తిరుపతికి విశాఖ సెగ! బీజేపీ, వైసీపీలో బెంగ
తిరుపతి లోక్ సభ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరుగుతుంది. నిజానికి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ తో పాటుగానే, తిరుపతి ఉపఎన్నిక నోటిఫికేషన్ కూడా వస్తుందని అనుకున్నారు.అయితే, తెలుగు రాష్ట్రాలలో పంచాయతీ, మున్సిపల్, మండలి ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న నేపధ్యంలో, తిరుపతి లోక్ సభతో పాటుగా , తెలంగాణలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉపఎన్నిక నోటిఫికేషన్ను ప్రత్యేకంగా ప్రకటిస్తామని ఎన్నికల సంఘం చెప్పింది. ఇప్పుడు, ఉభయ తెలుగు రాష్టాలలో స్థానిక , మండల ఎన్నికల ప్రక్రియ చివరి దశకు చేరిన నేపధ్యంలో , ఇక ఎప్పుడైనా తిరుపతి,సాగర్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ రావచ్చని తెలుస్తోంది.
తిరుపతి విషయానికి వస్తే,ఇది వైసీపీ సిట్టింగ్ సీటు. పార్టీ ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ చనిపోవడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.అయితే అధికార పార్టీ దివంగత నేత కుటుంబ సభ్యులను కాదని జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో సేవలు అందించిన వ్యక్తిగత ఫిజియో థెరపిస్ట్, డాక్టర్ గురుమూర్తిని బరిలో దించే అలోచనలో ఉందని తెలుస్తోంది. గురుమూర్తి కి టికెట్ ఇస్తారా లేదా అనేది ఇంకా తేలకపోయినా, దుర్గ పసాద్ కుటుంబ సభ్యులకు ఇవ్వడం లేదన్నది తేలిపోయింది.ఆయన కుమారుడు కళ్యాణ్ కు ఇచ్చిన మాట ప్రకారం ఆయన్ని మండలికి నామినేట్ చేశారు.
గత ఎన్నికలలో పార్టీ తరపున పోటీ చేసిన కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మికే తెలుగు దేశం పార్టీ మళ్ళీ టికెట్ ఇచ్చింది. ఆమె ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టారు. అదలా ఉంటే గత ఎన్నికల్లో నాలుగో స్థానానికి పరిమితం అయిన బీజీపీ, ఈసారి జనసేనతో జట్టు కట్టి రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో జరుగతున్నదేవాలయాలపై దాడులు, విగ్రహాలను ద్వంసం చేయడం,రాష్ట్రంలో జోరుగా సాగుతున్న క్రైస్తవ మత ప్రచారం , మత మార్పిడులు వంటి పరిణామాల నేపధ్యంలో, ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతిని హిందువుల సెంటిమెంట్ అస్త్రంతో జయించే ప్రణాళికను సిద్దం చేసుకున్నారు. అయితే ఇప్పుడ ఎన్నికలు దగ్గరకు వచ్చిన పరిస్థితులలో సీన్ రివర్స్ అయింది.ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నకల్లో, ప్రజలు బీజేపీని అసలు పట్టించుకొనే లేదు. ఆటలో అరటి పండులా పక్కన పెట్టారు. ఇప్పుడు అందుకు తోడు, విశాఖ ఉక్కు, బీజేపీ చిరు ఆశలను కూడా ఉక్కు పాదంతో తొక్కే సింది. దీంతో ఏమి సేతుర లింగా,అంటూ కమల దళం నేతలు తలలు పట్టుకున్నారు. ఇంతవరకు తిరుపతి నుంచి పోటీచేందుకు ఉత్సాహం చూపిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ,జనసేన ముటమి నుంచి ఎవరు పోటీ చేసినా ఫలితం ఉండదని ముందుగానే గమనించి, గాలికి పోయే పేల పిండి రామర్పణం’అన్నట్లుగా తిరుపతిలో పోటీ చేసే అవకాశాన్ని ఉదారంగా బీజేపీకి ఇచ్చేశారు.
మరో వంక బీజేపీ నేతలు విశాఖ ఉక్కు విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మింగలేక కక్కలేక బాధ పడుతున్నారు. ఈ నేపధ్యంలో శనివారం విజయవాడలో సమావేసమైన రాష్ట్ర పదాధికారుల సమావేశంలో దేశవ్యాప్త విధానంలో భాగంగానే విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరిస్తున్నామని పార్టీ ఇంచార్జి సునీల్ దేవ్‌ధర్’ విశాఖ ఉక్కు సమస్యను పలచనచేసే ప్రయత్నం చేశారు. అలాగే, రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వం విశాఖ ఉక్కు అంశాన్ని ముందు ఉంచి తెర వెనుక నిశ్శబ్దంగా మతమార్పిడులు చేస్తోందని, అంటూ మళ్ళీ మత మార్పిడుల విషయాన్ని ముందుకు తెచ్చారు .
అయితే విశాఖ ఉక్కు ఆందోళన విషయంలో ముందు నుంచి ముందున్న తెలుగు దేశం పార్టీ. తిరుపతి ఉప ఎన్నికలో అదే ప్రధాన ఎన్నికల అంశం చేసేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. అందుకు తగ్గట్టుగానే పార్లమెంట్ సాక్షిగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయం కేంద్రానిదే అయినా, రాష్ట్ర ప్రభుత్వం అనుమతితోనే నిర్ణయం జరిగిందని తేలడంతో జోరు పెంచింది.వైసీపీ ని ఉక్కు సంకెళ్ళతో బందించి తిరుపతి తీర్పుతో, విశాఖ ఉక్కు ప్రైవేటుపరం కాకుండా కాపాడేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది . విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిరసిస్తూ , ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు, శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో,పార్టీలకతీతంగా అందరూ ఉద్యమించి ప్రైవేటీకరణను అడ్డుకోవాలని కోరారు. పార్టీలకు అతీతంగా విశాఖ ఉక్కు అంశమే అజెండాగా స్వతంత్ర అభ్యర్ధిని బరిలో దించాలని సూచించారు. మొత్తానికి తిరుపతి ఉప పోరుకు విశాఖ సెగ తప్పేలాలేదు.