నిమ్మగడ్డ ఉన్నంతకాలం స్థానిక ఎన్నికలు జరగవు: జేసీ
posted on Nov 19, 2020 @ 3:01PM
స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఏపీ ప్రభుత్వానికి, ఎన్నికల సంఘం కమిషనర్ కు మధ్య జరుగుతున్న వివాదంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసి దివాకర్ రెడ్డి. ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఉన్నంత కాలం స్థానిక ఎన్నికలు జరిగేది కష్టమేనని చెప్పారు. పంచాయతీ ఎన్నికలను ప్రభుత్వం అడ్డుకోవడం వెనుక పెద్ద వ్యూహమే ఉందన్నారు దివాకర్ రెడ్డి. జస్టిస్ కనగరాజ్ ను ఎన్నికల కమిషనర్ గా నియమించుకుని, స్థానిక ఎన్నికలను ఏకగ్రీవం చేసుకునే ఎత్తుగడ వేశారని ఆరోపించారు. అందుకే ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలను ఆలస్యం చేస్తోందని జేసీ వివరించారు.
తాము కోరుకున్న కనగరాజ్ ఎన్నికల కమిషనర్ గా వస్తే తమ అభీష్టం ప్రకారం ఎన్నికలు జరుపుకుంటుందని వైసీపీ సర్కారుపై ఆరోపణలు చేశారు జేసీ దివాకర్ రెడ్డి. ఇంతకుముందు ఏకగ్రీవమైన స్థానాలు చెల్లుబాటు అవుతాయని కనగరాజ్ తో ఆదేశాలు ఇప్పిస్తారని చెప్పారు. ఇకపై ఎస్ఈసీ నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్ లకు అధికారులు హాజరయ్యేది అనుమానమేనని, వారు ఏదో ఒక సాకు చెప్పి సమావేశాలకు దూరంగా ఉండే అవకాశాలున్నాయని జేసీ వివరించారు. ఒకవేళ ఎన్నికలు వస్తే విపక్ష అభ్యర్థులను పోలీసు బలంతో బెదిరించి నామినేషన్లు వెనక్కి తీసుకునేలా చేస్తారని అన్నారు. ప్రజల్లో తమపై అభిమానం ఉన్నా, ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు ఏకపక్షంగానే జరుగుతాయని, స్థానిక సంస్థల ఎన్నికల్లో విపక్షాలు బరిలో దిగకపోవడమే మంచిదని జేసీ అభిప్రాయపడ్డారు. ఒకవేళ విపక్ష పార్టీల నుంచి ఎవరైనా గెలిచినా ఏదో ఒక ఆరోపణతో పోలీసు కేసు నమోదు చేస్తారని తెలిపారు జేసీ దివాకర్ రెడ్డి.