్ల తర్వాత జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. అందులో భాగంగానే గులాబీ పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తోంది. ఇటీవలే స్వామిగౌడ్‌తో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ నేత లక్ష్మణ్‌ సమావేశమై బీజేపీలోకి రావాలని ఆహ్వానించారు. అయితే అప్పుడు చేరికను నిర్దారించని స్వామి గౌడ్.. ఢిల్లీకి వెళ్లి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. స్వామి గౌడ్ చేరికతో గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి భారీగా ప్రయోజనం కలగనుంది కమలం నేతలు చెబుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులను ఏకతాటిపై నడిపిన స్వామి గౌడ్ కు.. ఇప్పటికే ఉద్యోగ సంఘాలపై పట్టుంది. గ్రేటర్ ఓటర్లలో లక్షలాది మంది ఉద్యోగులు ఉన్నారు. వారంతా ఇప్పుడు బీజేపీకి సపోర్ట్ చేయవచ్చని భావిస్తున్నారు. నగరంలోని గౌడ సామాజిక వర్గం కూడా బీజేపీ వైపు మెగ్గుచూపుతుందని భావిస్తున్నారు.                   స్వామి గౌడ్ బీజేపీలో చేరడంతో తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. స్వామి గౌడ్ బాటలోనే చాలా మంది టీఆర్ఎస్ నేతలు కారు దిగి కమలం గూటికి చేరబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన చాలా మంది నేతలకు ఇప్పటి వరకు ఎలాంటి పదవులు రాలేదు. అలాంటి వారంతా బీజేపీలో చేరుతారని చెబుతున్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ బీటీ, యూటీ బ్యాచ్ లుగా విడిపోయిందన్న చర్చ జరుగుతోంది. బంగారు తెలంగాణ.. బీటీ బ్యాచ్ హవానే పార్టీలో సాగుతుందని.. ఉద్యమ తెలంగాణ నేతలకు అన్యాయం జరుగుతుందన్న విమర్శలు ఉన్నాయి. పలుసార్లు స్వామిగౌడ్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. దీంతో ఇప్పుడు యూటీ బ్యాచ్ నేతలంతా బీజేపీ వైపు వస్తారని భావిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది నేతలు కమలం నేతలతో టచ్ లోకి వచ్చారని చెబుతున్నారు. గ్రేటర్ ఎన్నికల్ల బీజేపీ విజయం సాధిస్తే .. ఆ పార్టీలోకి వలసలు మరింత పెరుగుతాయంటున్నారు.    మరోవైపు స్వామి గౌడ్ చేరికతో తమకు మరింత బలం వచ్చిందని భావిస్తున్న తెలంగాణ బీజేపీ నేతలు.. గ్రేటర్ ఎన్నికల పోలింగ్ కు ముందే మరిన్ని చేరికలకు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. గ్రేటర్ ప్రచారానికి జేపీ నడ్డా రానుండటంతో.. ఆయన సమక్షంలో మరికొందరు టీఆర్ఎస్ నేతలు కాషాయ కండువా కప్పుకునేలా కసరత్తులు చేస్తున్నారట. మొత్తంగా స్వామి గౌ]డ్ తో మొదలైన టీఆర్ఎస్ నుంచి జంపింగ్ లు కొనసాగుతూనే ఉంటాయని, టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి ఊహించని విధంగా చేరికలు ఉంటాయని తెలంగాణ బీజేపీ నేతలు చెబుతున్నారు. కొందరు పెద్ద నేతలు కూడా కమలం పెద్దలతో మాట్లాడుతున్నారని కూడా బాంబ్ పేల్చుతున్నారు.

హామీల ‘బండి’ పరుగులు తీసేనా?

గ్రేటర్‌లో ‘సంజయ్’ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్   ఇచ్చిన హామీలకు నిధులెలా?   ట్రాఫిక్, ఎల్‌ఆర్‌ఎస్‌తో ‘గ్రేటర్’కు సంబంధమేమిటో?   తెలంగాణలో బీజేపీ ‘సంజయ్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్’.. అధికార టీఆర్‌ఎస్  పార్టీ గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. కేసీఆర్ సర్కారును ఊపిరాడనీయకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సంజయ్.. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో,  బస్తీనిద్ర చేసే వరకూ వెళుతున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక విజయం ఇచ్చిన టానిక్.. అందరికంటే సంజయ్‌కే ఎక్కువ పనిచేస్తున్నట్లు గ్రేటర్‌లో ఆయన దూకుడు చూస్తే స్పష్టమవుతోంది. అందుకే ఎవరూ ఊహించని హామీలు వరదలా పారిస్తూ, అందరినీ తన వైపు మళ్లించుకునే ప్రయత్నం చేస్తున్నారు.   సహజంగా ఏ ఎన్నికలప్పుడయినా,  మేనిఫెస్టోలు విడుదల చేయడం అన్ని పార్టీలకూ అలవాటే. ప్రధానంగా.. అధికారంలో ఉన్న పార్టీలు,  స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు విడుదల చేసే మేనిఫెస్టోకు ఎక్కువ విలువ-నమ్మకం ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వంలో ఆ పార్టీనే అధికారంలో ఉంటుంది కాబట్టి, అది ఇచ్చే హామీలే ఎక్కువ మేరకు పనిచేసే అవకాశం ఉంటుంది. అదే ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు ఎన్ని హామీలిచ్చినా,  వాటిని ప్రజలు నమ్మే అవకాశం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే.. ప్రభుత్వంలో ఒక పార్టీ ఉంటే, కార్పొరేషన్‌లో మరో పార్టీ అధికారంలోకి వస్తే పనులు జరగవు. పైగా ప్రతిరోజూ ఘర్షణ వాతావరణం ఉంటుంది. ఈ ఒక్క కారణంతోనే ప్రజలకు.. ప్రభుత్వాలపై వ్యతిరేకత, ప్రతిపక్షాలపై సానుకూలత ఉన్నప్పటికీ, ఓటు మాత్రం అభివృద్ధి కోణంలో, అధికారంలో ఉన్న పార్టీకే వేస్తుంటారు. ఇది ఎక్కడయినా సహజమే.   గతంలో చెన్నై నగరంలో ఇదే జరిగింది. అధికారంలో అన్నాడిఎంకె ఉంటే, మేయర్ పదవి డీఎంకె చేతిలో ఉండేది. ఆ సమయంలో జరిగిన ఘర్షణ తెలిసిందే. ఉమ్మడి రాష్ట్రంలో ఎంసీహెచ్ ఎన్నికలు జరిగితే టీడీపీ మేయర్‌గా తీగల కృష్ణారెడ్డి సారధ్యంలో టీడీపీ అధికారం సాధించింది. అప్పటివరకూ టీడీపీనే ప్రభుత్వంలో ఉన్నందున ఎలాంటి ఇబ్బంది రాలేదు. ఆ తర్వాత వైఎస్ సీఎంగా రావడంతో, గ్రేటర్ పరుగు మందగించిన వైనాన్ని విస్మరించకూడదు.  పైగా ప్రతిపక్ష పార్టీ అధికారంలో ఉన్న కార్పొరేషన్లు పంపించే ప్రతిపాదనలను, రాష్ట్ర ప్రభుత్వం సహజంగా ఆమోదించదు. బడ్జెట్ లో కూడా వివక్ష ప్రదర్శిస్తుంది. కాబట్టి.. విపక్ష పార్టీలు ఇచ్చే హామీలు చెల్లుబాటయ్యే అవకాశాలు బహు తక్కువగా ఉంటాయి. నేరుగా కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునే వెసులుబాటు కూడా తక్కువగానే ఉంటుంది. ఈ  దృష్ట్యా నిధులు-అధికారాల కోసం నిత్యం అధికారంలో ఉన్న పార్టీతో యుద్ధం చే యడం అనివార్యం.   ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో, బీజేపీ దళపతి బండి సంజయ్ ఇచ్చిన హామీలు దుమ్మురేపుతున్నాయి. ఓ వైపు ప్రజలు వాటిపై ఆశ-ఆసక్తి ప్రదర్శిస్తున్నా.. మరోవైపు అది ఎంతవరకూ ఆచరణ సాధ్యమన్న సందేహాలూ వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన బాధితులకు, కేసీఆర్ సర్కారు ఇంటికి పదివేలు నష్టపరిహాం అందించింది. అయితే, ఆ పంపిణీ ప్రక్రియపై చాలా ఆరోపణలు కూడా వచ్చాయి. టీఆర్‌ఎస్ కార్పొరేటర్లు, స్థానిక నేతలు తమ వారికి మాత్రమే ఇప్పించుకున్నారని, అందులో సగం కొట్టేశారన్న ఆరోపణలు కాంగ్రెస్-బీజేపీ నుంచి వినిపించిన విషయం తెలిసిందే. ఈలోగా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది.  వరద నిధుల సాయం ఆపాలని బండి సంజయ్ ఫిర్యాదు చేసినందుకే,  ఎన్నికల కమిషన్ దానిని ఆపివేసిందని టీఆర్‌ఎస్ ఆరోపించటం..  దానిని రుజువుచేయాలని సంజయ్ సవాల్ చేసి, ప్రమాణం చేసేందుకు  భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్లడం సంచలనం సృష్టించింది.   మళ్లీ ఎన్నికల వాతావరణాన్ని కాక పుట్టించేందుకు..  సంజయ్ బీజేపీ పక్షాన ఇచ్చిన హామీలు కూడా, జనక్షేత్రంలో చర్చనీయాంశంగా మారాయి. తాము గ్రేటర్ ఎన్నికల్లో గెలిస్తే, వరద బాధితులకు ఇంటికి 25 వేలు ఇస్తామని, వరదలో కారు-మోటర్‌వాహనం పాడయిపోతే కొత్త వాహనాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా... నగరంలో ట్రాఫిక్ పోలీసులు చలాన్లు వేస్తూ యువతను వేధిస్తున్నందున, తాము అధికారంలోకి వస్తే.. ఆ చలాన్లు తామే కడతామని, అసలు ట్రాఫిక్ చలాన్ల వ్యవస్థనే రద్దు చేస్తామన్న సంచలన హామీలు,  సహజంగానే టీఆర్‌ఎ స్‌లో కలవరం కలిగిస్తున్నాయి. ఎల్‌ఆర్‌ఎస్ రద్దు హామీ కూడా అందులో ఒకటి. అయితే.. సంజయ్ హామీల సాధ్యాసాధ్యలపైన విద్యాధికులు, మధ్య తరగతి వర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు తెరలేచింది.   అసలు..  సంజయ్ ఇచ్చిన హామీలన్నీ రాష్ట్ర ప్రభుత్వ పరిథిలోనివి అయినప్పుడు, ఒకవేళ గ్రేటర్ ఎన్నికల్లో గెలిచే మేయర్ ఎలా అమలుచేస్తారన్న సందేహం తెరపైకి వస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ బడ్జెట్ 18 వేల కోట్లు మాత్రమే. అందులో జీతాలకే సింహభాగం ఖర్చవుతుంది. ఇక ఇటీవలి వరద బాధితులకు..  ముఖ్యమంత్రి సహాయ నిధి ఖాతా నుంచి మాత్రమే,   ఇంటికి పదివేల రూపాయల చొప్పున చేసిన సాయం చేశారు.  దీనికి- గ్రేటర్ కార్పొరేషన్ నిధులకు ఏమాత్రం సంబంధం లేదు. ఇక ఎల్‌ఆర్‌ఎస్ కొనసాగింపు లేదా రద్దు అంశం కూడా,  పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిథిలోనిదే. ఒకవేళ రేపు బీజేపీ మేయర్‌గా గెలిస్తే, ఇంటికి 25 వేలు ఏ ఖాతా నుంచి ఇస్తారన్నది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది.   మరో కీలక అంశం ట్రాఫిక్ చలాన్ల రద్దు. దీనితో గ్రేటర్ కార్పొరేషన్‌కు ఎలాంటి సంబంధం లేదు. ఒకవేళ చలాన్లు గ్రేటర్ కార్పొరేషన్ చెల్లిస్తే చెల్లించవచ్చు. కానీ అందుకు కోట్ల రూపాయల నిధుల అవసరం ఉంది. ఇప్పటికే గ్రేటర్ కార్పొరేషన్ నిధుల్లేక అవస్థల పాలవుతోంది.  అయితే, మోటార్ వెహికల్ యాక్టు పూర్తిగా కేంద్ర మార్గదర్శకాల మేరకు అమలవుతుంది. చలాన్లు మాత్రం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు వెళుతుంది. వాటిని పోలీశాఖ లేదా ప్రభుత్వ అవసరాల మేరకు వినియోగిస్తుంటారు. ఇది ఒక్క తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వమే కాదు, బీజేపీ పాలిత రాష్ర్టాల్లోనూ అమలయ్యే ప్రక్రియనే.   తాజా గ్రేటర్ ఎన్నికల్లో..  తమ పార్టీ అధికారంలోకి వస్తే.. ప్రజలు నిబంధనలు ఉల్లంఘిస్తూ కడుతున్న ట్రాఫిక్ చలాన్లు.. ఇకపై  గ్రేటర్ కార్పొరేషన్ చెల్లిస్తుందన్న,  బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ హామీపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. 2014 నుంచి 2019 జూన్ వరకూ అందుబాటులో ఉన్న గణాంకాలు పరిశీలిస్తే... మొత్తం 56 కోట్ల రూపాయలు చలాన్ల రూపంలో వసూలయ్యాయి. అందులో సిగ్నల్ జంపింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, లైసెన్సు లేకుండా డ్రైవింగ్ చేయడం, త్రిబుల్‌రైడింగ్ వంటి కేసులకు సంబంధించిన చలాన్లు ఉన్నాయి. కేంద్రప్రభుత్వం కూడా చలాన్ల రుసుం పెంచడం ద్వారా, ప్రమాదాలు తగ్గించేందుకు కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. దేశంలోని అన్ని రాష్ర్టాలూ వాటినే అమలుచేస్తున్నాయి.   అయితే, బండి సంజయ్ హామీ ఇచ్చినట్లు...గ్రేటర్  కార్పొరేషనే ట్రాఫిక్ చలాన్లు చెల్లించడం లేదా రద్దు చేయడం వంటి చర్యలను.. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో కూడా అమలుచేస్తున్న దాఖలాలు కనిపించవు. మరి ఒక్క ‘గ్రేటర్’లోనే ఆ విధానం ఎలా అమలుచేస్తారన్న సందేహం, గ్రేటర్‌లో విద్యాధికుల నుంచి వినిపిస్తోంది. పైగా 18 వేల కోట్ల గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ బడ్జెట్‌లో,  జీతాలకు పోగా మిగిలేది అ తి స్వల్పమయినప్పుడు... ఇక ట్రాఫిక్ చలాన్ల రూపంలో వచ్చే బిల్లులు ఏవిధంగా.. ఎక్కడి నుంచి ఇస్తారన్నది మరో ప్రశ్న.   ఎందుకంటే.. ఒక్క 2019 జూన్ వరకే,  5.2 లక్షల కేసులకు గాను... 9.12 కోట్ల రూపాయలు చలాన్ల రూపంలో వసూలయ్యాయి. 2018లో 6.79 కోట్లు, 2017లో 8.84 కోట్లు, 2016లో 10.98 కోట్లు, 2015లో 11.30 కోట్లు, 2014లో 21.63 కోట్లు చలాన్ల రూపంలో ఖజానాకు చేరాయి. మరి ఈ డబ్బును గ్రేటర్ కార్పొరేషన్,  పోలీసులకు ఎలా చెల్లిస్తుందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మద్యం తాగి డ్రైవింగ్ చేసేవారి నుంచి, 3 కోట్ల రూపాయల చలాన్లు వసూలు చేశారు. మద్యం తాగుతూ డ్రైవింగ్ చేయడం నేరం. అందుకే బీజేపీ అధికారంలో ఉన్న కేంద్రప్రభుత్వమే భారీ చలాన్లు విధించింది. మరి ఒకవేళ బీజేపీ గ్రేటర్‌లో గెలిస్తే... మద్యం తాగుతూ పట్టుపడ్డ వాహనదారులకు విధించే చలాన్లు, అదే బీజేపీ చెల్లిస్తే.. అది కేంద్ర విధానాన్ని ధిక్కరించినట్లే కదా? మద్యం తాగుతూ వాహనాలు నడపటాన్ని ప్రోత్సహించినట్లు కాదా అన్నది మరో ప్రశ్న.   ఇక ఎల్‌ఆర్‌ఎస్ రద్దు కూడా,  గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ పరిథిలోని అంశం కాదు. అది కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించాల్సిందే. చివరకు బీఆర్‌ఎస్, బీపీఎస్ వంటి స్కీములు కూడా ప్రభుత్వం ఆమోదిస్తేనే..  గ్రేటర్ కార్పొరేషన్ అమలుచేయాల్సి ఉంటుంది. మరి ఏ అధికారంతో..  బీజేపీ,  ఎల్‌ఆర్‌ఎస్ రద్దు హామీ ఇచ్చిందన్న అంశంపైనే  ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.  బీజేపీ పట్ల  మధ్య తరగతి-విద్యాధికులలో ఇప్పటివరకూ సానుభూతి ఉంది. ఇలాంటి అసాధ్యమైన హామీలు గుప్పించడం ద్వారా, ఆ సానుభూతి దూరమయ్యే ప్రమాదం లేకపోలేదు. -మార్తి సుబ్రహ్మణ్యం