రోజా రాజీనా..? రాజకీయ రచ్చబండ
posted on Mar 10, 2021 @ 2:17PM
రోజా ఒక్కరు ఒకవైపు. చిత్తూరు జిల్లా వైసీపీ నేతలంతా మరోవైపు. అధికార పార్టీలో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. పాపం.. రోజాకు కన్నీరే మిగిలింది. ఆమె రాజకీయ భవిష్యత్తు రచ్చబండలా మారింది. రోజాను ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా అడుగడుగునా మోకాలొడ్డుతున్నారు సొంత పార్టీలోని వ్యతిరేకులు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మరోసారి ఆ కోల్డ్ వార్ కాకా రేపుతోంది. నగరి, పుత్తూరులో వైసీపీ తరఫును ఎమ్మెల్యే రోజా అనుచరులు పలువురు పోటీలో ఉన్నారు. అయితే, రోజాను రాజకీయంగా దెబ్బ తీసేందుకు, వైసీపీ అభ్యర్థులపైనే రెబల్స్ ను రంగంలోకి దించారు సీనియర్లు. దీంతో పార్టీ ఓటు బ్యాంకు ఇరు వర్గాల మధ్య చీలిపోయి వైసీపీకి ఓటమి తప్పని పరిస్థితి. తన అనుచరులను ఓడించడానికే ఇలా చేశారంటూ రెబెల్స్ పై ఫైర్ అయ్యారు రోజా. సొంత పార్టీ నేతలే తన కొంప ముంచుతున్నారంటూ మండిపడ్డారు. "గత ఎన్నికల్లో తన ఓటమికి పని చేసిన వారే ఇప్పుడీ పని చేశారు. నగరి, పుత్తూరులో 14మంది రెబెల్స్ ను పెట్టారు. ఆ రెబెల్స్ కు వైసీపీ నేతలు భారీగా డబ్బులు ఇచ్చారు. వెన్నుపోటుదారులను అధిష్టానం గుర్తించాలి." సాక్ష్యాధారాలతో నిరూపించి కుట్రదారులపై వేటు వేయిస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే రోజా.
రెబెల్స్ కు రోజా వార్నింగ్ తో చిత్తూరు రాజకీయ రచ్చబండ గురించి మరోసారి చర్చ జరుగుతోంది. రోజాకు అడుగడుగునా చెక్ పెడుతూ ఇద్దరు జిల్లా మంత్రులు ఆమెతో చెడుగుడు ఆడుకుంటున్నారు. మంత్రి పెద్దిరెడ్డి. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. చిత్తూరు వైసీపీలో ఈ ఇద్దరిదే ఆధిపత్యం. సీనియర్లతో రోజాకు అసలు ఏమాత్రం పొసగడం లేదు. ఏళ్లుగా ఇదే తీరు. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ వాయిస్ ను బలంగా వినిపించిన నేత రోజా. అసెంబ్లీలోనైనా, ప్రజాక్షేత్రంలోనైనా రోజా మాటలు మంటలు రేపేవి. అందుకే, ఫైర్ బ్రాండ్ లీడర్ గా పాపులర్ అయ్యారు రోజా. జగనన్న చెల్లిగా అధినేతతో సాన్నిహిత్యం ఎక్కువ. ప్రజల్లోనూ మంచి ఆదరణ. జబర్దస్త్ తో ఫుల్ క్రేజ్. ఇలా పార్టీలోనూ, ప్రజల్లోనూ రోజా ఇమేజ్ అమాంతం పెరుగుతుండటంతో చిత్తూరు జిల్లా నేతల్లో అభద్రతా భావం పెరిగిందని అంటారు. వైసీపీలో టాప్ పొజిషన్ లో ఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. రోజా టార్గెట్ గా ఎప్పటికప్పుడు పావులు కదుపుతున్నారని చెబుతారు. చిత్తూరులో ఏకఛత్రాధిపత్యం కోసం గత ఎన్నికల్లోనే రోజాను ఓడించేలా పెద్దిరెడ్డి కుట్రలు చేశారని అంటారు. నియోజకవర్గంలో రోజా వ్యతిరేకులను ప్రోత్సహించడం, నగరి అభివృద్ధికి అడ్డుపడటం, ఎమ్మెల్యేను ఇబ్బందులకు గురిచేయడం ఇలా శక్తి మేర రోజాను ఇరకాటంలో పడేస్తున్నారు మంత్రి పెద్దిరెడ్డి. ఇటీవల నగరిలో పారిశ్రామిక అభివృద్ధి కోసం ఎమ్మెల్యే రోజా భూములను సేకరిస్తే.. ఆ స్థలాలను పేదలకు పంచేలా మంత్రి పెద్దిరెడ్డి కుట్రలు చేశారనే ఆరోపణ. నగరిలో రోజా ప్రమేయం లేకుండానే పెద్దిరెడ్డి ప్రభుత్వ కార్యక్రమాలు చేపడుతున్నారని చెబుతున్నారు. అందుకే, ఆక్రోశం ఆపుకోలేక ఇటీవల అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీకి సైతం రోజా ఫిర్యాదు చేశారు. ఆ సందర్భంగా ఎమ్మెల్యే రోజా కన్నీళ్లు పెట్టుకోవడం చూశాం. రోజాను ఏడిపించేదాకా వదలలేదు వైసీపీ సీనియర్లు అంటూ అప్పట్లో పెద్ద చర్చే జరిగింది.
జిల్లాకే చెందిన ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి సైతం రోజాను అస్సలు ఓర్వడం లేదని అంటారు. నామినేటెడ్ పోస్టులు రోజా వ్యతిరేకులకు కట్టబెట్టి.. నగరి ఎమ్మెల్యేను కట్టడి చేసే కుట్ర చేస్తున్నారని చెబుతారు. ఇటీవల కేజే శాంతికి నామినేటెడ్ పదవి ఇవ్వడంపై బహిరంగంగానే అసంతృప్తి వెల్లగక్కారు రోజా. ఇలా, చిత్తూరు జిల్లాలో రోజా వర్సెస్ సీనియర్స్ కోల్డ్ వార్ ఓ రేంజ్ లో సాగుతోంది. అది, మున్సిపల్ ఎన్నికల్లో మరింత తారాస్థాయికి చేరింది. ఏకంగా వైసీపీ అభ్యర్థులపైనే సొంత పార్టీ నేతలే రెబెల్స్ ను నిలబెట్టడం, వాళ్లకి భారీగా డబ్బు సాయం చేయడంపై రోజా రెచ్చిపోయారు. మీ సంగతి తేలుస్తానన్నట్టు ఓ రేంజ్ లో సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మరి, నగరి ఎమ్మెల్యేకు.. ముఖ్యమంత్రి రేసులో ఉన్న పెద్దిరెడ్డి స్థాయి నేతను ఢీకొట్టడం సాధ్యమేనా? సీనియర్లతో ఫైట్ చేస్తారా? రాజీ కొస్తారా? రోజా రాజకీయ రచ్చబండలో ఎలాంటి తీర్పు వస్తుంది? ఇదే ఇప్పుడు ఆసక్తికరం.