ఒకే ఇంట్లో 20  ఎమ్మెల్సీ  ఓట్లు.. 

తెలంగాణలో జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బోగస్ ఓట్ల కలకలం రేగుతోంది. భారీగా బోగస్ ఓట్లు నమోదు చేయించారనే ఆరోపణలు మొదటి నుంచి వినిపిస్తుండగా.. తాజాగా అందుకు బలమైన ఆధారం లభించే ఘటన వెలుగు చూసింది.  భధ్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒకే ఇంటి నంబర్ పై  ఏకంగా 20 ఓట్లు నమోదయ్యాయి. వాటిలో 17 గ్రాడ్యుయేట్ ఓటర్ల  లెక్కలు తప్పు అని తెలుస్తోంది. అధికారుల విచారణలోనూ ఆ ఇంటిలో ముగ్గురు పట్టభధ్రులు మాత్రమే ఉన్నట్లు తేలింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణం రైటర్ బస్తీ కాలనీకి చెందిన 15వ వార్డు 8-3-19 నంబరు గల ఇంటి యజమాని వాసమళ్ళ ఏసురత్నం ఓటర్ల జాబితా ప్రకారం ఆ ఇంటి నెంబరుపై ఏకంగా 20 ఓట్లు నమోదు కావడంతో అధికారులకు అనుమానం వచ్చింది. అధికారులు ఆ ఇంటి యజమానిని ఆరా తీయగా ముగ్గురు పట్టభధ్రులు మాత్రమే ఉన్నారని...మిగతా 17 మంది ఎవరో కూడా తమకు తెలియదని వారు తెలిపారు. వారి వివరాలను తెలుపగా వారి పేర్లు కూడా ఎప్పుడూ వినలేదని ఇంటి యజమాని చెప్పడంతో అధికారులు షాకయ్యారు. ఓటర్ల జాబితాను అధికారులు పరిశీలించగా.. ఇలాంటి తప్పిదాలు ఇంకా చాలా ఉన్నాయని గుర్తించారు.  ఒకే ఓటరు పేరు రెండు పోలింగ్ కేంద్రాల్లోనూ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే ఇది ఎవరి పని అనేది అనుమానాలకు తావిస్తోంది. ఎన్నికల్లో గెలుపు కోసం రాజకీయ పార్టీలు ఇలా ఓటర్లను నమోదు చేయించాయా? అనే అనుమానం ఉంది.  అలా చేయించింది ఎవరు? ఏ పార్టీకి చెందిన వారు? అనేది మాత్రం తెలియడం లేదు. బోగస్ ఓట్లు వెలుగు చూస్తుండటంతో పోటీలో ఉన్న అభ్యర్థులు టెన్షన్ పడుతున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి డైరెక్షన్ లోనే వేలాదిగా బోగస్ ఓట్లు చేర్పించారని స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఆరోపిస్తున్నారు. మంగళవారం ఆయన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలిసి దీనిపై ఫిర్యాదు కూడా చేశారు. 

రోజా రాజీనా..? రాజకీయ రచ్చబండ

రోజా ఒక్కరు ఒకవైపు. చిత్తూరు జిల్లా వైసీపీ నేతలంతా మరోవైపు. అధికార పార్టీలో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. పాపం.. రోజాకు కన్నీరే మిగిలింది. ఆమె రాజకీయ భవిష్యత్తు రచ్చబండలా మారింది. రోజాను ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా అడుగడుగునా మోకాలొడ్డుతున్నారు సొంత పార్టీలోని వ్యతిరేకులు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మరోసారి ఆ కోల్డ్ వార్ కాకా రేపుతోంది. నగరి, పుత్తూరులో వైసీపీ తరఫును ఎమ్మెల్యే రోజా అనుచరులు పలువురు పోటీలో ఉన్నారు. అయితే, రోజాను రాజకీయంగా దెబ్బ తీసేందుకు, వైసీపీ అభ్యర్థులపైనే రెబల్స్ ను రంగంలోకి దించారు సీనియర్లు. దీంతో పార్టీ ఓటు బ్యాంకు ఇరు వర్గాల మధ్య చీలిపోయి వైసీపీకి ఓటమి తప్పని పరిస్థితి. తన అనుచరులను ఓడించడానికే ఇలా చేశారంటూ రెబెల్స్ పై ఫైర్ అయ్యారు రోజా. సొంత పార్టీ నేతలే తన కొంప ముంచుతున్నారంటూ మండిపడ్డారు. "గత ఎన్నికల్లో తన ఓటమికి పని చేసిన వారే ఇప్పుడీ పని చేశారు. నగరి, పుత్తూరులో 14మంది రెబెల్స్ ను పెట్టారు. ఆ రెబెల్స్ కు వైసీపీ నేతలు భారీగా డబ్బులు ఇచ్చారు. వెన్నుపోటుదారులను అధిష్టానం గుర్తించాలి." సాక్ష్యాధారాలతో నిరూపించి కుట్రదారులపై వేటు వేయిస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే రోజా.  రెబెల్స్ కు రోజా వార్నింగ్ తో చిత్తూరు రాజకీయ రచ్చబండ గురించి మరోసారి చర్చ జరుగుతోంది. రోజాకు అడుగడుగునా చెక్ పెడుతూ ఇద్దరు జిల్లా మంత్రులు ఆమెతో చెడుగుడు ఆడుకుంటున్నారు. మంత్రి పెద్దిరెడ్డి. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. చిత్తూరు వైసీపీలో ఈ ఇద్దరిదే ఆధిపత్యం. సీనియర్లతో రోజాకు అసలు ఏమాత్రం పొసగడం లేదు. ఏళ్లుగా ఇదే తీరు. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ వాయిస్ ను బలంగా వినిపించిన నేత రోజా. అసెంబ్లీలోనైనా, ప్రజాక్షేత్రంలోనైనా రోజా మాటలు మంటలు రేపేవి. అందుకే, ఫైర్ బ్రాండ్ లీడర్ గా పాపులర్ అయ్యారు రోజా. జగనన్న చెల్లిగా అధినేతతో సాన్నిహిత్యం ఎక్కువ. ప్రజల్లోనూ మంచి ఆదరణ. జబర్దస్త్ తో ఫుల్ క్రేజ్. ఇలా పార్టీలోనూ, ప్రజల్లోనూ రోజా ఇమేజ్ అమాంతం పెరుగుతుండటంతో చిత్తూరు జిల్లా నేతల్లో అభద్రతా భావం పెరిగిందని అంటారు. వైసీపీలో టాప్ పొజిషన్ లో ఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. రోజా టార్గెట్ గా ఎప్పటికప్పుడు పావులు కదుపుతున్నారని చెబుతారు. చిత్తూరులో ఏకఛత్రాధిపత్యం కోసం గత ఎన్నికల్లోనే రోజాను ఓడించేలా పెద్దిరెడ్డి కుట్రలు చేశారని అంటారు. నియోజకవర్గంలో రోజా వ్యతిరేకులను ప్రోత్సహించడం, నగరి అభివృద్ధికి అడ్డుపడటం, ఎమ్మెల్యేను ఇబ్బందులకు గురిచేయడం ఇలా శక్తి మేర రోజాను ఇరకాటంలో పడేస్తున్నారు మంత్రి పెద్దిరెడ్డి. ఇటీవల నగరిలో పారిశ్రామిక అభివృద్ధి కోసం ఎమ్మెల్యే రోజా భూములను సేకరిస్తే.. ఆ స్థలాలను పేదలకు పంచేలా మంత్రి పెద్దిరెడ్డి కుట్రలు చేశారనే ఆరోపణ. నగరిలో రోజా ప్రమేయం లేకుండానే పెద్దిరెడ్డి ప్రభుత్వ కార్యక్రమాలు చేపడుతున్నారని చెబుతున్నారు. అందుకే, ఆక్రోశం ఆపుకోలేక ఇటీవల అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీకి సైతం రోజా ఫిర్యాదు చేశారు. ఆ సందర్భంగా ఎమ్మెల్యే రోజా కన్నీళ్లు పెట్టుకోవడం చూశాం. రోజాను ఏడిపించేదాకా వదలలేదు వైసీపీ సీనియర్లు అంటూ అప్పట్లో పెద్ద చర్చే జరిగింది.  జిల్లాకే చెందిన ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి సైతం రోజాను అస్సలు ఓర్వడం లేదని అంటారు. నామినేటెడ్ పోస్టులు రోజా వ్యతిరేకులకు కట్టబెట్టి.. నగరి ఎమ్మెల్యేను కట్టడి చేసే కుట్ర చేస్తున్నారని చెబుతారు. ఇటీవల కేజే శాంతికి నామినేటెడ్ పదవి ఇవ్వడంపై బహిరంగంగానే అసంతృప్తి వెల్లగక్కారు రోజా. ఇలా, చిత్తూరు జిల్లాలో రోజా వర్సెస్ సీనియర్స్ కోల్డ్ వార్ ఓ రేంజ్ లో సాగుతోంది. అది, మున్సిపల్ ఎన్నికల్లో మరింత తారాస్థాయికి చేరింది. ఏకంగా వైసీపీ అభ్యర్థులపైనే సొంత పార్టీ నేతలే రెబెల్స్ ను నిలబెట్టడం, వాళ్లకి భారీగా డబ్బు సాయం చేయడంపై రోజా రెచ్చిపోయారు. మీ సంగతి తేలుస్తానన్నట్టు ఓ రేంజ్ లో సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మరి, నగరి ఎమ్మెల్యేకు.. ముఖ్యమంత్రి రేసులో ఉన్న పెద్దిరెడ్డి స్థాయి నేతను ఢీకొట్టడం సాధ్యమేనా? సీనియర్లతో ఫైట్ చేస్తారా? రాజీ కొస్తారా? రోజా రాజకీయ రచ్చబండలో ఎలాంటి తీర్పు వస్తుంది? ఇదే ఇప్పుడు ఆసక్తికరం. 

ఎస్ఐ కాళ్లు పట్టుకున్న అభ్యర్థి! వైసీపీ రిగ్గింగ్ ఆపాలంటూ వినతి

బోగస్ ఓట్లు.. దొంగ ఓట్లు.. రిగ్గింగ్. ఇవి మున్సిపల్ ఎన్నికల పోలింగులో వినిపిస్తున్న పదాలు.. కనిపిస్తున్న దృశ్యాలు. మున్సిపల్ ఎన్నికల్లో అధికార వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పోలింగ్ అధికారులు, పోలీసుల సహకారంతో బరి తెగిస్తున్నారని, యథేచ్చగా దొంగ ఓట్లు వేయించుకుంటున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అధికార పార్టీకి అనుకూలంగా అధికారులు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. వైసీపీ ఏజెంట్లను ఇష్టానుసారంగా అనుమతిస్తూ...ఇతర పక్షాల ఏజెంట్లుపై ఆంక్షలు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని చెబుతున్నారు. టీడీపీ, జనసేన మద్దతుదారులను పోలీసులు హౌస్ అరెస్టు చేసిన ఘటనలు కూడా జరిగాయి.  చిత్తూరు జిల్లా మున్సిపల్ పోలింగ్‌లో పోలీసుల తీరు వివాదాస్పదమైంది. చిత్తూరు 29వ డివిజన్‌లో వైసీపీ కార్యకర్తలు రిగ్గింగ్‌కు యత్నించారు. ఈ ప్రయత్నాన్ని ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన వనిత భర్త శ్రీనివాసులు అడ్డుకున్నారు. దీంతో అతనిపై వైసీపీ శ్రేణులు దాడికి యత్నించారు. తనకు న్యాయం చేయాలంటూ శ్రీనివాసులు ఎస్ఐ కాళ్లు పట్టుకున్నారు. వైసీపీ నేతల నుంచి తనకు రక్షణ కల్పించాలని కోరారు. రిగ్గింగును ఆపాలని విన్నవించారు. ఈ ఘటన చిత్తూరులో  కలకలం రేపింది కర్నూల్ జిల్లా నంద్యాలలో వైసీపీ నాయకులు రెచ్చిపోయారు. 34వ వార్డులో స్లిప్పులు పంచుతున్న టీడీపీ కార్యకర్తపై వైసీపీ అభ్యర్థి తరఫు బంధువులు మూకుమ్మడిదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో టీడీపీ కార్యకర్తకు తీవ్రగాయాలు అయ్యాయి. బాధితుడు ఫిర్యాదు చేయడంతో త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కడపలో కూడా వైసీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. ఓటు వేయడానికి వెళ్లిన ముస్లిం మహిళల నుంచి ఓటర్ స్లిప్పులు లాక్కున్నారు. వారిని ఓటు వేయనీయలేదు. మీ ఓటు మేము వేస్తామని చెప్పి వారిని పంపివేస్తున్నారు. దీంతో వైసీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఓటర్లు ఆరోపించారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి 24వార్డులో దొంగ ఓట్లను అడ్డుకునేందుకు వెళ్ళిన తనపై దాడి చేశారని మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు ఆరోపించారు. ఎన్నికల్లో వైసీపీ అనైతికంగా గెలవాలని చూస్తుందన్నారు. టీడీపీ ఓటింగ్ శాతాన్ని తగ్గించాలనే గొడవలు సృష్టించారు ..వారి బెదిరింపులకు తాము భయపడేది లేదన్నారు.

తండ్రి పేరుతోనే షర్మిల పార్టీ! ఏప్రిల్ 9న విడుదల..

తెలంగాణలో కొత్త పార్టీ పెడుతున్న వైఎస్ షర్మిల దూకుడు పెంచారు. జిల్లాల వారీగా నేతలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. సోమవారం మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నేతలతో సమావేశమయ్యారు. బుధవారం లోటస్ పాండులో ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో చర్చించారు వైఎస్ షర్మిల. ఈ నెల‌ 19న కరీంనగర్ జిల్లా అభిమానులతో ఆమె భేటీ  కానున్నారు. వరుసగా చర్చలు జరుపుతూనే పార్టీ ఏర్పాట్లను వేగవంతం చేశారు వైఎస్ షర్మిల. షర్మిల పార్టీకి సంబంధించి కీలక విషయాలు బయటికి వచ్చాయి. త‌న తండ్రి పేరు క‌లిసివ‌చ్చేలా పార్టీకి 'వైఎస్ఆర్ ‎టీపీ'గా పేరు పెట్టాల‌ని ష‌ర్మిల భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. పార్టీ జెండాలో మూడు రంగులు ఉండేలా డిజైన్ చేస్తున్నట్టు ప్రచారం జ‌రుగుతోంది. అందులో ఆకుపచ్చ, నీలం, తెలుపు రంగులు వుంటాయని తెలుస్తోంది. ఏప్రిల్ 9న ఖమ్మంలో జరిగే భారీ సభలో ఆమె త‌న‌ పార్టీ జెండాను ఆవిష్క‌రించ‌నున్న‌ట్లు సమాచారం.  2023 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీపై ఆమె ఇప్ప‌టి నుంచే ప్రణాళిక వేసుకుని ముందుకు వెళ్లాల‌ని ఆలోచిస్తున్నారు. ఖమ్మం జిల్లాలోని ఏదైనా ఓ నియోజ‌క‌వ‌ర్గంతో పాటు హైదరాబాద్‎లోని ఓ నియోజకవర్గంలో కూడా పోటీ చేయాల‌ని షర్మిల భావిస్తున్న‌ట్లు ఆమె అనుచరుల ద్వారా తెలుస్తోంది. అన్ని జిల్లాల నేతలతో సమావేశం ముగిశాకా పాదయాత్రపై షర్మిల నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. కొత్త పార్టీ పెడుతున్న షర్మిలకు తల్లి విజయలక్ష్మి పూర్తి సహకారం అందిస్తున్నారని లోటస్ పాండ్ వర్గాల సమాచారం.

విశాఖ ఉక్కు ఉద్యమంలోకి కేటీఆర్.. 

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం ఆంధ్రప్రదేశ్ లో కాక రేపుతోంది. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మేస్తున్నామంటూ లోక్ సభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనతో ఆంధ్రులు భగ్గుమంటున్నారు. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అంటూ నినదిస్తున్నారు. ఉక్కు కర్మాగారం కార్మికులకు మద్దతుగా ఉద్యమం చేస్తున్నారు విశాఖ వాసులు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు.  విశాఖ స్టీల్ ప్లాంట్  ప్రైవేటీకరణపై  ఏపీనే కాదు తెలంగాణ రాష్ట్రంలోనూ ఆగ్రహం వ్యక్తం అవుతోంది. తెలుగు రాష్ట్రాలను బీజేపీ సర్కార్ టార్గెట్ చేస్తుందనే అభిప్రాయపడుతున్నారు తెలంగాణ వాసులు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ విశాఖ ఉద్యమానికి మద్దతు తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవడం కోసం కలిసివస్తామని ప్రకటించారు. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అన్నారు   కేటీఆర్. పోరాడి సాధించుకున్న ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేశారన్నారు. విశాఖ ఉక్కు కోసం చేస్తున్న పోరాటానికి తమ మద్దతు ఉందన్నారు.  స్టీల్ ప్లాంట్ కోసం వీలైతే వైజాగ్ వెళ్లి ఉద్యమంలో పాల్గొనేందుకు సైతం సిద్ధమని ప్రకటించారు తెలంగాణ మంత్రి కేటీఆర్. తమ అందరి మద్దతు విశాఖ ఉక్కు ప్రైవేటు పరం కాకూడదంటూ చేస్తున్న ఉద్యమానికి ఉంటుందని.. పోరాటంలో కలిసి ఉంటామని చెప్పారు. విశాఖ ఉక్కు ప్రైవేటు పరం కాకూడదంటూ ప్రజానీకం తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తున్నారు. ఈ ఉద్యమానికి కేటీఆర్ ప్రకటన మరింత బలాన్నిచ్చినట్టైంది. కేటీఆర్ ప్రకటనపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఏదైనా ఇబ్బంది తలెత్తినప్పుడు తెలుగు రాష్ట్రాలు ఒక్కటవ్వాల్సిన ఆవశ్యకతను చాటి చెప్పిందని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. 

ప్రేమించిందని వెంట్రుకలు కట్.. యువతి సూసైడ్..

ప్రేమించడమే ఆమె చేసిన నేరం. విషయం ఇంట్లో తెలియడం ఆమె పాలిట శాపం. ఆ పేరెంట్స్ మరీ టూమచ్ చేశారు. కూతురు తల వెంట్రుకలు కట్ చేసి ఇంట్లోనే ఉంచారు. అటు ప్రేమికుడి నుంచి వేధింపులు.. ఇటు వెంట్రుకలు కట్ చేశారనే వేదన. తట్టుకోలేక పోయింది ఆ యువతి. అవమాన భారంతో, మానసిక కుంగు బాటుతో.. ఇంట్లో ఉరి వేసుకొని చనిపోయింది. హైదరాబాద్ శివార్లలో జరిగిందీ దారుణం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునే ఈ ఘటన జరగడం మరింత విషాదకరం. ఒరిస్సాకు చెందిన పరమేశ్వర్‌ కుటుంబం 20ఏళ్లుగా మైలార్‌దేవ్‌పల్లిలోని లక్ష్మీగూడలో ఉంటోంది. అదే ప్రాంతంలో ఉండే అక్రం అలియాస్‌ అప్సర్.. పరమేశ్వర్‌ చిన్న కూతురు లీజాలు ప్రేమలో పడ్డారు. మతాలు వేరైనా మనసులు కలిశాయి. ఇద్దరూ ఒకే కాలేజ్ లో ఇంటర్‌ చదువుకున్నారు. ఒకే కాలేజ్, ఒకే చోట ఇళ్లు ఉండటంతో వీరి ప్రేమ నిరాటంకంగా కొనసాగింది.  విషయం లీజా ఇంట్లో తెలీడంతో వారి ప్రేమకు బ్యాడ్ డేస్ స్టార్ట్ అయ్యాయి. లీజా కుటుంబ సభ్యులు పలుమార్లు అప్సర్‌ కు వార్నింగ్ ఇచ్చారు. వారి ప్రేమను కట్టడి చేసే ప్రయత్నం చేశారు. అయినా, ఆ లవర్స్ ఎక్కడా తగ్గలేదు. దీంతో.. ఆగ్రహించిన పరమేశ్వర్.. లీజాను ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా ఆమె తల వెంట్రుకలు కట్ చేశాడు. వెంట్రుకలు లేకుండా కూతురు బయటకు వెళ్లలేదని ఇంతటి దారుణానికి తెగించాడు. దీంతో ఆ యువతి మానసికంగా కుంగిపోయింది. అదే సమయంలో అప్సర్ నుంచి ఫోన్ లో వేధింపులు పెరిగాయి. ఇటు లవర్ నుంచి వేధింపులు, అటు తల్లిదండ్రుల టార్చర్, తల వెంట్రుకలు కట్ చేసినందుకు కుంగుబాటు.. వీటన్నిటితో విసిగిపోయిన లీజా.. ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.  సూసైడ్ కి ముందు లీజా అఫ్సర్ తో సుమారు గంటపాటు ఫోన్ లో మాట్లాడినట్టు తెలుస్తోంది. ఆమె చనిపోయాక కూడా అఫ్సర్ నుంచి 135సార్లు ఫోన్ వచ్చింది. అఫ్సర్ వేధింపుల వల్లే తమ కూతురు చనిపోయిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు పేరెంట్స్. పోలీసులు కేసు నమోదు చేసి, అఫ్సర్ ను అదుపులోకి తీసుకున్నారు. 

నవ వధువుపై హత్యాయత్నం.. ఈ పెద్దలున్నారే..

ప్రేమే నేరమా? పెళ్లే శాపమా? ప్రేమించి, పెళ్లి చేసుకున్న పాపానికి కన్న కూతురినే చంపేస్తారా? తల్లిదండ్రులు ఇక మారరా? వరుస ఘటనలు చూస్తుంటే ఇవే ప్రశ్నలు. తాజాగా, నెల్లూరు జిల్లాలోనూ ఇలాంటి హత్యాయత్నమే జరిగింది. తమను కాదని ప్రేమ వివాహం చేసుకున్నారన్న ఆవేశంతో యువతి కుటుంబ సభ్యులు నవ దంపతులపై దాడి చేశారు. వధువు నోట్లో పురుగుల మందు పోసి చంపే ప్రయత్నం చేశారు. నెల్లూరు జిల్లాలో జరిగిన ఈ దారుణం కలకలం రేపుతోంది.  సీతారామపురం మండలం సింగారెడ్డిపల్లికి చెందిన పాణెం బాలకృష్ణ, దేవమ్మ చెరువుకు చెందిన మోడి అనిత కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ నెల 5న కర్నూలు జిల్లా అహోబిలం ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. తమ కుమార్తెను అపహరించారని యువతి పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, ఆ ప్రేమ జంట సీతారామపురం పోలీసుస్టేషన్‌కు వచ్చారు. తామిద్దరం మేజర్లమని, ఇష్ట పూర్వకంగానే పెళ్లి చేసుకున్నామని పోలీసులకు చెప్పారు. పోలీసులు ఇరువర్గాల పెద్దలను పిలిపించి ఎమ్మార్వో ముందు హాజరుపరిచి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఇరు వర్గాలకు సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించేశారు పోలీసులు. కౌన్సిలింగ్ తర్వాత, ఆ ప్రేమ జంట ఆటోలో వరుడి ఇంటికి  బయలుదేరింది. అయితే, యువతి కుటుంబ సభ్యులు, బంధువులు కారులో వారిని వెంబడించారు. మార్గ మధ్యలో ఆటోను అడ్డగించి నవ దంపతులపై దాడి చేశారు. ఆ ఇద్దరిని విచక్షణారహితంగా కొట్టి.. యువతి నోట్లో పురుగుల మందు పోసి హత్యకు ప్రయత్నించారు. సరైన సమయంలో పోలీసులు అక్కడికి చేరుకోవడంతో ప్రమాదం తప్పింది. తీవ్రంగా గాయపడిన దంపతులను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పురుగుల మందు తాగించిన వధువు పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు అంటున్నారు. దాడి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి.. యువతి కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. నవ దంపతులపై దాడి ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. 

మంత్రి నాని ఓటు గల్లంతు 

ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల్లో  భారీగా ఓట్లు గల్లంతయ్యాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఓటర్ల జాబితాలో అవకవతకలు జరిగాయని మొదటి నుంచి విపక్షాలు చెబుతూ వస్తున్నాయి. అధికార పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో చాలా మంది ఓట్లు గల్లంతు అయ్యాయని, భారీగా బోగస్ ఓటర్లు చేరారని ఫిర్యాదులు  కూడా చేశాయి. అయినా అధికారులు పట్టించుకోలేదు. మున్సిపల్ పోలింగ్ సందర్భంగా ఇది నిజమవుతోంది. తమ ఓట్లు తీసివేశారంటూ చాలా ప్రాంతాల్లో ఓటర్లు నిరసనకు దిగిన ఘటనలు చోటు చేసుకున్నాయి.  ఏలూరు కార్పొరేషన్ లో ఇలాంటి ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి అళ్లనానికే  ఊహించని షాక్ తగిలింది. ఓటు వేసేందుకు ఆయన శనివారపు పేట పోలింగ్ బూత్ కి వెళ్లారు. తీరా అక్కడ ఓటు వేద్దామని జాబితాలో తన పేరు చూసుకుంటే లేదు. దీంతో తనకు ఓటు లేకపోవడంతో మంత్రి వెనుతిరగాల్సి వచ్చింది. మంత్రి అయిన తన ఓటే లేకుంటే ఎలా అని ఆయన అధికారులపై సీరియస్ అయ్యారు. పోలింగ్ అధికారుల తీరుపై మంత్రి నాని మండిపడ్డారు.  ఏలూరు కార్పొరేషన్ పరిధిలో ఓటరు నమోదు కార్యక్రమం సక్రమంగా జరగలేదని ప్రతిపక్షాలు ఆందోళనలు కూడా చేశాయి. అప్పుడు మంత్రి అలాంటిది ఏం లేదని విపక్షాల వాదనను కొట్టి పడేశారు. అన్ని సక్రమంగా జరుగుతున్నాయని కితాబు ఇచ్చారు. కానీ ఇప్పుడు స్వయంగా మంత్రికే ఇలాంటి అనుభవం ఎదురవ్వడం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై నెటిజన్లు సైతం సెటైర్లు వేస్తున్నారు. ఇదే అంశంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు.  

మూడు ముక్కలుగా టీఆర్ఎస్? కేసీఆర్ సర్కార్ కు ఎర్త్! 

కేసీఆర్ ప్రభుత్వం కుప్పకూలనుందా? డజన్ మందికి పైగా ఎమ్మెల్యేలు పార్టీని వీడనున్నారా? ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాతే ముహుర్తమా? ప్రభుత్వం పతనమవడం ఖాయమా? అంటే అవుననే అంటున్నారు బీజేపీ బాస్ బండి సంజయ్. వరంగల్ లో జరిగిన సమావేశంలో ఆ మేరకు హింట్ ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ సర్కారు కూలి పోవడం ఖాయమన్నారు. అందుకే కేసీఆర్ వణికిపోతున్నాడని.. ఉద్యోగ సంఘాలతో హడావుడిగా చర్చలు జరుపుతున్నాడని చెప్పుకొచ్చారు. పీఆర్సీపై ఉద్యోగులను మోసం చేస్తున్న ముఖ్యమంత్రికి త్వరలోనే పెద్ద షాక్ తగలబోతోందంటూ జోస్యం చెప్పారు సంజయ్.  బండి సంజయ్ కామెంట్లను రొటీన్ పొలిటికల్ స్టేట్ మెంట్స్ లా తీసుకోలేమంటున్నారు విశ్లేషకులు. గులాబీ పార్టీకి గండం పొంచి ఉందని చెబుతున్నారు. బీజేపీ విసురుతున్న వలకు ఇప్పటికే 12 మంది ఎమ్మెల్యేలు చిక్కారని.. త్వరలోనే వారంతా కారు వదిలి కాషాయ కండువా కప్పుకునేందుకు రెడీగా ఉన్నారని అంటున్నారు. జస్ట్.. సరైన సమయం కోసమే వెయిట్ చేస్తున్నారని.. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత దాదాపు ముహూర్తం ఫిక్స్ అవుతుందని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది.  12మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జంప్? తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ భారీ స్కెచ్ వేసిందని తెలుస్తోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా డైరెక్షన్ లోనే ఆపరేషన్ ఆకర్ష్ కు తెర తీశారని సమాచారం. త్వరలో అధికార టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి భారీగా వలసలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. బీజేపీ పెద్దల లెక్క ప్రకారం.. 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్సేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు, ఓ మాజీ మంత్రి, ఒక జెడ్పీ చైర్‌పర్సన్ కాషాయ కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.  ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఇద్దరు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ఇద్దరు, మహబూబ్‌నగర్ జిల్లా నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు బీజేపీ అగ్రనేతలతో టచ్‌లో ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ఒక్కో ఎమ్మెల్యే కూడా బీజేపీకి దగ్గరవుతున్నట్లు చర్చ జరుగుతోంది. ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా త్వరలో పదవీకాలం ముగుస్తుండటం, అధినేత నుంచి పలకరింపులు లేకపోవడం, ప్రగతిభవన్‌కు దారి లేకపోవడంతో పార్టీని వీడాలనే నిర్ణయించుకున్నట్లు సమాచారం. గతంలో మంత్రిగా పనిచేసినా ఇప్పుడు పెద్దగా ప్రాధాన్యం లేకపోవడం, జిల్లాలోని ఇద్దరు మంత్రులూ తన ప్రత్యర్ధులకే అండగా ఉంటుండం, స్థానిక ఎమ్మెల్యేతో ఇటీవల విభేదాలు రచ్చకెక్కడం లాంటి కారణంతో సీనియర్ నేత ఒకరు పార్టీని వీడడమే బెస్ట్ అనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన హైదరాబాద్ పరిసరాలలోని ఓ జిల్లా పరిషత్ చైర్మన్ కూడా పార్టీలో తగిన గౌరవం లేదని బాధపడుతూ బీజేపీతో టచ్‌లోకి వెళ్ళినట్లు తెలిసింది. మంత్రితో ఏర్పడిన విభేదాలను పరిష్కరించుకోడానికి అటు అధినేత, ఇటు యువనేత నుంచి సహకారం లేకపోవడంతో పార్టీని వీడేందుకే నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. బీజేపీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తామంటూ స్పష్టమైన హామీ ఇవ్వడంతో మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహారంలో ఓ మాజీ ఎంపీ కీలకంగా వ్యవహరిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఆయా సెగ్మెంట్లలో టీఆర్ఎస్ పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కారణంగా ఈ ఎమ్మెల్యేలు బీజేపీ వైపు చూస్తున్నట్లు తెలిసింది. బీజేపీ కూడా వారికి గట్టి హామీలే ఇస్తున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ నుంచి గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్‌లో చేర్చుకున్న ఫార్ములానే ఇప్పుడు బీజేపీ అవలంబిస్తోంది.  ఇటు బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ తో పాటు.. అటు హరీశ్ రావు రూపంలో మరో ముప్పు ఎప్పుడూ పక్కలో బల్లెంలా ఉండనే ఉంది. పార్టీలో తనను తొక్కేశారని తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న హరీష్.. మామకు వెన్నుపోటు పొడిచేందుకు అదును కోసం ఎదురు చూస్తున్నారనేది ఓపెన్ టాక్. హరీశ్ రావు తన వర్గంతో ఏ క్షణంలోనైనా పార్టీని చీల్చేందుకు సన్నద్ధంగా ఉంటారని.. ఆ సందర్భం రావడమే ఆలస్యమని అంటారు. ఇక.. బీసీ వర్గానికి చెందిన ఓ సీనియర్ మంత్రి సైతం వేరు కుంపటి పెట్టే ప్రయత్నాల్లో ఉన్నారని విస్తృత ప్రచారం జరుగుతోంది. కొంత కాలంగా గులాబీ జెండాపై రెబెల్ వాయిస్ వినిపిస్తున్న ఆ నేత.. రేపే, మాపో సొంత పార్టీ ప్రకటిస్తారని చెబుతున్నారు. ఇలా.. ముక్కోణపు పోటీలో.. కారు పార్టీ మూడు ముక్కలైనా ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ పరిణామాలన్నింటినీ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిశితంగా గమనిస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. 

పీఆర్సీపై సీఎం కేసీఆర్ హామీ! ఎన్నికల డ్రామా అంటున్న ఉద్యోగులు

తెలంగాణలో జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు అధికార టీఆర్ఎస్ పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో మెజార్టీ ఓటర్లుగా ఉన్న ఉద్యోగులు.. అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్సీ ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ నేతలు  ఈ విషయాన్ని గ్రహించారు. దీంతో సీఎం కేసీఆరే స్వయంగా రంగంలోకి దిగారు. ఉద్యోగ సంఘాల నేతలతో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉద్యోగ సంఘాలతో చర్చించారు. ఈ సమావేశంలో పీఆర్సీపై తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫిట్మెంట్పై చర్చించిన సీఎం కేసీఆర్… దాదాపు 30 శాతం వరకు ఫిట్మెంట్ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు, త్వరలోనే పీఆర్సీపై ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.  ముఖ్యమంత్రితో సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడారు ఉద్యోగ సంఘాల నేతలు. పీఆర్సీ విషయంలో కేసీఆర్ పై తమకు పూర్తి నమ్మకం ఉందని చెప్పారు. ఎన్నికల నియమావళి ఉన్నందున ప్రకటన చేయలేకపోతున్నాం అని సీఎం కేసీఆర్ చెప్పారని తెలిపారు. ఎన్నికలు ముగిసిన తరువాత పీఆర్సీ ప్రకటన వస్తుందన్నారు. ఉద్యోగుల పదవి విరమణ వయస్సు కూడా త్వరలోనే అమలు చేస్తామని సీఎం హామీ ఇచ్చారని ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు.ఏపీలో ఉన్న ఉద్యోగులను తెలంగాణ కు తీసుకురావడానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారన్నారు. 2014 తరువాత దేశంలోనే తెలంగాణ లో అత్యధిక పీఆర్సీ సీఎం కేసీఆర్ ఇచ్చారని తెలిపారు. ఉద్యోగుల ప్రమోషన్ లు కూడా చాలా త్వరితగతిన ఇచ్చారన్నారు. సీపీఎస్ ఉద్యోగుల కుటుంబలకు పెన్షన్ స్కిం అమలు చేస్తామని సీఎం భరోసా ఇచ్చారని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు.  ఏపి కంటే ఎక్కువే పీఆర్సీ ఇస్తామని సీఎం కేసీఆర్ చెప్పారన్నారు ఉద్యోగ సంఘాల నేతలు. ఏపీ ఉద్యోగులకు గత జూలైలో 28 శాతం పీఆర్సీ ప్రకటించారు. ఈ లెక్కన తెలంగాణ ఉద్యోగులకు 30 శాతం పీఆర్సీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే  పీఆర్సీపై కేసీఆర్ స్పష్టమైన హామీ ఇచ్చినా.. ఉద్యోగులు మాత్రం నమ్మడం లేదు. గతంలో చాలా సార్లు ఇలాంటి ప్రకటనలే చేశారని.. కాని అమలు కాలేదని చెప్పారు. గతంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. లోక్ సభ ఎన్నికలకు ముందు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు ముందు కూడా సర్కార్ ఇలాంటి హడావుడే చేసింది. ఎన్నికలు ముగియగానే మళ్లీ మర్చిపోయిందని ఉద్యోగులు చెబుతున్నారు.  ఇప్పుడు కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన పార్టీకి గడ్డు పరిస్థితులు ఉండటంతో.. ఓట్ల కోసమే మళ్లీ డ్రామా ఆడుతున్నారని విమర్శిస్తున్నారు.   

ఇన్ హేలర్ లో పాము.. 

పాములు పుట్టలో ఉండడం సహజం. పొలాల్లో తిరగడం ప్రకృతి సహజం, అప్పుడపుడు పెరట్లో , కొన్నీ సార్లు ఇంట్లో కూడా దర్శనం ఇస్తూ అందరిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి.  ఇలా వివిధ ప్రదేశాల్లో పాములు తలదాచుకున్న వార్తలను చదివాం. కానీ మనం ఊహించని చోట పాములు దర్శనము ఇస్తే మనిషి ఎలా ఫీల్ అవుతాడో తెలుసా..తాజాగా ఒక పాము ఇన్ హేలర్  లో తల దాచుకుంది. బహుశా అదే తన అమ్మ వడి అనుకుందేమో మరి. ఇన్ హేలర్ లో పాము తలదాచుకోవడం ఏంటని అనుకుంటున్నా. మీరే చదవండి  ఆస్ట్రేలియాలోని  క్వీన్స్‌ల్యాండ్‌కు చెందిన యువతికి ఆస్తమా ఉండటంతో ఆమె ఇన్‌హెలర్‌ను ఉపయోగిస్తోంది. ఇన్‌హెలర్‌ను వాడి పక్కన పెట్టిన సమయంలో ఎటునుంచి వచ్చిందో తెలియదు కానీ ఓ పాము పిల్ల వచ్చి ఇన్ హేలర్ ‌ లోపలకు దూరింది. పామును యువతి సరైన సమయంలోనే గుర్తించడంతో ఆమెకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. పామును చూసిన వెంటనే యువతి పాములు పట్టేవారికి సమాచారం ఇవ్వడంతో వాళ్లొచ్చి పామును పట్టుకున్నారు. పాము పిల్ల చిన్నదే అయినప్పటికి దాని విషం చాలా ప్రమాదకరమని వారు తెలిపారు. తాము ఇప్పటివరకు ఇళ్లలో అనేక చోట్ల పాములను చూశాం కానీఇన్ హేలర్  లోపల పాము పిల్లను చూడటం ఇదే మొదటిసారి అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి.  

బిర్యానీ పొట్లంలో ముక్కుపుడకలు.. నంద్యాలలో ఓటర్లకు గాలం 

ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు చివరి నిమిషం వరకు ప్రయత్నిస్తున్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు.  పోలింగ్ కేంద్రాల దగ్గర కూడా కొందరు అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. ఓటర్లకు గాలం వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కర్నూల్ జిల్లా నంద్యాలలోని 12వ వార్డు నుంచి బరిలోకి దిగిన ఓ స్వతంత్ర అభ్యర్థి ఓటర్లకు ముక్కుపుడకలు పంపిణీ చేస్తూ దొరికిపోయాడు.  ఖండే శ్యామసుందర్‌లాల్ అనే వ్యక్తి స్వతంత్ర అభ్యర్థిగా 12వ వార్డు నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. ఓటర్లను ఆకర్షించి ఓట్లు పొందడానికి బిర్యానీ ప్యాకెట్లలో ముక్కుపుడకలు ఉంచి పంచుతూ దొరికిపోయాడు. కర్ణాటక నుంచి కొందరిని కిరాయికి పిలిపించుకున్న శ్యామసుందర్ నిన్న బిర్యానీ ప్యాకెట్లలో ముక్కుపుడకలు ఉంచి వారితో పంపిణీ చేయించాడు.  విషయం పోలీసులకు తెలియడంతో.. వారు రంగంలోకి దిగి బిర్యానీ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్న రాఘవేంద్రస్వామి, రవికరణ్, మోహన్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నాలుగు బైక్‌లు, రూ. 55 వేల నగదు, 23 బంగారు ముక్కుపుడకలు, బిర్యానీ పొట్లాలను స్వాధీనం చేసుకున్నారు. స్వతంత్ర అభ్యర్థి శ్యామసుందర్‌తోపాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

షర్మిలకు విజయమ్మ ఆల్ ది బెస్ట్ 

వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించినప్పటి నుంచి ఆయన సతీమణి విజయమ్మ అనివార్యంగానే కావచ్చు, రాజకీయాలలో కీలక భూమికనే పోషిస్తూ వచ్చారు. పులివెందుల ఎమ్మెల్యేగా, ఆ తర్వాత జగన్ జైలుకు పోయిన సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా, అత్యంత క్లిష్ట సమయంలో వైఎస్సార్ పార్టీని బతికించడంలో కీలక భూమికను పోషించారు. 2014 ఎన్నికలలో విశాఖ నుంచి పార్లమెంట్ కు పోటీ చేశారు.ఆ ఎన్నికల్లో ఆమె ఓడిపోయినా, పార్టీకి అధికారం దక్కకపోయినా ఆమె,ఆమెతో పాటుగా కుమార్తె షర్మిలా, జగన్’కు అండగా నిలిచారు. 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వరకు ఆయన వెంటే ఉన్నారు. ఇక ఆ తర్వాత, ఒక ఇంటర్వ్యూలో ఆమె చెప్పినట్లుగా, ఇక తన అవసరం లేదని,రాజకీయ వేదిక నుంచి తప్పుకున్నారు. ఆతర్వాత ఆమె, ‘నాలో ... నాతో ...వైఎసార్’ పేరిట వైఎస్సార్ జీవిత చరిత్రని రాశారు. అనేక విషయాలను చెప్పారు. అందులో ప్రధానంగా ఆమె తమ ఇద్దరు పిల్లలు జగన్, షర్మిలలో వైఎస్సార్’కు షర్మిల అంటే కొంచెం ఎక్కువ ఇష్టమని, చెప్పారు. అలాగే, వైఎస్ మరణం తర్వాత జగన్ జైలుకు వెళ్ళిన సమయంలో కుటుంబ రాజకీయ వారసత్వాన్ని,పార్టీ  మనుగడను నిలుపుకునేందుకు షర్మిలను పాదయాత్రకు పంపక తప్పలేదని బాధను వ్యక్తం చేశారు.  ఇక ప్రస్తుతానికి వస్తే షర్మిల అన్న జగన్ అభీష్టానికి వ్యతిరేకంగా తెలంగాణలో పార్టీ పెట్టేందుకు, మరో పాద యాత్రకు సిద్దమవుతున్న సమయంలో విజయమ్మ ఎటు మొగ్గు చూపుతారు?షర్మిల రాజకీయ ప్రస్థానాన్ని ఏ మేరకు ఆమోదిస్తారు,ఎంతవరకు సహకరిస్తారు అన్నది, వైఎస్సార్ అభిమానుల్లో ఆసక్తిగా మారింది. జగన్ వేసిన ప్రతి అడుగులో ఆయనకు అన్ని విధాల సహకరించిన విజయమ్మ,షర్మిలకు అదే తరహ సహకారం,ఆశీస్సులు అందిస్తారా? అన్న ప్రశ్న చాలామందిలో వుంది.  షర్మిల నిర్వహిస్తున్న సమావేశాలు, జిల్లాల వారీగా వైఎస్ అభిమానులతో నివహిస్తున్నసమ్మేళనాలలో ప్రధాన భూమిక పోషిస్తున్న కొండ రాఘవ రెడ్డి మంగళవారం, వైఎస్ విజయమ్మను లోటస్ పాండ్ లో కలిశారు. సుమారు గంటన్నర సేపు ఆమెతో సమావేశమయ్యారు. విజయమ్మను మర్యాదపూర్వకంగానే కలిసానని రాఘవ రెడ్డి చెప్పారు. అయితే  మర్యాదపూర్వక భేటీలో ఏమేమి మాట్లాడుకున్నారో ఏమో గానీ, దేవుడు అంతా మంచే చేస్తాడని ఆమె ఆశీర్వదించారని, రాఘవ రెడ్డి చెప్పారు. ఇంతకీ ఏమిటా మంచి? ఎవరికి మంఛి? ఏమో .. 

విజయవాడలో ఓటేసిన పవన్ కల్యాణ్ 

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. నాలుగు మున్సిపాలిటీలు ఇప్పటికే ఏకగ్రీవం కాగా.. మిగిలిన మున్సిపాలిటీల్లో పోలింగ్ జరుగుతోంది. అక్కడక్కడా చెదురు మదురు ఘటనలు మినహా ప్రశాంతంగా జరుగుతోంది. సామాన్య ప్రజలతో పాటు సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు కూడా ఉత్సాహంగా ఓటువేస్తున్నారు.  జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయవాడలో ఓటు వేశారు.పటమట లంకలోని జిల్లా పరిషత్ గర్ల్స్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ బూత్ నెం-4కి వెళ్లిన పవన్ ఓటు  వేశారు. పవన్ కల్యాణ్ రాకతో పోలింగ్ కేంద్రంలో సందడి నెలకొంది. పవన్ కల్యాణ్ రాకతో పోలింగ్ కేంద్రంలో సందడి నెలకొంది. ఈ సందర్భంగా పవన్ ను చూసేందుకు ఓటర్లతో పాటు అభిమానులు పోటీపడ్డారు.  కర్నూలు జిల్లాలోని గూడూరులో ఓ పోలింగ్ కేంద్రంలో నాగు పాము హలచ్ చల్ చేసింది. మంగళవారం సాయంత్రం పోలింగ్‌బూత్ 9, 10లలో నాగుపాము కనిపించడంతో కలకలం రేపింది. స్థానికులు వచ్చి ఆ పామును పట్టుకున్నారు. అనంతరం చెట్ల పొదల్లోకి వదిలిపెట్టారు. అక్కడ నాగుపాము సంచరించడంతో పోలింగ్ సిబ్బంది భయపడిపోయారు. రాత్రంతా బిక్కుబిక్కుమంటూ పోలింగ్ బూత్‌లోనే గడిపారు. ఉదయం అక్కడ యధావిధిగానే పోలింగ్ ప్రారంభమయింది.  

జగన్ వీక్ సీఎం.. ఏడాదిలోగా అవుట్!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. సీఎం జగన్మోహన్ రెడ్డి చుట్టే చర్చలు జరుగుతున్నాయి. జగన్ పై సొంత పార్టీలోనే కుట్ర జరుగుతుందంటూ జాతీయ మీడియాలో వచ్చిన వార్తలు కలకలం రేపగా... ఏపీ నేతలు కూడా అలాంటి వ్యాఖ్యలే చేస్తున్నారు. జగన్ పదవిపై ఆశతో కొందరు నేతలు.. ఆయనకు ఉచ్చు బిగిస్తున్నారని నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు చెప్పారు. జాగ్రత్తగా ఉండాలంటూ ఆయన జగన్ కు సూచనలు చేశారు.  రఘురామ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారగా.. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్‌రెడ్డి మూడేళ్లు కూడా కొనసాగలేడని అన్నారు.  సీఎంపై వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. దుగరాజపట్నంపోర్టుకు కేంద్రం అన్ని అనుమతులు ఇచ్చి 2012లోనే నిధులను కేటాయించిందన్నారు. వైసీపీ దౌర్జన్యాలపార్టీగా మారిందన్నారు చింతా మోహన్. పంచాయతీ ఎన్నికలలో పోలీసు అధికారులను అడ్డంపె ట్టుకుని వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందన్నారు మోహన్. తిరుపతి పార్లమెంటు అభివృద్ధిపై వైసీపీ, టీడీపీ, బీజేపీ ఏం చేశాయో కాంగ్రెస్‌పార్టీతో బహిరంగ చర్చకు సిద్దమా అని సవాల్‌ విసిరారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ సీఎంకు తెలిసే జరిగిందన్నారు. జగన్‌లాంటి బలహీనమైన ముఖ్యమంత్రి ఇప్పటివరకు ఏపీకి ఎవరూ లేరని మరో వందేళ్లలో కూడా రాబోరన్నారు చింతా మోహన్. 

బాలీవుడ్ మత్తులో కేటీఆర్!

నిర్మల్  జిల్లా భైంసాలో మరోసారి హింస చెలరేగడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. భైంసాలో భారీగా బలగాలను మోహరించారు.పట్టణంలో పోలీసు  కవాతును నిర్వహించారు. సమస్యాత్మక ప్రాంతాల మీదుగా  ఫ్లాగ్ మార్చ్ కొనసాగింది. బైంసా ఘటనపై రాజకీయ రగడ ముదురుతోంది. కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. ఒక ప్రణాళిక ప్రకారమే భైంసాలో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయని అన్నారు. దీనికి సంబంధించి కేంద్ర నిఘా వర్గాలకు లేఖ రాస్తానని చెప్పారు. భైంసా అల్లర్లపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఎంపీ అర్వింద్ డిమాండ్ చేశారు. మంత్రి కేటీఆర్ బాలీవుడ్ మత్తులో మునిగిపోయారని... ఆ మత్తు నుంచి ఆయన బయటకు రావాలని అరవింద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్, కేటీఆర్ ఇద్దరూ ఓటు బ్యాంకు రాజకీయాల్లో మునిగిపోయారని అన్నారు. ఓట్ల కోసం హిందువుల ప్రాణాలను పణంగా పెడుతున్నారని మండిపడ్డారు. మత్తులో మునిగితేలుతున్న కేసీఆర్ తన మతాన్ని కూడా మర్చిపోయారని అన్నారు. భూకబ్జాల్లో కేటీఆర్ ను కవిత మించిపోయారని విమర్శించారు. హోం మంత్రి మహమూద్ చేతకాని స్థితిలో ఉన్నారని... లా అండ్ ఆర్డర్ తమకు అప్పచెపితే అల్లర్లను ఎలా కంట్రోల్ చేయాలో చేసి చూపిస్తామని అర్వింద్ చెప్పారు.  

బీజేపీ ముఖ్యమంత్రి రాజీనామా

ఉత్తరాఖండ్‌‌ రాజకీయాలలో సంచలనం జరిగింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ తన పదవికి రాజీనామా చేశారు. మంగళవారం పలు నాటకీయ పరిణామాల మధ్య సాయంత్రం 4 గంటల సమయంలో రాజ్‌భవన్‌కు చేరుకున్న ఆయన గవర్నర్ రాణి మౌర్యకు తన రాజీనామాను అందజేశారు. రావత్ పనితీరుపై .. బీజేపీ పెద్దలు, కేంద్ర ప్రభుత్వం అసంతృప్తిగా ఉన్నదని తెలుస్తున్నది. గడిచిన నాలుగు రోజులుగా ఆయనను పదవి నుంచి తొలగిస్తారని వస్తున్న వార్తల నేపథ్యంలో రావతే ఈరోజు పదవి నుంచి తప్పుకున్నారు. రావత్ వ్యవహార శైలిపై స్థానిక ఎమ్మెల్యేలు ఆగ్రహంగా ఉన్నారని తెలుస్తున్నది. క్యాబినెట్ కూర్పుపైనా ఆయనపై ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారు. ఇదే విషయమై పార్టీ పరిశీలకుడు రమణ్ సింగ్ ముందు తెలియజేశారు. అసంతృప్త వర్గాలు, ఇతరులతో చర్చించిన రమణ్ సింగ్.. ఇటీవలే ఇందుకు సంబంధించిన నివేదికను బీజేపీ అధిష్టానానికి అందజేశారు. దీంతో బీజేపీ కేంద్ర పెద్దలు ఆయన రాజీనామాకు పట్టుబట్టినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

కిషన్ రెడ్డి కుర్చీకి ఎసరు?

ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందనే సామెత  అందరికీ తెలిసిందే. ఇప్పుడు భైంసా అల్లర్ల వ్యవహారం  అటు తిరిగి ఇటు తిరిగి, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కుర్చీకి ఎసరు తెస్తుందా.. అంటే  పార్టీవర్గాలు, పరిస్థితి అలాగే ఉందనే అంటున్నాయి. భైంసా అల్లర్లు జరిగిన వెంటనే పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్, నిజమాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అలాగే ఇతర నాయకులు స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వాన్నిబోనులో నిలబెట్టారు. అయినా కిషన్ రెడ్డి మాత్రం కేంద్ర హోం మంత్రి అమిత్ షా భైంసాలో ఏమి జరిగిందని ఆరా కోరే వరకు స్పందించలేదన్న ఆరోపణలు పార్టీ నుంచే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో అయితే  కిషన్ రెడ్డికి వ్యతిరేకంగా కాంపైన్ నడుస్తోంది.  ఈ నేపధ్యం లోనే కిషన్ రెడ్డి మంగళవారం  భైంసా సంఘటనను ఖండిస్తూ వీడియో విడుదల చేశారు. భైంసాలో అలాంటి  సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని  రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంఘ వ్యతిరేక శక్తులు ఉద్దేశపూర్వకంగా ఘర్షణలు సృష్టిస్తున్నాయని,అలాంటి శక్తులపట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని  సూచించారు. భైంసాలో కొన్నేళ్లుగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని, ఒక వర్గం వారిపై మరో వర్గం వారు దాడి చేయడం మంచిది కాదని.. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసు వ్యవస్థను పటిష్టం చేయాలని డీజీపీకి సూచన చేశారు. మరోవంక అరవింద్ చలో భైంసా అంటూ బయలుదేరి హౌస్ అరెస్ట్ అయ్యారు. గత సంవత్సరం కూడా హిందువులపై దాడులు జరిగిన విషయాన్ని గుర్తుచేశారు. హిందువులలో భరోసా కలిపించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవంక దుబ్బాక ఉపఎన్నికల సమయంలో పోలీసులు రఘునందన రావు  ఇంటి పై దాడి చేసిన సందర్భంలో కిషన్ రెడ్డి స్పందించిన తీరు విమర్శలకు గురైంది. అలాగే కిషన్ రెడ్డి తెరాస పట్ల మెతక వైఖరి అవలబిస్తున్నారనే అపవాదు ఉండనే ఉంది. ఇలా  పార్టీలో కిషన్ రెడ్డి పట్ల  కొంత అసంతృప్తి ఉందని..సోషల్ మీడియాలో  వస్తున్న ట్వీట్లు, పోస్టులు సూచిస్తున్నాయి. అలాగేకిషన్ రెడ్డికి అమిత్’ షా క్లాసు తీసుకున్నారన్న వార్త కూడా  సోషల్ మీడియాలో షికార్లు చేస్తోంది. మొత్తానికి భైంసా అల్లర్లు కిషన్ రెడ్డిని అల్లరి పాలు చేసేటట్లే ఉన్నాయి. 

నేను చాలా మంచోడిని.. రాసలీలల మంత్రి క్లారిటీ

"అంతా అబద్దం. పచ్చి అబద్దం. నేను అమాయకుడిని. రాసలీలల సీడీ ఎవరో కావాలని చేసిన కుట్ర. నేను ఎలాంటి తప్పు చేయలేదు." ఇదీ కర్ణాటక రాసలీలల మంత్రి రమేశ్ జార్ఖిహొళి ఇచ్చిన క్లారిటీ. అది కూడా మీడియా సమావేశం పెట్టి మరీ తాను చాలా మంచోడినంటూ చెప్పుకొచ్చారు మాజీ మంత్రివర్యులు. తప్పేమీ లేకపోతే రాజీనామా ఎందుకు చేశారని విలేకర్లు ప్రశ్నిస్తే.. అది నా సొంత నిర్ణయమంటూ విషయం దాటేశారు.  కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాసలీలల సీడీ ఘటనపై బీజేపీ నేత, మాజీ మంత్రి రమేశ్‌ జార్ఖిహొళి తొలిసారి స్పందించారు. తాను సచ్చీలతను వెల్లడించేందుకు మీడియా ముందుకొచ్చారు. తనపై వచ్చిన రాసలీలల ఆరోపణల్లో నిజం లేదని ఖండించారు. ఆ ఆరోపణలకు సంబంధించి విడుదలైన సీడీ గురించి తనకేం తెలియదని.. కావాలని ఎవరో కుట్ర చేస్తున్నారన్నారు.  ‘రాసలీలల వ్యవహారంలో నేను ఉన్నానని ఆరోపిస్తూ విడుదలైన సీడీలో నిజం లేదు. నేను అమాయకుడిని. అసలు ఈ సీడీ వ్యవహారం నాలుగు నెలల కిందటే నా దృష్టికి వచ్చింది. నేను ఎలాంటి తప్పు చేయలేదని అప్పుడే నా సోదరుడికి కూడా వివరించా. అందులో ఉన్నది నేను కాదు. ఈ విషయంలో న్యాయపరమైన సహకారం గురించి నాకు అధిష్ఠానం నుంచి కాల్‌ వచ్చింది. అయినప్పటికీ ఆ ఆరోపణలపై నేను ఒంటరిగా పోరాడగలనని చెప్పా’ అని రమేశ్‌ తెలిపారు.   ‘మంత్రి పదవికి రాజీనామా చేయడం నా సొంత నిర్ణయమే. నన్ను రాజీనామా చేయమని సీఎం యడియూరప్ప కోరలేదు. నా అంతట నేనే రాజీనామా చేశా. నా వల్ల పార్టీ ఇబ్బందుల పాలు కావడం నాకు ఇష్టం లేదు. అందుకే తర్వాతి రోజు ఉదయమే రాజీనామా సమర్పించా’ అని రమేశ్‌ వెల్లడించారు.   ఓ యువతికి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి, లైంగికంగా లొంగ దీసుకుని, కొన్ని నెలలుగా ఆమెతో రాసలీలలు నెరుపుతున్నారనేది రమేశ్ జార్ఖిహొళిపై ఓ సమాచార హక్కు చట్టం కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఫిర్యాదుతో పాటు మంత్రి రాసలీలల వీడియోను సైతం బయటపెట్టారు. అందులో ఆ యువతితో రమేశ్ జార్ఖిహొళి చాలా సన్నిహితంగా ఉన్న ద‌ృశ్యాలు సంచలనంగా మారాయి. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. రమేశ్ పై ఒత్తిడి పెరిగి.. మంత్రి పదవికి రాజీనామా చేశారు. వీడియోలో ఆయన స్పష్టంగా కనిపిస్తున్నా.. తాను ఎలాంటి తప్పు చేయలేదని.. ఆ సీడీ ఓ కుట్ర అంటూ మాజీ మంత్రి రమేశ్ జార్ఖిహొళి చెప్పడాన్ని ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి. అటు, ప్రజల నుంచీ తీవ్ర విమర్శలు వస్తున్నాయి.