ఎస్ఈసీ నిమ్మగడ్డ వీడియో కాన్ఫరెన్స్ మరో సారి రద్దు.. ఇక మళ్ళీ కోర్టుకేనా..
posted on Nov 19, 2020 @ 11:21AM
ఏపీలో స్థానిక ఎన్నికలు జరపడం కోసం ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్న సంగతి తెల్సిందే. దీనికోసం జిల్లా కలెక్టర్లు, జడ్పీసీఈవోలు, జిల్లా పంచాయతీ అధికారులతో ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్ జరపాలని నిర్ణయించి సీఎస్ కు లేఖ రాశారు. దీనికోసం ఎన్నికల కమిషన్ కార్యాలయంలో ఏర్పాట్లు కూడా జరిగాయి. అయితే సమావేశంలో పాల్గొనాలని సీఎస్ నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని జిల్లాల కలెక్టర్లు చెబుతున్నారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుండి అనుమతి రాకపోవడంతో ఈ రోజు కూడా సమావేశం రద్దు అయినట్లుగా తెలుస్తోంది. ఇదే విషయమై ప్రభుత్వ అనుమతి రాకపోవడంతో నిన్న జరగాల్సిన వీడియో కాన్ఫరెన్స్ రద్దు అయిన సంగతి తెల్సిందే.
ఇది ఇలా ఉండగా వీడియో కాన్ఫరెన్స్ విషయంలో ప్రభుత్వం వైపు నుంచి క్లారిటీ రాకపోవడంతో పాటు ఎన్నికల నిర్వహణ పై రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదనే విషయాన్ని ఎస్ఈసీ కోర్టు దృష్టికి తీసుకెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహణ కోసం రెండు సార్లు సీఎస్ కు లేఖలు రాసినా అంగీకరించ లేదనే విషయాన్ని సైతం కోర్టు దృష్టికి తీసుకెళ్లే యోచనలో ఎస్ఈసీ ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తాము ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నా.. ప్రభుత్వం ఏమాత్రం సహకరించడం లేదనడానికి ఇదే నిదర్శనమని ఎస్ఈసీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇది ఇలా ఉండగా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఉద్దేశించి మంత్రి కొడాలి నాని అసభ్య వ్యాఖ్యలతో పాటు, ఎన్నికల నిర్వహణపై పలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఎస్ఈసీ గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. మంత్రి నాని ఉపయీగించిన పదజాలం పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. అయన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో టేపులు, పేపర్ క్లిప్పింగులను ఎస్ఈసీ గవర్నర్ కు పంపారు. మంత్రి నాని పై వెంటనే చర్యలు తీసుకోవాలని నిమ్మగడ్డ గవర్నర్ కు విజ్ఞప్తి చేసారు.