పీఆర్సీపై సీఎం కేసీఆర్ హామీ! ఎన్నికల డ్రామా అంటున్న ఉద్యోగులు
posted on Mar 10, 2021 @ 10:31AM
తెలంగాణలో జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు అధికార టీఆర్ఎస్ పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో మెజార్టీ ఓటర్లుగా ఉన్న ఉద్యోగులు.. అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్సీ ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ నేతలు ఈ విషయాన్ని గ్రహించారు. దీంతో సీఎం కేసీఆరే స్వయంగా రంగంలోకి దిగారు. ఉద్యోగ సంఘాల నేతలతో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉద్యోగ సంఘాలతో చర్చించారు. ఈ సమావేశంలో పీఆర్సీపై తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫిట్మెంట్పై చర్చించిన సీఎం కేసీఆర్… దాదాపు 30 శాతం వరకు ఫిట్మెంట్ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు, త్వరలోనే పీఆర్సీపై ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ముఖ్యమంత్రితో సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడారు ఉద్యోగ సంఘాల నేతలు. పీఆర్సీ విషయంలో కేసీఆర్ పై తమకు పూర్తి నమ్మకం ఉందని చెప్పారు. ఎన్నికల నియమావళి ఉన్నందున ప్రకటన చేయలేకపోతున్నాం అని సీఎం కేసీఆర్ చెప్పారని తెలిపారు. ఎన్నికలు ముగిసిన తరువాత పీఆర్సీ ప్రకటన వస్తుందన్నారు. ఉద్యోగుల పదవి విరమణ వయస్సు కూడా త్వరలోనే అమలు చేస్తామని సీఎం హామీ ఇచ్చారని ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు.ఏపీలో ఉన్న ఉద్యోగులను తెలంగాణ కు తీసుకురావడానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారన్నారు. 2014 తరువాత దేశంలోనే తెలంగాణ లో అత్యధిక పీఆర్సీ సీఎం కేసీఆర్ ఇచ్చారని తెలిపారు. ఉద్యోగుల ప్రమోషన్ లు కూడా చాలా త్వరితగతిన ఇచ్చారన్నారు. సీపీఎస్ ఉద్యోగుల కుటుంబలకు పెన్షన్ స్కిం అమలు చేస్తామని సీఎం భరోసా ఇచ్చారని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు.
ఏపి కంటే ఎక్కువే పీఆర్సీ ఇస్తామని సీఎం కేసీఆర్ చెప్పారన్నారు ఉద్యోగ సంఘాల నేతలు. ఏపీ ఉద్యోగులకు గత జూలైలో 28 శాతం పీఆర్సీ ప్రకటించారు. ఈ లెక్కన తెలంగాణ ఉద్యోగులకు 30 శాతం పీఆర్సీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే పీఆర్సీపై కేసీఆర్ స్పష్టమైన హామీ ఇచ్చినా.. ఉద్యోగులు మాత్రం నమ్మడం లేదు. గతంలో చాలా సార్లు ఇలాంటి ప్రకటనలే చేశారని.. కాని అమలు కాలేదని చెప్పారు. గతంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. లోక్ సభ ఎన్నికలకు ముందు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు ముందు కూడా సర్కార్ ఇలాంటి హడావుడే చేసింది. ఎన్నికలు ముగియగానే మళ్లీ మర్చిపోయిందని ఉద్యోగులు చెబుతున్నారు. ఇప్పుడు కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన పార్టీకి గడ్డు పరిస్థితులు ఉండటంతో.. ఓట్ల కోసమే మళ్లీ డ్రామా ఆడుతున్నారని విమర్శిస్తున్నారు.