ఆరేండ్లుగా హైదరాబాద్ ప్రశాంతం! కేసీఆరే రక్షన్న కేటీఆర్
posted on Nov 19, 2020 @ 12:23PM
సీఎం కేసీఆర్ వలనే హైదరాబాద్ ప్రశాంతంగా ఉందన్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణ వచ్చినప్పుడు హైదరాబాద్ లో కొన్ని చోట్ల అనిశ్చితి నెలకొందని తెలిపారు. హైదరాబాద్ పై ఎన్నో అసత్యప్రచారాలు చేశారన్నారు. ప్రాంతీయ విద్వేషాలు వస్తాయని ప్రచారం జరిగిందన్నారు. హైదరాబాద్ కు పెట్టుబడులే రావని.. తెలంగాణ వస్తే అంతా చీకటే అని పలువురు విమర్శించారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం దేశమంతా హైదరాబాద్ వైపు చూస్తోందని చెప్పారు మంత్రి కేటీఆర్.
హైదరాబాద్ లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ లో మాట్లాడిన కేటీఆర్.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా పదవీ బాధ్యతలు చేపట్టకముందు ఎన్నో విమర్శలు చేసినా... అసాధారణ పరిణతి చూపించారని కేటీఆర్ చెప్పారు. జూన్ 2న 2014లో బాధ్యతలు తీసుకున్న తర్వాత కనీస అవసరాలు, మౌలిక వసతులు, ప్రాథమిక అవసరాల దృష్టిలో పెట్టుకుని పని చేశామన్నారు గతంలో ఎండాకాలం వస్తే జలమండలి ఎదుట ధర్నాలు జరిగేవని, ఇప్పుడు తాగునీటి కోసం యుద్ధాలు చేసే పరిస్థితి నగరంలో లేదని చెప్పారు. శివారు ప్రాంతాలకు నీళ్లు ఇచ్చిన ఘనత కేసీఆర్‌దేనన్నారు కేటీఆర్. మెట్రో నగరాల్లో పారిశుద్ధ్య నిర్వహణలో హైదరాబాద్ ముందుందన్నారు.
హైదరాబాద్‌లో త్వరలో రెండు చెత్త డంపింగ్ యార్డులు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు కేటీఆర్. దక్షిణ భారతదేశంలోనే తొలి వేస్ట్ ఎనర్జీ ప్లాంట్‌ను ఏర్పాటు చేశామన్నారు. హైదరాబాద్‌లో 3,200 స్వచ్ఛ ఆటోలు పనిచేస్తున్నాయని తెలిపారు. గతంలో వారానికి 2 రోజులు పవర్ హాలిడేలు ఉండేవని గుర్తు చేశారు. ఇప్పుడు పరిశ్రమలకు 24 గంటల కరెంట్ ఇస్తున్నామన్నారు. హైదరాబాద్‌లో పేకాట క్లబ్‌లు లేవు, గుడుంబా గబ్బులు లేవని తెలిపారు. నిర్మాణ రంగం వ్యర్థాల కోసం ప్రత్యేక ప్లాంట్ ఏర్పాటు చేశామన్నారు. పోకిరీలు, ఆకతాయిల ఆగడాలకు అడ్డుకట్ట పడిందన్నారు కేటీఆర్. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రగతి పథంలో దూసుకుపోతోందన్నారు. విద్యుత్ లోటు నుంచి మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిందని తెలిపారు కేటీఆర్.