ఎన్నికల నిర్వహణ బాధ్యత ఎస్ఇసిదే.. స్పష్టం చేసిన మాజీ సీఎస్ ఐవైఆర్
posted on Nov 19, 2020 @ 5:03PM
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య తీవ్ర రచ్చ జరుగుతున్న సంగతి తెల్సిందే. తాజాగా ఈ వ్యవహారంలో సీఎస్ తీరు పై, అలాగే మంత్రి కొడాలి నాని అసభ్య వ్యాఖ్యల పై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన కు ఫిర్యాదు చేసారు. అయితే తాజాగా ఈ వ్యవహారం పై మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు. రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వం, ఎన్నికల కమిషనర్ ఈ వ్యవహారంలో రాజ్యాంగ సంక్షోభానికి దారి తీసేలా ప్రవర్తిస్తున్నారని ఐవైఆర్ అన్నారు. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ అధికారం ఎలక్షన్ కమిషనర్‌దేనని అయన తేల్చి చెప్పారు. ఎన్నికల కమిషన్ ఎన్నికల నిర్వహణ పై రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించడమంటే దీనిపై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిది కాదని అయన అన్నారు. ఒకవేళ ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కనుక అడ్డుపడితే కోర్టులో ఈ సారి అక్షింతలతోనే వ్యవహారం ఆగకపోవచ్చని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలు పూర్తిగా వివేక రహితంగా ఉన్నాయని అయన అన్నారు.